Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాస్కర్ హజారికా రాసి దర్శకత్వం వహించిన ''కొథనోది'' అనే అసామీ సినిమా భారతీయ సినిమాలో ఒక గొప్ప ప్రయోగం. ఈ సినిమాలో నాలుగు కథలుంటాయి. అయితే ఈ నాలుగు అసామీ సంస్కతిలో భాగం అయిన కథలు. మనం గాబ్రియల్ గార్సియా మార్కెజ్ అనే స్పానిష్ రచయిత, అతని మాజిక్ రియలిజం గురించి గొప్పగా చెప్పుకుంటాం. కాని భారతీయ సంస్కతిలో ఈ మాజిక్ రియలిజం ఒక భాగం అన్న సంగతి మనకే తెలీయదు. అసామీ ప్రాంతపు జానపద సాహిత్యంలో మనకు ఈ మాజిక్ రియలిజం చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. వాస్తవికత, కాల్పనితకను కలిపి సాహిత్యంలో కథను నడిపించే కథనాన్ని మాజిక్ రియలిజం అంటారు. అది విశేషంగా ప్రస్తుతం స్పానిష్ సాహిత్యకారులు ఉపయోగించుకుంటున్నారు. అయితే మన ప్రాచీన సాహిత్యంలో ఈ మాజిక్ రియలిజం చాలా సహజంగా ఒదిగిపోయి కనిపిస్తుంది. అసామీ సాహిత్యంలో జానపద కథలన్నీ ఒక తరం నుండి మరొక తరానికి వినికిడి ద్వారా చేయాయి. అలా కొన్ని వందల సంవత్సరాలుగా వారి జీవనంలో భాగం అయిన నాలుగు కథలను కలిపి చిత్రించిన అసామీ సినిమా 2015లో వచ్చిన ''కొధనోది''.
ఈ సినిమాలో అన్నీ ప్రముఖ పాత్రలు స్త్రీ లే. సినిమా హారర్ థ్రిల్లర్ గా మలచబడింది. కొన్ని సన్నివేశాలు చాలా క్రూరంగా ఉంటాయి. కాని కథకు అవి ముఖ్యం. ఈ నాలుగు కథల ముఖ్య విషయం తల్లి బిడ్డల సంబంధం. అయితే అందరూ చెప్పుకున్నట్లు ఈ తల్లిబిడ్డల సంబంధాలలో కేవలం ప్రేమ ప్రధాన పాత్ర వహించదు. మానవ జీవితాన్ని, ప్రేమలని ప్రభావితం చేసే కోరిక, కోపం, అసూయ, అత్యాశ అనే నాలుగు భావాలను చర్చించే గొప్ప కథలివి. ఆ నేపథ్యంతో ఈ కథలను అర్ధం చేసుకుంటే ఆ స్త్రీ పాత్రలు మనకు అర్ధం అవుతాయి. మన జానపద సాహిత్యంలో ఎంత గొప్ప మానవ విశ్లేషణ ఉందో అర్ధం చేసుకుంటే మన ప్రాచీన సాహిత్యాన్ని ముందు తరాలకు అందించవలసిన అవసరం కూడా అర్ధం అవుతుంది. అందుకే దర్శకుని ఈ ప్రయత్నాన్ని ఎందరో హర్షించారు, ప్రోత్సహించారు కూడా. ఉత్తమ అసామీ చిత్రంగా జాతీయ బహుమతితో పాటు ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమా ప్రదర్శించబడింది.
అసామీ జానపద సాహిత్యంలో తరతరాల నుండి వస్తున్న కొన్ని కథలను ''బుర్హీ ఆయిర్ సాధు'' అనే సంకలనంలో అసామీ సాహితీవేత్త లక్ష్మీకాంత్ బెజ్బాఒరా జాగ్రత్త చేసారు. అందులోని నాలుగు కథలు ఈ సినిమా కోసం తీసుకున్నారు దర్శకులు. అవి తేజీమొలా, చంపావతి, ఔ కువొరి, తావొఇర్ క్జాధు. ఈ నాలుగు కథలను కలుపుతూ ఈ సినిమా నడుస్తుంది.
ఒక వర్తకుడికి తేజీమోలా అనే తన కూతురంటే చాలా ప్రేమ. భార్య చనిపోతే అతను మరో పెళ్ళి చేసుకుంటాడు. సహజంగానే ఆ వచ్చిన భార్య ఇష్టపడి ఈ వివాహం చేసుకోదు కాబట్టి ఈ జీవితం అంటే, భర్త అంటే, ఆ సవతి కూతురంటే చాలా అయిష్టతను, కోపాన్ని పెంచుకుంటుంది. కూతురిపై తండ్రి ప్రేమను చూసి అసూయ పడుతుంది. తనకలాంటి ప్రేమ లేకనే రెండవ పెళ్ళీ చేసుకోవలసి వచ్చింది కాబట్టి ఆమెలో ఆ అసూయ, ద్వేషంగా మారిపోవడానికి పెద్ద సమయం పట్టదు. భర్త ముందు మౌనంగానే ఉన్నా అతను వ్యాపార నిమిత్తం కొన్ని రోజులు బైటి దేశానికి వెళ్ళినప్పుడు ఆ కూతురు మీద తన కర్కశత్వాన్ని ప్రదర్శిస్తుంది. అతి పాశవికంగా ఆ అమ్మాయిని చంపుతుంది. ప్రేమ క్రూరంగా మారితే ఒక స్త్రీ ఎంత అమానవీయంగా క్రూరంగా తయారవుతుందో చెప్పే కథ ఇది. ఇందులో అ సవతి తల్లిని చుస్తే భయం కలుగుతుంది. కాని ఆమె అలా ఎందుకు మారిందో ఆలోచిస్తే ఎన్నో కారణాలు. ఆ సవతి తల్లి ఒక మంత్రగాడిని ప్రేమిస్తుంది. అతను అతి భయంకరంగా ఉంటాడు. ఆమెను అలాగే భయంకరంగా తయారు చేస్తాడు. సరైన చోట వివాహం జరగకపోతే, కోరుకున్న జీవితం లభించకపోతే మాయగాళ్ల వలలో పడడం తప్పించుకోలేరు చాలా మంది స్త్రీలు. చివరికి అతని సహాయంతోనే ఈ తల్లి కూతురిని హత్య చేస్తుంది. జీవితం పట్ల సంతృప్తి లేకపోగా, స్వేచ్చలేని జీవితంలో తమ కోపాన్ని, చేతకానితనాన్ని, అసహాయతను క్రూరంగా మరల్చుకునే స్త్రీల జీవితాలు ఈ కథలో మనకు కనిపిస్తాయి. ఆలోచింపజేస్తాయి. ప్రస్తుతం ప్రతి రోజు చూస్తున్న అక్రమ సంబంధాలు, వాటి మధ్య బలి అవుతున్న పసిపిల్లల జీవితాల వెనుక ఇటువంటి నేపధ్యమే ఉంటుందన్నది నిజం. స్త్రీలో ప్రేమ బదులు అసూయ, ద్వేషం పాళ్ళూ ఎక్కువయితే ఆమె పురుషుణ్ణి మించి క్రూరంగా ప్రవర్తిస్తుందని, అంతటి శక్తి పురుషుడుకి కూడా ఉండదని, అతి క్రూరంగా అమాయకులను చంపడానికి వెనుకాడదని చెప్పే కథ ఇది.
దీవినాధ్ ఒక వ్యాపారస్తుడు. నేత వస్త్రాల కొనుగోలు కోసం ఒక ఊరికి వెళతాడు. అక్కడ ఒంటరిగా ఉండే ఒక మహిళను గ్రామస్తులు పరిచయం చేస్తారు. ఆమె మంచి నైపుణ్యంతో వస్త్రాలు నేస్తుందని తెలుసుకుని ఆమె వద్ద బట్టలు కొనడానికి సిద్దమవుతాడు. అయితే ఆమె వెనుక ఒక ఔతెంగా (ఒక కాయగూర - బత్తాయి అంత సైజులో ఉంటుంది. అసాంలో పండుతుంది. ఇష్టంగా తింటారు అక్కడి వారు) ఎప్పుడూ దొర్లుకుంటూ వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె కథ ఆమె నోటీతో వింటాడు. పిల్లలు లేని కేతకి గర్భవతి అయితే చాలా సంబరపడుతుంది. అయితే ఆమె గర్భంలో బిడ్డ బదులు ఓ ఔతెంగా పుడుతుంది. భర్త ఆమెను మాయావి అని వదిలించుకుంటాడు. ఆమెను ఊరి వాళ్ళూ వెలివేస్తారు. ఆమె ఊరవతల ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. ఆ ఔతెంగా ఆమె వెన్నంటే దొర్లుకుంటూ వెళుతుంది ఆమె ఎక్కడికి వెళ్ళినా. తల్లి కాబట్టీ ఆ కాయను పుత్రవాత్సల్యంతోనే చూస్తుంది. ఎందరేమన్నా ఆ కాయను దూరం చేసుకోదు. దీవినాధ్ ఆమె తల్లి మనసు అర్ధం చేసుకుంటాడు. అయితే ఆ కాయలోని బిడ్డను తాను బయటకు తీసుకు వస్తానని చెబుతాడు. తల్లిగా ఆమె ఆ సహాయం కోరుకుంటుంది. అతను చెప్పినట్లుగానే నడుచుకుంటుంది. చివరకు ఆ బిడ్డ కాయలోనించి బయటకు వచ్చి తల్లి ఒండిన ఆహారాన్ని తింటున్నప్పుడు దీవినాధ్ ఆ కాయ తొక్కను కాల్చేసి ఆ బిడ్డ మనిషిగానే ఉండవలసిన పరిస్థితి కల్పిస్తాడు. తెల్లటి శరీరంతో వింత జుట్టుతో ఉన్న ఆ బిడ్డను అక్కున చేర్చుకుని మురిసిపోతుంది ఆ తల్లి. బిడ్డ కోసం ఒక తల్లి ఎన్ని త్యాగాలు చేయగలదో, ఒక కాయ కడుపున పుట్టినా (ఇది మాట వరసకు అన్న పదం కాదు. నిజంగానే ఒక కాయను ఆమె ప్రసవిస్తుంది) దాన్ని అక్కున చేర్చుకుని తల్లిగా లాలించే గుణం ఒక్క స్త్రీకే ఉంటుంది. ఎటువంటి బిడ్డ పుట్టినా, ఆ బిడ్డకు ఎటువంటి శారీరిక అవలక్షణం ఉన్నా, ప్రపంచం ఎంత గేలి చేసినా తాను కన్న నలుసును అంతే సహనంతో గుండెకు హత్తుకోగల ప్రేమ, ఆ బిడ్డకు మంచి జీవితం ఇవ్వాలనే కోరిక ఒక తల్లికే ఉంటుంది. దాని కోసం ఎన్ని అవమానాలయినా భరిస్తుంది. ఆ తల్లి కోరిక గురించి చెప్పే కథ ఇది. మొదటి కథలోని తేజోమోలా తండ్రే ఇక్కడ వ్యాపారస్తుడిగా కేతకికి సహాయపడతాడు. దర్శకుడు ఈ రెండు కథలను సినిమా కోసం అలా కలిపారు.
మరో ఊరిలో ధోనేశ్వరీ అనే తల్లి ఉంది. ఆమెకు అందమైన అమాయకమైన కూతురు యుక్తవయసుకు వచ్చి ఉంది. ఆ బిడ్డకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని, వజ్ర వైడూర్యాలతో ఆమె బతకాలని ఆ తల్లి కోరిక. అందరి కన్నా ధనవంతున్ని తెచ్చి ఈ బిడ్డకు పెళ్ళి చేయాలని ఆమె ప్రయత్నం. ఎవరో చెప్పగా వింటుంది. ఒక కొండ చిలువతో కూతురి పెళ్ళి చేస్తే ఆమె అష్ట ఐశ్వర్యాలతో తూలతూగుతుందని. ఆమె ప్రేమను అత్యాశ కమ్మివేయగా, భర్తను ఒప్పించి ఒక కొండ చిలువను పట్టి తీసుకువచ్చి దానికి అల్లుడి మర్యాదలు చేసి బిడ్డనిచ్చి సాంప్రదాయక పద్ధతిలో పెళ్ళి చేస్తుంది. పెళ్ళి అయిన రాత్రి ఆ బిడ్డకు జాగ్రత్తలు చెప్పి కొండ చిలువ పక్కన పడుకోబెడుతుంది. ఆ బిడ్డ తన భయాన్ని, తల్లితో చెబుతూనే ఉంటుంది, కాని ఆ తల్లి అది ఆ కొండచిలువ ప్రేమ చూపించే పద్ధతి అని బదులు చెబుతూ ఉంటుంది. కొండచిలువ ఆ బిడ్డను చుట్టేస్తుంటే ఆ బిడ్డ అమ్మకు చెప్పుకుంటుంది. కొద్దిగా ఓర్చుకో అష్టయిశ్వర్యాలతో తూలతూగుతావు అని తల్లి హాయిగా నిద్రపోతుంది. బిడ్డకు గొప్ప భవిష్యత్తు ఇచ్చానని నమ్ముతుంది. మరుసటి రోజు బిడ్డను మింగిన ఆ కొండ చిలువ కడుపు కోస్తే అందులో చనిపోయిన ఆ బిడ్డ శరీరం బైటపడుతుంది. అర్ధం అయీ అవనట్లు ఉన్న కథలా ఉందా.... బిడ్డలపై ప్రేమతో గొప్పింటి సంబంధాలను ఎన్నుకుని చూసి వాడికెన్ని అలవాట్లున్నా ఆస్థి ఉంటే చాలని బిడ్డ సుఖపడుతుందని నమ్మి ప్రేమతో బిడ్డల వివాహాలు చేసే తల్లులు ఈ కథలో ప్రతి చోటా కనిపిస్తారు. అత్యాశ ప్రేమకు ఎలా ద్రోహం చేస్తుందో చెప్పే అద్భుతమైన కథ ఇది. ఈ కథలోని పెళ్ళికూతురు మొదటి కథలోని తేజీమోలా స్నేహితురాలు. తేజీమోలా ఆ పెళ్ళికి తల్లి అనుమతితో వెళ్ళి తల్లి ఎలుకను చుట్టి ఇచ్చిన చీర చిరిగిపోతే ఆ చీర కారణంగా తల్లి చెతిలో దెబ్బలు తిని చనిపోతుంది. అలా ఈ రెండు కథలను కలుపుతారు దర్శకులు.
ఒక టీచర్‌గా పిల్లలను దండించిన ప్రతి సారి, పిల్లలతో కొంత కటువుగా ఉండవలసిన ప్రతిసారి నేను ఆ పిల్లల తల్లుల నుండి ఎదుర్కునే కోపం గురించి ఎంతె చెప్పినా తక్కువే. వారి కోపంలో బిడ్డలపై పిచ్చి ప్రేమ ఉంటుంది. కాని ఆ పిల్లలను శిక్షించడం అప్పుడు అవసరం అని ఆ తల్లులు నమ్మరు. పిల్లల పట్ల కొంచెం కటువుగా ఉన్నా పులిలా మీదకు దూకి పిల్లలను కాపాడుకోవాలనుకునే ఆ తల్లుల అమాయకత్వం ఆ పిల్లల భవిష్యత్తుకు, వారి కుటుంబ భవిష్యత్తుకు కూడా ప్రమాదకరం. ప్రేమ కొందరిలో అనవసర కోపాన్ని పెంచుతుంది. ఆ విషయాన్ని చర్చించే కథ ఇది. మాలతి భర్త పూనారు తన బంధువయిన ఒక ముసలి వ్యక్తిని చాలా నమ్ముతాడు. అతనికి చెప్పకుండా ఏ పనీ చేయడు. మాలతి పిల్లలను ప్రసవించిన ప్రతిసారి ఆ బంధువు ఆ పుట్టిన బిడ్డను గొయ్యి తీసి పాతి పెట్టమని చెబుతాడు. మొదటి మూడు కాన్పులలో పుట్టిన పిల్లలను అలాగే అడవిలో పాతి పెడతాడు పూనై. మాలతి నాలుగోసారి ఆడపిల్లను కంటుంది. ఈ సారి తన బిడ్డను ఇవ్వనని, ఆ బంధువుని వదిలి పెట్టమని అతని మాటలు పట్టించుకోవద్దని భర్తను కోరుతుంది. భర్త వినడు. ఒక కత్తి బట్టల మధ్య దాచుకుని ఆ బంధువు అంతు చూడడానికి బిడ్డతో అతని దగ్గరకు భర్తతో వెళుతుంది మాలతి. ఈ నాలుగో బిడ్డను చూసి ఆ బంధువు ఇదే నీకు పుట్టిన మొదటి బిడ్డ. దీన్ని ప్రేమగా పెంచుకో. నేను నీ చేత చేయించిన మూడు హత్యల గురించి తెలుసుకోవాలంటే ఆ బిడ్డలను పాతి పెట్టిన చోటుకు ఇప్పుడు వెళ్ళు అని చెబుతాడు అతను. భర్తతో అడవిలోకి వెళ్ళిన ఆమె పాతి పెట్టబడిన ఆ మూడు మతదేహాలు మాట్లాడుకోవడం చూస్తుంది. తాము పుట్టిందే ఆ భార్యాభర్తలను చంపడానికని, ఒక పద్నాలుగేళ్ళూ పిల్లలుగా బతికి ఆ కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళమని. వారిని ఆ బంధువు కాపాడి తమకు ఆ అవకాశం లేకుండా చేసాడని బాధపడడం విని ఒక బంధువుగా, తమ మంచి కోరే వ్యక్తిగా తమ మొదటి బిడ్డల్ని భూస్థాపితం చేసి ఆయన తమను కాపాడాడని, అది అర్ధం చేసుకోలేక తన తల్లి ప్రేమ అతని పట్ల కోపంగా మారి తాను అతన్ని చంపాలని చూసిందని ఆమెకు అర్ధం అవుతుంది. ప్రేమ పిచ్చిగా మారి కళ్ళకు వాస్తవాలు కనిపించక బిడ్డల పట్ల కొంత కఠినంగా ఉండవలసిన సమయంలో అలా ఉండేవారిని శత్రువులుగా చూసే పిచ్చి తల్లుల కోపం కొన్నిసార్లు ఎంత ప్రమాదమో, కని ఆ ప్రేమకు కొంత అనుభవం జోడించి చూడడం ఎంత అవసరమో చెప్పే కథ ఇది. ముఖ్యంగా ఆ చంపిన ముగ్గురు బిడ్డలు మగవారు, చివరకు వారికి పుట్టిన బిడ్డ అడబిడ్డ అవడం కొసమెరుపు. మగ బిడ్డలను వెనకేసుకొచ్చే పిచ్చి తల్లులకు ఆలోచన కలిగించే కథ ఇది.
ఈ నాలుగు కథలలో నలుగురు తల్లులు కనిపిస్తారు. పిల్లల పెంపకం, పిల్లల పట్ల భాద్యత గురించి ఎన్నో విషయాలు మాజిక్ రియలిజాన్ని అంటిపెట్టుకుని చెప్పే ఈ కథలలోని తల్లి ప్రేమను, తల్లీ బిడ్డల సంబంధాలను వివరించే గొప్ప సినిమా ఇది. కొంత హింస ఎక్కువ పాళ్ళలో ఉన్నట్లనిపించినా చాలా లోతైన అర్ధంతో ఉన్న కథలు. ఈ సినిమాని అర్ధం చేసుకోవడానికి కొంత శ్రమ పడాలి. అసామీ సాంప్రదాయ సాహిత్యంతో కొంత పరిచయమన్నా ఉండాలి. మాత్రుత్వపు వివిధ పార్శ్వాలను చర్చించే ఈ సినిమాలోని స్త్రీ పాత్రలన్నీ ఆలోచింపజేసేవే... ఈ సినిమాను తీయడానికి ధైర్యం చేసిన భాస్కర్ హజారికాని అభినందించాలి. ఇటువంటి సినిమా తెలుగు ప్రేక్షకులు చూడగాలరా అన్నది ప్రశ్నే. తెలుగులో ఇటువంటి సినిమాలు రాకపోవడానికి కారణం అలాంటి ప్రేక్షకులను మన సినిమా తయారు చేసుకోలేకపోవడమే...
- పి.జ్యోతి, 9885384740