Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
రాష్ట్రంలో విద్యారంగంలో సమూల మార్పునకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ మండలం పరిధిలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వశిక్షా అభియాన్ నిధులు రూ.1. 35 కోట్లతో నిర్మించిన కేజీబీవీ అదనపు తరగతులు, వసతి గృహం రాజేంద్రనగర్ శాసనసభ్యులు టీ. ప్రకాష్ గౌడ్ , జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గత ఉమ్మడి పాలనలో 400 గురుకుల జూనియర్ కళాశాలలు ఉంటే తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల కాలంలోనే 1,150 గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. గురుకులాల్లో 80 డిగ్రీ , 5 పీజీ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందనీ,ఇందులో 53 డిగ్రీ ఉమెన్ కాలేజీలు ఉన్నాయన్నారు. విదేశాల్లో చదువుకునే ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఒక్కో గురుకుల విద్యార్థిపై రూ.లక్షా 25 వేలు ఖర్చు చేస్తుందన్నారు. గురుకులాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను భూతద్దంలో చూపెడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా ఎస్ఓ ప్రిన్సిపాల్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను అభివృద్ధి చేసిందనీ, వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ గురుకులాల ఉన్న గురుకుల విద్యావిధానం అధ్యయనం కోసం వస్తున్నారని అన్నారు. పేద,మధ్యతరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వ విద్య మరింత బలోపేతం అవుతుందన్నారు. మిడ్ డే మిల్స్ సంబంధించిన మోనూ బిల్లులు ఆలస్యమవుతున్న విషయం పై స్పందిస్తూ బిల్లులను ఎస్ఓలు ప్రిన్సిపాల్స్, హెచ్ఎంలు ఆలస్యం చేయడం వల్ల మిడ్ డే మీల్స్ బిల్లులు ఆలస్యం అవుతుందన్నారు. అలా కాకుండా ఆర్థిక శాఖ మంత్రి సూచన మేరకు వీలైనంత తొందరగా బిల్లులు ప్రభుత్వానికి పంపిస్తే తొందరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమాకుల సర్పంచ్ పంతంగి సుష్మా రాజ్ భూపాల్ గౌడ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటీ తన్వి రాజు, వైస్ ఎంపీపీ నీలం మోహన్, డీఈవో సుశీందర్ రావు, ఎంఈఓ డి. రాంరెడ్డి, కేజీబీవీ ఎస్ఓ మాధవి, పాలమాకుల ఎంపీటీసీలు సరిత రవీందర్, గుడాల ఇందిరా కృష్ణ, ఏఎంసీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్, ఎంపీడీవో వసంత లక్ష్మి, ఎంపీ ఓ సుజాత, డి ఈఈ సంజీవరెడ్డి , ఏఈ సూర్యనారాయణ , పంచాయతీ కార్యదర్శి శశిధర్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, కె.శ్రవణ్ కుమార్‌గౌడ్, కే.చంద్రారెడ్డి, చెక్కల చంద్రశేఖర్, పి. ఆంజనేయులు గౌడ్ , దండు ఇస్తారీ, మంచాల రాణి రవి , ఆనెగౌని శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.