Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్‌లో తొలి నాటి సినిమా ఆనవాళ్లు ఎక్కడున్నాయోనని వెదకడమంటే ఎడారిలో ఒయాసిస్సును కనుగొన్నంత పనవుతున్నది. చాలా విషయాలు ఎక్కడా క్రమపద్ధతిలో రికార్డు కాబడిలేదు. అయితే ఈ వెదుకులాటలో లభించిన ప్రతి సమాచారమూ అత్యంత విలువైనదే. 1896లోనే హైదరాబాద్‌కు సినిమా పరిచయం ఏర్పడింది. అంటే బొంబాయికి సమాంతరంగా ఇక్కడ సినిమా చరిత్ర పరఢవిల్లిందనేది స్పష్టమైంది. 1920 నాటికి ఇక్కడ సినిమా థియేటర్లు తయారైనవి. 1922 నాటికి మూకీల నిర్మాణమూ మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సినిమా స్టూడియోల విషయానికి వస్తే వాటికి కూడా 1922లోనే బీజాలుపడినవి.
1913లో దాదాసా హెబ్ ఫాల్కే తొలి భారతీయ కథాచిత్రం 'రాజా హరి శ్చంద్ర' తీశాక దేశమంతా సినిమాల వైపు దృష్టి మళ్లించింది. అప్పటికి చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలు కూడా సినిమాలు తీయనెంచినవి. నాటి హైదరాబాదు రాజ్యం కూడా ఇందుకు మినహాయింపేమీ కాలేదు. నాటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కలకత్తా నుండి ధీరేన్ గంగూలీని పిలిపించి మూకీలు తీయించారు. ఇదే హైదరాబాదులో సినిమా స్టూడియోలకు బీజవాపన అయింది.
ధీరేన్ గంగూలీ హైదరాబాదుకు రాగానే చేసిన మొదటి పని తన సినిమాల చిత్రీకరణకు కావలసిన స్టూడియో ఏర్పాటు. తీసిన సినిమాల ప్రదర్శనకు థియేటర్ల నిర్మాణం. ఆబిడ్స్‌లోని గన్ ఫౌండ్రెలో లోటస్ ఫిలిం కంపెనీ స్టూడియోను ఏర్పాటు చేసుకున్నాడు ధీరేన్. స్టూడియోలో ఒక ఫ్లోతోబాటు, లాబ్ వంటి వసతులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్టూడియోలోనే ధీరేన్ 'చింతామణి'', ''ఇంద్ర జిత్'', ''మెరేజ్ టానిక్'', ''ది లేడీ టీచర్'' (1922), ''యమాతి'', ''హరగౌరి''(1923) అనే ఆరు మూకీలు తీశారు. ధీరేన్ ప్రతిభను చూసిన నిజాం ఆయనకు హైదరాబాద్‌లో సినిమాల నిర్మాణానికి కావలసిన అన్ని వసతులను, ఆయన షూ టింగులు జరుపుకొనడానికి హైదరాబాదులో ఉద్యానవనాలను, తమ భవం తులను వాడుకునేందుకు అనుమతులిచ్చారు.
మరొక సమాచారం ఏమిటంటే మూకీల కాలంలో ఇక్కడి స్థానికులు సినిమాలు తీయాలని సంకల్పించడం. జిమోతీలాల్ థియేటర్స్ లిమిటెడ్ కంపెనీ 1930లో దక్కన్ టాకీస్ లిమిటెడ్ 1936లో లక్ష రూపాయల చొప్పున పెట్టుబడితో మొదలయినవి. ఇంకా మహవీర్ ఫొటో ప్లేస్ నేషనల్ ఫిలిం కంపెనీ (21.06.1930), ఫిలిం కార్పొరేషన్ లిమిటెడ్ (1930), జహంగీర్ పిక్చర్స్ లిమిటెడ్ కంపెనీ (1930) కూడా మొదలైనవి. కానీ వీటిలో ఒక్క మహవీర్ సంస్థ మాత్రమే మూకీలు తీసింది. మిగిలిన నాలుగూ ఏడాది తిరగకుముందే మూతపడ్డవి.
ఆ తరువాత హైదరాబాద్‌లో మరిన్ని థియేటర్లు నిర్మాణం జరిగినా మరో స్టూడియో ఏర్పాటు జరగలేదు. 1931లో టాకీలు వచ్చినవి. ఆ తరువాత 1946లో హైదరాబాదులో టాకీల కాలంలో తొలిస్టూడియో నెలకొన్నది. అదే మహవీర్ సింగ్ స్టూడియో. మహావీర్ సింగ్ బొంబాయి చిత్ర పరిశ్రమలో సినిమా రంగంపై కొంత అనుభవం గడించి 'హైదరాబాదు ఫిలిం స్టూడియో' పేరుతో అంబర్‌పేటలో ఒక స్టూడియోను నిర్మించారు. 'ఇబ్రత్' హిందీ చిత్రాన్ని ఈ స్టూడియోలో నిర్మించి విడుదల చేసినట్లు 1968 జయశ్రీ సంక్రాంతి సంచికలో రాశారు. 1963లో మళ్లీ దీన్ని ప్రారంభించాలనే సన్నాహాలు జరిపినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఈ మహవీర్ సింగ్ నిజాం తెలుగు దినపత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు సహకారంతో స్టూడియో నిర్వాణ, సినిమా నిర్మాణం చేశారు. అప్పటికే ఆయన మద్రాసులో మీరాబాయి వంటి సినిమాలు తీసి వున్నారు. బాపిరాజుతో తెలుగు సినిమానొకదాన్ని నిర్మించతల పెట్టి బొంబాయి నుంచి సామగ్రిని తెప్పించి ఫిల్మ్ స్టూడియో నిర్మాణం ప్రారంభించారు. కానీ 1948లో హైదరాబాదులో రజాకారుల దురంతాలు, తెలంగాణ విమోచన ఉద్యమాల మధ్య ఆ ప్రయత్నాలేవీ ముందుకు సాగలేదు. దాంతో చివరికి పెద్ద గోడౌన్ల ఆనాటి స్టూడియో ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. ఈ స్టూడియో తరువాత గోడౌన్‌గా మారిపోయినా దీని ఆనవాళ్లు వడ్డెబస్తీలో ఇప్పటికీ కనిపిస్తాయి. 1950ల తొలినాళ్లలో ఈ స్టూడియోను హిందీలో హైదరాబాదీ హీరో అజిత్ కొనడానికి ప్రయత్నాలు చేసినా, 1963లో దీనిని పున:ప్రారంభించాలని ప్రయత్నాలు చేసినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం అశ్విజ్ సోదరుల యాజమాన్యంలో ఈ స్టూడియో ఉన్నది.
1956లో ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్లు ఒక్కటై ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటి వరకు మద్రాసులో స్థిరపడిన తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది. దీనికి బీజం 1955లో పడింది. ఈ ఏడాదిలోనే సారధీవారి 'రోజులు మారాయి' సినిమా సికింద్రామాద్లోని రాజేశ్వరి థియేటర్లో నూరు రోజులు ఆడింది. అక్కడే శతదినోత్సవం సంబురాలు జరిగినవి. శతదినోత్సవ వేడుకలకు నాటి రెవెన్యూ మంత్రి కె.వి రంగారెడ్డి ముఖ్య అతిధిగా మాట్లాడుతూ హైదరాబాద్‌లో తెలుగు సినిమాలను నిర్మించడానికి సిని ప్రముఖులను ఆహ్వానించారు
ఆ తరువాత చల్లపల్లి రాజా, ఎస్.ఆర్. వై. రామకష్ణప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక 1956లోనే సారథీసూడియో నిర్మాణం ప్రారంభించి 1958లో పూర్తి చేశారు. పదకొండున్నర ఎకరాల స్థలంలో నాలుగు ఫోర్లు, రెండు యూనిట్లు, లాబోరేటరీ, రికార్డింగ్ కమ్ ప్రొజెక్షన్ థియేటరు వసతులతో తయారైంది. రోజుకు 40 రీళ్లు ప్రింటు చేయగల సామర్థ్యం లాబోరేటరీలో ఉండేది.
సారథి స్టూడియోస్ 1958 జూన్ 6న ప్రారంభమైంది. పి.గంగాధరరావు నిర్మించిన 'మా యింటి మహాలక్ష్మి' తొలిసారిగా ఈ స్టూడియోలో నిర్మాణం జరుపు కున్నది. ఇదిలా ఉంటే ఆ తర్వాత సారధి స్టూడియోలో వారివే భాగ్యదేవత (1959), కుంకుమరేఖ, కులదైవం (1960), కలిసి ఉంటే కలదు సుఖం (1961), ఆత్మబంధువు (1962) వంటి తెలుగు, తమిళ చిత్రాలు చిత్రీకరణ జరుపుకున్నవి. కానీ బయటి నిర్మాతల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో స్టూడియోని మూసి వేయాల్సి వచ్చింది. ఇంతలో మద్రాసులో 1962లో వాహినీ స్టూడియోలో సమ్మె జరగడంతో తెలుగు నిర్మాతల దృష్టి హైదరాబాదు వైపు మళ్లింది. సారథి స్టూడియోను నవయుగ శ్రీనివాసరావు లీజుకు తీసుకున్నారు. ఆ తరువాత అన్నపూర్ణా వారు తీయబోయే 'చదువుకున్న అమ్మాయిలు' (1963) సినిమాను ఇక్కడే సారథిలో తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అక్కినేని హైదరాబాదుకు నివాసం మార్చి ఉన్నారు. సారధిలో నటీనటులకు గదులుండటం వల్ల చాలామంది షూటింగ్‌కు సుముఖత వ్యక్తం చేశారు. అది మొదలు పి.ఏ.పి., జగపతి, పద్మశ్రీ (పి.పుల్లయ్య), బాబూ మూవీస్ వంటి ప్రసిద్ధ సంస్థలు హైదరాబాద్‌లో సారధిలోనే షూటింగులు చేయనారంభించాయి. ఇంతలో భాగ్యనగర స్టూడియో, 'అన్నపూర్ణ' స్టూడియో రామకృష్ణా, హీరోకృష్ణ 'పద్మాలయా' స్టూడియోలు రావడంతో సారధికి పని తగ్గినా హైదరాబాద్‌కు మాత్రం షూటింగుల కళ వచ్చింది. 1990 నాటికి హైదరాబాద్‌లో ఆరు స్టూడియోలు, నాలుగు డబ్బింగు, రి-రికార్డింగ్ థియేటర్లు రెండు కలర్, ఒక నలుపు తెలుపు లాబోరేటరీలు తొమ్మిది ఎడిటింగ్, 13 ఔట్ డోర్ యూనిట్లు ఉన్నాయి.
అక్కినేని నాగేశ్వర్రావు తన పరపతితో అప్పటి ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిల కాలంలో ప్రభుత్వంతో రాయితీలు పొంది తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ రావడానికి కొంత కారణమైనారు. ఎల్.వి.ప్రసాద్, అక్కినేని స్టూడియోల కోసం దరఖాస్తులు చేసుకుంటే అన్నపూర్ణ స్టూడియోకు బంజారాహిల్స్‌లో స్థలం కేటాయించగా, ఎల్.వి.ప్రసాద్ కు చాలా ఏండ్ల తరువాత చంద్రబాబు కాలంలో నేటి నక్లెస్ రోడ్ సర్కిల్ లో నిజాం నాటి విద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేసి ప్రసాద్ ఐమాక్స్ కు జాగా ఇచ్చారు.
1960 నాటికి హైదరాబాద్ పాతబస్తీలోని జహనూమాలో సదరన్ మూవీటోన్ స్టూడియో ఒకటి ఏర్పాటైంది. అదే ఆ తరువాత అజంతా స్టూడియో అయ్యింది. ఇందులో తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలు షూటింగ్ జరుపుకున్నవి. లవకుశ నిర్మాత శంకర్ రెడ్డి భారీగా తీసిన 'రహస్యం' ఇక్కడే తయారైంది. జి.రామకష్ణారెడ్డి సోదరులు ఈ స్టూడియో నిర్వాహకులు.
ఇక హైదరాబాదు - విజయవాడ రహదారి పై 1968లో 206 ఎకరాల్లో ప్రస్తుతం ఎల్.బి.నగర్ - అయ్యప్పనగర్ ప్రాంతంలో కాసు బ్రహ్మానందరెడ్డి కాలంలో 'బ్రహ్మానంద చిత్రపురి'ని ప్రారంభించారు. ఈ చిత్రపురిలో ఎవరెవరికి ఏం కావాలో చర్చలు కూడా జరిగినవి. నాటి ముఖ్యమంత్రి, గవర్నర్ పట్టంథాను పిల్లెలు హాజరై రామకష్ణా -ఎన్.ఎ.టి. కంబైన్స్ వారి స్టూడియోకు శంకుస్థాపన చేశారు. ఇంకా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లకు ఎంతెంత స్థలాలు కావాలో ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ 1969లో తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలకు రావడంతో బ్రహ్మానంద చిత్రపురి ముందుకు సాగలేదు. ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్, ఎల్.వి.ప్రసాద్ ప్రారంభించిన నిర్మాణాలు ఐరన్ స్టచ్చర్ల దగ్గర్నే ఆగిపోయినవి.
నాగేశ్వరరావు బంజారాహిల్స్‌లో అన్నపూర్ణ స్టూడియోను 1976, జనవరి 14న ప్రారంభించారు. ఎన్.టి.రామారావు 1976 జూన్ 7న ముషీరాబాద్ లో రెండు ఫోర్లతో రామకృష్ణా స్టూడియోను నెలకొల్పి తొలుత 'దానవీర శూరకర్ణ' సిని మాతో షూటిింగులు ప్రారంభించారు. 1989లో ఇక్కడ ఫోర్లను నాచారం తరలించారు.
ఇంతలో 1983లో హీరో కృష్ణ పద్మాలయా స్టూడియోస్ కట్టాడు. ఇందులో ఆయన సొంత చిత్రాలే గాక హిందీ, తెలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకున్నవి. దీనికన్నా ముందు మహబూబ్‌నగర్ చెందిన బాదం రామస్వామి 1964లో బంజారాహిల్స్ రోడ్ నెం.14లో కొన్న స్థలంలో 1976లో భాగ్యనగర్ స్టూడియోస్ నిర్మాణం చేశారు. 1977 అక్టోబర్ 2న ప్రారంభమైన ఈ స్టూడి యోలో బయటి చిత్రాలు చిత్రీకరణ జరుపుకునడమే గాక బాదం రామస్వామి స్వంతంగా ''చెప్పింది చేస్తా'' (1978) సినిమా తీశారు కూడా. కానీ ఎంతో కాలం ఈ స్టూడియో నడవలేదు. ప్రస్తుతం స్టూడియో పరిసరాల్లో స్కూలు, నివాస గహాలుండగా స్టూడియోను హూండారు కంపెనీకి లీజుకు ఇచ్చేశారు. 1970ల్లో సైదాబాద్‌లో శ్రీనివాస స్టూడియో ఒకటి ఏర్పాటైంది. కొద్ది కాలం పాటు తెలుగు, హిందీ సినిమాల షూటింగ్ జరుపుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎన్టీరామారావు 1983లో ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లో సినిమా రంగం వేళ్లూనుకుంటుందని చాలా మంది ఆశించారు. కానీ ఆయన రాజకీయాలు, పరిపాలన, మద్రాసుకు నీళ్లందించే విషయాల పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిం చారు. వీటి సంగతి అలా ఉండగా ఈయన కాలంలోనే అన్నపూర్ణా స్టూడియోలో కొంత భాగాన్ని నిబంధనల మేరకు తిరిగి తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత 1989లో డి. రామానాయుడు జుబ్లిహిల్స్లోని చదును చేసి ప్రభుత్వ స్థలంలో రామానాయుడు స్టూడియోను ప్రారంభించారు. అన్నిరకాల వసతులు ఇందులో ఏర్పరిచారాయన. స్క్రిప్టుతో వచ్చి తొలి కాపీతో బయటికి వెళ్లవచ్చని రామానాయుడు చెప్పేవారు. ఇంకా ఈయనే నానక్ రామ్ గూడాలో పెద్ద బిల్డింగ్ సెట్‌తో షూటింగ్‌కు వసతులు ఏర్పరిచారు. వీటి మధ్యన కె.ఎస్. రామారావు కూడా ఒక స్టూడియో ను ఏర్పాటు చేసినా అది ఎంతో కాలం కొనసాగ లేదు.
వీటన్నింటి తరువాత రామోజీరావు ప్రపంచస్థాయిలో చెప్పుకోదగిన విధంగా 1996లో మొదలు పెట్టి అనాస పూర్ లో తన పేరనే రామోజీ ఫిలింసిటీని వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అత్యా ధునిక హంగులు, గొప్పగొప్ప నిర్మాణాలు, సాంకేతిక విభాగాలు ఒకటేమిటి అన్ని వసతులతో ఈ స్టూడియోను నిర్మించారు. కానీ చిన్న మధ్యతరగతి నిర్మాతలకు మాత్రం ఇక్కడ చిత్రీకరణ జరుపుకు నేందుకు ఈ ఫిలింసిటీ అందుబాటులో లేదంటారు భారీ, అతి భారీ, హిందీ చిత్రాల వారికే ఇక్కడ షూటింగ్‌కు సాధ్యమని సినిమావర్గాల వారు చెబుతారు. మరోవైపు పర్యాటక కేంద్రంగా పెద్ద వ్యాపారమే నడుస్తున్నదిక్కడ.
ఇలా హైదరాబాద్‌లో సినిమా స్టూడియోలు నెలకొన్నాయి. ప్రోత్సాహాల కింద ప్రభుత్వం నుంచి వీరిలో చాలా మంది భూములు పొందారు. కానీ ఈ ప్రాంతం భూముల్లో సినిమాలు స్టూడియోలు కట్టి తెలంగాణ వారికి ఎంతమందికి అవకాశాలు కల్పించారనే ప్రశ్న వేసుకుంటే ఒకరిద్దరు తప్ప ఎవరూ ఉండరు. సెక్యూరిటీ గార్డులు,
డ్రైవర్లు, ఆఫీస్ బాయ్ లు, లైట్ బాయ్ లుగానే తెలంగాణ వారు ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లిక్కడ కట్టిన స్టూడియోలు వ్యాపారానికి, వారి పిల్లల సినీ కెరీర్‌కు ఉపయోగపడినవి తప్ప స్థానికులకు ఒరిగిందేమీ లేదు. కాకపోతే తెలుగు సినిమా మద్రాసు నుండి నాటి తెలుగు రాజధాని హైదరాబాదుకు వచ్చింది. కానీ అందులో తెలంగాణకు స్థానం లేదంటే అతిశయం లేదు. ఎవరైనా బాదం రామస్వామి వంటి వారు ముందుకు వచ్చి స్టూడియోకడితే దాన్ని ముందుపడనీయరు. ఇప్పుడు హైదరాబాదులో మిగిలినవన్ని మనవి కాని సీమాంధ్రుల యాజమాన్యంలో ఉన్న ఫిలిం స్టూడియోలే. తెలంగాణలో తెలుగు సినిమా ఉంది. కానీ తెలుగు సినిమాలో తెలంగాణ లేదు అన్న విషయం హైదరాబాదులోని స్టూడియోల విషయాలు తెలుసుకుంటే తేలిపోతుంది.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2009 తరువాత ఉద్యమ తీవ్రతకు సినిమా రంగంలో తెలంగాణ వారిపట్ల ప్రదర్శించిన వివక్షత కూడా కొంత కారణమైంది. తెలుగు సినిమాల్లో విలన్లు, హాస్య పాత్రలకు తెలంగాణ భాషాయాసలకు అంటగట్టి అవమానించారు. ఉద్యమ తీవ్రతకు తెలుగు సినిమా రంగం కూడా కారణమైంది. ఉద్యమ కాలంలో అదుర్స్ నిర్మాత వంశీ, మోహన్‌బాబు ఆయన కుమార్తె లక్ష్మీ, చిరంజీవి కుటుంబం, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ వంటి వారంతా తెరముందు, వెనుక తెలంగాణకు అడ్డు పడినవారే ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమ నాయకులు తెలంగాణ వచ్చాక తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకొని మన జీవితాన్ని, మన కథలను, మన సంప్రదాయాలను సినిమాలుగా తీద్దామన్నారు. అందుకు సహకరిస్తామన్నారు.
కానీ తీరా తెలంగాణ వచ్చాక అందరికన్నా ముందుగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రికి బోకేలిచ్చి కలిసింది. తెలంగాణను వ్యతిరేకించిన వారే. చివరికి వారే ఇప్పటి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి మావాడేనని చెప్పుకుని పనులు చేసుకుంటున్నారు.
రెండేళ్లయినా ఇప్పుటికీ ఎఫ్.డి.సి. విభజన పూర్తవలేదు. తెలంగాణ సినిమా వేళ్లూనుకుని సినిమాలు తీయడానికి ఒక పాలసీకి రూపకల్పన జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉన్న తెలుగు సినిమా రంగంలో తెలంగాణకు స్థానం లభించదు. అంతేగాక సినిమారంగంలో తెలంగాణ వారి ప్రవేశానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. మన స్టూడియోలు రూపొందవు. మన నటీనటులు, టెక్నీషియన్లు అవకాశాలు పొందలేరు. తీరా తెలంగాణ వచ్చాక ఆంధ్ర, తెలంగాణ వారు కలిసి పనిచేయాలని చెబుతుండటం తెలంగాణ వారికి కొరుకుడు పడని విషయం. కలిసి పని చేసిన 60ఏండ్లలో తెలంగాణ వారు ఎన్ని అవమానాలు పడ్డారో తెలియంది కాదు. ముంబైలో స్థిరపడిన హిందీ చిత్రరంగం బాలీవుడ్‌తో బాటు మరాఠీ చిత్రరంగాభివృద్ధికి కూడా పూర్తి స్థాయి సహకార మందిస్తూ ఉన్నది మహారాష్ట్ర ప్రభుత్వం. అదే పద్ధతిలో తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడే ఉండిపోయినా ఎవరికీ అభ్యంతరం లేదు.కానీ తెలంగాణ సినిమారంగ పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి తోడ్పాటునందించాలి. ముఖ్యమంత్రి ప్రకటించి నట్లుగా ఫిలింస్టూడియో నిర్మాణం సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి పూర్తిచేయాలి. తత్ఫలి తంగా చిన్న నిర్మాతకు చేయూత నిచ్చినట్ల వుతుంది. ఇందులోనే ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి తెలంగాణ సమాజాన్ని, సంస్కృ తిని ప్రతిబింబించే సినిమాలు తీయడా నికి నూతన తరాన్ని తయారు చేయాలి. అప్పుడే మన స్టూడియోల్లో మన సినిమాలు తయారై తెలంగాణ సినిమా అనేది ఉనికిలోకి వస్తుంది.
- హెచ్.రమేష్ బాబు,
94409 25814