Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెన్న శివరామకృష్ణ అశ్రుధార వ్రతం ఈ రుబాయిలు. ఈ రుబాయి ప్రక్రియ ద్వారా తన అంతరంగపదచిత్రాలను అక్షరాల ద్వారా 500 భావ చిత్రాలను చిత్రించి తెలుగుదనానికి అర్ధం చెప్పారు. ఈ ప్రయత్నంలో భావ చిత్రాలలో భావ మాధుర్యం ఎంత మాత్రం లోపించినా నిరభ్యంతరముగా వాటిని తోసిపుచ్చారు. ఇది ప్రతి కవికి ఉండవలసిన నిబద్ధత.
రుబాయిలు, గజళ్లు పారసీ భాష సాహితీ ప్రక్రియలు. తెలుగు భాష ఎలాంటి పరభాష ప్రక్రియలనైనా తనలో ఇముడ్చుకొని, ఇది తెలుగు ప్రక్రియే అన్నంతగా రూపాన్ని సంతరించుకొంటుంది. వాటి సౌందర్యదర్శనాన్ని మన కళ్లకు కట్టినట్లుగా చూపించారు. పెన్నా కలం పెన్న నది ప్రవాహ ఝరి తెలుగు హృదయాలను హత్తుకుంది.
రుబాయిలలో ఆత్శాశ్రయత, సామాజికతలు రెండూ ఒకే చోట చోటు చేసుకొని కనిపిస్తాయి. ఆత్మశ్రయతలో మనకు ప్రధానంగా వ్యక్తి, ఆ వ్యక్తి అంతర్ సంఘర్షణలు. దాని తాలూకు పరిణామాలు చోటు చేసుకొంటాయి. అలాగే సామాజిక అంశాలను పరిశీలించినట్లయితే, జీవిత నేపధ్యం, జీవతానుభావుల సారంలో గతం, వర్తమానాల్లోని వైవిధ్యతను ప్రదర్శిస్తాయి.
నిజానికి ఈ సాహిత్యప్రక్రియ 20 వశతాబ్దంలో ఎందరి చేతో కలాలు పట్టించి సశ్యకేదార ఫలాలను అందించింది.
ఈ రుబాయిల గ్రంధంలో పెన్నాగారు పుట13. రుబాయి సంఖ్య 10లో భావంలో మెరుపును, చిక్కదనాన్ని కలిగి అల్లసాని వారి జిగిబిగి తెలియజేసింది.
''తరువులతో మేలమాడు రుతువులు చూశాను !
నా అశ్రులతో నీ కనులను కడిగి చూసుకో
ఎపుడైనా నిన్ను నేను యాచించినదేమున్నది
నీ రెప్పలతో నా రెప్పలను తెరిచి చూసుకో?''
సుఖసంతోషాలు ప్రాకృతికంగా తెలియజేయడం గమనించదగినది. ఇది పాద ప్రారంభంలో వేడుకగా కన్పిస్తుంది.
రెండవ పాదంలో త్యాగనిరతిని తెలియజేస్తుంది.
మూడవ పాదంలో హద్దులు చెరిపిన నూతనత్వం ప్రతిఫలిస్తుంది.
ఆశను ఇంద్రధనువుతో పోల్చి నిశ్చితార్ధంతో రుబాయిని ముగించడంతో పాటు క్రియను విశేష ఉత్తర భాగంలో దర్శింపజేసారు.
రుబాయి సంఖ్య -22లో జీవిత సంఘర్షణ ప్రస్పుటంగా కన్పిస్తుంది.
గాయాలను పాలించే దొరనే నేను! సుడిగాలికి ఎగయు ధూళిపొరనే నేను ఏలాగైతేనేం బతికే ఉన్నాను నాకైనా వినిపించని మొరనే నేను.
తన వ్యధలకు కర్త క్రియా మాత్రమే కాదు. వాటికి ఏలికను నేనే అని. దారి తెన్ను లేని జీవితం ధూళిపొరలా గమ్యం లేకుండా సాగుతుందని. ఏదో విధంగా రేపు అనే నమ్మకంతో ఇంకా బ్రతుకు మీద ఆశ చావక జీవిస్తున్నాని. నాలో నేనుపడే మధనం నాకు కూడా అంతు చిక్కదని. ఒక దరిద్రుడి ఆర్తన ఈ రుబాయి తెలియజేస్తుంది.
కొత్తదనం కోసం వెంపర్లాడడం ప్రతి ఒక్కరికి అలవాటు. అది గ్రహపాటు కావచ్చు. పెన్నాగారు మాత్రం తన రుబాయిలో ఇలా అంటారు.
రుబాయి పుట సంఖ్య 255
వైవిధ్యమె ఎపుడూ ఈ బతుకు కోరుకునేది !
సదా నూతనత్వమె ప్రతి మనసు కోరుకునేది
వ్యవస్థ ఏదైనా సామరస్యమె మూలం
సహనమే, సంస్కృతులన్నీ బదులు కోరుకునేది !
మనిషి మనసు నిరంతరం నూతన వొరవడిని కొరుకుంటుంది. ఈ నూతనత్వానికి ఎలాంటి అడ్డుగొడలు లేవు. అలాగే వ్యవస్థలో నూతనత్వం అనేది సామరస్యానికి కొలమానంగానూ, సహన సౌశీల్యతే సంస్కృతుల సమ్మేళనమని పెన్నాగారి ఉవాచ.
రుబాయి ప్రక్రియలో అందవేసిన కవితా శిఖామణులు - దాశరధి, డా|| సి. నారాయణరెడ్డి, తిరుమల శ్రీనివాసచార్య, ఏనుగు నరసింహరెడ్ది తమ వంతు భూమికను పోషించారు. ప్రక్రియ ఏ రూపంలో ఉన్న ప్పటికీి భావ పరిపుష్టి అత్యంత అవసరం. పెన్న కలప్రవాహ ఝరిలో సాహితీ ప్రియులు తడిచి ముద్దౌతారు, మీ మనసును రంజింపజేసే ఈ రుబాయిలు ఎలాంటి సంక్లిష్టతలేని అందమైన అపురూప భావ చిత్రాలు.
పెన్నా తీరాన అలా కూర్చోని ఈ కావ్యసుధను రుచి చూడండి. తెలుగుదనంలో ఉన్న తియ్యదనం మీకు తెలుస్తుంది.
అశ్రుధార (రుబాయిలు)
కవి: పెన్నాశివరామకృష్ణ
పేజీలు: 139 వెల: రూ.100/-
ప్రతులు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
- సోపతి