Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచి కవిత్వం ఎప్పుడు వస్తుంది అంటే మధన పడినప్పుడు, మనసు గాయపడినప్పుడు, ఆకలి కోసం పేగులు అల్లాడినప్పుడు. అప్పుడు వచ్చే కవిత్వాన్నికి ఎలాంటి స్వార్థం ఉండదు, ఎలాంటి రంగులు హంగులు అవసరం ఉండదు, ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది... అలాంటి అద్భుతమైన కవిత్వాన్ని రూపా రుక్మిణి రాశారు. వెలుగును చూడాలంటే కచ్చితంగా చీకటితో యుద్ధం చేయాల్సిందే అని ఎన్నో కవితల్లో అంతర్లీనంగా చెప్పకనే చెప్పారు. తనకు నచ్చిన వస్తుశిల్పాలతో మేజిక్ చేశారు రూప.
పాల కడలిని చిలికితే ముందు విషం వచ్చి తర్వాత అమతం వచ్చినట్టు.. రూప కూడా ఎంతో మధనపడి ఆచి తూచి ఒక్కో అంశాన్ని ఎంచుకుని అనీడగా మన ముందుకొచ్చారు. ఈ పుస్తకంలో ఎన్నో జీవితాలు ఉన్నాయి.. ప్రకతి పలకరిస్తుంది, స్త్రీల హక్కుల్ని గుర్తుచేస్తుంది, రైతులకు, సైనికులకు సలాం చేస్తుంది.. ఇలా ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో కవితలై ఒదిగాయి.. రూప కలం వయసు చాలా తక్కువే ఐనా ఆ కలానికి వున్న పదును చాలా ఎక్కువ. కవి గాయపడినప్పుడే అక్షరాలు రక్తాన్ని పులుముకుని ఎర్రని సూర్యుడిలా నిప్పులు కక్కుతూ వెలుగునిస్తాయి. ఆమె అక్షరాలూ కూడా అంతే. రంగుల గాయం కవితలో రెండు వాక్యాలు అందరికీ గట్టిగా తగులుతాయి. ప్రపంచం ఊసరవెల్లి / ప్రతీ రంగులో నిన్ను నీవే ఆవిష్కరించుకోవాలి అనేవి ఆ వాక్యాలు.. ప్రపంచం అందంగా కనిపించినంత అందంగా ఉండదు. పైకి అందం నటిస్తూ లోపల వికారాన్ని ప్రవహిస్తుంది అని చెప్పకనే చెప్పారు రూప. పుస్తకం పేరు చూడగానే పేరు కొత్తగా ఉందని లోపలికెళితే నీడ కవిత కనిపించింది. ఈ కవిత కవయిత్రికి ఎందుకు ఇష్టమో, అభిమానమో అర్థమైంది. పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకు ఎవరు మనతో వున్నా లేకపోయినా మన నీడ మనతోనే ఉంటుంది. నీడ మీద మన ప్రభావం తప్ప ఎవరి ప్రభావం పడదు. ఆ కవితలోని ఆఖరి పదమే అనీడ.. వెలుగున్నంత వరకు నీడ మనతోనే ఉంటుంది. చీకటిలో నీడ కనిపించదు. అప్పుడు దానికి ఏ విలువా ఉండదు. జీవితంలో తాను చూసిన అన్ని మలుపుల్లో తనకు ఎక్కడా వెలుగు రేఖ కనిపించలేదు. తన చుట్టూ వున్న సమాజాన్ని చూసిన రూపకు ఎక్కడా ఎలాంటి సంతోషమూ కనిపించలేదు. అంతా చీకటిమయమే. ఎవరు ఎవరికీ తోడు లేకుండా, ఎవరికీ ఎవరు ఏమీ కాకుండా పోతున్నారు. చివరకి మన నీడ కూడా మనకు తోడు రావడం లేదనే నేపథ్యంలో సమాజాన్ని, బంధాల్ని ఒక్క పదంలో నిక్షిప్తం చేశారు కవయిత్రి. సామాజిక అంశాలనే కాదు, స్త్రీ వాదాన్ని కూడా అంతే బలంగా తనదైన శైలిలో కొత్తగా పలికించడం రూప ప్రత్యేకత. స్త్రీనే / దూషించే వాక్యంగా మలచే పురుషాహంకారాన్ని/ అంటూ చాలా అద్భుతంగా చెప్పారు. మగాడిని నిందించే పదం ఏదీ అంటూ ఈ సమాజంపై సూటిగా తన ప్రశ్నల బాణాల్ని వదిలారు. పుస్తకం మొత్తం మీద '' నాన్నే ధైర్యం '' కవిత అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. గుండెలపై ఆడించి, చదువులెన్నో చదివించి, ఉద్యోగంలో అండగా నిలబడి, చిన్న గాయానికి అమ్మను అరిచే నాన్నమాత్రం తన కూతురు మనసుకు ఐన గాయాలను ఎందుకు చూడడు అంటూ ఆర్తిగా ప్రశ్నించడం ప్రతీ ఆడపిల్ల మనస్సును కదిలిస్తుంది. వాళ్ళ నాన్నలు ఈ కవితను చదివితే మాత్రం తమను తాము తడిమి చూసుకోక మానరు. ఎన్ని ఇచ్చాడు నాన్న / కానీ అణగారిన బతుకు నుంచి బయటికి వస్తానంటే మాత్రం ఒప్పుకోడేందుకో అంటూ బాధతో, ప్రేమతో, కోపంతో ప్రశ్నించే తీరు వర్ణనాతీతం. ఇక ఏడాది కాలంగా గందర గోళాన్ని సష్టిస్తున్న కరోనా మీద ఎన్నో అద్భుత కవితలను రాశారు రూప. కరోనా కవితల్లో కొన్ని వాక్యాలు ఒలికి పోతున్న కాలాన్ని / ఒడిసిపట్టలేని క్షణం, నిర్జీవమై పోతున్న జీవం/ ఊరు ప్రేమ పావురంలా రమ్మని పిలుస్తోంది / చాప కింద నీరులా / కుదేలైన వ్యవస్థలో ఒక తరం కనుమరుగైపోతుందేమో..? ఇలా ఎన్నో వెంటాడే వాక్యాలు ఈ పుస్తకంలో వున్నాయి. పత్తి మీద సాము కవిత ఆద్యంతం కన్నీరు తెప్పిస్తుంది. ద్రోహమెరుగని పుడమి పురిటి పంటను ఇచ్చి తన మాట నిలుపుకుంది / అంటూ రాసిన రెండు చక్కని చిక్కని వాక్యాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. కష్టపడి పంట పండించి గిట్టుబాటు ధర రాక ఎంతో మంది రైతులు ప్రాణాలు వదిలేస్తున్నారు. వారందరికీ నివాళిగా ఈ కవిత ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అనీడ పుస్తకంలో ఒక్కో కవితది ఒక్కో ప్రత్యేక శైలి. రాతలెప్పుడు రాబోయే తరాలకు చెరగని గుర్తులు.. అలాంటి ఒక గుర్తును ఆహ్వానిద్దాం. మరిన్ని పుస్తకాలతో భవిష్యత్ తరాలకు వెలుగవ్వాలని రూపను ఆశీర్వదిద్దాం.
- అమూల్యచందు, 9059824800