Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి ఇప్పుడు స్త్రీ కూడా ఉద్యోగం చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఆమె మాత్రమే కుటుంబానికి ఆధారం అవుతుంది. తాను తప్ప కుటుంబ బాధ్యత మరెవ్వరూ తీసుకోలేని పరిస్థితులలో ఆమె కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్ళీ ఉద్యోగం చేయడానికి సిద్దపడుతుంది. మన దేశంలో కష్టానికి తగిన ప్రతిఫలం రాని పరిస్థితులున్నప్పుడు కొంచెం ఎక్కువ జీతం వస్తుందంటే దేశాన్ని వదిలి పరదేశానికి ఉద్యోగానికి వెళ్ళడం ఉన్నత చదువు చూపిన మార్గం. ఉన్నత ఉద్యోగాల వేటలో దూర దేశం వెళ్ళిన నిపుణల పరిస్థితి ఆర్దికంగా గొప్పగా ఉండవచ్చు, కాని తక్కువ చదువుతో శారీరిక శ్రమతో కూడిన ఉద్యోగాల వేటలో గల్ప్ దేశాలకు వెళ్ళిన వారి కడగండ్లు ఎంత ఘోరంగా ఉంటాయో కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు స్పష్టపరుస్తూ ఉంటాయి. పురుషుడికి ఎదురయిన పరిస్థితుల కన్నా అలా గల్ప్ దేశాలలో పనికి వెళ్ళిన స్త్రీల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా కేరళ ప్రాంతం నుండి గల్ప్ ప్రాంతాలకు వెళ్ళే స్త్రీల సంఖ్య ఎక్కువ. అటువంటి ఒక స్త్రీ కథే ఈ మళయాళి సినిమా ''ఖద్దామా''.
''ఖద్దామా'' అంటే అరబిక్ భాషలో పనిమనిషి అట. ఇందులో ముఖ్య పాత్ర పేరు అస్వథి. అస్వథి పాత్రలో నటించిన కావ్యా మాధవన్ నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. 2011 లో ఈ సినిమాకు మూడు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి కేటగిరిలలో ఆ అవార్డులు ఈ సినిమాకు లభించాయి. ఒక దిగువ మధ్యతరగతి స్త్రీ అస్వథి. భర్త ఒక ప్రమాదంలో చనిపోతాడు. అంతకు ముందు కూడా అతను పెద్ద సంపాదన పరుడు కాడు. కుటుంబాన్ని ఆదుకునే వారెవ్వరూ ఉండరు. ఆమె ఊరి వాడైన ఉస్మాన్ అనే వ్యక్తి గల్ఫ్ లో ఒక పెద్ద అరబ్ షేక్ వద్ద డ్రైవరుగా పని చేస్తుంటాడు. అతని సహాయంతో ఆ యజమాని స్పాన్సర్ చేయగా అస్వథి పని మనిషిగా సౌది అరేబియా వెళుతుంది. ఆక్కడి ఆచారాలను బట్టి బురఖా ధరించడం తప్పని సరి అవుతుంది. సిటికి దూరంగా ఉన్న ఒక పెద్ద ఇంట్లోకి చేరిన తరువాత మొట్టమొదట ఆమె స్పాన్సరర్ చేసే పని ఆమె పాస్‌పోర్ట్ తీసి పెట్టుకోవడం. తరువాత ఆమెకు ఆ ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియకుండా పోతుంది. ఆ ఇంట్లో ఒక బానిస బ్రతుకు ఆమెది. ఎవ్వరు ఏం చేసినా పెదవి విప్పకూడదు.
ఉస్మాన్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. కాని మగవాడిగా అతనికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. సునామీలో అందర్ని కోల్పోయి అనాధ అయిన ఫాత్మా అనే ఒక ఇండోనేషిన్ అమ్మాయి కూడా ఆ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. ఉస్మాన్ ఫాత్మా మధ్య శారీరిక సంబంధం ఉంటుంది. అతనికి ముందే వివాహం అయ్యిందని అస్వథికి తెలుసు. అందుకని ఇది తప్పని అతని భార్యకు, ఫాత్మాకు కూడా అన్యాయం చేయడమే అని ఆమె ఉస్మాన్‌కి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాని అతను దాన్ని పట్టించుకోకుండా తనకు దొరికిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు వారి మధ్య సంబంధం ఇంటి యజమానికి తెలుస్తుంది. ఫత్మా ను విపరీతంగా కొడతారు. ఉస్మాన్‌ను ఇంటి నుండి వెళ్లగొడతారు.
అస్వథి ఫత్మా ఆ ఇంటి నుంచి తప్పించు కోవడానికి సహాయ పడుతుంది. ఫత్మాకు ఉస్మాన్ మరో చోట పని చూపిస్తాడు. అయితే ఆమె ఫత్మా పారి పోవడానికి సహయం చేసిందని అనుమానించి ఇంటి యాజమాని అస్వథి ని కూడా విపరీతంగా కోడతాడు. రకరకాల హింసలు పెడతాడు. ఆ హించ భరించలేక ఆమె ఉస్మాన్ ను సహాయ మడుగుతుంది. ఉస్మాన్ ఆమెను కూడా పారిపోయి తన స్నేహితుని వద్దకు వెళ్ళమని చెబుతాడు. అయితే అస్వథి ఆ ఇంటి నుండి బైటపడినా సరి అయిన సమయంలో ఉస్మాన్ స్నేహితున్ని చేరుకోలేకపోతుంది. అర్ధరాత్రి ఒంటరిగా మిగిలిపోతుంది. అక్కడి నుండి ఆమె కష్టాలు మరింత ఘోరంగా ఉంటాయి. ఎడారిలో ప్రయాణం, ఎవరికీ తెలియకుండా పారిపోవడం, ఎవరి కంట పడకుండా ఉండడం, ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాని స్థితి.
సౌదీలో రజాక్ అనే మరో వ్యక్తి పని చేస్తూ ఉంటాడు. అనాధలుగా మరణించిన మళయాళీల, భారతీయుల శవాలను గుర్తు పట్టి వాటిని దేశానికి తిరిగి పంపించడానికి శ్రమ పడుతూ ఉంటాడు. మార్చురీలో నిరంతరం ఎన్నో అనాధ శవాలు వస్తూ ఉంటాయి. అలాగే తప్పిపోయిన కనిపించకుండా ఉన్న వ్యక్తుల వివరాలు అతనికి చేరుతూ ఉంటాయి. తన స్వంత డబ్బు ఖర్చు పెట్టి వారికి సహాయపడుతూ ఉంటాడు. అతనికి అస్వథి అనే పని మనిషి కనిపించట్లేదనే సమాచారం అందుతుంది. ఆమె దొంగతనం చేసి పారిపోయిందని పేపర్లో వేయిస్తాడు ఆమె యజమాని. రజాక్ అస్వథి యజమానిని కలుస్తాడు. ఆ యజమాని ప్రవర్తన గమనించిన రజాక్, అస్వథి ఆ ఇంట్లో ఎన్ని బాధలు పడి ఉంటుందో గ్రహించగలుగుతాడు. ఉస్మాన్ని కలిసి అస్వథి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఇంటి నుండి పారిపోయిన తరువాత కొన్ని రోజులకు మరో వ్యక్తితో అస్వథి తనను కలిసిందని కాని మరో మగవానితో వచ్చిన ఆమెను చూసి ఆమెకు తాను సహాయం చేయ నిరాకరించానని, ఆమె దొంగతనం చేసినట్లు నమ్మి ఆమెకు సహాయం చేయలేదని చెప్పిన ఉస్మాన్‌లో ని అవకాశవాదాన్ని రజాక్ ప్రశ్నిస్తాడు. అస్వథి ని దేశం కాని దేశం పిలిపించి ఆమె గుణం తెలిసి, తన యజమాని క్రూరత్వం తెలిసి ఆమెకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఆమెను ఒంటరిని చేయడం ఎంత అన్యాయమో అర్దం చేసుకోమని చెప్పి రజాక్ అస్వథి కోసం వెతకడం మళ్ళీ మొదలెడతాడు.
అస్వథి ఒంటరిగా పారిపోతూ కొందరు దుర్మార్గులకు చిక్కు తుంది. లారిలో ఆమెను ఎక్కుంచుకుని వారు రియాధ్ తీసుకెళతాం అని నమ్మబలుకుతారు. కాని ఎడారి ప్రాంతానికి లారీ వెళ్తున్నప్పుడు ఆమె భయపడుతుంది. ఆ లారిలో ఆమె పరిస్థితి గమనించిన మరో మళయాళి ఆమెను రక్షిస్తాడు. ఏ పరిస్థితులలో ఆమె పారిపోయు ఉంటుందో అతను తన అనుభవంటో ఊహించగలుగుతాడు. ఆమె భాద్యత భరతన్ అనే ఒక ట్రక్ డ్రైవర్ కు అప్పగించి ఉస్మాన్ దగ్గరకు ఆమెను చేర్చమని కోరతాడు. భరతన్ ఉస్మాన్ వద్దకు ఆమెను తీసుకువస్తే ఉస్మాన్ ఆమెకు సహాయం చేయ నిరాకరిస్తాడు. కాని మానవత్వం నిండిన భరతన్ ఆమెను ఒంటరిగా వదలేక మరో సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడు వారిద్దరూ పోలీసులకు పట్టుపడతారు. పర పురుషుడితో పారిపోయిందన్న నెపం మీద అస్వథిని అక్రమ సంబంధం నేరం క్రింద భరతన్‌ను అరెస్టూ చేస్తారు అధికారులు. ఇటువంటి తప్పులకు కొరడా దెబ్బలు శిక్ష. అస్వథి ఆ శిక్షను అకారణంగా భరించవలసి వస్తుంది. ఆమె జైలులో ఉందని తెలుసుకున్న రజాక్ ఆమెను, ఆమెకు సహయం చేసిన భరతన్ ను కూడా విడిపించి భారతదేశం పంపించే ఏర్పాటు చేస్తాడు. నిరాశతో కృంగిన మనసుతో అస్వథి తిరిగి దేశం చేరుతుంది.
అయితే మరో అనాధ శవం ఆస్పత్రి లో ఉందని రజాక్‌కు కబురు వస్తుంది. అస్వథికి ఎడారిలో దుండగుల నుండి పారిపోవడానికి సహాయం చేసిన మళయాళి వ్యక్తి శవం అది. ఆమెను దుండగులనుండి తప్పించినందుకు వారు కాపు కాచి అతన్ని హత్య చేసారు అన్నది ప్రేక్షకులకు అర్ధం అవుతుంది. రజాక్ అతన్ని గుర్తుపట్టలేకపోతే ఖచీ×ణజుచీు×ఖీ×జుణ ×చీణ×Aచీ గా రాసుకుని ఆ శవాన్ని మూసేస్తారు మార్చురీ వాళ్ళు. ఇలాంటి గురించలేని శవాలు ఎన్నో ఆ మార్చురీ నిండా వాటి వెనుక ఎన్ని కథలో. భారతదేశంలో వారికోసం ఎదురు చూస్తున్న ప్రాణాలు ఎన్నో....
అస్వథి కథ ద్వారా గల్ప్‌లో ఇంటి పని కోసం వెళ్ళే భారతీయ స్త్రీల జీవితాలను చూపించే ప్రయత్నం చేసారు దర్శకులు కమల్. ఈ సినిమాను గల్ప దేశాలలో బాన్ చేసారట. అయితే ఈ సినిమా చాలా భాగం గల్ప్ లోనే చిత్రించారు. గల్బ్ జీవితంతో అనుభవం ఉన్న చాలా మంది ఈ సినిమాలో సన్నివేశాలలో నూరు శాతం వాస్తవికత ఉందని దృవీకరించారు. కె. యు. ఇక్బాల్ ఈ సినిమా కథా రచయిత. మళయాళం న్యూస్ అనే పత్రికలో జర్నలిస్టుగా పని చేసిన అనుభవంతో గల్ఫ్ లోకొన్ని సంవత్సరాలు ఉన్న అనుభవంతో ఈ కథను వారు తయారు చేసుకున్నానని చెప్పుకున్నారు. ఈ సినిమా కథకు ఆధారం సుబైదా విలిక్కున్ను అనే ఒక స్త్రీ అనుభవాలు. పత్రికలో ఇక్బాల్ పని చేస్తున్నప్పుడు ఆమె కథ వినడం జరిగింది. అయితే సుబైదా ఇందులో అస్వథి లాగా భారతదేశం రాలేకపోయింది. ఒక డిపోర్టేషన్ కాంప్ లో పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేక జబ్బు పడి మరణించింది. ఇలాంటి కథలెన్నో చూసిన అనుభవంతో ఇక్బాల్ రాసుకున్న స్క్రిప్ట్ ఇది. కావ్యా మాధవన్ నటన ను అందరూ మెచ్చుకున్నా అమెకు కథా పరంగా పెద్దగా నటించే స్కోప్ లేదని నా కనిపించింది. రజాక్ పాత్రలో శ్రీని వాసన్, భరతన్ పాత్రలో మురళీ గోపి నటన బావుంటుంది. ఈ సినిమా యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో దొరుకుతుంది. ఈ ఇతివృత్తంతో వచ్చిన మొదటి సినిమా ఇది. తెలుగులో ''పంజరం'' అనే పేరుతో ఇది డబ్ అయిందని తెలిసింది. ప్రయత్నిస్తే దొరకవచ్చు.
- పి.జ్యోతి, 9885384740