Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి మనిషి భూమిపై ఎక్కడో చోట పుడతాడు. పుట్టిన గడ్డ మీద ప్రేమ, మమకారం ఉంటాయి. మనుషులు నివసించేది భూమి మీదనే అయినా అన్నిచోట్ల ప్రకతి వనరుల సమానంగా ఉండవు. కొన్ని ప్రాంతాలలో అధికమైన ఖనిజసంపద, నీటి వసతులు, పంటలకనుగుణమైన భూములుంటాయి. మరికొన్ని ప్రాంతాలలో కష్టించి పని చేసుకోవడానికి కూడా అనువైన ప్రదేశాలు లేక సొంత గూటి నుంచి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి బతకవలసిన పరిస్థితులు నెలకొంటాయి.
మన దేశంలో కూడా భౌగోళిక పరిస్థితుల్లో అనేక మార్పులున్నాయి. ముఖ్యంగా దక్షిణాంధ్ర ప్రాంతం నేటికి అనేక రంగాలలో వెనుకబడి ఉంది. పూర్వం సిరిసంపదలతో, మణిమాణిక్యాలతో తంజావూర్, మధుర, చెంజి రాజ్యాల సంస్థానాలు విలసిల్లేవి. కాలక్రమంలో దక్షిణాది ప్రాంతాలు పోర్చుగీసులు, డచ్చి, ఇంగ్లీష్ వాళ్లు, గోల్కొండ సుల్తానులు, బీజాపూర్ సుల్తాన్లు, ఔరంగజేబుల దండయాత్రలు చేయడం వల్ల సర్వసంపదలు కొల్లగొట్టారు. అయినా దక్షిణాది ప్రాంతంలో సాహితీసేవ అజరామంగా వెలుగొందింది. విజయరాఘవ నాయ కుడు, తిరుమల నాయకుడు, రఘునాథ నాయకుడు, ఇలా ఎందరో సాహిత్యానికి చేసిన సేవ ఎనలేనిది.
స్వాతంత్రం వచ్చాక తెలుగువారి సరిహద్దులు వేరయ్యాయి. తెలుగువారికి తెలుగువారితో ప్రమేయం లేకుండా భౌగోళిక సరిహద్దులు ఏర్పడ్డాయి. ఇందుకు ఆర్థిక, రాజకీయ, సామ్రాజ్యవాద కారణాలున్నాయి. ఇప్పటికీ దక్షిణ పథాన తెలుగువారైన త్యాగధనులు ఎందరో ఉన్నారు. వీరపాండ్య కట్టబ్రహ్మన్న, ఓమందూర్ రెడ్డియార్, త్యాగరాయ శెట్టి, రాణి మంగమ్మ, కావలి సోదరులతో పాటు మరెందరో సాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. దక్షిణాదిలో స్థిరపడ్డ తెలుగు ప్రాంత మూలాలన్న సాహితీవేత్తలు, ప్రముఖులు, తెలుగు ప్రాంతం, భాష మీద మమకారం, మట్టిని మరువకుండా దక్షిణాది ప్రాంతంలో నివసించిన తెలుగు గడ్డ కోసం జీవించారు. నేటికీ తెలుగుభాష దక్షిణాది రాష్ట్రాలలో జీవించడానికి కారణం ఈ మహానుభావులు చేసిన సేవే. తెలుగు సాహిత్యం, భాష, ప్రాంతం కోసం నిర్విరామ సేవలను అందించారు. కాలక్రమంలో వారి సేవలు మరుగున పడుతున్నాయి. దక్షిణాది ప్రాంతానికి దారి దీపాలుగా నిలిచిన ఈ మహానుభావులను మర్చిపోకూడదనే ఉద్దేశంతో డా||నాగసూరి వేణుగోపాల్ ''దక్షిణాంధ్ర దారి దీపాలు'' గ్రంథానికి సంపాదకత్వం వహించి, మరుగున పడిన దక్షిణాది మాణిక్యాలను వెలుగులోకి తెచ్చాడు.
ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించిన డా||నాగసూరి వేణుగోపాల్ గారు 1961లో అనంతపురం జిల్లాలో కొనతట్టుపల్లి గ్రామంలో జన్మించారు. తొమ్మిది ఆకాశవాణి కేంద్రాలలో మూడు దశాబ్దాలకుపైగా పనిచేస్తూ, రచయితగా, కాలమిస్టుగా, సంపాదకునిగా, పనిచేస్తూనే అరవైకిపైగా పుస్తకాలను వెలువరించారు. విజ్ఞానశాస్త్రం, సాహిత్యం, పత్రికారంగం, ప్రసార మాధ్యమాలు, చరిత్ర, భాష వంటి విషయాలపై పరిశోధనాత్మక గ్రంథాలు వెలువరించారు. దక్షిణాంధ్రలో జీవించిన తెలుగు మహనీయుల చరిత్రలను, వారు చేసిన సేవలను గుర్తు చేసుకుందాం.
సాధు వరదరాజం పంతులు :
తెలుగు ప్రాంత, వంశ మూలాలున్న వరదరాజం తమిళ నిఘంటువు కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆయనకు తెలుగు మీద అభిమానం ఏర్పడింది. తెలుగు మాట్లాడడం వచ్చిన, రాయడం, చదవడం రాదు. తెలుగు సాహిత్యంలో పరిచయం లేదు. ఈ లోపాలను సరిచేసుకోవడానికి తెలుగు లిపి నేర్చుకున్నాడు. తెలుగు శతకాలు, భాస్కర రామాయణం, పోతన భాగవతం, వీరేశలింగం రచనలు, ఆంధ్రపత్రిక ప్రతిరోజు చదివేవారు. తన ఇంట్లోను తెలుగు నేర్పారు. తమిళనాడులో తెలుగు ప్రచారానికి తమిళలిపిలో తెలుగు రచనలు అచ్చు వేయించారు. ''దక్షిణాంధ్ర పత్రిక'' స్థాపించి, ఉచితంగా ప్రతులను పంచారు. ఆయనకు ''దక్షిణాంధ్ర పితామహ'', ''భాషోద్ధారక'' బిరుదునిచ్చి గౌరవించారు. తెలుగు వ్యాప్తికి, పరిరక్షణకు కోసం పని చేశారు.
కె.ఎస్. కోదండరామయ్య :
తెలుగువాడిగా పుట్టడం గొప్పతనంగా భావించి, తెలుగువారి కోసం జీవితాన్ని వెచ్చించిన మహానుభావుడు కె.ఎస్. కోదండరామయ్య. అప్పటి సేలం జిల్లా (ఇప్పటి కష్ణగిరి జిల్లా) హౌసూరు తాలూకాలోని కారుపల్లెలో 1909 ఆగస్ట్ 6న జన్మించారు. వీరి తండ్రి శివరామదాసు పండితుడు, కవి, బహు గ్రంథకర్త, పత్రికా సంపాదకుడు. ఆయనకు కందుకూరి వీరేశ లింగంతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. వితంతు వివాహాది, సంఘసంస్కరణలో పాల్గొన్నారు. కందుకూరి రచనల్ని కన్నడికరించారు. దాసుగారు గ్రంథాలయాన్ని నెలకొల్పి స్థానికులు సాహిత్యాభిలాష పెంచారు. సరిహద్దు సైనికులుగా పనిచేశారు కోదండరాం. తమిళనాడు సరిహద్దులోని హౌసూరు, డెంకనికోట, వేపనపల్లి ప్రాంతాలలో అత్యధికులు తెలుగువారున్నారు. కనుక ఆ ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంతో కలపాలని ఉద్యమించి ''అంకుశ గిరి ఆంధ్రా సరిహద్దు సంఘాన్ని'' స్థాపించారు. విజ్ఞాన వ్యాప్తికోసం పొట్టి శ్రీరాములు సేవాసమితిని స్థాపించారు. తమిళనాడు శాసనసభలో మొట్టమొదటిసారిగా తెలుగువాణి వినిపించిన ఘనధీరుడు కోదండ రామయ్య. ఆంధ్ర భాషోద్యమం కోసం, మాతభాషను కాపాడుకోవడానికి ''దక్షిణ భాష రక్షణ సమితి''ని స్థాపించారు. ఆంధ్ర సాంస్కతిక సమితి స్థాపన కోదండరామయ్య సేవలలో కీర్తి పతాక. తెలుగు సంఘాల ఆవిర్భావానికి వారి ప్రేరణ. తెలుగు సాంస్కతిక పరిరక్షణకు వీరొక గొప్ప మార్గదర్శి.
వావిళ్ళ రామస్వామి శాస్త్రి :
తెలుగు అక్షరాలను అచ్చుల్లో అందంగా తయారుచేసి తెలుగుజాతికి అరచేతుల్లో పెట్టిన మహానుభావుల్లో వావిళ్ళ వారు ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. నేడు తెలుగు అచ్చు పుస్తకం చదువుతున్న ప్రతి తెలుగువారికి స్మరణీయమైన వ్యక్తి వావిళ్ళ రామశాస్త్రి. ముద్రణారంగంలో ప్రత్యేకంగా తెలుగువారికి అవిశ్రాంత కషి చేశారు. రామశాస్త్రి ఊరుపేరు వావిళ్ళ. అదే వారి ఇంటిపేరయింది. నెల్లూరులోని గట్టుపల్లి శేషయ్యశాస్త్రి, ఉడాలి శేషోపాధ్యాయుల వద్ద వేదం నేర్చుకున్నాడు. చిలుకూరి పాపయ్యశాస్త్రి వద్ద వ్యాకరణ శాస్త్రం చదివారు. వావిళ్ళ రామస్వామి పుస్తకాలను ముద్రించే ముద్రణాలయం స్థాపించారు. సంస్కత గ్రంథాలను కన్నడ లిపిలో అచ్చువేసి అందిస్తే బాగుంటుందని భావించి మైసూరులోని రామశాస్త్రి తన అన్న గారితో కలిసి ఒక అచ్చుకూటం ఏర్పాటు చేసుకొని కొన్ని గ్రంథాలను అచ్చు వేశారు. అలా అచ్చు ప్రపంచంలోకి మొదటిసారి అడుగుపెట్టారు. కానీ ప్రజల నుండి ఎటువంటి ఆదరణ కనిపించలేదు. అక్కడి నుండి చెన్నపట్టణానికి చేరుకుని వావిళ్ళ మేనమామ వేదం వెంకటాచల శాస్త్రి తన మేనల్లులతో కలిసి 1847లో ''వివేకా రత్నాకరం''అనే అచ్చు యంత్రాన్ని స్థాపించారు. ఇందులో అనుభవం గడించిన వావిళ్ళ సోదరులు 1849లో ''హిందూ భాషా సంజీవని ముద్రాక్షరశాల''ను ఆరంభించారు. భాగస్వాముల మధ్య బేధాభిప్రాయాలు వచ్చి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే సంజీవని నడిచి, మూతపడింది. మళ్లీ 1851లో నెల్లూరుకు చెందిన పండితులు సరస్వతి తిరువెంగడాచార్యులతో కలిసి ''సరస్వతీ నిలయం'' అనే కొత్త ముద్రణాలయం ఆరంభించారు. ఇది కూడా మధ్యలోనే ఆగిపోయింది. మరో ప్రయత్నం 1854లో తాండయార్ పేటలోని తన సొంత ఇంట్లో ''సరస్వతీ నిలయం'' పేరిట ముద్ర ణాలయం ఆరంభించారు. ఈ ముద్రణాలయం ముందుకు పరుగులు పెట్టింది. ఎన్నో పుస్తకాలను తెలుగు అచ్చులోకి మార్చి తెలుగు జాతికి అందించింది. ఈ సరస్వతి నిలయాన్నే 1906లో రామస్వామిశాస్త్రి తనయుడు వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి ''వావిళ్ళ ప్రెస్''గా మార్చాడు. వావిళ్ళ రామస్వామి నిరంతరం పగలు, రాత్రి తేడా లేకుండా అచ్చు యంత్రాల మధ్య జీవనం గడిపేవారు. పింగళి సూరన రచించిన రాఘవపాండవీయం, అప్పకవీయం, చెన్నపురి విలాసం, నరకాసుర విజయవ్యాయోగం, మనుచరిత్ర, ఆముక్త మాల్యద, శ్రీమదాంధ్ర మహాభారతంలాంటి అనేక తెలుగు పుస్తకాలను తెలుగులో అచ్చు వేశారు. అలాగే అనేక సంస్కత పుస్తకాలను అచ్చు రూపం ఇచ్చి తెలుగు అచ్చుకూట చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోకుండా తన పేరును సుస్థిరం చేసుకున్న ధన్యజీవి వావిళ్ళ రామస్వామిశాస్త్రి.
వీరపాండ్య కట్టబ్రహ్మన్న:
అలగియ పాండ్యపురం పాలిస్తున్న జగవీర కట్టబ్రహ్మన్న ఆర్ముగత్తమ్మాల్ దంపతులకు జనవరి 3, 1760న వీరపాండ్య కట్టబ్రహ్మన్న జన్మించాడు. పాలెగాళ్లలో ప్రసిద్ధుడు కట్టబ్రహ్మన్న. ఇతను తెలుగువాడు. ఇంటిపేరు గట్టి. పూర్తి పేరు గట్టి వీరపాండ్య బ్రహ్మయ్య. కాలక్రమేణా కట్టబ్రహ్మన్నగా స్థిరపడిపోయింది. ఇప్పటి కోయంబత్తూర్, సేలం, కొల్లిడం ప్రాంతాలతో అప్పటి పశ్చిమ తమిళనాడులో మధురై రాజ్యం ఉండేది. ఈ ప్రాంతంలో నాయకరాజుల పాలనకు ఆద్యుడు విశ్వనాథ నాయుడు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని 72 మంది పాలెగాళ్ళు ప్రజాప్రతినిధులుగా పాలన సాగించేవారు. వీరిలో కొందరు స్థానిక తమిళులైతే, అధికశాతం పాలెగాళ్లు తెలుగువారే. తమ పరిధిలో పన్నుల వసూలు, శాంతి భద్రతలు కాపాడడం, రాజుకు సైన్యాన్ని సమకూర్చడం ఈ పాలెగాళ్ల వంతు. ఫిబ్రవరి 2, 1790న, 30 సంవత్సరాల వయసులో కట్టబ్రహ్మన్న రాజ్యాధికారం చేపట్టాడు. ఆ ప్రాంతానికి 47వ రాజు. తన వంశానికి చెందిన ఐదవతరం రాజుగా కట్టబ్రహ్మన్న పాలన చేపట్టడం జరిగింది. 1795 ప్రాంతంలో బ్రిటిష్ వారి సహకారంతో ఆర్కాడ్ నవాబు పశ్చిమ తమిళనాడుపై తీవ్రమైన దాడులు జరిపాడు. దాదాపు అందరు పాలెగాళ్లు లొంగిపోయారు. బ్రిటిష్ వారికి కప్పం చెల్లించడానికి అంగీకరించారు. కానీ కట్టబ్రహ్మన్న తిరుగుబాటు చేపట్టాడు. కరువుసీమలో కప్పమేమిటని ప్రశ్నించాడు. బ్రిటిష్ వారిని ధిక్కరించాడు. కొంత వివాదం తర్వాత, రామనాథపురం సేతుపతికి చెందిన రామలింగ విలాసం అనే భవనంలో అప్పటి బ్రిటిష్ కలెక్టర్ జాక్సన్తో కట్టబ్రహ్మన్న సమావేశమయ్యాడు. ఈ సమావేశం సామరస్యంగా జరగలేదు. ఘర్షణ నెలకొంది. బ్రిటిష్ సైన్యంలో ఉపకమాండర్ క్లర్క్ చంపి వేయబడ్డాడు. కట్ట బ్రహ్మన్న స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉన్నందున రైతులు కప్పము కట్టారని ప్రకటించాడు. నాడు రామనాథపురంలో దాడిలో తన వద్ద నుంచి దోచుకున్న సొమ్ము కూడా వెనక్కు ఇవ్వాలన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో యుద్ధాలు ప్రకటించి, కట్ట బ్రహ్మన్నను విచారించి, బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యంత దారుణంగా చింతచెట్టుకు ఉరి తీశారు. స్వంత అస్తిత్వం కోసం ప్రాణత్యాగం చేసిన కట్టబ్రహ్మన్న తదితర వీరులు జానపదులకు నాయకులుగా మిగిలారు. కట్ట బ్రహ్మన్న సాహసాలపై ఎన్నో జానపద గాథలున్నాయి. మనిషి బ్రతకడానికి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళినవారు మాతభాషను అభిమానించకపోవడమేకాక, ఈసడించుకునే వారున్నారు. మాతభాషలో మాట్లాడాలంటే సిగ్గుపడే వారున్నారు. మాతభూమిలో ఉంటూ భాషను గౌరవించని, ఆదరించని సమాజం ఉంది. అయినా కొందరికి మాతభాష, ప్రాంతంపై అధికమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. అలాంటి భావాలున్న వ్యక్తులు ఎక్కడున్నా తమ ప్రాంత, భాష కషి చేయడమే కాకుండా కంకణం కట్టుకొని అల్ప సంఖ్య గల ప్రాంతాలలో కూడా మాతభాషను బ్రతికించారు. మాతభాషను, భూమి గొప్పతనాన్ని చారిత్రాత్మకంగా, చరిత్రాత్మకంగా నిలబెట్టిన త్యాగధనులు. అలాంటి వారి కషి ఫలితంగానే దక్షిణాది ప్రాంతాల్లో నివసించిన ఎంతో శ్రమకోర్చి కషి చేశారు. వారు పోరాడి నిలబెట్టిన త్యాగఫలమే ఈనాటికి దక్షిణాది ప్రాంతాలలో నేటికీ తెలుగు విరాజిల్లుతుంది. ఇలాంటి మహానుభావులు చరిత్రను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
- బి.మహేష్, 8985202723
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు.