Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవితా సంపుటి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..
స్వప్నంలోని మార్మిక రహస్యాల వ్యక్తీకరణ..... జీవితాన్ని -కవిత్వాన్ని మోస్తూ ఒక నల్ల బ్యాగు,కవిత్వాన్ని కలగంటూ వేస్తున్న అడుగులు, అప్పుడప్పుడు ప్రపంచంలోకి వచ్చి, ప్రపంచంలో నూతన కవిత్వం వెంటే పడుతూ కవిత్వం వెనకే నడుస్తున్న కవి ''నాళేశ్వరం శంకరం''.
ప్రతి కవికి ఒక రకమైన శిల్పం, శైలీ ప్రత్యేకతను కలిగి ఉంటాడు. ఈ కవి ఏఆడంబర పదాలు,ఏ ఢాంబికాలు లేని వాడు. ఒక మహానుభావుడు అన్నట్లు కవిత్వం, జీవితం వేరు వేరుగా వుండవు, వుండలేదు. ఆ ఉండలేని తనం, ఆ ఊపిరాడని తనం రాయించిన కవిత్వమే 1997లో వెలువరించిన ''దూదిమేడ''కవితా సంపుటి.
ఒక సంకలనమే కావచ్చు ఇప్పటికీ అతనిని కవిగా నిలబెట్టింది. ఈకవితా సంపుటి వచ్చి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది.
సమూహంలో ఉండి ఒక్కసారిగా ఒంటరివాడవుతాడు. ఒంటరిగా ఉండి జన సమూహంలో నుండి మాట్లాడుతాడు. తెలంగాణ పోరాటంలో'' తెలంగాణ రచయితల వేదిక ''ద్వారా ఊరూరా తిరిగి, తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని వ్యాప్తి చేసాడు. నాళేశ్వరం శంకరం కవిత్వంలో సమాజంపట్ల ఒక ప్రేమ, మనిషి పట్ల ఆర్తినిండి ఉంటుంది. మనిషి జీవితంలోని మూలాల్లో ఒదిగిపోయిన నైరాశ్యాన్ని వేదనని వెతికి పట్టి కవిత్వం చేయడం అనేది నాళేశ్వరం కవిత్వంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ అనుభవంలో ఉన్నది.అతని కవిత్వం ఎంతగా శ్రమజీవన సౌందర్యాన్ని గుభాలిస్తుందో అంతగా అతని జీవన విధానంకూడా నిత్యశ్రామికుణ్ణి తలపిస్తుంది.
సాహిత్యాన్ని ఎంతగా సష్టించగలరో....అంతకంటే ఎక్కువగా సాహిత్యసజనకోసం అనువైన నిర్మాణాన్ని కూడా చేపట్టగలరు.
సాహిత్యాన్ని, సాహిత్యకారులను గుర్తించి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అనేక మంది నూతన సాహిత్యకారులు తయారవ్వడానికి ఆయన నిత్యం ఆరాటపడుతుంటారు.ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నిత్యసాహితీ కషివరుడు.
తెలంగాణలో... మొత్తం తెలుగు సాహిత్య పరిణామక్రమంలో అటు సాంప్రదాయ సాహిత్యంతోను, ఇటు డెబ్భై,ఎనబై దశకాల్లో వచ్చిన విప్లవ సాహిత్యం తోనూ, ఆ తర్వాత వచ్చిన స్త్రీవాద, దళిత సాహిత్యంతోనూ, ఆ తర్వాత వచ్చిన స్వరాష్ట్ర సాధనలో వెల్లువెత్తిన ప్రాంతీయ ఆత్మగౌరవ పోరాట సాహిత్యంతోనూ పరిచయమున్న కవి నాళేశ్వరం శంకరం గారు.
''దూది మేడ'' కంటే ముందూ, దూదిమేడ తర్వాత కాలం నుండి ఇప్పటి వరకు కూడా తన సాహిత్య బిరుదును పట్టుసడలనీయని ఒక పూర్తికాల సాహిత్యకారులు నాళేశ్వరం శంకరం గారు. తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను సమాజంలోని అనేక మంది అట్టడుగుస్థాయి జీవితాలతో మమేకం చేసుకొని సాహిత్యంలో ప్రతిష్టించిన వాడు నాళేశ్వరం శంకరంగారు.
నేటి తరానికి ఆయన జీవితం, కష్టం తెలియాల్సిన అవసరం ఎంతయినా వుంది. చిన్నప్పుడు ఎడ్లు కాస్తా, గడ్డికోస్తా నాన్న బలవంతంతో బిక్షాటన అనే కుల వత్తికి స్వీకరించలేక అనుభవించిన మనోవేదన, అమ్మకు బీడీలు చుట్టడంలో సహాయపడుతూ చదువుకోవాలనే ఆలోచనను అణచుకోలేని హదయం...అతని బాల్యంమే అతనికి కవిత్వాన్ని కూడా ఇచ్చింది.
పుంఖానుపుంఖాలుగా రాసి, అశ్లీలకవిత్వాన్ని రాసి రాత్రికి రాత్రి కవిగా మారలేదు.
''దూదిమేడ'' లో తనకవిత్వాన్ని ఏవిధంగా ఆవిష్కరిస్తారో చెప్పినప్పుడు'' నాకు, నాఆలోచనకూ మధ్యన ఓ భావన రూపుదాల్చుతుంది ఆ భావనను కవితాత్మకం చేసేందుకు మనోఫలకం మీదే ప్రయత్నిస్తాను. ఆ ఆలోచనకు సరిపడే ప్రతీకల్ని సమకూర్చుకుంటూ కవిత్వం రాయడం నాకలవాటు'' అంటాడు.
దీనిని బట్టి కవిత్వం పట్ల అతనికి ఉన్న నిబద్ధత తెలుస్తుంది.ఒక కవితకు శీర్షిక అనేదిఎంత ప్రాధాన్యతను ఇస్తుందో,
''మా ఊరి మానవతార'' చెరువును వస్తువుగా తీసుకున్న కవిత.ఎత్తుగడలో ఒక త్యాగంతో తనను తాను కోల్పోతూ ఇతరులకు వెలుగునివ్వడం అనే కొవ్వొత్తితో పోలుస్తూ ఒక గొప్పభావ చిత్రమిది.
''కొవ్వొత్తిలా కరిగే చెరువును చూపినప్పుడల్లా
గుండె చెరువవుతుంది, మనసు సముద్రమౌతుంది.
''''గాయమైన పొలానికి నీటికట్లు
కట్టాలన్నదే...''
ఒక గొప్ప భావ చిత్రం మనల్ని కట్టిపడేస్తాడు.
''బతికే వూరునూ పుష్పించే భూభాగాలనూ
ఈ చెరువే అనుక్షణం అంటిపెట్టుకోవడమెందుకో!
మా వూరి నీళ్ళకడవలో తల దాచుకోవడమెందుకో''...
''మా వూరి అస్పశ్యవాడలా ఈ చెరువు''....
''అక్కడక్కడా చెరువు నీళ్ళు తాగి పూలు పుష్పిస్తాయి
నాచుమాత్రం శవంమీది గుడ్డలా చెరువుపై కప్పుతుంది.''...
చెరువు మీద కవితలు ఇప్పుడు చాలానే వచ్చాయి. కానీ ఈ కవిత 1991 నాటి ''నిండు కుండ''.
ఈ కవితను ఆసాంతం అనుభూతి చెందిన తర్వాత పల్లెలో చెరువు, పల్లెవాసుల చెరువుతో జీవన సంబంధం, ఒక పెయింటింగ్ వేసుకున్నంక తప్తిగా చూసుకున్న అనభవంలోకి తీసుకుని పోతుంది. వెంటనేఈ కవితలో అంతర్లీనంగా సామాజిక అంశం వుండడం ప్రత్యేకతగా నిలిచింది.
''చేలోకి పురుగులొస్తున్నాయి'' అభ్యుదయం,సామాజిక చైతన్యాన్ని కోరుకుంటుంది.మానవ సమాజ మార్పుకోసం శ్రీ శ్రీ తలపించే తపన ఈ కవిది.
శ్రీశ్రీ పురస్కారం అందడం ఆయన నిత్యసాహితీ కషికి దక్కిన గౌరవం.అలుపెరగని ఈ నిత్య కార్మిక కవికి మరెన్నో గౌరవాలు దక్కాలని కోరుకుందాము.
- సీహెచ్.ఉషారాణి,
9441228142