Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తక శీర్షిక ఒక్కటి చాలు. కొన్ని మాటలు కొన్ని కోట్లిచ్చినా నెరవేర్చలేని పనులను సాధించుకొస్తాయి. అటువంటి ఓ తోడునిచ్చే మాటకావాలంటాడు. అలా నీడనిచ్చే ఓ మిత్రుడు కావాలంటాడు కవి శ్రీనివాస్ గౌడ్. ఈ 'ధైర్యవచనం' ఎవరో మిత్రుడు కవికి ఇచ్చిందే కాదు, కవి తన కవిత్వం ద్వారా మనకు ఇస్తున్నది కూడా.
ఈ శీర్షిక, ఇందులోని కవిత్వాన్ని మనం పరిశీలిస్తే శ్రీనివాస్ గౌడ్ కవిత్వంలో ఎక్కువపాళ్ళు 'మానవీయత' చోటు చేసుకుంది. ఇందుకు ఉదాహరణగా ధైర్యవచననం, దయా దీపాలు, గేటుదగ్గర, ఎండ చెట్టు నీడన, వాళ్ళు మొదలగు కవితలు చెప్పుకోవచ్చు. చైతన్యాన్ని కలిగించే కవితలుగా మాటల మీద మాటు వేయండి, పొడుచు కొస్తున్న పొద్దువైపు, అమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి కవితలను చెప్పవచ్చు.
మతసామరస్యానికి ప్రతీకగా బద్ లా కవిత, నోస్టాల్జియాను చూపిస్తూ పాఠాంతరం, ముంతావోళ్ళ బాయి కవితలు, ఇంకా మిత్రులను, ఇష్టమయిన కవులను గుర్తు చేసుకుంటూ రాసిన కవితలు నల్లని మంటలు మద్దూరి నగేష్ బాబుపై రాసినది, ఏముంటుందా చేతుల్లో కవి శివారెడ్డిపై రాసినది, నాగేశ్వరరావు అనే మిత్రుని కోసం రాసిన నీలో కొంత భాగం కవిత మొదలైనవి ఉన్నాయి. ఇవే కాకుండా ప్రపంచ సాహిత్యాన్ని కూడా అనువదించటంలో నిపుణుడైనా ఈ కవి ఇందులో ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్ కవితను, జపనీస్ కవితలను, చీనా కవి లి బొ కవితల అనువాదాలను చేర్చాడు. మొత్తంగా చూసుకుంటే ఆధునికతను కలగలుపుకున్న, మంచి వస్తు వైవిధ్యమున్న కవితా సంపుటిగా ధైర్యవచనాన్ని పేర్కొనవచ్చు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. ఒక్కోసారి
గేటు పడుతుండాలి
జీవితం కళ్ళబడుతుంది
ఒక్కోసారి
గేటు తీసుండాలి
జీవితం తుళ్ళి పడుతుంది (గేటు దగ్గర..పేజీ 20)
ఇక్కడ కవి తీసుకున్న వస్తువు అందరి కళ్ళముందు నిత్యం కదలాడేదే.గేటు దగ్గర చిల్లర వ్యాపారం చేస్తూ పొట్టపోసుకునే జీవుల, గేటు మీదుగా ప్రయాణం చేసే వాహనదారుల ఆలోచనలలోని భిన్న కోణాలను కవి కవిత్వీకరించాడు.అక్కడ పెన్నులమ్ముతూనో, బొమ్మలమ్ముతూనో, కారు తుడుస్తూనో కనిపించే వాళ్ళకు గేటు పడితేనే జీవితం గడుస్తుంది కదా. ఆ ప్రాముఖ్యతను కవి ఈ వాక్యాల్లోకి పట్టుకొచ్చి తనదైన పరిశీలనాత్మక దష్టిని కనబరిచాడు.
2. అనేక రంగుల
పూల వదనాలతో పూసే
ఒండ్రుమట్టి
ఆపద కాలాల
అంటుబద్ద (ఆమె అనేకం..పేజి 80)
స్త్రీ కోణంలో రాసిన కవితలు ఎన్నో ఉన్నాయి. ఎందుకో ఈ కవితలో కవి వాడిన పదాల ప్రయోగం బాగా ఆకట్టుకుంటుంది. ఈ వాక్యాల్లోనే మనం గమనించొచ్చు. స్త్రీని ఒండ్రుమట్టి, అంటుబద్ద అని సంభోదించాడు.
మట్టిని ఏ ఆకతిలోకి మారిస్తే అలాగే మారుతుంది. స్త్రీ కూడా ఏ సమస్యొచ్చినా అంతే. నిన్నటికి నిన్న కరోనా సమస్యతో బాధపడుతూ ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్న తన భర్తకు నోటి సహాయంతో కత్రిమ శ్వాసను అందించే ప్రయత్నం చేసింది ఓ మహిళ. ఆమె కాదా కవి చెప్పిన ఆపద కాలాల అంటుబద్ద. అందుకోసమే ఈ వాక్యాలు వెలకట్టలేనివి.
3. ఇంటిపక్క వదిలేసిన
ఓటికుండలా
ఒట్టిపోయి వొరుగుతున్న తాడిచెట్టులా
ఆశలు ఎండిపోయి చిట్లిన గాజుచూపులతో
అతడు కనిపించాడు
(అతను కనిపించాడు..పేజి 116)
ఈ కవితలో నేటి గౌడుల జీవన పరిస్థితులను ప్రతిబింబింప చేశాడు. కల్లు అమ్మి బతుకు యంత్రాన్ని నడిపే గౌడులను కరోనా ఎంత కుళ్ళబొడిసిందో వివరించాడు. కల్లు అమ్ముడుబోతేనే కడుపునిండే కుటుంబాలున్న సంగతిని కవి గుర్తుచేశాడు. ఓటికుండ, ఒట్టిపోయిన తాడిచెట్టు, చిట్లిన గాజు చూపులు గౌడుల దీనస్థితికి ఉదాహరణలుగా తీసుకోవటంలో కవి విషయనిపుణతను చాటి చెబుతున్నాయి.
4. అమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి
రైతులూ గుర్తొస్తున్నారు
రైతులు గుర్తొచ్చిన ప్రతీసారి
అమ్మలు గుర్తొస్తున్నారు
(అమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి..పేజీ 126)
రైతును, అమ్మను పక్కపక్కన పెట్టడంలోనే కవి ప్రతిభ అర్థమవుతుంది. అమ్మ వద్దంటున్నా గోరుముద్దలు తినిపిస్తూనే ఉంటుంది. రైతు ఎంతో మోసగించబడ్డా పంటను పండిస్తూనే ఉంటాడు. అందుకే కవి రైతుకు, అమ్మకు ఏ మాత్రం తేడా లేదనన్నట్టుగా ఈ వాక్యాలు రాశాడు. కవి చెప్పినట్టు మనం ఎప్పుడు అన్నం తిన్నా అమ్మ గుర్తుకు రావాలి, పంట పండించిన రైతు గుర్తుకు రావాలి. ఇదే మనం రైతుకిచ్చే నైతిక బలం. ఆ బలాన్ని కవి పిడికిలెత్తి మరీ ఈ వాక్యాల్లో అందించాడు. అందరం అందిపుచ్చుకోవాల్సిన అవసరము ఉన్నది.
నిరంతర అధ్యయనశీలి అయిన ఈ కవి కవిత్వంలోని నూతనత్వం ఆకర్షించదగినది. పరిణతితో కూడిన కవిత్వం కవి శ్రీనివాస్ గౌడ్ బలం. అందరిని కవిత్వంతో కట్టిపడేస్తూ ధైర్య వచనాలను బహుమానంగా ఇచ్చిన కవికి శుభాకాంక్షలు.
- తండ హరీష్ గౌడ్, 8978439551