Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనసు' ఎందరో ఎన్నో విధాలుగా అక్షరీకరించిన అనూహ్య వేదన. ఉద్వేగాల చిరునామా. ఊహాతీతమైన ఊహల ఉనికి. చిన్న పలకరింపుకే పరవశిస్తుంది. అందని వాటి వెంట పరుగులు తీస్తుంది. తీయిస్తుంది. అందవని తెలిసినా ఎందుకో ఎపుడూ అసహనమే. అసంతప్త యాతనలే.
ఆ కోవలో తెలుగు సినీ సాహితీ వినీలాకాశాన దేదీప్యంగా వెలిగిన మనసు గీతాలెన్నో. అటువంటి గీతాలలో అపురూపం అత్యంత ప్రత్యేకం యీ గీతం. విప్లవకవిగా ముద్రపడిన శ్రీశ్రీ గారి అక్షరాలు యివి. అందుకేనేమో మనసును నేరుగా చేరి ఒకరకంగా గాయపరుస్తాయి. మరోరకంగా గాయానికి లేపనమూ అవుతాయి. అందుకే యివి మౌనాక్షరాలు. మంత్రాక్షరాలు కూడా.
పల్లవి|| మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము..
అదే స్వర్గము ...
చాలా సాధారణమైన కోరిక యిది. కోరిక కాదేమో. మనసు అడిగే చిన్న భావన. హదయం సుతిమెత్తన. అందునా కళాకారుడి హదయం మరీ సున్నితం. ఎన్నో విషయాలను అతిసులువుగా పరిష్కరించే మనసు ఒక్కోసారి బేలగా మారిపోతుంది. కన్నీరవుతుంది. కారణం తనదైన హదయం, అర్ధం చేసుకునే మనసు, లాలించే ఒక భరోసా లేనితనం. ఆ క్షణాల్లో కలిగే వేదన అవ్యక్తం.
చ|| ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము...
అదే స్వర్గము ... ||
''చీకటి మూసిన ఏకాంతములో...'' ఓV్‌ా!! ఎంతటి గాఢమైన భావనాస్థితి. చీకటి అంటేనే దిగులు - గుబులు మోసుకొచ్చే సమయం. అందులోనూ ఏకాంతం కూడా అంటే యిక ఊహించగలమా ఆ స్థితిని.
ప్రతి వ్యక్తికి తనదైన ప్రపంచం ఉంటుంది. తనవైన ఆశలు - ఆశయాలు. నిజానికి అతిపెద్ద ఆనందాలు మోసుకొచ్చే ఘడియలకన్నా చిన్న కోరికలు తీరని క్షణాలు మిగిల్చే వేదనే అధికం ఎప్పుడూ.
జీవితం చాలా సందర్భాల్లో కోరుకున్నవి అందించదు. కోరుకోనివి అనుకోకుండా అడగకుండానే తెచ్చి వాకిట నిలబెడుతుంది. అవి అందించేది దుఃఖమా ఆనందమా అనేది తనకు తెలియదు. చేయాల్సింది చేసి మౌనంగా కాలం పొరలలో దాగిపోతుంది. అలా అని పూర్తిగా వీడిపోదు. వెంటాడుతూనే ఉంటుంది నీడలా పొగమంచులా.
చ|| నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము...
ఎంత మామూలు భావన. కానీ ఎంత శక్తినిచ్చే భావన. ఏముందీ కోరికలో తీరకపోవటానికి అనిపిస్తుంది. వెంటనే ఏమి లేదు యీ భావనలో, జీవితమంతా మనసుకు సంబంధించినదంతా యిందులోనే యీ కాస్త ఆలోచనలోనే ఉంది కదా అనిపిస్తుంది. జీవితాన్ని నడిపించే కనిపించని శక్తి కదా యీ భావన వెనుక ఆనందం - ఆంతర్యం.
కోరికలకు కూడా స్థాయిలుంటాయి. బహుశా చిన్న కోరికలు తీరకపోవటమే జీవితమేమో.
చ|| చెలిమియె కరువై వలపే అరుదై
చెదిరిన హదయమే శిల అయిపోగా
నీ వ్యథ తెలిసి నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము....
మనం ఏదీ చెప్పకుండానే మన మనసును గ్రహించే మనసుండటం ఎంత అదష్టం. కానీ అందరికీ అది లభించేదేనా. నిజానికి జీవితంలో ఒక్కసారయినా యీ పాట స్థితిని - భావనను అనుభూతించని హదయం, ఆస్వాదించని సందర్భం ఉండదేమో.
ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వంలో వచ్చిన డాక్టర్ చక్రవర్తి చిత్రంలోనిది యీ గీతం. శ్రీశ్రీ గారి అక్షరాలు సాలూరి రాజేశ్వరరావుగారి స్వరాలలోంచి జాలువారి ఘంటసాలవారి గళంలోని అనిర్వచనీయమైన ఓదార్పును - ఊరటను మనసు పొరలకు అందిస్తాయి. సితార్ జనార్దన్ గారి నాదతరంగాలు మనల్ని మరో లోకంలోకి నడిపించుకు వెళతాయి. ఎ.ఎన్.ఆర్, జగ్గయ్య, సావిత్రిల నటన అపురూపం. కేవలం ఆహార్యంతో నటిస్తూ, పాత్రలను వారు ఎలివేట్ చేసిన తీరు అద్భుతం.
పాట పల్లవిలో వినిపించే స్వరాలను సితార్ నాదంపై పలికించటం అదే నాదంతో ముగించటం అపురూపమైన ఆనందం.
ఆ సితార్ నాదం ఆరంభమే మనల్ని ఎక్కడికో, ఏ జ్ఞాపకాల మూలల్లోకో తీసుకెళ్లి అక్కడే నిర్దాక్షిణ్యంగా విడిచి వెనుకకు వచ్చేస్తుంది.
పాట ముగిసినా మనం ఆ పాట ధ్యాసలోనే ఒక దిగులు తెమ్మెరలో చిక్కుకుపోతాం. మనసుకు మనసైన ఆ పాటతోనే ఏకాంతంగా.. మరీమరీ యిష్టంగా.. మనదైన ఆ ప్రపంచంలోనే...
- మొదలి పద్మ,
9248259622