Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమోచన పేరుతో లబ్ది పొందాలనుకుంటున్న బీజేపీ
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల కీలక పాత్ర
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నర్సిరెడ్డి
- సాయుధ పోరాటం వారోత్సవాల్లో భాగంగా సీపీఐ(ఎం) శ్రేణుల మండల వ్యాప్తంగా బైక్ ర్యాలీ
నవతెలంగాణ-యాచారం
ప్రజలంతా ఏకమై ప్రధాని మోడీ, బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సిరెడ్డి కోరారు. బుధవారం యాచారం మండల వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై నర్సిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు నిజాం నవాబు అరాచకాలకు వ్యతిరేకంగా ఎర్రజెండా నాయకత్వాన నడిచిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని తెలిపారు. ఈ పోరాటంలో ఎంతోమంది అమరులు నేలకొరిగారని గుర్తు చేశారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ విమోచన పేరుతో ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. ఇవాళ ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదని, నిజమైన హక్కుదారులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండా పోరాటం చేసిందని వివరించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల ప్రోత్బలంతో కమ్యూనిస్టులను అణిచివేసి, ఎన్నో నిర్బంధాలకు గురిచేసారని ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటం ద్వారా పటేల్ పట్వారి, భూస్వామ్య వ్యవస్థ, రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి మధుసూదన్ రెడ్డి, పగడాల యాదయ్య, రాజు, శోభన్, జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు కందుకూరి జగన్, ఆలంపల్లి నరసింహ, పి అంజయ్య, మల్లేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.