Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాయిస్ ఆఫ్ తెలంగాణ పత్రిక చీఫ్ ఎడిటర్ పాపన్నగారి మాణిక్‌రెడ్డి
నవతెలంగాణ-కొత్తూరు
గత ఎనిమిదేండ్లుగా ప్రభుత్వ పాఠశాలలో పదోన్నతులు నిలిచిపోవడంతో ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వాయిస్ ఆఫ్ తెలంగాణ పత్రిక చీఫ్ ఎడిటర్ పాపన్నగారి మాణిక్ రెడ్డి అన్నారు. గురువారం టీఎస్ యూటీఎఫ్ కొత్తూరు, నందిగామ మండల మహాసభలు నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడుతూ అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించకపోవడంతో వారంతా ఒకే క్యాడర్లో నిరాశతో పదవి విరమణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలను కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వహించడం లేదని వాపోయారు. రాష్ట్రంలో ఎంఈఓ, డిప్యూటీఈవో, పోస్టులతో పాటు జూనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, బీఈడీ కళాశాలలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వీటన్నిటికీ అర్హులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించడంలో చిత్తశుద్ధి లేకపోవడం దారుణమన్నారున. విద్యారంగ పరిరక్షణకు వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసి దసరా సెలవుల లోపు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
యూటీఎఫ్ నందిగామ, కొత్తూరు మండలాల కమిటీ ఎన్నిక
నందిగామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కొత్తూరు, నందిగామ మండలాల టీఎస్ యూటీఎఫ్ మహాసభల సందర్భంగా ఆయా మండలాల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూటీఎఫ్ కొత్తూరు మం డలం అధ్యక్షులుగా బి రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా బి వెంకటేష్, నందిగామ మండలాధ్యక్షులుగా తహెర్, ప్రధాన కార్యదర్శిగా జె.బాలకృష్ణ, సభ్యులుగా సత్యనారాయణ, రెడ్యానాయక్, సాయన్న, మద్దిలేటి, విజయలక్ష్మి తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటప్ప, జిల్లా కార్యదర్శి రఘుపాల్ తదితరులు పాల్గొన్నారు.