Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరం ఒక ఉమ్మడి కుటుంభంలాంటిది. అనేక అనుభవాలను, అనుభూతులను పంచిన ఆత్మీయ నేస్తం. ఉత్తరం కోసం అలా గడపలో నిలబడి ఎదురుచూస్తు, కాలుగాలిన పిల్లిలా ఒకటికి రెండూసార్లు వీధిలోకి తొంగి చూస్తు పోస్టుమాన్ కోసం నిరీక్షించడం ఒక అందమైన అనుభూతి. ఎవరో ఒకరు దగ్గర నుండి అందిన ఉత్తరంలో తెలుగుదనం నిండిన గుండ్రని అక్షరాలు. ఏదో తెలియని ఆనందం మరోసారి విషాదం చోటు చేసుకొన్నప్పటికి. నిన్నటి పదిలమైన జ్ఞాపకాలు అభివృద్ధి నడుమ, ఉరకలు పరుగుల జీవితాలలో ఉత్తరం నేడు చెరిగిపోతున్న జ్ఞాపకం. అయితే నేటికి మారుమూల ప్రాంతాలలో ఈ ఉత్తరం అనేక కబుర్ల జలకాలాటల్లో మనసును సేదతీరుస్తుంది.
ఎన్నో యోజనాల దూరం ఈ ఉత్తర ప్రపంచం మనకు దూరమైపోయింది. భాషలోని సౌకుమార్యం. తెలుగు అక్షరంలో జీవం కృత్రిమత్వంగా ఉంది. ఫోనులోని మాటల్లో ఆత్మీయ స్పర్శ ఏ మాత్రం కనిపించడం లేదు. అంతా అంకెలగారడి జీవితం. ఉత్తరంలో చిరునామాలో ఇంటి నంబరు తప్పినప్పుడు పోస్టుమాను పడే హైరాన అంతా ఇంతా కాదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరం చిరునామా గుర్తు చేస్తూ. జ్వలితగారు 'లేఖవలోకనం' పేరుతో సమాజం మీదకు ఒక అస్త్రాన్ని సంధించారు. ఈ లేఖల్లో మనకు సమాజంలో జరుగుతున్న లైంగిక హింసను, స్త్రీల పై నిరంతరం జరుగుతున్న దాడులను ఖండిస్తూ రచయితలు తమ భావోద్వేగాలను, అవేదనను తమ ఉత్తరాలలో ప్రస్ధావించడం జరిగింది. ప్రధానంగా రచయిత్రులు స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు, ఈ లేఖాస్త్రాం ద్వారా శంఖారావం పూరించడం జరిగింది.
వాస్తవానికి ఉత్తారాలు కేవలం జ్ఞాపకాలు ఎంత మాత్రం కాదు. అందుకు ఉదాహరణగా శ్రీశ్రీ, కోకు.చలం తదితరుల ఆలోచన సరళిని సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూ, ఈ ఉత్తరాలు ఈతరానికి ప్రేరణగా అక్షర సత్యాలు. అక్షర దీపికలు.
ఈ ఆధునిక యుగంలో ఉత్తరాలు అనే తోకలేని పిట్టలు మన జీవితాల నుండి అందనంత దూరం ఎగిరిపోయాయి, అక్షరాల అక్ష రాలలో జీవం కనుమరుగవుతుంది. కలం పట్టి ఉత్తరం వ్రాయడం మరచిపోయినవారికి. జ్వలితగారి లేఖావలోకనం నేటి తరానికి సంధించిన ప్రశ్న. కలం పట్టి ఒక ఉత్తరం వ్రాయమని ఈ లేఖల సారంశం. సమయం దండుగ అనుకొకుండా ఒకసారి ఉత్తరం వ్రాసి చూడరు.మీ మనసు మీకు ఏమి సమాధానం చెప్పేది తెలుస్తుంది. మీలో నిగూఢంగా ఉన్న మీ భావేద్వేగాలను అక్షరాలలో సంధించి నలుగురితో మీ ఆత్మీయత అనుభూతులను పంచుకొండి. జీవితం క్షణికమే కావచ్చు. మీ భావనలు మాత్రం చిరంజీవత్వం కలిగివుంటాయి.
ఈ మహా యజ్ఞంలో నేను సైతం అంటూ 62 మంది రచయితలు రచయిత్రులు పాల్గోని తమ ఆలోచనల దృక్పధాన్ని తెలియజేసారు. అయితే, రచయితల స్వీయదస్తూరితో ఈ సంకలనం తీసుకు వచ్చినట్లయితే, మరింత అందంగా ఉండేది.
- బొల్లిముంత వెంకటరమణ