Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నైవేద్యం కన్నా అభిషేకం మిన్న' నైవేధ్యం వద్దు అభిషేకం ముద్దు' అన్న ప్రచారం 'ఊపు' అందుకుంది. ఇప్పుడు రాజు చిత్రపటాల ముందు పాల గిన్నె కనపడ్డం లేదు. అభిషేకాలు జెరుగా జోరందుకున్నాయి. చిత్ర పటాలు పాలతో తడిసి ముద్దయి పోసాగేయి. రాజులు తిరిగి రానిలోకాలకు ఎగిరేరు. రాజ్యాలు ఎగర్లేక పేర్లు మార్చుకుని ఉన్న చోటే ఉన్నాయి. కానీ చిత్ర పటాలకు పాల అభిషేకం మాత్రం కొనసాగింపు కొనసాగిస్తూనే ఉన్నది.
ఆవు పాలు ఇస్తుంది. గేదెకూడా పాలే ఇస్తుంది. మనుషులు పాలు తాగుతారు. మనుషులే కాదు పిల్లులు కూడా పాలు తాగుతాయి. పిల్లుల సంగతేమోకాని మనుషులుమాత్రం పాలని తాగడం కోసమే కాదు ఇంకోలా మరోలా కూడా వాడుతారు. అందుకే కదా 'నెత్తిన పాలు పోశావురోయి' అనే మాట పాప్యులర్ అయ్యేసింది.
అనగనగా ఓ రాజ్యం వుంది. రాజ్యం అన్నాకా రాజూ రాజ్యమే రాజులా ఉన్నాక పన్నులు కట్టే తన్నులు తినే ప్రజలూ ఉండాలిసిందే కద! రాజుకి ప్రజలు కన్న బిడ్డలు అవడం మాట శుద్ధ అబద్ధం నేతిబీరకాయలో నేయి అవును కాని ప్రజలకి మాత్రం రాజు కన్న తండ్రికన్నా మూరెడూ బారెడూ ఎక్కువే!
రాజులందరికీ రకరకాల 'పిచ్చులు' వుంటాయి. వాటిని పిచ్చులు అని కాక ఇష్టాలని, అభిరుచులనీ అనే వాళ్ళు ఉంటారు.
మన అనగనగా రాజ్యంలో రాజుకి 'పాలు అంటే చచ్చేంత ఇష్టం. చచ్చేంత ఇష్టం అంటే ఉత్తి పుణ్యానికి చస్తాడని కాదు. పాలకోసం అవసరమైతే ఎవడి చెవులైనా చావగొట్టి మూసేస్తాడన్న మాట. ఈ మాట ఓ చెవిలో అలా ఉంచుకుని కథలోకి దిగుదాం.
రోజురోజుకీ గొర్రెల్లాంటి ప్రజలు తెలివిమీరి పోతున్నారని జానాబెత్తడు తోకని కూడా తిరగేస్తున్నారని పన్నులూ, తన్నులూ తప్పించుకోవడానికి ఎదవ్వేషాలు వేస్తున్నారనీ రాజుకి 'అనుమానసందేహడవుతాడు' వచ్చింది. ఖజానా ఖాళీ అవగానే కనిపిస్తుండటం ఇందుకు కారణం. అని రాజు ' ఇమాజినేషనేషనూహ' అయితే నాచ్చిగర్ల్స్కీ డాన్సింగ్ డాన్స్కే వాటికే వీటికే వేటికి కోతలేని వాటికీ వసూళ్లన్నీ ఖర్చయిపోతున్నాయని కాకుండా ప్రజలకు తనంటే భయమూ భక్తీ తగ్గిపోతున్నాయని దిగులు పడ్డాడు.
రాజు దిగులు పడ్డం చూసి పరివారమంతా దిగులుపడ్డది. సమస్య పరిష్కారానికి బాగా ఆలోచించి, రాజు మీసాలకు 'మాలిష్దార్' సంపెంగ్ నూనె రాస్తున్న సమయంలో చక్కటి సలహా అడ్వయిజు' చేశారు.
దేశ దేశాల నుంచీ దిగిపోయారు పెన్సిళ్ళూ పేపర్లూ రంగులూ కుంచెలూ పట్టుకుని చిత్రకారులు. ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాదు వేల సంఖ్యలో రాజుగారి చిత్ర పటాలు రడీ అయిపోయేయి గోడలమీదకి ఎక్కడానికి. రాజు తలుచుకుంటే గోడలకూ మేకులకూ చిత్ర పటాలకూ కొదవేముంటుంది గనక రాజ్యంలో కార్యాలయాలన్నీ రాజుగారి చిత్ర విచిత్రమైన పటాలతో కిక్కిరిసి ఉక్కిరి బిక్కిరయిపోయేయి. రాజు చిత్రపటాలు వాడవాడలా! చిత్రపటాలు రాజువి ఇంటింటా!
ఊరికే చిత్రపటాలు పెట్టుకోవడం వల్ల ప్రజలకు రాజు మీద భక్తీ ముఖ్యంగా భయమూ ఉన్నట్టు తెలిచదు కదా. అందువల్ల రాజుచిత్ర పటానికి పూజలు మొదలయ్యేయి. పూజలన్నాక నైవేద్యం లేకుండా పూర్తవవు కదాజ రాజుకి ఏమిష్టం 'పాలు' కదా ఆ మాట మీ చెవిలో ఉంది కదా!
రాజు చిత్ర పటానికి 'పాట' నైవేధ్యంగా పెట్టడం 'మొదలై ఆరంభమై రొటీనైపోయింది. అయితే రాజు చిత్రపటానికి నైవేధ్యంగా ఉంచబడిని పాలు ఆవువైతేనేం, గేదైతేనేం పాల పొడివైతేనేం ఏం చెయ్యాలో ఎవ్వకీ అర్థం కాలేదు. దేవుడికి నైవేధ్యంగా పెట్టిన పాలని ఆ తర్వాత ప్రసాదంగా భావించి సేవిస్తే దేవుడేం పెద్దగా పట్టించుకోడు కానీ రాజుకీవిషయం తెలిస్తే భయంలేని ప్రజలకి భయం నేర్పడూ!
చిత్రపటం పాలుతాగదు ప్రజలు భయం తాగుతున్నారని కాని పాలు తాగడం లేదు. గిన్నెల్లో అలా చిత్ర పటాల ముందున్న పాలు చూసి ఉసురుమన్న పిల్లలు తర్వాత మ్యావనకుండా దొంగచాటుగా దూదికాళ్ళతో వచ్చి పాలు తాగి బ్రేవుమనసాగేయి. రాజంటే ప్రజలకు భయం కాని పిల్లులకేం భయం. రాజు చిత్ర పటాల ముందు కనపడ్డ పాలను తాగి రాజ్యంలో పిల్లులు పులుల్లా బలిసీ మ్యావుమనసాగేయి.
ఈ విషయం తెలిసి రాజు గోడకు తల బాదుకున్నాడు. కిరీటం ఉండటం 'నయం' అయింది. పరిహారం పరుగులు పెట్టింది. తన చిత్ర పటం ముందు వుంచబడ్డ పాలను 'క్యాట్ పిల్లులు' తాగడం తట్టుకోలేకపోయేడు.రాజ్యంలో పిల్లులన్నింటినీ చంపేసి పాపం ముట నెత్తికి ఎత్తుకోలేడు కనుక అనుభవం వల్ల తల మీద ఒక్క వేంట్రుక కూడా మిగలని సీనియర్ మంత్రిని 'అడిగేడు సంప్రదించేడు'
'నైవేద్యం కన్నా అభిషేకం మిన్న' నైవేధ్యం వద్దు అభిషేకం ముద్దు' అన్న ప్రచారం 'ఊపు' అందుకుంది. ఇప్పుడు రాజు చిత్రపటాల ముందు పాల గిన్నె కనపడ్డం లేదు. అభిషేకాలు జెరుగా జోరందుకున్నాయి. చిత్ర పటాలు పాలతో తడిసి ముద్దయి పోసాగేయి.
రాజులు తిరిగి రానిలోకాలకు ఎగిరేరు. రాజ్యాలు ఎగర్లేక పేర్లు మార్చుకుని ఉన్న చోటే ఉన్నాయి. కానీ చిత్ర పటాలకు పాల అభిషేకం మాత్రం కొనసాగింపు కొనసాగిస్తూనే ఉన్నది. అటు పిల్లులూ ఇటు మనుషులూ తాగని పాలు చిత్ర పటాల మించి ధారలు కట్టి రొడ్డు 'పాల'వసాగాయి.
- చింతపట్ల సుదర్శన్,
9299809212