Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదే పనిగ అరిచి గీ పెడుతూ వచ్చి ఒంగలకి పారిపోయే అవకాశమిచ్చే వాహనం ఒకటి వచ్చింది. రోడ్డు మలుపులో ఆగింది. అందులోంచి ఓ లాఠీ బయటకు వచ్చింది. లాఠీ పట్టుకున్న రక్షక భటుడు బయటికి వచ్చాడు. పొట్ట కిందకి జారిపోతున్న బెల్టుని పైకి లాగాడు. అది పైకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ జారింది. దాన్ని మళ్ళీ మళ్ళీ పైకి లాగలేక గుండ్రటి కుండలాంటి పొట్టని లోపలికి నొక్కుకుంటూ బయల్దేరాడు రోడ్డు మీదకి. కర్రతిప్పుతూ ఊపుతూ రోడ్డు మీద టకటకలాడిస్తూ.
రోడ్డుకు ఆనుకుని నిలబడి ఉంది ఓ భవనం. ఈ చివర నుంచి ఆ చివర దాకా ఉంది గోడ. అర్ధరాత్రి గడియారంలో పెద్దముల్లు చిన్న ముల్లు కనపడకుండా దాచేసింది. భవనం గోడ చివర నుంచి ఒక శబ్దం రక్షక భటుడి చెవుల్లోకి జొరబడింది. కర్ర ఊపడం తిప్పడం ఆపి చెవిని చేత్తో పట్టుకుని జాగ్రత్తగా విన్నాడు. అవున్నిజమ ఏదో ఒక ధ్వని వినపడుతున్నది భవనం గోడ ఆ చివర.
విన్నవాడు బెంబేలెత్తిపోయేలా వ్యాను చప్పుడు చేసుకుంటూ వచ్చినా పారిపోని దొంగ ఎవడ్రా అనుకుంటూ చప్పుడు వస్తున్న వేపుకి చప్పుడు చేయకుండా వెళ్ళేడు రక్షకుడు.
అప్పటికే గోడకి పెద్ద కన్నం అయి వుంది. రాళ్ళూ ఇటుకలూ గోడ వారన కుప్పకూలి ఉన్నాయి. మనిషి దూరేంత కంత దూరాన వెలుగుతున్న వీధి లైటు వెలుతురులో కనబడున్నది. కన్నం పక్కనే కన్నం వేసిన కన్నపు దొంగ నిలబడున్నాడు. ముఖం కనిపించడం లేదు కాని గోతికాడ నక్కలాగున్నాడు. వీడు ఏం చేస్తాడో చూద్దాం. లోపలికి దూరనిద్దాం. ఏదో ఓటి చేసి ఎర్ర చేతుల్తో దొరికిపోతాడు అనుకున్న భటుడు కన్నపు దొంగ కన్నంలో నుంచి దూరగానే 'ఫాలో' అయ్యేడు.
దొంగ బీరువా తెరిచేడు నోట్ల కట్టలు బ్యాగులో కుక్కేడు. కాస్సేపు సోఫా వెనకాల నక్కేడు. తర్వాత మరో గదిలోకి వెళ్ళేడు. రక్షకుడు అంతా కనిపెడ్తూనే ఉన్నాడు. ఆ గదిలో ఉన్న మరో బీరువాలో దొంగ తను తెచ్చిన బ్యాగు దాచేడు. ఖాళీగా ఉన్న డబుల్ కాట్ మీద తాపీగా పడుకుని ఇంటి వోనర్లా కాలు మీద కాలేసుకుని నిద్రలోకి జారిపోబోయేడు.
చిర్రెత్తుకొచ్చింది రక్షక భటుడికి... వీడు మామూలోడు కాదు గజ దొంగే. చేసేదంతా చేసి డబ్బు బ్యాగు దాచుకుని నిద్రపోవడానికి చూస్తున్నాడు గుండెల్తీసిన బంటు వీడు బటాచోర్ వీడు గూట్లే గాడు వీడు అనుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళేడు భటుడు. ఉలిక్కిపడి లేచి కూచున్నాడు మంచం మీది దొంగ. 'ఎవరు నువ్వు?' అన్నాడు ఒణక్కుండా తొణక్కుండా 'కనపడ్డంలా ఎవరినో! లాఠీ చూళ్ళేదూ!' అన్నాడు రక్షకభటుడు దొంగను పట్టుకోబోతున్నానన్న ఆనంద పారవశ్యంతో.
'ఇంటికి కన్నం వేసి లోపలికి వచ్చిన కన్నపు దొంగవి నువ్వు. నీ వెనకాలే వచ్చా ఎర్ర చేతుల్తో పట్టుకుంటా ఏదీ చెయ్యి చాపు' అన్నాడు రక్షకుడు. దొంగ చేతులు చాచాడు ఎరుపు రంగు మచ్చుకు కూడా లేదు. శానిటైజర్‌తో తుడ్చుకున్న చేతుల్లా శుబ్బరంగా ఉన్నాయి.
'ఎవరు నువ్వు ఈశ్వరుడివా?' అన్నాడు దొంగ భటుడ్ని ఎగాదిగా చూస్తూ.
'నా పేరు ఈశ్వరుడు కాదు. అసలు నువ్వెవడివిరా!' అన్నాడు లాఠీ ఉన్నోడు.
'నేనే ఇంటి వోనర్నీ నేనే ఇంటి దొంగని. నువ్వు ఇంటి దొంగని పట్టుకోడానికి వచ్చిన ఈశ్వరుడివనుకున్నా. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కదా!'
'ఇల్లూ నీదే ఇంటికి కన్నం వేసే దొంగవీ నువ్వే. ఇదేం పొయ్యేకాలం?' అన్నాడు భటుడు తత్తరపడుతూ.
ఇప్పుడంతా ఇంటి దొంగలదే 'హవా'. ఎందరు ఇంటి దొంగలు ఇంటికి కన్నం వేసిన డబ్బు మూటల్తో విదేశాల్లో ఎంజారు చేస్తున్నారో తెలీదా? ఎవడింటికి వాడు కన్నం వేసుకోవడం ఎవడి కొంపకి వాడు నిప్పు అంటించుకోవడం ఆ మజాయే వేరు. ఇంటి దొంగలు అవడానికి ఎన్నికల్లో గెలవడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తున్నదో తెలిసే వుంటుంది. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అన్న మాట వినలేదూ. నా కోసం నువ్వెంతో చేస్తాడు. దోచుకున్న దాంట్లో నీకూ వాటా యిస్తాలే. నాకు నువ్వు నీకు నేను. ఇది ఇంటి దొంగలకూ, తోడు దొంగలకూ కల్సి వస్తున్న కాలం అనగా 'అచ్ఛేదిన్' అన్నమాట.
- చింతపట్ల సుదర్శన్, 9299809212