Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి టైటిల్లోనే కవిత్వాన్నంతా మనకు వర్తింపచేశాడు. కవి ఎంతో ముందుచూపున్నవాడుగా మనకు తెలుస్తుంది. ఈ వర్తించటమనేది ఈ కాలానికా, రాబోయే కాలాలకా అనే సందిగ్ధ వాతావరణంలోకి నెట్టకుండా ఎప్పుడైనా కావచ్చు, ఎవ్వరికైనా కావచ్చు, ఏ సందర్భంలోనైనా కావచ్చన్నట్టుగా భవిష్యత్‌కు సంకేతాలనిచ్చాడు. నిజానికి ఎవరికీ వర్తించనిది ఏముంటుంది. కవి వర్తించేవే జోడించానన్న విశ్వాసంతోనే ఆ మాటలన్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భాన మనకు వర్తించే ఆ కవి ప్రసేన్. వీరి కవిత్వాన్ని చదివిన వారికి బహుశా తెలిసే ఉంటుంది. ఈయనో మ్యాజికల్ పోయట్ అని. పావురాన్ని పువ్వు చేయగలడు. పువ్వును దండను చేసి కవిత్వంతో ఎగరేయగలడు.
కవిత్వం చదివే వాళ్ళము సాధారణంగా పుస్తకాన్ని శ్రద్ద, ఆసక్తితో చదువుతాము. కానీ ఇంకాస్త ముందుకెళ్ళి ఈయన కవిత్వాన్ని కాస్త మెదడును అప్డేట్ చేసుకుంటూ జాగ్రత్తగా చదవాలి.ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన అప్డేటేడ్ పోయెట్.
ఇందులో కొత్తదనంతో పాటు సామాజికం ఉంది. వైయుక్తికం ఉంది. తత్వం ఉంది. మానవీయ కోణమూ, స్త్రీ సమస్యల పట్ల స్పందన ఉంది. మూఢనమ్మకాల పట్ల నిరసనను వ్యక్తం చేశాడు. కవి కవిత్వం పూర్తి అనుసంధానంతోనే ముందుకెళ్ళింది. ఇతని దుఃఖం కొత్తదే, చైతన్యం కొత్తదే, శీర్షికలు కొత్తవే. భావోద్వేగాల విషయంలో మాత్రం బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఇవన్నీ కలగలుపుకొని కవిత్వానికో చిటికెన వేలై, పట్టుకునే చేతులకోసం నడిచొస్తున్నాడు. ఈ కవి పెట్టిన ''మరణజన్మ సంయోగక్రియ'' కవితా శీర్షిక కవిలోని సజనను, ఆధునికతను పట్టిచూపుతుంది. పుస్తకం నిండా ఇలాంటివెన్నో.
వెంటాడే వాక్యాల్లోకి..
1. ఆత్మలోంచి పిట్టలేచింది / మళ్ళీ దగ్ధమయ్యేందుకు
/ కాలిపోయి చిగురించేందుకు (ఐ ఉండుట..పేజీ 15)
కవి ఇందులో మానని గాయాల గురించి మాట్లాడుతున్న అన్నాడు.మానని గాయాల నేపథ్యమంతా జీవితమే కదా.ఆ జీవితాన్ని తాత్వికంగా ఈ వాక్యాల్లోకి తీసుకొచ్చాడు. రోజూ చావటం, పుట్టటం సహజస్థితిగా మారిన మనిషికి ఈ వాక్యాలు అంకితం చేయొచ్చు.
2. ఉన్నచోటునే అలంకరించుకోవాలి / నదీ తీరమైతే అలలను అమర్చుకోవాలి / ఆకాశమైతే మేఘాలను కలిపి కుట్టు కోవాలి / పూలతోటయితే పరిమళం పులుముకోవాలి
(దేవుడూ నేనూ ఓ గుసగుస.. పేజీ 36)
చాలా మంది వ్యక్తులు తాము సాధించలేని వాటికి ఏవేవో టాగ్స్ తగిలిస్తుంటారు. ముఖ్యంగా దేవుడు నా అందున లేడు అంటూ రకరకాలుగా ఆపాదించుకుంటారు. అది ఒక వైకల్య మంటూ కవి అంటించిన చురకలు ఈ కవితా పంక్తులు. మూఢులకు ఈ వాక్యాలు ఔషధాలు. మనమెక్కడున్నా ఆ పరిస్థితుల్లో ఒదిగిపోవాలంటూ ఇచ్చిన సందేశం తప్పక గుర్తుపెట్టుకోదగినది. అందరికీ వర్తించేది.
3. ఆ విద్యార్థినులకేమీ తెలీదు / కాళ్ళ మధ్య పుండుగురించీ / ఆ పుండులోపలి నదీ ప్రవాహాలు గురించీ / ఆ నెత్తుటి పాప పుణ్యాలూ / పవిత్రాపవిత్రతల గురించీ / వాళ్ళకేమీ తెలియదు
(ఓ నా బట్టా! ముట్టుకో!..పేజీ 75)
ఈ కవితలో ఓ సున్నితమైన ఎత్తిపొడుపు మనకు కనిపిస్తుంది. ఇది కవిలో కూసంత ఎక్కువపాళ్ళే ఉన్నదన్న విషయం ఒప్పుకో తగినదే.బయటుండడం అనే కారణంతో ఏమి తెలియని పసిపాపల పట్ల ఇంత అనాగరికంగా ప్రవర్తించిన మనుషులను ఎండగడుతూ రాసిన కవితా వాక్యాలు. ఇందులో కవి పిల్లల అమాయకత్వంలోని పవిత్రతను బయటికి తీసుకొచ్చారు.
4. ''ఇక నా నువ్వొక / అంతర్లోక బినామీ సంచారివి / ఎప్పుడూ ఎల్లప్పుడూ / ఏ భావోద్వేగమూ కాపీ పేస్టవదు / ఏ బాధానందానికీ / బాక్ స్పేస్ లో చోటు దొరకదు''
(బిబ్లియోగ్రాఫిటీ..పేజీ 105)
నవ్వటం, ఏడ్వటం అనేవి కత్రిమంగా మారిన నేటి రోజుల్లో భావోద్వేగం అంశాన్ని తన కవితా వాక్యాల ద్వారా కవి చర్చలోకి తెచ్చాడు. నిజంగా ఏ వ్యక్తీ బాధ ఇంకొకరికి సంబంధించిందేమి కాదు. ఒకరిలో copy చేయబడ్డ బాధ ఇంకో వ్యక్తిలో Paste కావాలనేది ఏమి లేదు. ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో అదే వ్యక్తిలో కూడా బాధ రూపం మారి ఆనందం వైపుగా పయనించొచ్చు. లోలోపలలోనే ఒకరికి బదులుగా ఇంకొక వ్యక్తిగా తనలో తానే మార్పు చెందే కాలానికి సూచికగా ఈ వాక్యాలు కనబడుతాయి.
ఎన్నో మేలిమి వాక్యాలను రాసి అన్నీ అందరికీ వర్తింప చేసి చేతులు దులుపుకొని నీకోసం కాదు వర్తించే వాళ్ళకోసమంటూనే అందరికీ వర్తించే వర్తమాన నిత్యనూతన కవికి నమస్సులు. ఇతను post modern కాదు post post modern..
- తండ హరీష్ గౌడ్, 8978439551