Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ మానవాళి ప్రస్తుతం అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొం టున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కరోనా విపత్తు చరిత్రలో మొదటిది కాదు. చివరిది కాదు. 1918 సంవత్సరంలో స్పానిష్ దేశంలో సంభవించిన అంటు వ్యాధి విపత్తులో జనం అత్యంత దారుణమైన పరి స్థితులు ఎదుర్కొన్నారు. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ కాలంలో వ్యాధి నిర్మూలనకు ఇప్పుడున్న శాస్త్ర విజ్ఞానం అందు బాటులో లేదు. అయినప్పటికీ ప్రజలు మనో ధైర్యంతో ఆ మహా విపత్తును ఎదుర్కొన్నారు.
రెండు సంవత్సరాలుగా మనం ఎదుర్కొం టున్న కరోనా కష్ట కాలాన్ని ఒకసారి విశ్లేషిస్తే మనుషుల్లో భయాన్ని వ్యాపింప జేసి కొన్ని బడా సంస్థలు తమ వైద్య వ్యాపారాభివృద్ధిని అధికం చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు. ప్రజల్లో నెలకొన్న భయాన్ని ఎప్పటి కప్పుడు తొలగించేందుకు ప్రభుత్వాలు కూడా గట్టిగా కృషి చేయలేక పోయాయి. అందువల్ల ప్రజలు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకుని భయాన్ని వీడాలి. కరోనాను జయించాలి. ఇదిలా ఉండగా కొన్ని మత విశ్వాసాలు కరోనా వ్యాప్తికి దోహద పడ్డాయి. ప్రజలు నమ్మే ఏ విశ్వాసమైనా జనానికి నష్టం కలుగజేసే విధంగా ఉండకూడదు. ఒకవేళ ఆ విశ్వాసం వల్ల నష్టం జరుగుతున్నదని భావిస్తే దానిని మార్చుకునేందుకు వెనుకాడవద్దు. కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలు, వారి ప్రాణాలే ముఖ్యమని భావించాలి. మారుతున్న కాలంతో పాటే మనం మారాలి. ఆదునిక యుగంలో మూడ విశ్వాసాలను ఇంకా పట్టుకు వేలాడితే దేశం అభివృద్ది చెందదు. ఇదిలా ఉండగా ప్రజలు ఎక్కువగా గుమిగూడే ఏ కార్యక్రమాన్నైనా ప్రస్తుతం వాయిదా వేసుకోవాలి. అనగా ప్రతి మనిషి స్వయం నియంత్రణను పాటించాల్సిన సమయమిది. వైరస్ సోకకుండా తప్పించుకుని తిరగాలి. ఇండ్ల నుంచి బయటకు వచ్చినపుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు ఏ మనిషిని కదిలించినా కరోనా కష్టాలే వినిపిస్తున్నాయి. ఆప్తులను కోల్పోయి దు:ఖిస్తున్న వారే అధికంగా కనిపిస్తున్నారు. ప్రతి రోజు, ప్రతి క్షణం ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రజల భయాందోళనను పెంచి పోషిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఈ కాలంలో కొంత మంది ప్రజలు టీవీలను వీక్షించడమే మానేశారు. బ్రేకింగ్ న్యూస్ పేరిట కొన్ని టీవీలు చేస్తున్న హంగామాను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. కరోనా వ్యాప్తి, దాని నివారణ విషయంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శాస్త్రీయంగా వివరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయలేదు. అంతేకాకుండా వ్యాధి నివారణ విషయంలో కీలకంగా పని చేస్తున్న వ్యాక్సిన్ డోసుల పంపిణీ అస్తవ్యస్తంగా తయరైంది. ఈ సందర్భంగా భయమే కొన్ని సందర్భాల్లో ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నది. 'జో డర్ గయా వో మర్ గయా' అనే నానుడి సర్వత్రా వినిపిస్తున్నది. అలాగని వ్యాధి సంక్రమించినా ఏమి కాదనే అతి విశ్వాసం కూడా ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం మనకు కనిపించే మూడు సింహాలు మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం, అయితే ఆ కనిపించని నాలుగవ సింహమే మనోధైర్యం. ఈ మనోధైర్యంతోనే లక్షలాది ప్రజలు కరోనాను జయించారు. తమకు తోచినా పద్ధతిలో వంటశాలనే వైద్యశాలగా మార్చుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రజలు సాధించిన గొప్ప విజయమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా నివారణ విషయంలో దూరదృష్టి కొరవడడం వల్లనే ప్రాణ నష్టం అధికంగా సంభవించింది. దీనికి తోడు తమకు ఏమి కాదనే అతి విశ్వాసం కూడా మరికొంత నష్టాన్ని కలుగజేసింది.
మొదట్లో కరోనా వ్యాధి సోకినా వారిని చూసి అనేక మంది భయపడ్డారు. సంవత్సరం తరువాత ఆ వ్యాధి గుట్టు తెలుసుకుని ఇరుగు పొరుగు వారు వ్యాధి పీడితులకు సహకరించారు. దీంతో అనేక మంది స్వీయ నిర్భందంలో ఉంటూ కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న కొంత మందిలో మానసిక సమస్యలు తలెత్తాయని అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. మానసిక ఆందోళనకు గురైన వారు గాబరా పడకుండా సాధారణ స్థితిని పొందేందుకు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇదే కాకుండా కరోనా వైరస్ సృష్టించిన అల్ల కల్లోలానికి అనేక కుటుంబాలు చితికి పోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేనందున ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కాగా ఈ ఆపద కాలంలో మనుషులకు భయమే అతి పెద్ద వైరస్ అని మానసిక ధైర్యం, ఆత్మస్థైర్యం ధర లేని మెడిసిన్ నిపుణులు చెబుతున్నారు.
కష్టాలు, నష్టాలు, సంక్షోభాలు, ఆపదలు మన జీవితంలో ఒక భాగమే. మిత్రమా.. మనకు కష్టమోస్తే కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి.ఆపదను అధిగమించే మానసిక స్థైర్యాన్ని అలవర్చుకోవాలి. అలాంటప్పుడే ఇలాంటి సంక్షోభాలెన్నింటినైనా మనం దాటుకుని ముందుకు వెళ్లగలుగుతాం.
- జి గంగాధర్ సిర్ప, 8919668843