Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రేవు ... రేవులో పడవలు.. వాటి
సింగారమైన తెల్లని తెరచాపలు...
రేవు గట్టుపై ఈ చెట్టు... రేవులోకి దిగటానికికున్నఈ మెట్లు... నాకు ఊహ తెలిసిన నాటి నుండి చూస్తూనే ఉన్నా.... పడమటి వాకిలి ముందు నిలిచిన నా ఈ జీవితంలో.... ప్రపంచంలో ఎన్నో మార్పులు. అలాగే ఈ రేవులోను ఎన్నో మార్పులు...
నిజానికి నేనిక్కడికి వచ్చి చాలా ఏళ్ళు ఐంది. చీకటి మూసిన ఆకాశమైన నను ఒక దీర్ఘ నిశ్వాసం ఇక్కడికి లాక్కొచ్చింది. ఇక్కడ ఈ చెట్టు కింద ఉన్న రాతి మీద కూర్చున్నానా... కదలే అలల్లా నా కళ్ళ ముందు ఎన్ని చిత్రాలో... మనసు నిశ్చలతను నలిపేస్తూ.. ఓదార్పందని నా మనసెపుడూ చిత్తడిగానే... ఎన్ని జ్ఞాపకాల ముద్రలు మోస్తూనో... ఒంటరి తనంలో వాటిని తోడు తెచ్చుకుంటూ... అలల్ని నెట్టే తెడ్డులా ... ఎపుడూ తడిగానే... ఆటుపోట్లకు తడుస్తూ, ఆరుతూ... ఆరుబయటే... ఎవరు గుర్తించని... ఎవరికి పట్టని ఇసుకలా... నేను. తడి ఇసుకలో పిచ్చుకగూళ్ళు కడుతూ ఆనందించే పిల్లల కేరింతలలా ఎపుడో కాని ఓ ఆనందపు వీచిక నన్నంట లేదు.
ఈ రేవు ఒడ్డున... ఇక్కడే కూర్చుని ఎన్నిసార్లు ఏడ్చానో. రాక్షసత్వం నిండిన తండ్రి ఆధిపత్యపు అహంకారానికి ఒణికిపోతూ... ఓదార్చే ఒడి లేక, అపుడు ఈ రేవే అలల చేతులతో నన్ను హత్తుకుని తెరచాపల కాపులలో నాకు ధైర్యమిచ్చాయి. ఇక్కడ పడవలో కూర్చున్న నన్ను అలలు ఎంతగా ఊయలలూపాయో. ఒడ్డును కొట్టుకునే అలలు బాధ - ఆక్రందననీ వినిపించేవి. పడవల్ని కట్టే గుంజలు' లంగరు మనిషి బతుకు కూడా ఇలాగే... ఎపుడో... అంటూ తెలిపేవి. వెన్నెలలో ఇసుకపై పడుకున్నపుడు ఆ ఏకాంతం... ఒంటరితనం ఎంత విషాదాన్ని, ఎంత భయాన్ని కుమ్మరించేదో.. విప్పి చెప్పలేని అలజడినెంత పంచేదో...
నిజం ఈ రేవు నాకెన్నో నేర్పింది-. ఆలోచన, అవగాహన, బాధ, భయం ...మనసుకు మెత్తదనం... ఆనందించటం - నిర్లిప్త నిర్వేదాలననుభవించటం, నిష్కతిలేని బంధాల బంధనాలను భరించటం... మనిషి క్రౌర్యం, మూర్ఖత్వం శ్రమించటం, విహరించట, ఆకాశాన్ని ఆలింగనం చేసుకునే గాలితో మాట్లాడటం, సాయం.. వ్యవసాయం ఇలా ఎన్నెన్నో... ఎవరు నేర్పని చెప్పని ఎన్నెన్నో విషయాలు విలువలు నేర్పింది. అందుకే ఈ రేవున అపుడపుడూ నన్ను పిలుస్తూంటుంది. ఎవరు నా పిలుపుకు బదులివ్వనపుడు ప్రేమంటే... అంటూ అందని.. అనుభవానికిరాని ప్రేమను వెదికి వెదికి విసిగినపుడు అగాధమై మనసు అలమటించినపుడు ఈ రేవే నన్ను పిలుస్తూ ఉంటుంది.
జీవితంలో చాలా దూరం వచ్చాను. ఈ ప్రయాణంలో ఇంత దూరం ఎలా వచ్చానో... ఎలా నడిచానో... ఎన్ని ఆనందాలు అందాయో... నిజంగా అందాయా... ఎంత విషాదమయ్యానో... ఎవరికి తెలుసు.
లోక సహజమైన పెళ్ళి, పిల్లలు, ఉద్యోగం, అవసరాలు.. అపోహలు... అయోమయం.. చీకటి పొద్దులై... ముద్దుగా మారక.. మనసు రంగుల రంగమై హాయి స్వరాల సరమై నిలవక... అందమైన జీవితమందక జాలి ఔతూ... జాజుల జాజరలా ఓ జావళిలా అవక... ఆరభిలా కాక వరాళిని వినిపిస్తూ... ఉన్నా.
నేనందరి కోసం, నా కోసమెవరు? ఏ చేయి నా తల నిమిరింది. ఏ ఒడి నా అలసట తీర్చింది. ఏ ఎద నా దిగులు కాటును మాన్పింది. ఏ చేతి కొన నా నిస్సహాయ అశ్రువులను. తుడిచింది.
నా చూపులు చురుకుదనాన్ని కోల్పోయి వాడిలేని తూపులుగ మారితే.. చీకట్లో నేనొంటరిగా... మనసుకెందుకింత చిత్రవధ... వ్యధ మనిషికి మరో మనిషి తోడు ప్రేమ అవసరమే కదా! మరి నాకా అవసరాన్ని తీర్చేదెవరు?.
కట్టుకున్నవాడికి నే తెచ్చే కాసులు కావాలి. పిల్లలకి వాళ్ళ కోరికలు తీరాలి. మనసు అనుభవించే సంతోషం ఏదో... సంతప్తి ఏదో తెలుసుకోలేని ఆబోతు అనురాగం చూపక చీకట్లో చేసే చేతలకి మూలిగే మనసు నుండి అసహ్యం పడగలెత్తి బుసకొట్టినా చేతుల్లో సత్తువలేక నిస్సహాయమై, హేయమై.. బతుకు... ఆ మాత్రం సర్దుకు పోలేవా ఆడదానివి కావా - అని హౌరెత్తే విజ్ఞతలేని జనావళి న్కెజాన్ని తెలిసి చాలాసార్లు ఆడది అబలే అవుతుందెందుకో... స్వీయ నిర్ణయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోలేని ప్రతిబంధకాల మధ్య - నిలుస్తుంది ఎందుకో...?
ఓ పూచిన పూవులా. ఓ శ్రావ్యమైన రాగంలా... స్త్రీ ఎపుడౌతుంది? ఈ ప్రశ్న నన్నెన్నిసార్లు ప్రశ్నించిందో... నా ఆవిటితనాన్ని విస్మరిస్తూ మామూలుగా ఉన్న వారికున్న మిన్నగా ఎన్ని చేసినా నాకేమీ రాదనే నేనేమీ చేయలేననే వారి నుండి రా నా దగ్గరికి అంటూ నా మనసుకెన్ని అనుభవాల ఆటపాటలను నేర్పిన ఈ రేవు నన్ను పిలిచిందీనాడు.
ఒకపుడు ఇక్కడ పరువ ప్రయాణీకుల కోసం ఓ తాటాకు పందిరి, అక్కడ ఇడ్లి - వడ మొదలైన టిఫిన్లు అమ్మే అవ్వ, తాత వారికి అన్ని అందించే పిల్లలు... అంతా సందడి సందడిగా ఉండేది. ఇపుడా పందిరి లేదు. ఆ సందడి లేదు. నాలా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఓ పాత పూరి గుడిసె తప్ప.
ఎవరో వచ్చి అడిగారు - ఏ ఊరు మీది. ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి ఇంటికి వెళ్ళాలి... అని, నవ్వి ఊరుకున్నాను. జవాబివ్వని నన్ను చూచి వెళ్ళిపోయారు వాళ్ళు. చీకటి పడుతోంది. ముందు పలకరించిన వాళ్ళే మళ్ళీ వచ్చారు. పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నావామ్మా, ఏమైనా తిన్నావా - అని ఆ పాటి శ్రద్ధ ఇంట్లో వాళ్ళకి నా మీద ఉంటే నేనిక్కడ దాకా వస్తానా!
ఏదైనా సలహా ఇవ్వబోతే - నువ్వు ఆడదానివి. అంతవరకే ఉండు సలహాలివ్వకు - అని ఇంటి యజమాని. అంటే... యజమాని మగవాడేనా ఆడది వాడికి ఆ అవసరానికేనా? పిల్లలకేద్కెనా చెప్పబోతే - ఏంటి మేమైనా పదేళ్ళ పిల్లలమా- అంటుంటే మనసు ఉత్సాహం నశించి ఉసూరుమంటుంది. చనువుగా మాటాడనివ్వని పిల్లలు - నా చనుబాలు తాగి పెరిగిన పిల్లలు... వయసు పెరిగితే - వద్ధాప్యం వస్తే - అది శరీరానికేగా - మరి మనసు సంగతేమిటి? చేయి పట్టి నడక నేర్పిన చేతిని చీదరించుకుంటారు. ఎందుకు? మరణానికి అడ్డుకాని అవిటితనం, ముసలితనం మనుషులు మధ్యెందుకు అడ్డౌతోంది దూరాన్ని పెంచుతోంది?
రాత్రంతా ప్రయాణం చేసి వచ్చానిక్కడికి - అలసట, నిద్ర, ఆకలి చుట్టుముడుతున్నాయి. ఎవరో నా పక్కనుండి వెళుతూ- రాత్రయింది ఇంటికి వెళ్ళమ్మా! ఇంక ఇక్కడ ఎవరూ ఉండరు.. అన్నారు వాళ్ళకేం తెలుసు ఇపుడు నాకే ఇల్లు లేదని, ఏ బంధం లేదని. ఆత్మీయతకై అలమటించి, అలమటించి విసిగి వేసారి ఈ చోటుకు వచ్చానని. ఈ నది కౌగిలి నన్నాహ్వానిస్తోందని.
నా కిష్టమైన వెన్నెల... ఎంత బాగుందో... వెన్నెలలా విరిసిన ఆత్మజ్ఞానంలో తామరాకు మీది నీటిబొట్టులా మారిన మనసుతో రేవులోకి దిగాను. నీటిపై వెన్నెల మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఆకర్షణలు, అందాలు నాకు ఇపుడు అవసరమా?
ఇపుడు నేను ఆగని అశ్రుపాతాన్ని
నిట్టూర్పుల గానాన్ని
నిస్పహ నిండి రగులుతున్న తాపాన్ని
ఆరిపోబోతున్న దీపాన్ని
చేరేదెవరు ఈ చీకటి పువ్వును
రావెందుకని అడిగేదెవరు నా పెదవులపై చిరునవ్వును..!
నాకే తెలియటంలా...
నేను కాకనో.. వితాకునో
మనిషితనాన్ని మౌనంగా మేలుకొలిపే పొలికేకనో...
ఏమైనా
నేనిప్పుడు మోగని మువ్వను
ఎవరి చూపుకి అందని అందాల గవ్వను..
వాలుతోన్న పొద్దు వెలుగు వాకను..
ఎవరికి వినబడని హదయార్తి కేకను.
నిశాంత నిశ్శబ్ద నిశీధినీ నిశ నిషంగధిలా...
నీడలేని ఈ నదిలా..
రాహిత్యాన హదయ స్పర్శా నిర్వేశం (సుఖదుఃఖానుభవం) లేని..
ఆనందమీయని సాంత్వనలా...
ఊపిరాడనీయని అలల ఆలింగనమై....
నదినై కాలం ఒడిలోనికి నడుస్తూ....
ప్రవహిస్తూ.......
- రాజావారి రెడ్డి మల్లీశ్వరి