Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఐదేండ్లు పదవిలో ఉండమని ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఒక సారి గెలిస్తే ఐదేండ్లు ఆ పదవిలో ఉండాల్సిందే. కానీ ఈ మధ్య కొత్త ఒప్పందాలు తెరమీదకు వస్తున్నాయి. కుర్చీపై ఆశ పడిన వారు రెండున్నరేండ్ల చొప్పున పంచుకుంటున్నారు. ఒప్పందాలు రాసుకుంటు న్నారు. రెండున్నరేండ్ల తరువాత స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకోవాలి. లేదంటే మూడేండ్లలో అవిశ్వాసం తప్పదు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేదు. విపక్షం కంటే, స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. చైర్మెన్లపై ఆవిశ్వాసానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేండ్లు ఆగాల్సిందే. వారి పదవీ కాల పరిమితిని కూడా ఐదేండ్ల 11 మాసాలకు పెంచింది. ఇక ఉన్నొక్క ఏడాదికి అవిశ్వాసం పెడితే ఏందీ.. పెట్టుకుంటే ఏందీ. డబ్బుల ఖర్చు తప్ప అనే పరిస్థితి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి వారు నాలు కర్చుకుంటున్నారు. ఇక ఆయా మున్సిపాలిటీల్లో స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తున్న కౌన్సిలర్లకు నియోజకవర్గ బాస్‌ల సపోర్టు ఉన్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుబ ణంలో మున్సిపల్ చైర్పర్సన్లకు కాస్త ఊరట లభించి నట్లయ్యింది. సదరు చైర్మన్లు 'రాజీ' నామా చేస్తేనే మరొకరికి అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ స్వల్ప చట్ట సవరణ బిల్లు తీసుకువచ్చింది. దాంతో స్వపక్షంలోనే విపక్ష పాత్రను పోషిస్తున్న కౌన్సిలర్లనుంచి చైర్మెన్లు, చైర్పర్సన్లకు కాస్త ఊరల లభించింది. ఇక ఆశావహులకు భంగపాటు ఎదురైంది. నిన్నటి వరకు ఆవిశ్వాసం పెడ్తామని ఉవ్విళ్లూరిన వాళ్లు నోళ్లకు తాళాలు పడ్డాయి. ఇక చేసేది లేక చైర్పర్సన్లపై చర్యలు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీల్లో ఈ తంతు గత కొంత కాలంగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రధానంగా మూడు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లను తప్పించాలని గత ఏడాది కాలంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వారిని తప్పిం చడమా? రాజీనామా చేయించడమా? చర్యలు తీసు కోవడమా? ఏదో ఒకటి జరగాల్సిందేనని పట్టుబ డుతున్నారు. స్వచ్ఛందంగా తప్పుకోకపోతే మూడేండ్లు పూర్తి కాగానే ఆవిశ్వాసం పెట్టాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేండ్ల పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే. స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత చైర్పర్సన్లు మరో ఏడాదిన్నర వరకు ఎలాంటి ఆవిశ్వాసం లేకుండా కొనసాగేందుకు అవకాశం లభించింది.
లభించిన ఊరట..
మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలపడంతో చైర్మన్లకు ఊరట కలిగించింది.ఇక ఆశావహులకు భంగ పాటు ఎదురైంది. 2018 మున్సిపల్ యాక్టు ప్రకారం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల పదవీ కాలం మూడేండ్లు పూర్తయితే వారిపై కౌన్సిలర్లు కౌన్సిల్లో అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణతో చైర్పర్సన్, వైస్చైర్పర్సన్లపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఉన్న గడువును మూడేండ్ల్ల నుంచి నాలుగేండ్లకు పెంచింది. మున్పిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ప్రతిపాదనకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేండ్ల పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రంగారెడ్డి జిల్లాలో...
రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని మున్సిపాలిటీల్లో అధికార పార్టీకి మెజార్టీ స్థానాలు రాకపోయినా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నుంచి కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకుని చైర్ పర్సన్లను చేశారు. ఇంకా మెజార్టీ లేకుంటే ఎంపీ, ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియోగా సభ్యులను చేర్చుకుని కుర్చీలను దక్కించుకున్నారు. అనతి కాలంలోనే వారిలో పొరపొచ్చాలు రచ్చకెక్కాయి. చైర్మన్లు తిరిగి స్వంత గూటికి చేరుకుంటున్నారు. ఇక అధికార పార్టీ వారిపై అనేక రకాల ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. ఆదిభట్ల చైర్‌పర్సన్‌ను కొత్త ఆర్థికగౌడ్ను కాంగ్రెస్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఆమెను పార్టీలో కలుపుకుని టీఆర్ఎస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. కానీ ఎంతో కాలం అధికార పార్టీలో ఇమడలేకపోయారు. ఏడాది పాటూ అధికార పార్టీలోనే ఘర్షణ వాతావరణం నెలకొంది. తిరిగి చైర్ పర్సన్ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. ఇక ఇదే పరిస్థితి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పూర్తి మెజార్టీలో కప్పరి స్రవంతిని చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు.ఇక్కడ చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య గత ఏడాదిగా సమన్వయం లేకుండా పోయింది. ఆమెపై కౌన్సిలర్లు మూకుమ్మడిగా ఫిర్యాదు చేసుకున్నారు.రికార్డులు సీజ్ చేశారు. ఇక ఆమెను లాంగ్‌లీవ్‌పై వెళ్లాలని కూడా ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. అయితే తను ససేమిరా అనడంతో మూడేండ్లలో ఆవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఇక ఆవిశ్వాసం మరో ఏడాది పొడిగించడంతో చైర్ పర్సన్‌కు కాస్త ఊరట లభించింది. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇక్కడ బీజేపీ కౌన్సిలర్లు అత్యథికంగా గెలిచారు. చివరి క్షణంలో బీజేపీ కౌన్సిలర్‌ను తమవైపు తిప్పుకుని చైర్మన్‌ని చేశారు. రెండేండ్ల పాటు సాఫీగా సాగినప్పటికీ ఎంతో కాలం నిలవలేకపోయారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక్కడ కూడా అతనిపై ఆవిశ్వాసం ప్లాన్ కూడా జరిగింది. తుర్కయాంజాల్లోనూ కాంగ్రెస్ చైర్‌పర్సన్‌పై కూడా ఆ పార్టీ కౌన్సిలర్లు ఆవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ మొత్తం 24 వార్డులకు గాను, టీఆర్ఎస్ ఆరు, కాంగ్రెస్ 17, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. ఇక్కడ చైర్మన్‌తో పాటూ, వైస్ చైర్మన్ స్థానం సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ రెండున్నరేేండ్ల చొప్పున పదవిని పంచుకునేందుకు కుదుర్చుకున్న ఒప్పందం జూలైంలోనే ముగిసింది. కానీ తన పదవి నుంచి తప్పుకోలేదు. దాంతో అవిశ్వాసం పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ సభ్యులతో కలిసి కాంగ్రెస్ సభ్యులు సిద్ధమయ్యారు. కానీ మున్సిపల్ స్వల్ప సవరణ చట్టం నీళ్లు చల్లింది.