Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే ఒక మహౌన్నత మూర్తిమత్వం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. తెలంగాణ వైతాళికుడిగా యావత్తు తెలుగుజాతి గుర్తు పెట్టుకోవాల్సిన పేరు సురవరం. ఈయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల పాడు గ్రామంలో మే 28 న 1896లో జన్మించాడు. మద్రాసులో చదువుకోవడం వల్ల జాతీయోద్యమ ప్రభావం ప్రతాపరెడ్డిపై ఎక్కువగా ఉండేది. దాంతో తన పత్రికకు ''దేశబంధు'' అనే పేరు పెట్టుకున్నాడు. కానీ అది నిజాం ప్రభుత్వం అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ''గోల్కొండ పత్రిక'' పేరును ఖరారు చెయ్యడంతో 10 మే 1926 న ఈ పత్రిక పురుడుపోసుకుంది.
ప్రతాపరెడ్డి సాహిత్యం విశ్వరూపానికి గోల్కొండ పత్రిక నిదర్శనం. నాటి తెలుగు పత్రికారంగంలో సంచలనాలకు తెరలేపింది గోల్కొండ పత్రిక. సురవరం ప్రతాపరెడ్డి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది 'గోల్కొండ పత్రిక'. ఇది ప్రతాపరెడ్డి అక్షరాల కోట. ఆ తరువాత ''ప్రజావాణి'' పత్రికను కొంతకాలం నడిపాడు. సాహిత్య, సాంస్కతిక, రాజకీయ రంగాలతో పాటు బహు ముఖ ప్రతిభకు ఆయన నిలువెత్తు ఉదాహరణ. తెలంగాణలో కవులే లేరన్న నిందావ్యాఖ్యలకు 1935లో 'గోల్కొండ కవుల సంచిక' ద్వారా సమాధానమిచ్చాడు. ఇందులో 354 మంది కవులతో ఈ సంకలనం పురుడు పోసుకుంది. మొక్కవోని సంకల్పశక్తితో ఈ సంచికను ప్రకటించాడు ప్రతాపరెడ్డి. జీవిత కాలంలో సురవరం చేసిన నాలుగు శతాబ్దాల సాహితీ సేవ మహౌన్నత శిఖరం లాంటిది. ఆయన సాహిత్యం తరతరాలకు ఆదర్శప్రాయం. నిజాం పాలనలో మాత భాష తెలుగు పతనపు అంచుల వరకు చేరిందని సురవరం తపించే వాడు. సంస్కతి శరీరం లాంటిదైతే భాష శ్వాస లాంటిదని భావించి, భాషాభిమానులతో కలిసి 1921 సంవత్సరం హైదరాబాదులో ఆంధ్ర జన సంఘాన్ని స్థాపించాడు. అదే సంవత్సరంలో 'ఉచ్చల విషాదం' అనే నాటకాన్ని రాశాడు. పరిశోధకుడిగా ప్రతాపరెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర', 'హిందువుల పండుగలు', 'రామాయణ విశేషములు'. ప్రజల సాంఘిక చరిత్రే అసలైన చరిత్రగా ఆవిష్కరించిన ప్రతాపరెడ్డి గ్రంథానికి తొలి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొంది చరిత్ర సష్టించింది. సురవరం ప్రతాపరెడ్డి వ్యక్తిత్వపరంగా నిరాడంబరత, నిర్భీతి, నిజాయితీ నిస్వార్ధత, సురవరం జీవలక్షణాలు.
సురవరం ప్రతాపరెడ్డి 124వ జయంతిని పురస్కరించుకొని పాలమూరు సాహితి సంస్థ ''సురవరం మొగ్గలు'' అనే పుస్తకాన్ని వెలువరించింది. మొగ్గల సష్టికర్త అయిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ దీనికి సంపాదకత్వం వహించాడు. ఇందులో 124 మంది కవులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఉండడం విశేషం. ఇందులో 79 రచయితలు, 45 మంది కవయిత్రులు తలో చెయ్యివేసి మొగ్గల కవిత్వాన్ని సుసంపన్నం చేశారు. సురవరం వ్యక్తిత్వాన్ని, భాషా సాంస్కతిక విషయాలను బోల యాదయ్య, కపిలవాయి అశోక్ బాబు, కర్నాటి రఘురాములుగౌడ్, ఓర్సురాజ్ మానస, శాంతారెడ్డి లు, సురవరం ప్రతాపరెడ్డి ధిక్కారతత్వాన్ని తన కలం ద్వారా ఉప్పరి తిరుమలేష్, బాదేపల్లి వెంకటయ్య, సర్ఫరాజ్ అన్వర్, కొలిపాక శ్రీనివాస్, సముద్రాల కుమారస్వామి, శైలజా శ్రీనివాస్, బొడ్డుపల్లి ఖాజన్న, పులి జమున, సీతాలక్ష్మి, కొప్పోలు యాదయ్య , బర్క శశాంక్, సహని, బండారు సునీత, సురవరం జీవితంలోని భిన్నపార్శ్వాలను తమ కవితలను జీవనదిలా పారించారు. ఉదాహరణకు.. డాక్టర్ గుంటి గోపి రాసిన.. ''పత్రిక కోసం ఎన్నో అవతారాలను ఎత్తుతూనే/ అన్ని ఆటంకాలను అధిగమించిన ధైర్యశాలి/ యువతరానికి స్ఫూర్తి సురవరం కలం'' అంటాడు. అలాగే బోల యాదయ్య ''అతడు జ్ఞాన దివిటీని ఎత్తి పట్టుకొని/ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగైనాడు / జనం బతుకుల్లో సూర్యుడు సురవరం'' అంటూ సురవరం ప్రజల్లో చైతన్యం ఎలా తీసుకు వచ్చాడో తెలియజేస్తాడు. మరో కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి రాసిన మొగ్గలు ''తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాటల్లో గాక / గోల్కొండ కవుల సంచికతో జవాబిచ్చాడు / తెలంగాణలో నిలిచి గెలిచిన వాడు సురవరం'' అంటూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిన సాంస్కతిక కేతనం అంటూ కితాబిచ్చాడు. అయిత అనిత రాసిన మొగ్గల్లో ''తెలంగాణ వికాసానికి అవిరళ కషి సలుపుతూ / హైందవ ధర్మవీరులు గ్రంథాలయోద్యమాలను రచించాడు / వ్యాఖ్యాతగా రచయితగా ప్రసిద్ధుడు సురవరం'' అంటుంది.
అజ్ఞానమును పారద్రోలి రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేక దక్పథాన్ని వ్యక్తంచేస్తూ మూడు పాదాల మొగ్గలన్నీ పువ్వులై పరిమళాలను వెదజల్లారు కవులు. తెలంగాణ ప్రజలలో చైతన్యం ఐక్యమత్యమును పెంపొందించి రేపటితరానికి ఆదర్శప్రాయమైన వాడు, సాహితీయోధుడు సురవరం. స్థితప్రజ్ఞుడు, రాజకీయ చైతన్యుడు, కార్యదక్షుడు అయిన సురవరం ప్రతాపరెడ్డి గురించి అలాగే సాహిత్యం, భాషా సాంస్కతిక విషయాలు జీవితం, వ్యక్తిత్వం, ప్రజ్ఞావంతుడైన సురవరం రచనలు సంబంధించి విభిన్న కోణాల్లో మొగ్గల కవితలలో ఆవిష్కతం చేశారు ఇందులోని కవులు. ఒక్కో కవి, కవయిత్రి తమ ఆలోచనలకు తగినట్టు కవితలను మూడు పాదాల్లో ఇనుమడింప చేశారు. తెలంగాణ వైతాళికుడు అయిన సురవరం ప్రతాపరెడ్డి జీవితం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం.
124 మంది కవులతో కవితా సంకలనాన్ని వెలువరించిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కషి ప్రశంసించదగ్గది. ఆధునిక నూతన వచన కవితా ప్రక్రియలో కొత్త ఒరవడిని సష్టిస్తూ అక్షరోద్యమం చేస్తూ, కవులకు అండగా నిలిచి సురవరం హదయాన్ని ఆవిష్కరింపజేశాడు. సాహితీ లోకానికి సురవరం మొగ్గల సంచికనందించాడు. తెలంగాణ సమాజాన్ని అన్ని కోణాల్లో ప్రభావితం చేసిన సురవరం మనందరికీ ఆదర్శవంతుడు.
- కొలిపాక శ్రీనివాస్, 9866514972
(పిహెచ్.డి స్కాలర్)