Authorization
Mon Jan 19, 2015 06:51 pm
' మైనింగ్ బూతం మా ప్రాణాలను బలిగొంటుంది. మైనింగ్ యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి పరిష్మన్లు ఉన్నాయన్న నేపంతో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నారు. వందల పీట్ల లోతు తవ్వకాలు తొవ్వి అలాగే విడిచిపెట్టడంతో ఆ బావుల్లో పడి ఇప్పటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో పశువులు పడి మృత్యువాతపడ్డాయి. మైనింగ్ అధికారులకు ఎన్ని మార్లు చెప్పిన మమల్ని పట్టించుకోవడం లేదు. ఎన్ని ఫిర్యాదులు చేసిన ఫలితం లేదు. మళ్లీ పర్మిషన్లు రెన్యూవల్ కోసం అధికారులు మా గ్రామాలకు ఉత్తరాలు పంపించారు. ఈ దఫా పర్మిషన్లు ఇచ్చేది లేదు..మా ప్రాంతం నుంచి మైనింగ్‌ను తరిమికొట్టడమే మా లక్ష్యం' అని రంగారెడ్డి జిల్లా సిద్ధపూర్ మైనింగ్ ప్రాంత నివాసితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- మైనింగ్ తవ్వకాలతో మా ఊర్లు ఆగమవుతున్నాయి
- నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు
- ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మైనింగ్ యాజమాన్యాలు
- ఆటు వైపు తిరిగి చూడని అధికారులు
- మైనింగ్ నుంచి వెలుబడే.. శబ్ద, వాయు కాలుష్యానికి తాళలేక పోతున్న స్థానికులు
- మా గోస అధికారులు అర్థం చేసుకోవాలంటున్న ప్రజలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో మైనింగ్ అధికారుల నిర్లక్ష్యంతో మైనింగ్ యాజమాన్యాలు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. వాల్ట చట్టం.. మైనింగ్ నిబంధనలు ఏమీ తమకు పట్టవన్నట్టు ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో కొత్తురు మండల పరిధిలోని సిద్ధపూర్ గ్రామంలో రెవెన్యూ అధికారుల రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 278లో 13.36 ఎకరాలు, సర్వే నెంబర్ 16లో 8.20 ఎకరాలకు మాత్రమే మైనింగ్ జోన్లో ఉన్నట్టు అధికారిక రికార్డులు చూపుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ పరిమితులు మించి వందల ఎకరాలు భూముల్లో తవ్వకాలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సుమార్ 30 ఎకరాల్లో నాలుగురికి మైనింగ్ స్టోన్ అండ్ మెటల్ తవ్వకాలు పర్మిషన్లు ఇచ్చింది. కానీ ఇక్కడ తమను అడిగే వారు లేరన్నట్టు.. తమకు ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు చేపడుతున్నారు. స్థానికులు మందలిస్తే..మాకు ప్రభుత్వం నుంచి పర్మిషన్లులు ఉన్నాయి. మేము ఇట్లే తవ్వుతాం.. దిక్కున చోట చొప్పుకొండి అంటు దబాయింపులకు పాల్పడుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు.
స్టోన్ అండ్ మెటల్ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రాంత ప్రజలను మైనింగ్ తవ్వకాలతో మీకు వచ్చే ఇబ్బందులు ఏమీ అని అడిగితే.. తమ గోడు వరద ప్రవాహంలా వెళ్లబోసుకున్నారు. ' మా పొట్టకొట్టి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. పశువులు మేపుకుని బతికే మా భూముల్లో తవ్వకాలు చేపట్టి పశువులు మేపుకోవడానికి జాగా లేకుండా చేస్తున్నారు. స్టోన్ క్రషర్ మిషన్ నుంచి వచ్చే దుమ్ము గడ్డి మీదపడి పశువుల మేతకు కూడా పనికిరాకుండ పోతుంది.. పశువులు తిన్న రోగాల భారిన పడి చనిపోతున్నాయి. మా జీవనాధారమైన పశువులను బతుకకుండా చేశారు. ఇక్కడి నుంచి మిషన్లు తరిమికొట్టాలి. గిప్పుడు గానీ పర్మిషన్లు ఇస్తే ఊరుకునేది లేదు. ఊరు..ఊరంత ఎకమై మైనింగ్‌ను రద్దు చేసేంత వరకు ఇక్కడే కుర్చోని ధర్నాలు చేయడానికి సిద్దామవుతాం. ఇప్పటికి మైనింగ్‌తో ఎన్నో ముగజీవులు, మనుషుల ప్రాణాలు పోయాయి. మా ప్రాణాలు పోయిన పర్వలేదు గానీ మైనింగ్‌కు పర్మిషన్లు ఇవ్వనివ్వమని '' ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
సామాన్యుల ప్రాణాలు తీయొద్దు
మైనింగ్, పోల్యుషన్ బోర్డు అధికారులు కాసులకు కక్కుర్తి పడి సామాన్యుల ప్రజల ప్రాణాలతో చేలగాటం ఆడోద్దు. మైనింగ్ తవ్వకాల కోసం పెట్టే బాంబులతో చుట్టూ పక్కన ఉన్న బోరుబావులు కూడి పోతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి మైనింగ్ పర్మిషన్లు రద్దు చేసి ఈ ప్రాంత భూములను, ప్రజలను కాపాడాలి.
- శేఖర్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు
గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు
మైనింగ్ యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నారు. పర్మిషన్లకు మించి లోతుకు తవ్వకాలు చేపట్టడంతో ఈ ప్రాంతాల్లో తిరిగే మూగజీవులు, మనుషులు బావుల్లో పడి చనిపోతున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికీ ముగ్గురు వ్యక్తులు ఇక్కడ చనిపోయారు. ఇంత జరుగుతున్న మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సారి మళ్లీ రెన్యూవల్ ఇచ్చేది లేదు. ఈ ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలు నిలిపివేయాల్సిందే. లేదంటే పెద్ద ఎత్తున్న నిరసనలు చేపడుతాం.
సిద్ధపూర్, యువ నాయకులు- నరేందర్‌రెడ్డి,
పర్మిషన్లు ఇచ్చేది లేదు
మైనింగ్ తవ్వకాలతో సొమ్ము చేసుకునేది వ్యాపారులు.. ఇబ్బందులు పడేది మాత్రం సామాన్య ప్రజలు. తవ్వకాల కోసం పెట్టే బాంబులు రాత్రి సమయంలో ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తుంది. క్రషర్ల నుంచి వచ్చే దుమ్ముతో చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నారు. మైనింగ్ తవ్వకాలతో 15 ఏండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక మా ప్రాంతంలో మైనింగ్ పర్మిషన్లు ఇస్తే ఊరుకునేది లేదు.
- వడ్డే బాలయ్య, మాజీ ఎంపీటీసీ సిద్ధపూర్