Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
- పట్టించుకోని అధికార నాయకుల
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
పేదవాడు తలదాచుకోవడానికి చిన్న గుడిసె వేసుకున్నా చాలు ఆఘమేఘాల మీద తమ ప్రతాపాన్ని చూపే రెవెన్యూ అధికారులు అదే పెద్ద వాళ్ళు, అధికారం ఉన్నవాళ్లు కోట్లాది రూపాయల విలువ ఉన్న ప్రభుత్వ భూము లు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా పట్టించుకోరు. తమకేమీ తెలియనట్లు అటు వైపు కూడా కన్నెత్తి చూడరు. తాజాగా శేరిలిం గంపల్లి మండల పరిధిలోని మియాపూర్ మక్తాలోని కిందికుంట చెరువు కట్టకింద సర్వేనెంబర్ 77లోని దాదాపు 12 గుంటల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారు. నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది.దీంతో వాటిని తమ కబంధ హస్తాల్లోకి తీసుకుం టున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూము లు ఇప్పటికే చాలా వరకూ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు తాజాగా ఈ స్థలంపై గురిపెట్టిన కబ్జాదారుల కన్ను పడిందే తడవుగా ఆలస్యం చేయకుండా స్థలం చుట్టూ రేకులు పెట్టి కబ్జా చేశారు. ఇంత విలువైన స్థలం కబ్జాకు గురైతే అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలువురికి అనుమానాలకు తావిస్తోంది.
అధికార పార్టీ నాయకులే సూత్రధారులా ?
ఈ కబ్జా బాగోతం వెనుకాల ఓ అధికార పార్టీ నాయకులున్నారని పలు అనుమానాలున్నాయి. అందుకే అటు వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అధికారులకు ఫిర్యాదు..
ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరణ కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించగా వారు అందు బాటులోకి రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాదారుల కానంద హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.