Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వసంతం- ఈ పదమే ఒక ఆనందజోల. కాలపు రాసహేల. వద్దనలేని రసడోల, మొత్తంగా వసంతుని లీల. అనుగు పెంచే ఆమని ఇష్టాన్ని హషిగా, హష్టిగా పంచే ఇష్మము అని, ఋతి అని, ఋతుపతి అని, విరాళి పెంచే కామము, కామ సఖము అని, కుసుమాలకు నిలయమైంది కనుక కుసుమాకరము, పుష్పాకరము అని, పూవులొచ్చే కాలం కనుక కుసుమా గమము అని, శరీరానికి సుఖమందించేది కనుక క్షిపణ్యువు అని, ననలు ఎగసే కాలం కనుక ననకారు అని, బంధాలలో బంధించేది కనుక బాంధవముఅని, పికములానందించే కాలం కనుక పికానందం అని, పూవులు పూసే మాసం కనుక పుష్పమాసము, పుష్ప సమయం అని పూలు గుబాళించు కాలం మదమనందించే కాలం కనుక మదనము, మధువు, మాధవము అని, మల్లెలు పూచే కాలం కనుక సురభి అని...- ఇలా అనేక పేర్లతో పిలువబడుతుంది దీనినే వసంతం అని వాసంతం అని అంటారు
వసంత శోభ గురించి మన పూర్వకవులెందరో తమ ప్రబంధాలలో కావ్యాలలో ఎంతో గొప్పగా వర్ణించారు. భర్తహరి సుభాషితాలలోను ఈ ఋతువర్ణన అద్భుతంగా చేయబడింది. ఈ ఋతువులో ఇలా అలా అంటూ ప్రకతి అందాలు, జీవుల మానసిక శారీరక ప్రవత్తులలో కలిగే మార్పులు మొదలైన విషయాలు చెప్పారు. ఇలా ఎన్నో విషయాలు చెప్పిన కవులు వసంతం అంటే ఏంటి అని నిర్వచించ లేదు. ఐతే అలా వసంతాన్ని నిర్వచించిన గుంటూరు శేషేంద్ర శర్మగారి మాటలలో వసంతం గురించి ఏం చెప్పారో చూద్దాం. ఆయన రచనలోని ప్రతి పార్శ్వం కవితాత్మకమైనదే. అద్భుతమైనదే ప్రకతి ప్రేమికుడైన శేషేంద్ర వసంత ఋతురాగం విలక్షణమైనది, వినూత్నమైనది.
మనిషి వసంతాన్నాహ్వానించటం, ఆస్వాదించటం ఓ ఉత్సవంలా జరుపుకోవటం మనకు తెలుసు. కోయిల కూత వినగానే వసంతమొస్తోందంటూ, చైత్ర మొస్తోందంటూ అనుకుంటాం మనం. వసంతమొస్తోందంటూ తెలుపుతుంది. కనుకనే కోకిలను వసంతఘోషి అని అంటారు. వసంత మొస్తోందనగానేఏం జరుగు తుందనే విషయాన్నే శేషేంద్ర - చైత్రమాసపు గాలి వీచిందో లేదో చెట్లు పూలు పూయటానికి నిర్ణయించు కున్నాయి. పూలు పెదవులు విప్పాయి పుప్పొడి రహస్యాలను వినిపించడానికి... అంటూ సెలవిచ్చారు.
చెట్లను పూజించటం మనకు తెలుసు. పూజింపబడే ప్రతిచెట్టు పవిత్రమైనదే. పవిత్రమైన ఆ చెట్టును దేవాలయంతో పోల్చారు. ఎగిరే పక్ష్నుల్ని దేవతలుగా చెప్పారు శేషేంద్ర.
నిన్నటిలాగే ఇవాళ, ఇవాళలాగే రేపు అని అనుకునే జనం 'వసంతం వచ్చింది, వెళ్ళింది' అని అనుకుంటారు. దానికేమీ ఒక ప్రత్యేకతను ఆపాదించరు. ప్రత్యేకమైన ఆనందాన్ని అనుభవించరు కొందరు. కానీ శేషేంద్ర -వసంతం అంటే మజాక్ కాదు' అంటారు. ఆయన దష్టిలో వసంతం అంటే
.....
పువ్వు పువ్వు గొంతెత్తి పిలిచే రుతువు
ఆకు ఆకు అనంత భవిష్యత్వం
ప్రతీక ఐ నర్తించే రుతువు
చెట్ల నిండా కలలు పూచే రుతువు
రంగు రాగము ఒకటై నీమీద కుట్ర చేసే రుతువు
వసంతం అనగానే సర్వ ప్రకతి శోభాయమానమై చైతన్యవంతమై సౌందర్య నిలయమై ఒప్పారుతుంది. కనుకనే - కామదేవత చేసుకునే సౌందర్య క్రతువుగా, కోకిలల పాఠశాలగా, పక్షుల సంగీత కచేరీగా ఒక్కో పక్షి వెయ్యేసి పాటలుగా రూపాంతరం చెందే రుతువుగా వర్ణించారు వసంతాన్ని. అంతేకాదు వసంతం అనేది పూల రుతువే కాదు పూలు నిట్టూర్పులు విడిచే రుతువు కూడా అనంటారు. విజమే.. కామదేవత జరుపుకునే ఈ సౌందర్య క్రతువు కాలంలో రంగు రాగం ఒకటైన కాలంలో ప్రియ వియోగ యోగంతో ప్రేమ పీయూష లేని ప్రమదలు విడిచేది నిట్టూర్పులేగా..మరి.
వసంతం వచ్చీ రాగానే - చెట్లు చిగిర్చి రంగురంగుల పూలు పూస్తాయి. జీవకళకే కొత్త కళ వస్తుంది. రసోదయ మౌతుంది. పరిసరాలు పూలవాసనతో పరిమళిస్తాయి. ఇదంతా మనం మామూలుగా చూచేది చెప్పుకునేది.కాని శేషేంద్ర పరిశీలనలో...
''వసంత ఋతువు వచ్చిందో లేదో
కోకిల గొంతు పేలిపోతుంది.
బీరుసీసా మూతి ఎగిరిపోతుంది
వాస్తవాలు స్వప్నాల మాయలోకి
దొర్లిపోతున్నాయి'' - అంటూ ఎంతో హద్యంగా చెప్పారు. అంతేనా వసంతాన్ని సాలెపురుగుతో పోలుస్తూ....
చైత్రం ఒక సాలెపురుగు. పుష్పాలు పూస్తుంది.
గూళ్ళు పెడుతుంది.
పువ్వులో రంగులు పోస్తుంది.
గూళ్ళలో చరిత్రను అల్లుతుంది.
ఏవో గుసగుసలతో ఏకాంతాన్ని ఛేదిస్తుంది - అంటూ
ఒక కొత్త ఆలోచనను భావం చిత్రాన్ని మనముందు ఉంచారు శేషేంద్ర.
వసంతంలో ప్రతి ప్రాణి పొందే ఆనందం అనంతం. కాని వసంతం విలువ, వసంతం లేకపోతే - రాకపోతే, ఆ బాధ ఎందరికి తెలుసు అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా. .ఊహూ.... (అసలు ఎదటి వారి గురించి ఎంత మంది. ఎన్ని సార్లు ఆలోచిస్తారు ). కాని శేషేంద్ర ఆలోచించారు. అర్థం చేసుకున్నారు. ఆ బాధ కేవలం ... కోకిలల్ని కోల్పోయిన కొమ్మలకే తెలుసు.
పాటల్ని కోల్పోయిన పక్షులకే తెలుసు - అని అంటారు.నిజమే కోల్పోవటు అంటే అసలైన అర్థం ఎందరికి తెలుసు... ఏమో.. వసంతాన్ని భూగోళం చుట్టూ తిరిగే అగ్ని జ్వాలగా వర్ణించిన శేషేంద్ర, ఆ అగ్నిజ్వాల కావాలంటే - అంటే వసంత సోయగాల ఆస్వాదనానుభవం కావాలంటే దేశాన్ని త్యాగం చెయ్యాలి. దేశం కావాలంటే వసంతాన్ని త్యాగం చెయ్యాలి - అంటూ వసంతోత్సవాలలోను దేశాన్ని మరువని వారు శేషేంద్ర. (నిజమైన కవి ఎపుడు తన బాధ్యతను విస్మరించడు).
అందమైన ఊహలు చాలామందికి వస్తాయి. కాకపోతే ఆ అందమైన ఊహల్ని ..భావజాలాన్ని గాఢతను హద్యంగా రసాత్మకంగా వ్యక్తపరచే భాష చాకచక్యం, చమత్కరించే నైజం కొందరికే వుంటుంది. వసంత ఋతువులోని చంద్రుణ్ణి గురించి చెబుతూ - చెట్లు ఒకదానితో ఒకటి ఆడుకుంటే ఎగిరొచ్చిన ఉల్లబంతి చంద్రుడు - అంటూ తన ఊహను నవ్యాతి నవ్యంగా వింతగా చెప్పారు. ఇతరుల నుండి పొందిన ఆనందాలకి కతజ్ఞత తెలియచేయడం సంస్కారం -
ఈ క్రూర జీవితాన్ని బ్రతకటమెలా
ఒక వసంత చాయ లేకపోతే
అందుకే నేను పాదాక్రాంతుణ్ణవుతాను
ఈ చిగురాకు నీడకు అంటూ- వసంతకాలపు చిగురాకుకు కూడా కతజ్ఞత తెలిపిన గొప్ప సంస్కారి శేషేంద్ర.
ఈ మాట ఎందుకంటున్నానంటే మేలు చేసిన వ్యక్తి కళ్ళెదుట ఉన్నా నిర్లక్ష్యంగా చేస్తూ కతజ్ఞత చూపని రోజులివి కదా. శేషేంద్ర వసంతాన్ని ఎంతగా ప్రేమించకపోతే - మనిషినై అన్ని వసంతాలు పోగొట్టుకున్నానని వాపోతారు....
మరి మళ్ళీ మళ్ళీ వచ్చే పూలకారుల్లో శేషేంద్రను మరల మరల చదువుదామా!
- రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి