Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ సహనశీలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు పోటెత్తినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. తన కుటుంబం కోసం, తన వారి కోసం జీవితాన్ని ధారపోస్తుంది. అలాంటి త్యాగశీలి ఒక్కోసారి నిరాశ చెంది నీరసించిపడిపోతుంది. అప్పుడామెకు మనోధైర్యం చాలా అవసరం. స్త్రీజాతికి మనోధైర్యాన్నిచ్చే అలాంటి పాటను ప్రసిద్ధకవి, సినీగేయ రచయిత తిరునగరి శ్రీనివాసస్వామి రాశాడు. 2008లో పులిఅమత్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ తీర్పు ఇల్లాలిది' సినిమా కోసం రాసిన పాట ఇది.
సినిమా కథ పరంగా పరిశీలించినట్లయితే భర్త తన భార్యను వేధిస్తూ, చిత్రహింసలు పెడుతూ నానా బాధలకు గురి చేస్తూ ఉంటాడు. భర్త పెట్టే బాధల్ని భరిస్తూ కూడా ఆమె ఎంతో ఓర్పుతో బతుకు గడుపుతుంది. ఇక రానూ రానూ భర్త పెట్టే బాధల్ని తాళలేక నరకంలాంటి ఆ జీవితాన్ని గడపలేక ఇంటిని వదిలిపెట్టి, రహదారుల వెంట నడుస్తూ బతుకుభారమై ఆత్మహత్యాయత్నం చేస్తుంది. అలాంటి సందర్భంలో వినిపించే 'గీతో'పదేశం ఇది.
ప్రశ్నార్థకంగా సాగిన మగువ జీవితానికి ఒక సమాధానమై నిలబడ్డ పాట ఇది. మమతానురాగాలకు కరిగిపోయి ఆత్మీయతానుబంధాలకు పరవశించిపోయి ముందుకు సాగే ఓ మహిళా! కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ, పశువుల్లా ప్రవర్తించే మానవ మగాలను ఇంకా ఎందుకు సహిస్తావు అంటూ ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. స్త్రీ జీవితం కర్పూరం లాంటిది. తాను కరిగిపోతూ వెలుగునిస్తుంది. జీవితంలో తన సర్వస్వంగా భావించుకున్న తన భర్త చేసిన అన్యాయానికి ఆ స్త్రీ మనసు గాయపడింది. అలమటించి పోయింది. ఆ అలసట నుంచి ఉపశమనం పొందే సహనం ఆమెకు కవచమవ్వాలని, కలత పడకుండా ముందుకు సాగిపోవాలని చెబుతూ సందేశమై సాగుతుంది ఈ పాట. ఆత్మబలమే మనిషి బతుకును మార్చేస్తుంది. అదే మనకు బంగారు భవితను అందిస్తుంది. ఆత్మవిశ్వాసముంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. రాయి కూడా సానబడితేనే రత్నమై తళుకులీనుతుంది. ఇక్కడ ఆమె బతుకు రాయి దశ నుంచి రత్నం దశగా పరిణామం చెందే క్షణాలు తొందరలోనే ఉన్నాయని కవి ఆమెకు భరోసానిస్తున్నాడీ పాట ద్వారా. జీవితం కష్ఠసుఖాల సంగమం. బాధ వెంట సుఖం.సుఖం వెంట బాధ రెండూ ఉంటాయి. అది గ్రహించుకుంటే దేనినైనా దాటుకూపోగలం. ఛేదించుకు పోగలం.
ఎడారిలో పూలు పూయవు. కాని ఆ అసాధ్యమైన పని ఏదో నాటికి సాధ్యం కావచ్చు. అలాంటి ఆశతో, నమ్మకంతో ముందుకు సాగితే అది నెరవేరవచ్చు. ఇక్కడ ఎడారిమయమైన తన బతుకులో కూడా దిగులు తొలగి సంతోషమనే పూలు పూసే కవి చెబుతున్నాడు. నిజం కఠోరమైనది. కాని ఆ కఠోరం వెనుక ఎంతో అందముంటుంది. అంతే కాదు అలుపు లేక చేసిన ప్రయాణం వెనుకే గెలుపూ ఉంటుంది. సమాజంలో అవినీతి, అమానుషత్వం, అన్యాయం పెచ్చు పెరిగిపోయాయి నేడు. అలా అని మనం చూస్తూ కూర్చుంటే అవి పరిమితులు దాటి, పైపైకి ఎగబాకి మనల్ని మింగేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ధైర్యంతో అడుగులనే పిడుగులుగా వేసి ముందుకు నడిస్తే ఆ అమానుషత్వం వెనకడుగు వేస్తుంది. భయపడి దౌడు తీస్తుంది. గులాబి పూవు శాంతికి సంకేతం. అందుకే గులాబి పూల వనాలలోని నిండైన శాంతిని నీ బతుకులో నింపుకోవాలంటే నువ్వు ముందుగా నీ బతుకు నేలను సాగు చేసుకోవాలి. గులాబి తోటను పూయించుకోవాలి. వీణ తీగ తెగిందని చూస్తూ కూర్చుంటే కుదురుతుందా? స్వరాలలోని మధురిమల్ని నువ్వు ఆస్వాదించాలంటే తెగిన తీగను శ్రుతిని చేయాల్సిందే మరి. ఈ సమాజనౌకను సవాలు చేస్తూ బ్రతుకుపయనాన్ని సాగించినపుడు కష్టాలు దూరమై నీ బతుకులో సుఖాలు నిండి స్వర్గం ఉదయిస్తుందని కవి ఇక్కడ స్త్రీజాతికి ఉదాత్తమైన సందేశాన్నందించాడు. సమస్యలను పరిష్కరించుకుని ముందుకుపోవాలి గాని సమస్యలకు భయపడే వారికందరికి ఆ సమస్యల సంకెళ్ళను ఛేదించి, విచ్చు కత్తిలా విరుచుకుపడగల ఉత్సాహాన్ని నూరిపోయగల సత్తాను నింపుకున్నదీపాట. స్త్రీని అబల అంటారు. అంటే బలం లేనిదని అర్థం. కష్టాల్లో ఉన్నప్పుడు మరీ బలహీనురాలై కుంగిపోతుంది. అలాంటి అబల తనకు తాను సబలగా నిరూపించుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచేలా ప్రేరేపిస్తుందీ పాట. ఇది సినిమా సన్నివేశం దష్ట్యా మహిళలకు సందేశాన్నిచ్చే పాటలా తోస్తున్నా, వింటుంటే మానవజాతి మనుగడకే మనోధైర్యాన్నిచ్చే మహౌన్నతగీతమిది.
పాట :- మమతకోసం కరిగినీరై సాగే ఓ మహిళా/ మనసులేని మగాల వైనం ఇంకా సహింతువా/ అలమటించి బతుకులోన అలసిపోయావా/ కలతపడక సాగిపోతే గెలుపు నీదేగా/ ఆత్మబలమే మనిషి భవితను మార్చివేస్తుంది/ రాయి కూడా సానబడితే రత్నమౌతుంది/ జీవితాన వెలుగు నీడలు వెంట ఉంటాయి/ బాధ వెనుకే సుఖాలు సర్వం ఉన్నవి గ్రహించుమా
ఎడారిలోన సుమాలు పూచే సమయమొస్తుందీ/ దిగులులేని బతుకు నీకు సొంతమౌతుందీ/ కఠోరమైన నిజాలలోనే అందముంటుందీ/ అలుపులేని పయనమందే గెలుపు ఉంటుందీ/ సమాజమందు అమానుషత్వం పెరిగే పోయిందీ/ పిడుగులలాంటి అడుగులే వేస్తే పరుగే తీస్తుందీ
గులాబిపూలవనాలలోని శాంతి కావాలా/ బతుకునేలను సాగు చేస్తే సాధ్యమౌతుందీ/ స్వరాలలోని సరాగమే నీవందుకోవాలా/ తెగిన తీగను శ్రుతిని చేస్తే రాగమౌతుందీ/ సమాజనౌకను సవాలు చేస్తూ సాగేపోవాలీ/ వెతలుతొలిగీ నీదు బతుకే స్వర్గమౌతుందీ.
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682