Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్వ మతాలు వైష్ణవం (విష్ణు ఆలయం) , శైవం (శివాలయాలు ) , జైనం (జైనాలయం ), వీర శైవం , సమ్మేళనం ఈ నేల. సాం ఘిక, రాజకీయ చైతన్యం ఈ మట్టి సొంతం, అన్యాయాన్ని ప్రశ్నించి , ఎదురు నిలబడి , కలబడే , పౌరుషమున్నభూమీ కొలనుపాక.
నిరంకుశ మతోన్మాద ఫాసిస్టు నైజాం పాలన వ్యవస్థను'' నీకాల్మొక్తబాంచెనొర'' అనే సాధారణ తెలంగాణ రైతాంగం పిడికిలి బిగించి లావాలా, ఉప్పెనలా పైకె గిరి నిజాంను అతని తాబేదార్లను, జాగీర్దారులను,రజాకార్లను, జమీందార్లను మట్టి కరిపించి భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాయుధపోరాటం సాగించిన అనేక రైతులు చైతన్యం పోందడం లో తన వంతు పాత్రను పోషించిన బహిరామియా గ్రంథాలయం యొక్క పాత్రను ఒక సారి స్పషిద్దాం. కొలనుపాక నవాబు తురాబ్యార్జంగ్ యొక్క జాగీరు గ్రామం. ఈ జాగీర్ కింద కొలనుపాక,
బొందుగుల, చిన్నకందుకూరు మరియు రఘునాథపురంలో సగ బాగం ఉండేవి. కొలనుపాక లో జాగిర్ తహశిల్దార్ , అమీన్ కచిర్ /పోలీస్టేషన్ ఉండేది.
చివరి నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతం లో తెలుగు సంస్కతిపై, తెలుగు భాష పై ఉర్దూభాష ఆధిపత్యాన్ని చలాయిస్తున్న సందర్భమది. అది ఒక భాష సంస్కతుల పై దాడి మాత్రమే కాదు, వేషభాషలపై, సంస్కతిపై, సాంప్రదాయాలపై, తమపై జరుగుతున్న దాడిగా ప్రజలు భావించారు. తెలుగు వారంతా చైతన్యం చెంది తమ భాషను రక్షించుకునేందుకు ప్రయత్నం చేయాలని ప్రతినబూనుతున్న సందర్భం అది. ఇందుకు కారణాలు లేకపోలేదు. అందుకు ప్రధాన కారణం ఆంధ్రమహాసభ ,గ్రంథాలయోద్యమం వంటి సంస్థలు ప్రజలను అక్షరాస్యత వైపు ప్రేరేపించి వారిని చైతన్యవంతులుగా చేసే ప్రయత్నం చేశాయి. ఆ గ్రంథాలయోద్యమం కొలనుపాక గ్రామం పై ప్రభావం చూపిందని చెప్పవచ్చు.
హైదరాబాదులో విద్యనభ్యసిస్తున్న గంగరాజు కిషన్ రావు, గంగరాజు రఘునాథరావు, మంగు నరసింహారావు కొలనుపాక గ్రామానికి వేసవి సెలవుల్లో వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు విద్య నేర్పాలన్న ,విజ్ఞానం అందించాలని ఒక పఠన ఆలయం ''గ్రంథాలయం'' ఏర్పాటు చేయాలనే ఆవశ్యకత ఉన్నదని భావించి క్రీ. శక. 1921 ఏప్రిల్ 6 తారీఖున''బహారామియా గ్రంథాలయాన్ని''62 పుస్తకాలతో ఒక చిన్న ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఆరుట్ల సోదరులు ఇరువురు కొలనుపాక జాగీర్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఆ గ్రంథాలయంలో చిన్న, చిన్న పుస్తకాలు, పత్రికలు, కరపత్రాలు అందుబాటులో ఉండేవి.
వీరితో పాటు మంగు శేషగిరిరావు ఈ గ్రంథాలయ అభ్యున్నతి కి కషిచేశారు. కొద్ది కాలం తరువాత ఆగ్రంథాలయాన్ని మాటూరి రామస్వామి మడిగలోకి మార్చబడింది. తరువాత 1935 వ సంవత్సరంలో ఆంధ్రమహాసభ అధ్యక్షులు కొలనుపాక గ్రామానికి విచ్చేసినప్పుడు ఈ గ్రంథాలయానికి విచ్చేసి తగిన సహాయ సహకారాలు అందిస్తామని, ప్రజల సహాయ సహకారంతో ఈగ్రంథాలయాన్ని అభివద్ధి చేయాలని గ్రంథాలయ కమిటీకి విన్నవించారు. ఆ గ్రంథాలయానికి ప్రజల సహాయ సహకారాలతో గోల్కొండ, రహబరేదక్కన్, ప్రజామిత్ర, మొదలగు పత్రికలు తెలుగు, సంస్కతం, రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్ర మహాసభలు, గ్రంథాలయ ఉద్యమం, గ్రంధాలయాల స్థాపన (ఆంద్ర భాషా నిలయాలు) ప్రభావం వలన బహారామియా గ్రంథాలయం కాస్త బహారామియా ఆంధ్రభాషా నిలయంగా పిలిచేవారు. రానురాను గ్రంథాలయానికి చదువరులు పెరగడంతో ఆరుబయట అరుగుల పైనే కూర్చుని పేపరు చదవడం, రాజకీయ చర్చలు,
జాతీయ నాయకుల వర్ధంతులు,
జయంతులు, బుర్రకథలు, హరికథలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా చదువరులను ఆకర్షించే ప్రయత్నం చేయడం జరిగింది.
ప్రజల సహాయ సహకారాలతో ఆనాటి ఆంధ్రమహాసభ నాయకులు, యువకులు ఆరుట్లసోదరులు, బెల్లంకొండ లింగయ్యగార్లకు ఈగ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించాలని ఆలోచన కలిగింది. సరిగ్గా అదే సమయానికి ఆరుట్ల కమలాదేవి గారు మెట్రిక్యులేషను పూర్తిచేసి కొలనుపాక గ్రామానికి విచ్చేశారు. ఈ గ్రంథాలయ భవనంలో గ్రంథాలయంతో పాటు బాలికల పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు.
ఇక్కడ ఒక కొత్త విషయం ఏమిటంటే గ్రంథాలయాన్ని నిర్మించాలి అని చాటింపు వేయించగానే స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ఉదారం గా విరాళాలు అందించారు తమ ఎడ్ల బండ్లతో ఇసుక, ఇటుకలు, మట్టి, దూలాలు, పెంకులు సమకూర్చారు.
దక్కన్ రహబదురే పత్రిక విష ప్రచారం వలన నాడు గ్రంథాలయాలు నిజాం వ్యతిరేక ఉద్యమ ప్రేరకాలుగా పని చేస్తున్నాయని భావించి నిజాం ప్రభుత్వం గస్తీ నిషాన్ అనే పర్మానా విధించి గ్రంథాలయాలకు అనుమతి ఇవ్వకుండా ఉన్నది. ఆ విధంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు గ్రంధాలయం అంటే అనుమతి ఇవ్వరు అనే ఉద్దేశంతో '' రామానుజ కూటం' పేరుతో జాగిర్ తహశీల్ లో 5 మే 1941 (5 తిర్1350 ఎఫ్) నాడు అనుమతి తీసుకున్నారు.
గ్రంథాలయ భవనాన్ని ప్రజల సహాయ సహకారాలతో 85 రోజుల కాలంలో పూర్తి చేశారు. ఈ గ్రంథాలయ భవనంలో నే బాలికల పాఠశాలను 15 జూన్ 1941 లో (15 అమర్ధాడ్ 1350 యఫ్) ప్రారంభించారు. ఈ పాఠశాలలో 60 మంది బాలికలు విద్యనుఅ భ్యసించేవారు. గ్రంథాలయం అన్ని వసతులతో పూర్తి కావస్తున్న సందర్భంలో కొలనుపాక జాగీర్ ముంతజం మరియు తాసిల్దార్ ఆలయ పూజారులకు సమన్లు జారీ చేసి భయపెట్టారు. ప్రభుత్వ అనుమతి లేకుండా భవన నిర్మాణం జరిగిందని దాన్ని మూసివేయాలని అని పాఠశాలను /గ్రంథాలయాన్ని మూసివేయాలని స్కూల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి గారికిమె మో ఇచ్చారు.
ఎవరైనా ఆ గ్రంథాలయానికి వెళ్లిన శిక్ష పాత్రుల వుతారని ఆజ్ఞ జారీ చేశారు. ఆగ్రంథాలయంలో ఉన్న వస్తువులను, పుస్తకాలను ఒక గదిం తాళం వేసి ఒక పొలిసును వారం రోజుల పాటు కాపలా ఉంచారు. అప్పుడు రామ చంద్రారెడ్డి గారు అమీన్ %డ% తహిశిల్ తో ఇది ఖాన్ పాఠశాల కాదు దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఉత్తరం వ్రాశారు. ఈ విషయమే ఆరుట్ల లక్ష్మినర్సింహారెడ్డి గారు గోల్కొండ పత్రిక లోవ్యాసం కూడా రాసారు. గ్రంథాలయాన్ని/బాలికల పాఠశాలను తెరవవలసింది గా జాగీర్ కు అర్జీ ఇవ్వగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కాని ఈవిషయాన్ని దాట వేయడం జరిగింది.
జాగీర్ స య్యద్రియా ఉద్దీన్ పో లీసులు పాఠశాల భవనాన్ని గ్రంథాలయాన్ని స్వాధీనపరచు కొని సీల్ వేయడం జరిగింది. దాన్ని తిరిగి స్వాధీన పరచు కోడానికి రామచంద్రారెడ్డి, కమలాదేవి దంపతులు, బూరుగుల రామకష్ణారావు సహాయ సహకారం తో 30 మంది బాలికలను హైదరాబాద్ కు తీసుక వెళ్లి ఐ జి పి హాలెన్స్ నుక లిశారు. ఆనాడు వెళ్లిన వారిలో బెల్లం కొండ వజ్రమ్మ, బెల్లంకొండ వెంకటనరసమ్మ, ఆరుట్ల రాధమ్మ, ఆకుల బాలమని,గోపాలమ్మ, దరిపల్లిరాములమ్మ, సుభద్రమ్మ, తదితర విద్యార్థులు పాల్గొన్నారు. అయినను గ్రంథాలయం తెరవపడలేదు. తరువాత 1944, 1945, కాలంలో మూడు నెలలు మూసి తరువాత 1945 మేనుండి అని కొందరు
హైదరాబాద్ ఇండియయన్ యూనియన్‌లో కలిపిన తర్వాత గ్రంథాలయం తెరవబడ్డది అని అభిప్రాయం.
సాయుద పోరాట సమయంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లకు 20 పుస్తకాలను, దిన పత్రికలను తీసుకుని వెళ్లి రైతులకు చదివి వినిపించేవారు. వారిని చైతన్యం చేయడంలో బహరామియా గ్రంథాలయం పాత్ర అజరామం. సెప్టెంబర్ 15వ తారీఖున 1947 ఉదయం 10 గంటలకు ఆరుట్ల వీరారెడ్డి నాయకత్వంలో కానుగుయాదగిరి, చిలుకూరు నరసింహారెడ్డి, గొల్లలక్ష్మయ్య, మిరియాలనరహరి, కమ్మ కాపు రాములు, పిట్టల నరసయ్య అనుముల సోమిరెడ్డి, బెల్లంకొండ రామచంద్రయ్య నైదరాబాద్ ఇండియన్యూనియన్లో చేరాలని''షా హే ఉస్మాన్ముర్గాబాద్''అనే నినాదాలతో ఊరేగింపుగా బయలుదేరి గ్రంథాలయం దగ్గరికి రాగానే ఆనాటి తాసిల్దార్,
జాగిర్ పోలిస్ అమీన్ పోలీసు బలగంతో వచ్చి సత్యాగ్రహనికి పూనుకున్న వారిని చుట్టుముట్టారు. వీరందరిని లాఠీఛార్జ చేసి అరెస్టు చేసి భువనగిరి కోర్టులో హాజరు పరిచారు. వీరందరికీ రెండున్నర సంవత్సరాల జైలుశిక్ష 200 రూపాయల జరిమానా విధించారు. ఇవి చెల్లించక పోతే ఇంకా ఆరు నెలల శిక్ష విధించాలి అని తీర్పు చెప్పారు.
1950వ సంవత్సరంలో మార్చి నెలలో కొలనుపాకకు గిర్దావరి శిస్తు వసూలు చేయడానికి గ్రామానికి వచ్చారు అతనికి బసస్థానిక గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది బెల్లంకొండ లింగయ్య పట్వారీ నరసింహాచారి వడ్ల రాములు మొదలగు వారు మాట్లాడుతుండ గా కమ్యూనిస్టులు దాడి చేసి గిరిదావారిని, మంగు రంగారావును కాల్చిచంపారు. బాలికల పాఠశాల జైనమందిరం లో నడపాలని నిర్వహించారు. దానికి రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి కన్యా బాలికల పాఠశాల పేరుతో ప్రారంభించడం జరిగింది.
నాడు ఈ గ్రంథాలయంలో దాదాపు 10 వేల పై చిలుకు పుస్తకాలు ఆనాటి సాహిత్యం రాజకీయ, ఆర్థిక, సంబంధిత పుస్తకాలు ముఖ్యంగా కమ్యూనిస్టు సాహిత్యం ఎక్కువగా ఉండేది. గ్రంథాలయం తిరిగి తెరిచిన తర్వాత దిన దిన ప్రవర్ధమానంగా అభివద్ధి చెందింది. గ్రంథాలయం యొక్క గ్రంథ సంపద 1965 నాటికి దాదాపు 25 వేలపై చిలుకు ఉండేను. నిత్యం 100 మంది దాకా చదువర్లు విచ్చేస్తుండే వారు.
కొలనుపాక జాగీర్దార్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆరుట్ల సోదరులు, బెల్లం కొండలింగయ్య, మద్దిపాపిరెడ్డి, అనంతారం నారాయణరెడ్డి, పోతునారాయణ, బాలకొండరాజిరెడ్డి, ఆరుట్ల కష్ణారెడ్డి, మాదిగ మఠం లింగయ్య, మిర్యాల లింగయ్య, మాటలరామస్వామి, వంటి పోరాట యోధులు ఈ గ్రంథాలయంలో లేదా ఈగ్రంథాలయపు అరుగుల పై చర్చించినవారే...
తరువాత 1975 జూన్ మాసంలో డాక్టర్ సి హెచ్ దేవ్ అనంద రావు గ్రంధాలయ శాఖామాత్యులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గారి చే పక్కభవనం నిర్మించి ప్రభుత్వ శాఖా గ్రంధాలయంగా విలీనం చేసారు. కొన్ని ఆర్ధిక కారణాల వలన అనుకున్నంత స్థాయిలో అభివద్ధి చెందలేదు. ఆదరణ లేక అందులో ఉన్న గ్రంథ సంపద కాలగర్భంలో కలిసి పోయింది. ప్రస్తుతం ఈగ్రంథాలయంలో 8000 గ్రంథ సంపద ఇంగ్లీష్, తెలుగు ,హిందీ భాషల్లో పుస్తకాలు కలవు. 20 తెలుగు, ఆంగ్ల దినపత్రికలూ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నేటి యువతరానికి అవసరమయ్యే పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ నిత్యం ఈగ్రంథాలయానికి 50 మంది విద్యార్థులు, 10 వద్ధులు విచ్చేస్తుంటారు. ఉన్నటువంటి గ్రంథాలయాన్ని విస్తరించ వలసిన అవసరం ఉన్నది. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈగ్రంధాలయాన్ని ఈ గ్రంథసంపదను అభివద్ధి చేయాల్సి బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది. చరిత్ర ,వారసత్వ సంపద గల భవనాలకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయ కారాలు అంది పుచ్చుకొని ఈ ఈగ్రంధాలయాన్ని డిజిటలైజ్ చేసి విస్తత పరిచాలసిన అవసరమున్నది.
- డా || రవి కుమార్ చేగొని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం