Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కేంద్రం అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ ప్రజా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, అధిక ధరలతో పేద ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్యన చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునేందుకు మనువాదులు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి దేశాన్ని వేల సంవత్సరాల వెనక్కి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుం దన్నారు. కానీ ప్రజలు వారి కుటిల ప్రయత్నాలను గమనిస్తున్నారని, తప్ప కుండా వాటిని తిప్పి కొడతారని అన్నారు. మహనీయుల ఆశయాలు, పోరాటాల స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బేగరి మహేష్, షాద్నగర్ నియోజకవర్గం మాజీ ప్రధాన కార్యదర్శి మైలారం సుబ్రహ్మణ్యం, అంబేద్కర్ ప్రజా సంఘంలో చేరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు డప్పు రాజేందర్, నాయకులు యాదయ్య, నర్సింలు, శివకుమార్, రామస్వామి, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.