Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కార్ భూములు ధనికులకు ధారదత్తం చేయొద్దు
- గూడు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించాలి
- లేదంటే ఆ భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ
- పేదల భూములు లాక్కుంటే ఊరుకోబోం
- సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
- ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్వర్యంలో కలెక్టర్ ఎదుట ధర్నా
- ధర్నాను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులు
- ఇరువర్గాల మధ్య వాగ్వివాదం
- ప్రజా సమస్యలపై డీఆర్వో హరిప్రియకు వినతి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
' ఈ భూమిద పుట్టిన పేద వాడికి తలదాచుకోవడా నికి కనీసం గూడు ఎందుకు ఉండకూడదు. ధనవంతుల ఇండ్లలో పుట్టిన వారికి వందల ఎకరాలు జాగాలు ఎక్కడి నుంచి వచ్చినవి. ధనవంతులకు సర్కారు భూములను ధారదత్తం చేయడం కాదు. గూడు లేని నిరుపేదలకు ప్రభు త్వ భూముల్లో జాగాలు కేటాయించాలి.. లేని పక్షం లో ఆ భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కొన్నేండ్లుగా జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై రంగారెడ్డి జిల్లా ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. దీంతో పోలీసులు ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. నాయకులను లాక్కుపోయే ప్రయత్నం చేయగా.. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యల్లో ఆందోళన చేశారు. నాయకులు మాట్లాడేం దుకు ఏర్పాటు చేసిన సౌండ్ బాక్స్ మౌత్‌ను లాక్కొని పగు లగొట్టారు. మైక్‌లు పగలకొట్టి మా గొంతులు ఆపాలేరని, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఇండ్ల జాగాలకు పట్టాలు ఇచ్చిన వారికి స్థలం కేటాయించాలి, డబుల్ బెడ్రూంలకు ధరఖాస్తు చేసు కున్న అర్హులందరికీ ఇండ్లు ఇవ్వాలి, బ్యాండెడ్ లేబర్ భూ ములకు పట్టాలు ఇవ్వాలి, పేదలకు అసైన్డ్ చేసిన భూముల ను లాక్కొవద్దు, టెనెంట్ యాక్ట్ కింద పంపిణి చేసిన భూములను పట్టాలు ఇవ్వాలని, దళిత బంధు పారదర్శకం గా అమలు చేయాలి' అని ప్లకార్డులను ప్రదర్శించారు. వీటిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని, కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. దీంతో డీఆర్వో హరిప్రియ వీరి వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు ఆమెకు 26 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజే శారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ 120 గజాల ఇంటి జాగా కోసం పేద ప్రజలు ఏండ్లుగా నిరీక్షిస్తున్నారని అన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చి స్థలాలు చూపించకపోవడం ఏంటనీ ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలు, బడా పెట్టుబడిదారులు అడుగగానే వందల ఎకరాలు పంచిపెడుతున్న సర్కారుకు పేదలకు గుంట జాగా ఇచ్చేందుకు ఎందుకు మనస్సు రావడం లేదని నిలదీశారు. రామోజీ ఫిలీం సిటీ ప్రాంతంలో 650 మందికి జాగాలు పట్టాలు ఇచ్చి స్థలం ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామోజీరావుకు ఈ ప్రభుత్వం భయపడుతుండోచ్చు కానీ ఎర్రజెండా బిడ్డలు భయపడరని తేల్చి చెప్పారు. ఆ భూముల్లో ఎర్రజెండాలు పాతుతామని హెచ్చరించారు. ఇప్పటి వరకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులకు కేటాయించాలని లేదంటే వాటిని స్వాధీనం చేసుకుని, అర్హులకు పంచుతామన్నారు. నాటి ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో మోడీ వికృత చేష్టలతో సామాన్య ప్రజలు అల్లడిపోతున్నారన్నారు. విద్యావ్యవస్థలను భ్రష్టు పట్టిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ మాట్లాడుతూ పేదలకు అసైన్డ్ చేసిన భూములను రియల్ వ్యాపారులు అప్పగించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం వత్తాసు పలుకుతుందన్నారు. జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ పెద్ద బొజా లు వాలిపోయినట్టుగా టీఆర్ఎస్ డేగాలు వాలిపోతున్నా యని ఎద్దేవా చేశారు. మీర్పేట్, నాదర్గుల్, తుర్కయం జాల్ ప్రాంతాలో వందల ఎకరాల పేదల భూములను టీఆర్ఎస్ నాయకులు కబ్జాలు పెట్టారన్నారు. వారికి జిల్లా అధికారులు వంతపడుతున్నారని అన్నారు. పేదలకు చెందాల్సిన భూములను తక్షణమే వారికే కేటాయించకపోతే భవిష్యత్‌లో పెద్దఎత్తున పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు లు జంగారెడ్డి మాట్లాడుతూ దున్నేవాడికి భూమి అనే నినాదంతో చేసిన భూ పోరాట ఫలితంగా వేల ఎకరాలను నిరుపేదలకు పంపిణీ చేశారన్నారు. ఆ భూములను ప్రభు త్వం పేదల నుంచి గుంజుకోవడానికి కుటీల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆ ప్రయత్నాలు తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో బాండెడ్ లేబర్‌కు కేటాయించిన భూము లను గవర్నర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన భూములను రైతులను పేరు మీద పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలను పరిష్కరిస్తామని ధరణి పోర్టల్ తెచ్చిన ప్రభుత్వం.. కార్పొరేట్ ఆఫీసులను ఓపెన్ చేయిందన్నారు. కార్పొరేట్ ఆఫీసుల నుంచి రెవెన్యూ ఆఫీసర్లకు ఫోన్ వస్తే తప్పా సమస్య పరిష్కరం అయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే భూ సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, సామేల్, మదుసుధన్ రెడ్డి, జగదీశ్, రాజు నాయక్, కవిత, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘం, కార్మిక, రైతు సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.