Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలు ఇచ్చిన భూములకు స్థలాలెక్కడా..?
- అర్హులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాల్సిందే..
- కార్మిక, కర్షకుల సమస్యలు పరిష్కరించాలి
- విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజురియంబర్స్మెంట్
విడుదల చేయాలి
- ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పోరుకు సిద్ధం
- నేడు రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
- పాల్గొననున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
పేదోడీ సొంతింటి కల.. కలగానే మిగిలిపోతోంది. కంటి తుడుపుగా పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన సర్కారు.. స్థలాలు కేటాయించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతోపాటు జిల్లాలో కొన్నేండ్లుగా పేరకుపోయిన రైతుల భూ సమస్యలు, కార్మిక వేతన సవరణలు, పేదల భూ పంపిణీ, దళిత బంధు, విద్యార్థుల, నిరుదోగ్య సమస్యల పరిష్కారానికై ప్రజా సంఘాల ఐక్య వేదిక పోరుకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకున్న జిల్లాలోని ప్రజా సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న ప్రజలు తరలించేందుకు ప్రజా సంఘాలు ప్రణాళిలకు సిద్ధం చేశాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ పాల్గొననున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి
పేదలకు ఇంటి జాగాల కోసం కమ్యూనిస్టుల చేసిన పోరాటం ఫలితంగా ఆనాటి సీఎం దివంగత వైస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో జిల్లా వ్యాప్తంగా సుమారుగా 1500 మందికి పట్టాలు ఇచ్చారు. అవి కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. పట్టాలు ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా నేటికీి ఒక్కరికీ కూడా స్థలం కేటాయించలేదు. రామోజీ ఫిలీం సిటీ ప్రాతంలో 670 మందికి జాగాలు ఇస్తున్నట్టు పట్టాలు ఇచ్చారు. కానీ నేటికి స్థలం చూపించ లేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 60 గజాల చొప్పున పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు తక్షణమే జాగాలు కేటాయించాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. 'ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించక పోతే. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ గూడిసెలు వేసేందుకు మేం రెడీగా ఉన్నాం' అని ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది.
కార్మిక హక్కులు హరించొద్దు..
ఎన్నో ఏండ్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్‌గా తీసుకువచ్చి కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్న చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీసం వేతనం కింద రూ. 26 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లకు కనీసం వేతనంతోపాటు ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగా అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూ సమస్యలును పరిష్కరించి, పేదలకు పంపిణీ చేసిన భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ధరణి నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. దళిత బంధు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. ఎంపిక విధానం అధికారులతో చేపట్టాలి. దళిత బంధు పథకంలో ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా ప్రభుత్వం పక్కగా చర్యలు తీసుకోవాలి.
గత అకాడమిక్‌కు సబంధించిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నేటికీ విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో, గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది.
కార్మికుల హక్కులను కాపాడాలి
ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన కార్మికుల హక్కులను హరించొద్దు. నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి.
- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్
భూ సమస్యలను పరిష్కరించాలి
జిల్లాలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలి. భూ పోరాటాల ఫలితంగా నాడు పంపిణీ చేసిన భూములకు పట్టాలివ్వాలి. ధరణి సమస్యలను తక్షణమే పరిష్కరించి, రైతులకు రైతుబంధు, రైతుబీమా అందేలా చర్యలు తీసుకోవాలి.
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
పట్టాలు ఇచ్చిన వారికి జాగాలు కేటాయించాలి
ఎన్నో పోరాటాల ఫలితంగా పేదలకు ఇండ్ల నిర్మాణాల కోసం పట్టాలు ఇచ్చారు. కానీ స్థలం చూపించలేదు. వెంటనే పట్టాలకు సంబంధించిన స్థలాలు కేటాయించాలి. లేని పక్షంలో భవిష్యత్ పెద్ద ఎత్తున్న ఉద్యమాలు చేపడుతాం.
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కేవీపీఎస్ అధ్యక్షులు సామేల్
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తాం
పేదల ఇండ్ల నిర్మాణ కోసం ప్రభుత్వం జాగాలు కేటాయించకపోతే ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ గూడిసెలు వేస్తాం. ఇండ్ల జాగాలకు సర్టిఫికెట్లు ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా నేటికీ స్థలాలు కేటాయించలేదు. తక్షణమే ప్రభుత్వం సర్టిఫికేట్లు ఇచ్చిన లబ్దిదారులతో పాటు అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.
- వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, జగన్