Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టాలు, కన్నీళ్ళు దాడి చేస్తున్నప్పుడు తోడుగా, నీడగా నేనున్నానంటూ కొందరి పరిచయాలు మనకు ఊరటనిస్తాయి. కన్నీళ్ళు తుడుస్తాయి. ప్రేమగా దగ్గరికి చేరి పెన్నిధిగా నిలిచిపోతాయి. వీడిపోని బంధమై మనల్ని అల్లుకుపోతాయి. ఆ తీయని పరిచయమే ప్రేమగా మారి ప్రాణబంధమై ప్రయాణిస్తే జీవితం పూలదారిలా సాగుతుంది.
మానవ జీవన ప్రయాణం విచిత్రమైనది. పుట్టుక మొదలు మరణించేవరకు ఎన్నెన్నో మలుపులు.. అనుబంధాలు, అనురాగాలు, ఈర్ష్యాద్వేషాలు,కుళ్ళు కుతంత్రాలు.. ఇలా ఎన్నెన్నో మనిషికి ఎదురై బలపరుస్తాయి. బలహీనపరుస్తాయి కూడా.. అయితే ఈ గమనంలో కష్టాలు, కన్నీళ్ళు దాడి చేస్తున్నప్పుడు తోడుగా, నీడగా నేనున్నానంటూ కొందరి పరిచయాలు మనకు ఊరటనిస్తాయి. కన్నీళ్ళు తుడుస్తాయి. ప్రేమగా దగ్గరికి చేరి పెన్నిధిగా నిలిచిపోతాయి. వీడిపోని బంధమై మనల్ని అల్లుకుపోతాయి. ఆ తీయని పరిచయమే ప్రేమగా మారి ప్రాణబంధమై ప్రయాణిస్తే జీవితం పూలదారిలా సాగుతుంది. అలాంటి యువతీయువకుల ప్రేమగాథను మధురమైన పాటగా పలికించాడు సిరాశ్రీ. 'భైరవగీత' (2018) సినిమాలో ఆయన రాసిన ఈ ప్రణయగీతం యువహృదయాలను హాయిగా తడుముతుంది.
ప్రియుని రాక వల్ల ప్రేయసి జీవితం ఆనందమయమైంది. ప్రేయసి రాక వల్ల ప్రియుని మనసు పరవశమై చిందులు వేస్తుంది. అంటే ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉందన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. నా పాలిట భగవద్గీతవు. నా నుదుటన బ్రహ్మదేవుడు రాసిన గీతవు. నువ్వేనా? అని ప్రేయసి ప్రేమగా ప్రశ్నిస్తుంది ప్రియుడిని. అంటే ఇక్కడ ఆమె జీవితానికి దొరికిన దివ్యవరం ఆ ప్రియుడు. ఆమె జన్మకు సార్థకతను కలిగించినవాడు. ఇంకా నా బ్రతుకుకు రక్షణగా ఉన్న లక్ష్మణరేఖవు నువ్వే కదా! ఏ కష్టం నన్ను సమీపించకుండా రక్షణ కవచమై నన్ను కాపాడేది నువ్వే కదా! అని అంటుంది. ఆ ప్రేయసికి రాళ్ళదారిలో నడుస్తూ ఉన్నా రహదారల్లే ఉంది. ముళ్ళబాటలో వెళుతూ ఉన్నా పూలదారిలా అనిపిస్తుంది. కారణం ఆమె వెంట తన ప్రియుడున్నాడు. అతనితో సాగించే ప్రయాణం అంత హాయిగా ఉందామెకు. అయితే ఇక్కడ ఆమె రాక కూడా ప్రియుడి జీవితంలో కొత్త సంతోషాన్ని తీసుకొచ్చింది. అందుకే ఆ ప్రియుడు కూడా ఆమెను తన పాలిట భగవద్గీతగా, తన జీవనరేఖగా, తన భాగ్యరేఖగా భావిస్తున్నాడు.
ఇంతటి ఆనందం తన ప్రియుడి రూపంలో తనను చేరడానికి ఏ జన్మలో నేను ఏ పుణ్యం చేసుకున్నానో అని ప్రేయసి భావిస్తుంది. ఏడేడు జన్మల భాగ్యంగా ఈ జన్మలో నాకు నువ్వు దొరికావని ప్రియుడంటాడు. ప్రేయసి కళ్ళు మూసుకున్నప్పటికీ అతని రూపమే కనిపిస్తుందట. అంతటి ఆరాధన మరి. ప్రియుడికి చివరి ఊపిరి దాకా ప్రేయసే దారి చూపే దీపమై, ప్రాణమై నడిపిస్తుందట. ఇక్కడ అతనిదీ అదే ఆరాధన..
ఆమె శ్వాస కూడా ఆమె ఎదలోని ప్రియుడిని చేరిందట. అతని గుండె శబ్దం ఆమెను జోకొట్టి జోలపాడిందట. నిన్నటివరకు రెండుగా ఉన్న మనం నేడు నిండుగా ఒకటైపోయాం. కలలన్నీ పండించుకుని శతమానం అంటూ పెళ్ళివైపు అడుగులు వేద్దామంటూ ప్రేయసీప్రియులు తమ ప్రేమ ప్రయాణాన్ని, అన్యోన్య అనురాగాన్ని పంచుకుంటారు. వలపుల వరదల్లే సాగే ఈ రెండు హృదయాల పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూనే ఉంటుంది.
అద్భుతమైన సంగీతం అమోఘమయమైన సాహిత్యం ఈ పాటకు మరింత వన్నె తెచ్చాయని చెప్పవచ్చు.
పాట :
నువ్వేన భగవద్గీత/నా నుదుటిన బ్రహ్మగీత/నువ్వేన లక్ష్మణరేఖ/నా జన్మకు రక్షణరేఖ
రాళ్ళలో నడుస్తు ఉన్నా/రహదారల్లే ఉంది/మనదారిలో ముళ్ళెన్నున్నా/పూదారల్లే ఉంది
నువ్వేన భగవద్గీత/నా నుదుటిన బ్రహ్మగీత/నువ్వేన జీవనరేఖ/నా మనసుకు భాగ్యరేఖ
ఏనాటి పుణ్యఫలమో నా మనసు నిన్ను చేరింది/ఏడేడు జన్మలకథ ఏమో ఈ జన్మ నిన్నే ఇచ్చింది/కనుమూసి ఉన్న రెప్ప తెర మీదనే కనిపిస్తు ఉంది నాకు నీ రూపమే/కడదాక దారి చూపే ఓ దీపమై కరుణించావమ్మా నువ్వే నా ప్రాణమై
నాలోని శ్వాస కూడా ఎదలోని నిన్ను తాకింది/నా గుండె సవ్వడి నిను చేరి జోకొట్టి జోలను పాడింది/నిన్న మొన్న ఉన్నా గాని రెండుగా ఒకటై నేడు ఉన్నామే నిండుగా/జతగానే స్వప్నాలన్ని నేడు పండగా శతమానం పాడుకుంటూనే పండుగా..
- తిరునగరి శరత్ చంద్ర , 6309873682