Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో హిందూ దేవాలయాలకు కొదువేలేదు. ఏ రాష్ట్రంలోనైనా ఏదొక విశిష్టత కలిగిన శైవ, వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో ఎంతో విశిష్టత కలిగిన కట్టడాలు, ఎంతో చరిత్ర కలిగినవి కూడా ఉన్నాయి. కొన్ని ఏక శిల నిర్మాణాలుంటే... కొన్ని రాతి కట్టడాలూ ఉన్నాయి. అలాంటి కోవలోదే ఉన్కోటి.. ఈ ప్రాంతానిది శిల్ప సౌందర్యమే కాదు పచ్చని ప్రకృతి కూడా... ఈ ప్రాంతం దర్శించేవారు ప్రకృతి ఒడిలో సేద తీరుతూ... శిల్ప సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఒక కొండను అలవోకగా ఎక్కేంత ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇంతటి రమ్యమైన ప్రాంతం ఎక్కడ ఉందో, ఈ స్థల విశిష్టత ఏంటో తెలుసుకుందామా...
భారతదేశంలోని రాష్ట్రాలలో త్రిపుర మూడవ చిన్న రాష్ట్రం. 'రాజ్మల' ప్రకారం, సుప్రసిద్ధమైన చారిత్రక ఆధారాల పరంగా చూస్తే త్రిపుర 'త్రిపూర్' అనే రాజు 'త్రిపుర' అని పిలువబడే ప్రాంతాన్ని పాలించాడు. అతని పేరు మీదుగానే ఆ రాజ్యాన్ని త్రిపురగా పిలిచేవారు. ఇక్కడి ఒక జిల్లానే ఉన్కోటి.. ఉనకోటి అంటే కోటికి ఒక్కటి తక్కువ అని.. అంటే 99,99,999 అని అర్థం. దేశంలో ఎక్కడా లేని శైవ యాత్రా స్థలంగా ఈ ప్రాంతాన్ని పేర్కొంటుంటారు. అంతేకాదు దీనిని పెరులోని మచ్చుపిచ్చుతో పోల్చుతారు. ఈ ప్రాంతంలో నడుస్తూంటే మరొక శకానికో, మరో కాలానికో వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో అనేక శిల్పాలు రాతితో, రాతిలో చెక్కారు. 8, 9వ శతాబ్దాల నాటివిగా చెప్పే ఈ శిల్పాలకు కొన్ని ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి.
ప్రచారంలోని కథలు...
అందులో ఒక కథ.. పురాణాల ప్రకారం, శివుడు తన పరివారంతో కలిసి కాశీకి వెళుతుండగా, మధ్యలోనే రాత్రి అవుతుంది. ఆ రాత్రి సమయంలో వారు కైలాషహర్ ఉండిపోతారు. ఈ ప్రాంతం ఉనకోటి నుండి 10 కిలోమీటర్ల లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. అయితే అందరు వేకువ జామున త్వరగా బయలు దేరాలని ముందుగానే హెచ్చరించి ఉంచుతాడు. అయినప్పటికీ శివుడు మాత్రమే త్వరగా మేలుకొంటాడు. మిగిలిన వారు మేల్కోరు. వారందరిపై కోపంతో, చిరాకుతో తనొక్కడే వెళ్ళిపోతాడు. తన పరివారమంతా ఇప్పుడు ఉనకోటి వాలులోనే ఉండిపోయారని కథనం ఉంది.
మరో కథనం.. కల్లుకుమ్హార్ అనే వ్యక్తి పార్వతి అంటే అద్భుతమైన ఔత్సాహికం కనబరిచేవాడు. శివపార్వతులు పరివారంతో కలిసి ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నపుడు కల్లుకుమ్హార్ వారితో కలిపి కైలాసానికి వస్తానని కోరతాడు. శివపార్వతులు ఈ విషయం గురించి ఆలోచించి... పార్వతిదేవి 'శివునితో పాటు అతని పరివారం మొత్తానివి కోటి శిల్పాలు ఒక్క రాత్రిలో ఇక్కడున్న రాళ్ళలో చెక్క గలిగితే తెల్లవారాక తీసుకెళ్తామని' అని అతని ప్రతిభకు, సామర్థ్యానికి పరీక్ష పెడుతుంది. ఒకవేళ కల్లుకుమ్హార్ను తమతో తీసుకెళ్ళాలని, లేకుంటే ఇక్కడే వదిలివేయాలని నిర్ణయించుకుంటారు. అందుకు అంగీకరించిన ఆ శిల్పి రాత్రంతా కష్టపడి చిత్రాలు చెక్కుతాడు. మరుసటి రోజు తెల్లవారే సరికి కోటికి ఒక్కటి తక్కువ చేయగలుగుతాడు. నిబంధన ప్రకారం శిల్పి చేయలేక పోవడంతో శివుడు అతనిని కైలాసానికి తీసుకెళ్ళకుండా వదిలివేశాడని స్థానిక కథ ప్రచారంలో ఉంది.
రెండు రకాలైన శిల్పాలు
ఆధ్యాత్మికం అనే విషయం పక్కన పెడితే ఈ శిల్పాల సౌందర్యం ఎంత చూసినా తనివితీరదు. ఉన్కోటిలో కనిపించే శిల్పాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రాతితో చెక్కినవి, మరొకటి రాతి శిల్పాలు... రాతితో చెక్కిన శిల్పాలలో శివుడు, గణేషునికి సంబంధించిన శిల్పాలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఇలాంటి శివుని శిల్పాలను ఉనకోటీశ్వర కాల భైరవ అని పిలుస్తారు. ఇవి 30 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇందులో ఒక్క తల భాగమే 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహాలు ఉన్న ప్రతి చోట శివునికి రెండు పక్కల ఇద్దరు దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఒకటి సింహం మీద నిలబడిన దుర్గా మాత, మరో స్త్రీ మూర్తి విగ్రహం. వీటితో పాటు అదనంగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని భూమిలోపలకు కూరుకుపోయినట్లుంటాయి. ఇలా దాదాపు కోటికి ఒక్కటి తక్కువగా శిల్పాలు ఈ ప్రాంతంలో అడుగడుగునా కనిపిస్తుంటాయి.
పండుగలు
ప్రతి ఏటా ఇక్కడ ఏప్రిల్ నెలలో అశోకాష్టమీ మేళా అని పెద్ద జాతర నిర్వహిస్తారు. ఈ పండుగకు వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. దీనితో పాటు జనవరిలో మరో చిన్న జాతర కూడా జరుగుతుంటుంది.
పచ్చని ప్రకృతి ఒడిలో...
కైలాషహర్ అనేది ఒక కొండ ప్రాంతం.. ఈ కొండ వాలులో పైకి ఎక్కే కొద్దీ శిల్పాలు దర్శనమిస్తుం టాయి. అంతే కాదు.. ఈ ప్రాంతం మొత్తం పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరంగా, కన్నుల విందుగా ఉంటుంది. కొండ ప్రాంతం మొదలయినప్పటి నుండి శిల్ప సౌందర్యం కూడా మొదలవు తుంది. శిల్పాలను చూస్తూ కొండవాలు ఎక్కవచ్చు. అంతేకాదు ప్రస్తుతం ఈ ప్రాంతం అభివృద్ధి దశలో ఉంది. దీనిని ప్రపంచ వారసత్వ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఎలా చేరుకోవాలంటే...
ఉన్కోటి జిల్లా కేంద్రానికి తూర్పు వైపు 8 కిలోమీటర్ల దూరంలో కైలాషహర్ ఉంది. అగర్తలాకు ఈశాన్యంలో 178 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. రైలు మార్గమైతే ధర్మనగర్ రైల్వే స్టేషన్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.