Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి జీవితంలో తనను అర్థం చేసుకునే వ్యక్తుల కోసం అన్వేషిస్తూనే ఉంటాడు. అర్థం చేసుకోవడం అంటే ఒక వ్యక్తిలోని అంతర్మధనాన్ని, ఆలోచనలను, ఆవేశాలను, వీటిని కారణమైన అనుభవాలను నిర్ణయాత్మక దష్టితో కాకుండా మానవతా దష్టితో స్వీకరించడం. ఇటువంటి అనుబంధం చాలా సార్లు ఎంత వెతికినా దొరకదు. అందుకే అందరి మధ్య కూడా మనిషి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి వారితో ప్రతి నిముషం కలిసి ఉండవలసిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలు ఒకే ఇంట్లో జీవితాలను పంచుకున్న వ్యక్తులలో కూడా ఒకరి గురించి మరొకరికి తెలిసేది తక్కువే. ఒక మనిషి గురించి తెలుసుకోవడం అంటే వారి అలవాట్లు, ఆలోచనలు కాదు వారి భావాలు అర్థం కావాలి. అది అందరిలో సాధ్యం కాదు. ఒకోసారి మనతో పెద్దగా అనుబంధం లేని వారు మనకు దగ్గరవుతారు, మన స్పందనలు వారికి తెలిసిపోతాయి. ఇద్దరు జీవితాలు ఒక్క క్షణం ఒక గాటున నిలిచిన ఫీలింగ్ కలుగుతుంది. అదో నిజమైన తోడు అంటే. అదే మనిషి నిత్యం కోరుకునేది. ఆ దగ్గరవ్వడంలోని ఆత్మీయత అనుభవించిన వారికే అర్థం అవుతుంది. ఈ పాయింట్ మీద నిర్మించిన గొప్ప స్త్రీవాద సినిమా మరాఠీ భాషలో వచ్చిన ''ఆమీ దోఘీ''. తెలుగులో ఆమీ దోఘీ అంటే మనం ఇద్దరం అని అర్థం. ఇది ఇద్దరు స్త్రీల కథ. స్త్రీవాదం అన్న పదం ఇక్కడ వాడవలసి రావడానికి కారణం ఇద్దరు స్త్రీల మనోభావాలు, వారు నమ్మిన స్వాతంత్య్రం, వారు సాగించిన జీవన ప్రయాణం. ముక్తా బర్వే, ప్రియా బాపత్ల అత్యుత్తమ స్థాయి నటన ఈ కథను చాలా ఎలివేట్ చేసిందని చెప్పాలి.
గౌరీ దేష్పాండే అనే మరాఠీ రచయిత్రి కథ ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. సావిత్రి తల్లి చిన్న తనంలోనే చనిపోతుంది. తండ్రి జగదీష్ సర్దేశాయి ఒక పెద్ద లాయర్. చాలా ప్రాక్టికల్ మనిషి. తన చూట్టూ ఉన్న వ్యక్తులతో చాలా ప్రాక్టికల్‌గా రాషనల్గా ఉండే వ్యక్తి. అనవసరమైన ఎమోషన్స్ అతనికిష్టం ఉండవు. చాలా మంచి వ్యక్తి కూడా. భార్య చనిపోయిన తరువాత కూతురుని పని వాళ్ళ సహాయంతో చాలా భాద్యతతో పెంచుతాడు. ఆడమనిషి లేని ఇంట్లో, సెంటిమెంట్ల ప్రాధాన్యం లేని వ్యక్తివాదాన్ని సమర్ధించే మనుష్యుల మధ్య పెరిగిన సావిత్రి చిన్న తనంలోనే చాలా స్వతంత్రురాలిగా జీవించడానికి అలవాటు పడుతుంది. తనలోని భావోద్వేగాలను బైటపెట్టడం అమెకు తెలియదు. షోలాపూర్‌లో ఈ తండ్రీ కూతుర్లు ఉంటారు. ఒకసారి ఏదో కేసు కోసం పక్క ఊరికి వెళ్ళిన జగదీష్, సావిత్రి కన్నా కొంచెం పెద్దదయిన ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుని తీసుకుని వస్తాడు. ఇంటికి వచ్చి కూతురుకి నౌఖర్లకు ఆమె తన భార్య అని పరిచయం చేస్తాడు. పదిహేనేళ్ళ సావిత్రి తండ్రి తనకు చెప్పకుండా తనను అడగకుండా పెళ్ళి చేసుకుని రావడంతో కోపం తెచ్చుకుంటుంది. కాని ఆ వచ్చిన అమ్మాయి పై ఆసక్తి కూడా పెంచుకుంటుంది. ఆమెతో స్నేహంగా ఉండడం మొదలెడుతుంది. కాని తండ్రితో క్రమంగా దూరం అవుతుంది. అమల అనే పేరుగల తన మారుటి తల్లిని అమ్మి అని పిలవడం మొదలెడుతుంది.
అమ్మి పెద్దగా చదువుకోలేదు. చిన్నగా తన పేరు రాసి సంతకం పెట్టడం తప్ప ఆమెకు పెద్ద అక్షర జ్ఞానం లేదు. సావిత్రికి కోపం, తొందరపాటు ఎక్కువ. అమ్మి చాలా ఓర్మితో ఓపికతో నడుచుకునే అమ్మాయి. ఇద్దరు భిన్న దవాలయినా ఇద్దరి మధ్య ఒక వింత స్నేహం ఏర్పడుతుంది. తండ్రితో ఎప్పుడు గొడవకు దిగే సావిత్రికి, ఆమె తండ్రికి మధ్య ఒక వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తుంది అమ్మి. తండ్రి ఆమ్మి పట్ల చాలా పొజెసివ్నెస్తో ఉన్నాడని సావిత్రికి అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమ్మితో కలిసి తిరిగినందుకు వీధిలో ఐస్‌క్రీమ్ తిన్నందుకు తండ్రి ఆమెను మందలించడంతో ఆమె అహం దెబ్బతింటుంది. తండ్రి తన ప్రతి చిన్న ఆనందానికి అడ్డుపడే వ్యక్తిలా ఆమెకు కనిపిస్తూ ఉంటాడు. తండ్రి పట్ల ఎంత ద్వేషం ఆమె పెంచుకుంటుందంటే, ఆమె జుట్టు బావుంటుందని తండ్రి అన్నాడని ఆ జుట్టును కత్తిరించుకుని తండ్రిపై తిరుగుబాటు ప్రకటిస్తుంది. తండ్రికి అమ్మికి మధ్య ఉన్న సంబంధాన్ని విమర్శించినప్పుడు అమ్మి చాలా స్పష్టంగా ''నీ స్వాతంత్య్రానికి మేము అడ్డు రావద్దు అని నీవు అనుకున్నట్లే మా భార్యాభర్తల సంబంధాన్ని మా మధ్యే ఉండనీ. దాన్ని విమర్శించే హక్కు నీకు లేదు'' అని చెప్పడం సావిత్రి జీర్ణించుకోలేక పోతుంది.
సావిత్రి చదువులో ఎప్పుడు ముందుండే అమ్మాయి. తండ్రి ఆమెను షోలాపూర్‌లోనే చదివించాలనుకుంటాడు. కాని దానికి భిన్నంగా సావిత్రి ముంబారు వెళ్ళిపోవాలనుకుంటుంది. తండ్రికి ఇష్టం లేకపోయినా తనకు నచ్చిన రీసెర్చ్ కోసం బొంబాయి వెళ్ళిపోతుంది. తండ్రి ప్రతి నిర్ణయాన్ని కాదనే స్వభావం అలవర్చుకున్న సావిత్రి తరువాత తండ్రితో పెద్దగా సంభంధం పెట్టుకోదు. తండ్రి ప్రయత్నించి ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడి తన జీవితం తన ఇష్టం వచ్చినట్లు గడపాలనుకుంటుంది.
పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో యూనివర్శిటీలో మొదట్ ర్యాంక్ సాధించి అక్కడే తనకు నచ్చిన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరుతుంది సావిత్రి. రామ్ అనే స్నేహితుడు పరిచయం అవుతాడు. అతనితో డేటింగ్ మొదలెడుతుంది. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని తనకు నచ్చిన పద్ధతిలో జీవిస్తూ ఉంటుంది. చాలా తెలివి గల రీసెర్చ్ స్కాలర్ గా గొప్ప పేరు సంపాదించుకుంటుంది. తండ్రి ఎన్ని సార్లు పిలిచినా అతన్ని చూడడానికి షోలాపూర్ వెళ్ళదు. సావిత్రి రాసిన ఒక థీసిస్‌కి అంతర్జాతీయ స్థాయిలో బహుమతి లభిస్తుంది. ఆమెకు అవార్డ్ ఇచ్చే రోజున అమ్మి సావిత్రిని వెతుక్కుంటూ ఆమె ఇంటికి వస్తుంది. నుదుటి పై బొట్టు లేకుండా ఇంటికి వచ్చిన అమ్మిని చూసి సావిత్రి ఆశ్చర్యపోతుంది. ఆమె తండ్రి మరణించి పదిహేను రోజులయ్యిందని, ఆమెకు కబురు చేయవద్దని తండ్రి చెప్పాడని, తన యావదాస్థిని సావిత్రి పేరున రాసి ఒక షరతు పెట్టాడని అమ్మి ద్వారా సావిత్రికి తెలుస్తుంది. షరతు ప్రక్రారం అమ్మిని సావిత్రి తన తల్లిగా తన వద్ద ఉంచుకోవాలి. సావిత్రికి తండ్రిపై కోపం వస్తుంది. తండ్రి మరణం ఆమె అహాన్ని దెబ్బ తీస్తుంది తప్ప, బాధ కలిగించదు. కాని తండ్రి షరతులతో తనకు ఆస్తి ఇవ్వడం ఆమె జీర్ణీంచుకోలేకపోతుంది.
అమ్మి ఆమెతోనే ఉండిపోతుందని తెలిసి ముందు ఇబ్బంది పడినా అమ్మి అంటే ముందు నుండి ఉన్న ఇష్టం కారణంగా ఆమెకు అది పెద్ద కష్టంలా అనిపించదు. అమ్మి సావిత్రి జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఆమె ఓపిక సావిత్రి జీవన విధానాన్ని ఆమె అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, విమర్శించకపోవడం ఇవన్నీ సావిత్రిని అమ్మికి దగ్గర చేస్తాయి. తన స్నేహితులకు అమ్మిని తన తల్లి అనే పరిచయం చేస్తుంది. సవతి తల్లి అన్న పదాన్ని మర్చిపోతుంది. అమ్మి ఆమె జీవితంలో ఒక భాగం అయిపోతుంది.
రామ్ ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండడం, సావిత్రి రామ్ భార్యా భర్తల్లా జీవించడం అమ్మి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. రామ్ సావిత్రిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కాని సావిత్రికి వివాహ బంధం పట్ల నమ్మకం లేదు. రామ్‌తో తనకున్న ప్రేమ తగ్గకూడదని దానికి వివాహం అనే పేరు అవసరం లేదని ఆమె వాదన. రామ్ ఎంత ప్రయత్నించినా సావిత్రి అతని తల్లిదండ్రులను కలవడానికి ఇష్టపడదు. తప్పని పరిస్థితులలో రామ్ తన తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఈ సంగతి తెలిసి సావిత్రి బాధపడుతుంది. రామ్ తన జీవితంలో నించి వెళ్ళిపోయాడు అన్న బాధ కన్నా ఏ మాత్రం తెలివి లేని ఒక సాధారణ బోరింగ్ అమ్మాయిని రామ్ ఎలా పెళ్ళి చేసుకున్నాడని ఆమె బాధ. ఆమెలోని ఈ ఆధిపత్యభావం రామ్‌కి కోపం తెప్పిస్తుంది కూడా. జీవితంలో సాధారణంగా జీవించాలనుకునే వ్యక్తులు కూడా ఉంటారని చాలా కోపంగా బాధగా చెప్పి వెళ్లిపోతాడు రామ్. తనలోని భావోద్వేగాలను బైటపెట్టడం చిన్నతనం అని భావించి అన్నింటిని తనలోనే ఉంచుకునే సావిత్రి తత్వం తెలిసిన అమ్మి ఆమెను ఓదారుస్తుంది. సావిత్రి అనుకున్నట్లే ఆ బంధంలో ప్రేమ మాత్రమే మిగిలిందని పెళ్ళితో వచ్చే వ్యావహారికత ఆ బంధంలో లేకపోవడమే సావిత్రి కోరుకున్న బంధం అయినప్పుడు ఇక బాధ ఎందుకని సావిత్రిని అమ్మి ప్రశ్నిస్తుంది. మొదటిసారి సావిత్రి అమ్మిలోని లోతును చూడగలుగుతుంది.
సావిత్రి రామ్‌ని మరచిపోయి జీవిస్తున్న సమయంలో అమ్మి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆమెను హస్పిటల్లో చేర్పిస్తుంది సావిత్రి. లుకేమియా ఆఖరి స్టేజీలో ఆమె ఉందని డాక్టర్లు చెబుతారు. ఆమె ఇంకొన్ని రోజులే జీవిస్తుందని సావిత్రికి తెలుస్తుంది. అయితే ఈ విషయం అమ్మికి ముందే తెలుసని డాక్టర్లు చెప్పినప్పుడు అమ్మి జీవితం ముందు తన తెలివి ఎంత చిన్నదో సావిత్రికి మొదటిసారి అర్థం అవుతుంది. చాలా కోపంతో అమ్మిని తనతో నిజం చెప్పలేదని వాదిస్తుంది. అప్పుడు అమ్మి ఆమెకు తన గతం గురించి చెబుతుంది. తన తండ్రి, సావిత్రి తండ్రి ఇద్దరు మిత్రులని తన తండ్రి ఆస్థి అంతా పోగొట్టుకున్నారని, ఆ విషయంలో కేసు సహాయం కోసం సావిత్రి తండ్రి తమ ఊరు వచ్చాడని అప్పటికే తనకు లుకేమియా సోకిందని, తన తండ్రి మరణించిన తరువాత ఆమె భాధ్యత సావిత్రి తండ్రి తీసుకోవలసి వచ్చిందని, పరాయి స్త్రీ, వివాహానికి యోగ్యత లేని ఒక కేన్సర్ పేషెంటుని ఇంటికి తీసుకు వస్తే లోకం ఒప్పదని అందుకని సావిత్రి తండ్రి ఆమెను పెళ్ళి చేసుకున్నాడని అమ్మి చెబుతుంది. ఆ వివాహంతో సావిత్రికి కూడా ఒక స్నేహితురాలిని తీసుకువచ్చినట్లు అవుతుందని తండ్రి ఆశపడ్డాడని, తమ మధ్య శారీరక సంబంధం లేదని, ఆమెపై అతను చూపిన శ్రద్ధ ఒక రోగిపై చూపే శ్రద్ధ, బాధ్యత అని, ఆయన చివరి దాకా ఆ భాద్యతను సక్రమంగా నిర్వహించారని ఆమ్మి చెబుతుంది. సావిత్రి తొందరబాటు, తండ్రిపై ద్వేషం ఇవన్నీ కూడా ఆమెను తండ్రికి దూరం చేసాయని అయినా ఆమె మంచి మాత్రమే వారిద్దరూ కోరుకున్నారని సావిత్రికి అమ్మి ద్వారా తెలుస్తుంది.
మరణించబోయే ముందు సావిత్రిని అమ్మి మానవ సంబంధాలలో స్వేచ్ఛను కోరుకున్నట్లే తనలోని భావోద్వేగాలకు కూడా స్వేచ్ఛనివ్వమని కోరుతుంది. ఆమె చెప్పిన ఈ మాటతో సావిత్రికి తన వ్యక్తిత్వంలోని లోటు అర్థం అవుతుంది. తనలోని కోపం, ప్రేమ, భయం, వీటన్నిటిని తనలోని దాచుకోని ప్రాక్టికల్‌గా బతుకుతున్నాననే నెపంతో రాయిలా మారిపోయానని, మానవ సంబంధాలలో స్వేచ్ఛ కన్నా మనలోని మన భావాలకు స్వేచ్ఛ అవసరం అని ఆధునికత, చదువు, ఆత్మగౌరవం, తమపై తమకు నమ్మకం ఇవన్నీ మనిషిని ప్రాక్టికల్‌గా చేస్తూ మన భావోద్వేగాలను దాచిపెడుతున్నాయని, వాటిని బైట పెట్టడం అతి సాధారణమైన హేయమైన చర్య అని మనం అనుకోవడం తప్పని, నిజమైన స్వేచ్ఛ మనలను మనం ప్రతికూల భావోద్వేగాల నుండి విముక్తి చేసుకోవడం అని, అది చేయలేనప్పుడు మన జీవితంలో ఎన్ని ఉన్నా అది మన నియంత్రణలో లేకుండా పోతుందని, వ్యక్తి స్వాతంత్య్రం పేరుతో చాలామంది తమ జీవితాలపట్ల నియంత్రణ కోల్పోతున్నారని తాను ఇప్పటి దాకా చేసింది అదేనని అమ్మి చెప్పిన అ ఒక్క మాటతో అర్థం అవుతుంది సావిత్రికి.
ఈ సినిమాలో సావిత్రి పాత్ర ఇప్పటి ఆధునిక స్త్రీలకు నిదర్శనం. చిన్నప్పటి నుండి తనలోని భావోద్వేగాలపై నియంత్రణ సాధిస్తున్నాననే నెపంతో తన జీవితంపై నియంత్రణ కోల్పోయే స్థితిలోకి ఆమె వెళ్ళడం కనిపిస్తుంది. ప్రతి దాన్ని తన దష్టిలోంచే చూడడం, అందరూ తన స్థాయిలోనే ఉండాలని అనుకోవడం, సాధారణత్వంలోని గొప్పతనాన్ని చూడలేకపోవడం, అది చేతకాని తనం అని అనుకోవడం ఇవన్నీ ప్రస్తుత ఆధునిక యువతలోని లక్షణాలు. అలా జీవిస్తూ వారు ఆనందంగా ఉన్నారా అంటే అదీ లేదు. దానికి కారణాన్ని అమ్మి పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు. చదువు లేక, కష్టాలతో జీవితం సాగిస్తూ, మరణానికి ప్రతి నిముషం దగ్గర అవుతూ ఆమె జీవితాన్ని అర్థం చేసుకున్న విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఇద్దరి నటీమణుల నటన చాలా హుందాగా ఉంటుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ప్రతిమా జోషి. రచయిత్రి, నిర్మాత కూడా స్త్రీలే. ఇంత మంది స్త్రీల మధ్య స్త్రీ వాదంపై ఇంత సహేతుకమైన చర్చ ఈ మధ్యకాలంలో మరే సినిమాలో రాలేదని చెప్పవచ్చు. ఈ సినిమాను చూసి అర్థం చేసుకుని ప్రస్తుత స్త్రీవాదుల దక్కోణ్ణంలో రావలసిన మార్పు ఎంత అవసరమో చర్చించుకోవలసిన అవసరం ఉంది. తమ జీవితాలపై నియంత్రణ కోల్పోవడం ఏ వాదానికైనా చాలా నష్టం కలిగించే విషయం. స్త్రీ వాదం పేరిట జరుగుతున్న తప్పులను సున్నితంగా ఎత్తి చూపిన సినిమా ఇది.
- పి.జ్యోతి,
9885384740