Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈనాడు వేలకోట్ల వ్యాపారానికి కేంద్ర బిందువైన చలనచిత్రపరిశ్రమకు అంకురార్పణ
చేసిన దాదా ఫాల్కేను నిర్దయగా అవమానపరిచిన విషయం మనల్ని
కలచివేయవచ్చు. కానీ, ఈ వ్యాపార ప్రపంచంలో మానవీయ విలువలకు
తావులేదని రుజువు పరుస్తుంది ఫాల్కే జీవనగాథ.
ఎనభై ఏండ్ల కిందటి మాట. అవి 1940ల నాటి రోజులు. డెబై ఏండ్లు నిండిన ఆ వృద్ధుడు అతి సాధారణ ఖాకీ దుస్తులు ధరించి వున్నాడు. నాటి బొంబాయి నగరంలోని ఓ స్టూడియో గేటువద్ద వాచ్‌మెన్‌తో ప్రసిద్ధ దర్శకుడు కేదార్ శర్మ సినీ పనిత నాన్ని ప్రశంసిస్తూ మాట్లాడు తున్నాడు. అతని వద్ద అసిస్టెంట్‌గా చేరి పనిచేయ డానికైనా తాను సిద్ధమని, గతంలో సినిమా నిర్మాణంలో అనుభవం కలిగున్నానని మొర పెట్టుకుం టున్నాడు. చివరికి కేదార శర్మ వద్ద కెమెరాలు తుడిచే పని చేయడానికైనా తాను సిద్ధమన్నారు. ఇంతలో స్టూడియో నుండి యజమాని బయటకు వచ్చి అంతా విన్నాడు. అతనితో ఆ వృద్ధుడు తానెవరో చెప్పాడు. కాని ఆయనిదేమీ పట్టించు కోకుండా ఆ వాచమన్తో మెడపట్టి గెంటించారు. ఇంతలో అక్కడికొచ్చిన కేదార శర్మకి ఈ గెంటివేత దృశ్యం కనబడింది. అలా ఆ పెద్దమనిషిని గెంటివేసిన స్టూడియోలో తొలినాటి భారతీయ సినీ నిర్మాతల్లో ఒకరైన సేఠ్ చందూలాలల్షా కాగా, ఆ అవమానానికి గురైన వృద్ధుడు ఎవరో కాదు. యావత్ భారతీయ సినిమా కళకు ఓనమాలు నేర్పి, దాని ఎదుగుదలకు తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పితామహుడు, నేడు ''ఐశ్వర్య'' వంతమైన మన సినిమా పరిశ్రమకు బీజం వేసిన మహామహుడు. ఆయనే దుండేరాజ్ గోవింద్ ఫాల్కే. అందరూ గౌరవంగా పిలుచుకునే ''దాదా సాహెబ్ ఫాల్కే''. ఈ ఏప్రిల్ 30కి ఆయన జన్మించి 151 సంవత్సరాలు పూర్తవుతాయి.
ఈనాడు వేలకోట్ల వ్యాపారానికి కేంద్ర బిందువైన చలనచిత్ర పరి శ్రమకు అంకురార్పణ చేసిన దాదా ఫాల్కేను నిర్దయగా అవమానపరిచిన విషయం మనల్ని కలచి వేయవచ్చు. కానీ, వ్యాపార ప్రపంచంలో మానవీయ విలు వలకు తావు లేదని రుజువు పరుస్తుంది ఫాల్కే జీవనగాథ.
1910. అవి శీతాకాలపు రోజులు. బొంబాయి నగరమంతా క్రిస్మస్ ఉత్సవాల్లో మునిగి తేలుతోంది. చార్మిరోడ్లో - ఉన్న ఒక టెంట్ వద్ద 'దిలైఫ్ ఆఫ్ క్రీస్తు అనే మూకీ ప్రదర్శనను సతీసమేతంగా వెళ్ళి చూసోచ్చాడు పాల్కే. అప్పుడాయనకి క్రీస్తు జీవితంలాగే మనమూ మన ఆరాధ్య దేవతలను, ఆదర్శ పురుషులను తెరపై చూడలేమా అన్పించింది. కానీ దానికి అదిక మొత్తం లో ధనం, పరిజ్ఞానం, అనుభవం, వసతులు, వన రులు కావాలి. వీటిలో ఏ ఒక్కటీ లేకున్నా చేయాలనే సంకల్పబలం మాత్రం ఉంది. ఆ సంకల్ప బలమే భారతీయ సినిమా ఆవిర్భావానికి, అంకురార్పణకు శ్రీకారం చుట్టింది. పాల్కే ఆ తరువాత బొంబాయిలో ప్రదర్శించిన ప్రతి మూకీని చూశాడు. వాటిలోని ప్రతి సీన్‌ని, షాట్‌ని తనకున్న ఫోటోగ్రఫీ పరిజ్ఞానంతో విశ్లేషించుకున్నాడు. అప్పటిదాకా ఆయన అభ్యసించిన కళలన్నీ సినిమా నిర్మాణానికి ఉపయోగపడేవే కావడం ఫాల్కేకి కలిసొచ్చింది. ఇక తాను సినిమాను తీయగలననే నిర్ణయానికి వచ్చాడు.
సినిమాకి సంబంధించిన కేటలాగులు, పుస్తకాలు, పరికరాలను ఇంగ్లాండ్ నుండి తెప్పించుకోగలిగాడు, తన మినియేచర్ ఫిలిం కెమెరాలతో ఏడాదిపాటు ప్రయోగాలు చేస్తూ గడిపాడు. ఇలా రాత్రింబవళ్లు కెమెరాతో కుస్తీ పట్టడం, సినిమాలు చూడటం గమనించి స్నేహితులు, బంధువులు ఇదంతా జరిగేవని కాదని..... డబ్బు, సమయం, ఆరోగ్యం వ్యర్థమౌతాయని నీరుగార్చినా ఫాల్కే తన ప్రయత్నాలు మానలేదు. ఫలితంగా ఆయన కనుచూపు మందగించింది. అప్పట్లో బొంబాయిలోని ప్రసిద్ధ నేత్రవైద్యుడు డా|| ప్రభాకర్ కళ్లకు ఎక్కువగా పని కల్పిస్తే శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినా లక్ష్యపెట్టక ఫాల్కే తన ప్రయోగాలు కొనసాగించాడు.
ఫాల్కే ఇన్ని ప్రయోగాలు చేస్తున్నా, పూర్తి స్థాయి పరిజ్ఞానం సంపాదించేందుగాను ఇంగ్లండ్ వెళ్లడం తప్పనిసరి అనుకున్నాడు. కానీ అందుకు ఆర్థికపరమైన మద్దతు అవసరమైంది. తన మిత్రుడు యశ్వంత్ నాదకర్ణికి తాను రూపొందించిన 'విత్తు నుండి మొలకెత్తే దాకా' అనే లఘుచిత్రాన్ని చూపాడు
ఒక బఠాణీ విత్తును నాటి అది మొలకెత్తి మొక్కగా మారే వరకూ జరిగే పరిణామాలను దృశ్యీకరించిన ఆ సింగల్ రీల్ ఫిలింని చూసిన నాదకర్ణి మన పాల్కే పూర్తిస్థాయి సినిమాను తీయగలడని అంత త్వరగా విశ్వసించలేదు. చివరికి 10 వేలు అప్పుగా ఇవ్వగా, 15 వేలు ఇన్స్యూరెన్స్ పాలసీ మీద లోన్ తీసుకుని, మరో పదివేలు అప్పు పుట్టించు కున్నాడు. 1912 ఫిబ్రవరి 1న ఇంగ్లండ్ పయనమయ్యాడు ఫాల్కే. సినికేటలాగ్లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఇంగ్లండ్ వెళ్లగానే బయోస్కోప్ వీక్లీ ఎడిటర్ 'కాబర్నే'ని కలుసుకుని సెవెషిప్ హస్వర్త్ అనే దర్శకుని వద్ద సహాయకునిగా చేరి అన్ని విభాగాల్లో శిక్షణ పొందారు ఫాల్కే, ఇంగ్లండ్ నుండి సినిమా నిర్మాణానికి సంబంధించిన విలియంసన్ కెమెరా, డెవలపింగ్, ప్రింటింగ్ పరికరాన్ని, కొన్ని నెలలకు సరిపడే ముడిఫిలిం, సినిమా నిర్మాణాలలో సాంకేతికంగా ఉపయోగపడే పుస్తకాలతో 1912 ఏప్రిల్ 1న ఇండియా తిరిగొచ్చాడు. నూతనోత్తేజంతో బొంబాయిలో కాలుపెట్టిన పాల్కే తన కుంటుంబ సభ్యులందరికీ వేషాలు వేయించి తనకు తోచిన దశ్యాలను చిత్రీకరించాడు. ఆ దశ్యాలను ప్రాజెక్టర్తో చూడగా అవి అనుకున్నట్లుగానే వచ్చాయి. ఈ దృశ్యాలను ఒక ఫైనాన్సియర్‌కి చూపగా ఆయన సంతప్తి చెంది పాల్కే తీయబోయే చిత్రానికి అప్పు ఇచ్చేందుకు సరేనన్నాడు. కానీ సెక్యూరిటీగా ఏమైనా చూపితేగాని ఇవ్వనన్నాడు. చిత్తం తప్ప విత్తం లేని ఫాల్కే సెక్యూరిటీగా ఏమి చూపగలడు? అప్పటికే అప్పులు చేసి ఉన్నాడు. వ్యవహారాలేమీ లేవు. అందివచ్చిన అవకాశం చేజారింది. ఆ రాత్రి పక్కన అలికిడయ్యేసరికి తిరిగి చూశాడు. చేతిలో మూటతోఉన్న భార్య సరస్వతి. ''మీరు ఏమాలోచిస్తున్నారో. ఎందుకాలోచిస్తున్నారో నాకు తెలుసు. క్రీస్తు కథలాగా మనదేవుళ్ల కథలను తీయాలనుకుంటున్నారు. ఎంత ధనం కావాలో నాకు తెలీదు కానీ ఈ నగలు తీసికెళ్ళి మీ ప్రయత్నం ప్రారంభించండి'' అంటూ నగలమూట చేతిలో పెట్టింది. ఇది ఊహించని ఫాల్కే కృతజ్ఞతతో నిండిన స్వరంతో 'సరసూ' అన్నాడు. ఆ తర్వాత ఆయనకు మాటలు పెగల్లేదు. అలా తొలిసినిమా కోసం తన నగల్ని త్యాగం చేసిన సరస్వతీఫాల్కేకి యావత్ భారతీయ సినీ పరిశ్రమ ఎప్పటికీ రుణపడే ఉంటుంది.
తక్కువ బడ్జెట్లో రూపొందే 'హరిశ్చంద్ర' కథను సిద్ధం చేసుకున్న దాదాకి తారామతి పాత్ర పోషణకుగానూ మహిళలెవరూ ముందుకురాలేదు. బొంబాయి రెడ్‌లైట్ ఏరియా వెళ్ళి ప్రయత్నించినా ఎవరూ చేయమన్నారు. చివరికి హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న ఔత్సాహిక నటుడు సలంకే చేత తారామతి పాత్ర వేయించారు. వాటి ప్రసిద్ధ రాజాపూర్ డ్రామా కంపెనీవారి సహకారంతో రాజు హరిశ్చంద్ర మూకీని 3,700 అడుగుల నిడివితో పూర్తిచేశారు. పాల్కే ఫిలింస్, బాంబే - 4 బ్యానర్‌పై కథ, దర్శకత్వం, ఎడిటింగ్, ప్రాసెసింగ్, ప్రొడ్యూసర్. పాల్కే వ్యవహరించారు. టి.బి. తెలాంగ్ ఛాయాగ్రహణం అందించారు.
1913 మే 3న తొలి భారతీయ సినిమాగా రాజా హరిశ్చంద్ర బొంబాయిలోని కరోనేషన్లో విడుదలై విజయభేరి మోగించింది. ఏకబిగిన 23 రోజులపాటు కనకవర్షం కురిపించింది. ఇలా ''రాజాహరిశ్చంద్ర''లో భారతీయ సినిమా పరిశ్రమ ఆవిర్భవించింది.
భారతీయ సినిమాకు పితామహుడైన దాదాపాల్కే నాసిక్ దగ్గర్లోని త్రయంబక్‌లో 1870 ఏప్రిల్ 30న జన్మించారు. తండ్రి దాజీశాస్త్రి సంస్కృత పండితులు. చిన్నతనం నుండి ఫాల్కే లలితకళల పట్ల ఆసక్తి పెంచుకుని చిత్రలేఖనం. ఇంద్రజాలం, నటనలో ప్రవేశం పొందారు. ప్రాథమిక విద్య త్రయంబక్‌లో తర్వాత బొంబాయిలో కొనసాగింది. 1885లో బొంబాయిలోని జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరి నటనలో శిక్షణ పొందారు. అక్కడే తనకు సినిమాకళకు సంబంధించిన విషయాలతో పరిచయాలేర్పడి దానిపై అభిరుచిని పెంచుకున్నానని ఒక పత్రికలో రాశారాయన. బొంబాయిలోని కళాభవన్‌లో ఫొటోగ్రఫీ భాగానికి ఇన్చార్జిగా చేరిన పాల్కే ఫొటోగ్రఫీలో పలు ప్రయోగాలు చేయడమే గాక మౌల్డింగ్, ఆర్కిటెక్చర్లో స్వల్పకాలిక కోర్సులు చేశారు. ఫాల్కే తన కెరీర్‌ను ఫోటోగ్రఫీతో ప్రారంభించి తరువాత నాటి స్టేజీల పరదాలపై సీన్లు చిత్రించే చిత్రకారుడయ్యాడు. క్రమంగా 1903 చివరినాటికి నాటి ప్రభుత్వ పురాతత్వశాఖలో క్రాఫ్ట్ మన్ కమ్ పొటోగ్రాఫర్‌గా చేరాడు. ఆ తరువాత ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం చేశాడు. చివరికి రాజహరిశ్చంద్రతో భారతీయ సినిమాకి ఆద్యుడైనారు.
రాజాహరిశ్చంద్ర విజయమిచ్చిన ప్రేరణతో 1914లో మోహినీభస్మాసుర తీశారు. ఈ సినిమాలో పార్వతి, మోహిని పాత్రలను దుర్గ, కమలాబాయి గోఖలే అనే రంగస్థల నాయికలచే పోషింపజేశారు. వీరే భారతీయ సినిమాల్లో తొలినాయికలు. 1914 జూన్‌లోనే సావిత్రి సత్యవాన్ విడుదల చేశారు. ఆ సినిమా ఒకేసారి మూడు చిత్రాలు తీయగల్గేంత ధనాన్ని వసూలు చేసింది. మరోవైపున ఇప్పటిదాకా తీసిన ప్రింటు త్వరగా వెెలిసి పోతూండటంతో కొత్త కెమెరా, కొత్త డెవలపింగ్ మిషన్లను తేవడానికి లండన్ వెళ్తూతాను తీసిన హరిశ్చంద్ర ప్రింటు కూడా వెంట తీసికెళ్ళాడు. అక్కడ బయోస్కోప్ సంపాదకుడి సహకారంతో హరిశ్చంద్ర ప్రదర్శనలిచ్చారు. 1914 మే 28 సంచికలో 'ట్రేడ్ టాపిక్ శీర్షికన ఫాల్కే రాజహరిశ్చంద్రల గురించి పాల్కే చేసిన కృషి సాధారణమైంది కాదు. ఒక దేశపు సినిమా హరిశ్చంద్ర ఆవిర్భావానికి నాందిపలికిందని రాశారు. ఇంకా అక్కడ పలుపత్రికలు ఫాల్కే గురించి గొప్పగా రాశాయి. 1914 జూన్ 4 బయోస్కోప్‌లో ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ ఇండియా అని ఫాల్కే బొమ్మతో ప్రత్యేక వ్యాసాన్ని రాశారు. ఇంతేకాదు అక్కడి నిర్మాతలు తమకు భారతీయ కళలతో సినిమాలు తీసి పెట్టమని ఆయన ముందు క్యూకట్టారు. కానీ దాదా అంగీకరించలేదు.
1914 చివరి వాటికి ఇండియా తిరిగొచ్చిన ఫాల్కే మళ్లీ సినిమాల నిర్మాణానికి పడ్డ కష్టాలు ఇన్నీ అన్నీ కావు. అప్పటిదాకా ఫైనాన్స్ చేసిన నాదకర్ణి, అతని బావ అప్పు తీర్చమని ఒత్తిడి తెచ్చారు. దీంతో యూనిట్ సభ్యులు దూరం కానారంభించారు. అయినా వెనకంజవేయని ఫాల్కే ఒకవేళ ఈ దశ వల్లనే భారతీయ సినిమా పరిశ్రమ మూతపడవలసి వస్తే నేను ఏ స్వదేశీభావనతోనైతే లండన్‌లో సినిమాలు తీయకుండా వచ్చానో దానికి విలువ లేకుండా పోతుంది. నా జీవితాన్ని పణంగా పెట్టయినా సరే ఆర్థిక వనరులను పెంచుకుని పరిశ్రమను నిలబెడతాను. భారతీయులకు వెండితెర వైభవాన్ని అందించాలంటే ఈ మాత్రం కష్టనష్టాలు తప్పవేమోనని పించింది.' అని తన ఆత్మకథలో రాసుకున్నాడు. 1916 వరకు తన పాత చిత్రాలను ప్రదర్శిస్తూ గడిపిన ఫాల్కే గ్వాలియర్ రాణి, అంద్ పాలకులు, మరో ఇరువురి ద్వారా మొత్తం 10వేలు సమకూర్చుకుని 1917లో 'రాజాహరిశ్చంద్ర' (కొత్త వర్షన్), 'లంకాదహన్' తీసి విడుదల చేశాడు. వీటికి పోటీగా మదన్ 'హరిశ్చంద్ర' పటాన్‌కర్ 'ప్రహ్లాద'లు విడుదలైనవి. కానీ ఫాల్కే చిత్రాలు లక్షలు వసూలు చేశాయి. బొంబాయి, పూనా, మద్రాసు నగరాల్లో వసూలైన మొత్తాన్ని ఎడ్లబండ్లపై పోలీసుల సాయంతో ఇంటికి చేరవేసుకోవలసి వచ్చిందాయనకు.
దీంతో ఫాల్కే దశ తిరిగింది. 1917లో హిందూస్థాన్ ఫిలింస్ పతాకంపై తీసిన సినిమాలన్నీ ఆర్థికంగా విజయం సాధించి ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాయి. నాసిక్‌లోని ఆయన స్టూడియో నిరంతరం షూటింగ్‌లతో కళకళలాడింది. ఈ నేపథ్యంలో ఫాల్కే 'శ్రీ కృష్ణజన్మ', 'లంకాదహన్', 'కాళీయమర్దన్' (1920), 'భస్మాసురమోహిని', 'సావిత్రి సత్యవాన్' (1921), 'సంత్ నామ్‌దేవ్ (1922). 'శిశుపాలవధ', 'అశ్వత్థామ', 'భబ్రువాహన', 'బుద్ధదేవ్', 'మహానంద' (1923), 'రామరావణ యుద్ధ', 'సీతావనవాస్' (1924), 'సత్యభామ' (1925), 'జానకీ స్వయంవర్', 'సంత్ ఏకనాథ్' (1926), 'హనుమజ్జన్మ', 'మోహినీ రుక్మాంగద' (1927), పరుశురాం' (1928), 'మాలతీమాధవ, ''సంత్ మీరాబాయి' (1929), 'కబీర్కుమార్' (1930) వంటి 97 మూకీలు తీశారు. మరోవైపు షార్ట్ ఫిలింస్ కూడా తొలుత తీసింది ఈయనే. హౌ ఫిలింస్ ఆర్ మేడ్, సింహస్థ పర్వని, ఏనిమేటెడ్ కాయిన్స్, స్కార్పియస్ బైట్ మొదలైన పాతిక లఘుచిత్రాలు తీశారు. అయితే హిందూస్థాన్ ఫిలింస్, స్టూడియోలో భాగస్వాముల మధ్య విభేదాలు పొడసూపి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. దాంతో ఫాల్కేకి సినిమాలపై విరక్తి కలిగి ఉపాధి కోసం రంగస్థలంపై నాటకాలు వేయించాడు. అది నష్టాల్ని తెచ్చి పెట్టింది. కానీ హిందూస్తాన్ కంపెనీ వారికి ఫాల్కే విలువ తెలిసొచ్చి ఆయన్ను వెనక్కు పిలిపించి పూర్తి స్వతంత్ర బాధ్యతలు అప్పజెప్పి సినిమాలు తీయించారు. దాదా తీసిన చివరి మూకీ 'సేతుబంధన్' (1933).
కాగా అప్పటికే (అంటే 1931లో) అర్దేషిర్ ఇరానీ 'ఆలంఆరా' అనే తొలి భారతీయ టాకీ తీసి సరికొత్త చరిత్ర సష్టించారు. మూకీలతో భారతీయ సినిమాకు ప్రాణం పోసిన ఫాల్కేకి టాకీలు అవరోధంగా నిలిచాయి. దాంతో సేతుబంధన్ తరువాత సినిమాలకు దూరమవ్వాలనే నిర్ణయం అయిష్టమైనదే కానీ తప్పని పరిస్థితి అని 1934లో కేసరి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఇక తర్వాత ఏం చేయాలనేదే ప్రశ్న. ఎందుకంటే అప్పటిదాకా సంపాదించుకున్నది ఏమీ లేదని రాసుకున్నారు. అప్పటికాయన వయసు 62 ఏళ్లు. ఆ వయసులో కూడా ఉద్యోగాన్వేషణలో పడ్డాడు ఫాల్కే. అలా వెండితెరకి దాదాగా వెలిగిన ఫాల్కే చివరికి నిరు పేదగా నిలిచాడు. ఎన్ని పనులు చేసినా పొట్టగడవటమే గగనమైంది. ఎనామిల్ బోర్డులు రూపొందించే పని చేశాడు. ప్రశంసలొచ్చాయే తప్ప పైసా రాలేదు. ఇంతలో కొల్హాపూర్ సినిమావారు 'గంగావతరణ్' (1934) టాకీకి దర్శకత్వం వహించమని కోరారు. హిందీ, మరాఠీల్లో రూపొందిన ఈ చిత్రం పూర్తయ్యేసరికి రెండేళ్లు పట్టింది. ఇంతలో ఆయన ఆరోగ్యమూ చెడిపోయింది. ఇన్ని కారణాలతో ఆ సినిమా పరాజయం పాలైంది. అలా ఫాల్కేకి తొలిటాకీనే చివరి టాకీ అయింది.
చివరి రోజుల్లో తెరమరుగై జీవనం సాగిస్తున్న ఫాల్కేను కలుసుకున్న ఓ జర్నలిస్ట్ తమ ఫొటో ఇస్తే ముఖచిత్రంగా వేస్తామని అడగ్గా ''నేను జన్మనిచ్చిన పరిశ్రమే నన్ను మరిచిపోయింది. నువ్వెందుకు గుర్తు చేయడం? మరచిపోవడం సహజం. నువ్వు కూడా అలాగే మర్చిపో'' అన్నాడు నిర్వేదంగా, అజ్ఞాతంగా ఉంటూ, పేదరికంలో మగ్గుతూ అనామకుడిగా 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో కన్నుమూశాడు ఫాల్కే. 2004లో ముంబైలోని చిత్రపురిని 'దాదాఫాల్కే చిత్రనగరి'గా పేరు మార్చారు. నేడు ఫాల్కే లేరు... కానీ భారతీయ సినీ చరిత్రకే హీరోగా ఆయన స్థానం చెరిగిపోనిది. నేడు మన మధ్య ఫాల్కే లేడు. కాని ఆయన ప్రాణం పోసిన భారతీయ సినిమా తేజోవంతంగా వెలుగుతూనే ఉంది.
ఫాల్కే అవార్డు - రాజకీయాలు
దాదా ప్రారంభించిన సినీ పరిశ్రమలోకి ఎందరో వ్యాపారులు ప్రవేశించి కోట్లు గడించారు. కానీ ఆయన్ను సరిగ్గా గౌరవించలేక పోయారు. 1971 ఏప్రిల్ 30న భారత ప్రభుత్వం ఆయన పేరున ఒక స్మారక తపాలబిళ్లను, 1970లో శతజయంతి సందర్భంగా 1969 నుండి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రవేశపెట్టి దేవికారాణి మొదలు ఇటీవలి రజనీకాంత్ దాకా 51 మందికి బహుకరించారు. ఈ అవార్డు అందుకున్న తెలంగాణ వారిలో ప్రథముడు పైడి జైరాజ్ (1980). ఆ తర్వాత 2005లో శ్యాంబెనెగల్ ఉన్నారు. కాగా 1975లో బెంగాలీ వాడైన ధీరేన్ గంగూలీకి ఈ అవార్డు వచ్చింది. ఈయన మూకి సినిమా జీవితం మన హైదరాబాద్‌తో ముడిపడి ఉంది. 1922లో హైదరాబాద్ వచ్చి మూకీలు తీశారాయన.
ఇక ఇతర తెలుగు వారి విషయానికి వస్తే మొదటి ఫాల్కే అవార్డు వాహినీ సంస్థ అధివేత దర్శక నిర్మాత బి.ఎన్ .రెడ్డికి 1974లో వచ్చింది.ఆ తరువాత దర్శక నిర్మాత ఎల్ .వి.ప్రసాద్ (1982), విజయ-వాహిని స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి (1988), అక్కినేని నాగేశ్వరరావు (1990), శతాధిక చిత్రాలు తీసిన డి.రామానాయుడు (2009), కళాత్మక చిత్రాల దర్శకుడు కె.విశ్వనాథ్ (2016)ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. కాగా భారతదేశంలో సమాంతర సినిమాకు ఆద్యుడైన శ్యాంబెనెగల్ (2005) హిందీ విభాగంలో ఈ అవార్డు అందుకున్నా అతను మన తెలంగాణవాడే.
పోతే ఇటీవలి ఫాల్కే అవార్డు గ్రహీత రజనీకాంత్ (2019) విషయంలో కొంత వివాదం మొదలైంది. తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయనను ఎంపిక చేశారని .కళాకారులకు ఇచ్చేఅవార్డులు, పదవులు రాజకీయాలతో ముడిపెట్టి ప్రకటించడం వలన వారి విలువను కుదింప చేస్తుందనేది సినీ వర్గాల వాదన. ఐనంత మాత్రాన రజనీకాంత్ ఫాల్కే అవార్డుకు అనర్హుడని కాదు. నటుడిగా, వ్యక్తిగా ఆయన ఉన్నతుడే. కానీ ఎన్నికల సమయంలో ప్రకటించడంలోనే రజనీని మచ్చిక చేసుకుని, ఆయన అభిమానుల ఓట్లను తమ కూటమి వైపు మలుపు కోవచ్చనేది బిజేపి ఉద్దేశ్యం అనేది విమర్శ.
అంతెందుకు దేవెగౌడ ప్రధాని కాగానే కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు(1995)ఫాల్కే అవార్డు ప్రకటింపజేసుకున్నారు.ఆ తరువాత మోడీ వచ్చాక కూడా తన పాత మిత్రులు అమితాబ్, వినోద్ఖన్నాలకు అవార్డులు వచ్చాయనే విమర్శ కూడా ఉంది. ఐతే జాతీయ అవార్డులు, దాదాఫాల్కే అవార్డుల ఎంపికలో రాజకీయాలు మొదటి నుండీ ఉన్నవే. లేకపోతే గడచిన 51ఏండ్లలో ఏకంగా 28మంది హిందీ రంగానికి చెందిన వారికే అత్యధిక అవార్డులు దక్కినవి. ఆ తరువాత 11సార్లు బెంగాలీ రంగానికి, మూడవ స్థానంలో 6సార్లు తెలుగు వారికి, తమిళంలోముగ్గురికి, మరాఠి, కన్నడ, అస్సామి, మలయాళ రంగాలలో ఒక్కొక్కరికి దక్కింది. ఇందులో మరోకోణంలో చూస్తే గడచిన 50ఏళ్ళలో మహిళలకు దక్కింది ఆరుసార్లే. వరుసగ వారు దేవికారాణి(1969), రూబీమేయర్ సులోచన(1973), కానన్ బాల(1976), దుర్గాఖోటే (1983), లతామంగేష్కర్ (1989), ఆషాభోంస్లే(2000). అంటే గడచిన 20ఏండ్లుగ ఒక్క మహిళకు కూడ ఫాల్కే అవార్డు ఇయ్యలేదన్న మాట. ఇదోరకమైన పక్షపాతం. ఐతే ఉండేది ఒకే అవార్డు. సినిమాల నిర్మాణం జరిగేదేమో పన్నెండు భాషలకు పైగా. రాజకీయాల ప్రమేయం లేకుండ జాతీయ, దాదాఫాల్కే అవార్డులు ప్రకటించిన సందర్భాలు అరుదే అనడంలో అతిశయంలేదు. పోతే ఫాల్కే అవార్డు పొందిన తెలుగు వారు ఎనమండుగురు. ఈ లెక్కన చూసుకుంటే మనం కాస్త మెరుగే అనుకోవడంలో తప్పులేదేమో.
- హెచ్.రమేష్‌బాబు, 7780736386