Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడు పదుల సంవత్సరాలు దాటిన భారతదేశ స్వాతంత్రోద్యమంలో అశేష త్యాగాలు చేసిన అమర వీరుల జీవిత చరిత్రలు దాదాపు వంద మంది ప్రముఖుల్ని రచయిత తోటకూర వేంకట నారాయణ సచిత్రాలతో - ఒక చక్కటి కవిత ప్రతి యోధుని చరిత్ర ముందు.. అందించిన తీరు ప్రశంసనీయం..
నాయకులు శూన్యం నుండి ఊడి పడరు కదా!! వారికి అనుచరులు వుండి ఇచ్చిన పిలుపుకు స్పందించి, సర్వం ఒడ్డి, అనుసమాన త్యాగాలు చేసిన మహనీయులెందరో! వారిలో గుంటూరు జిల్లా ప్రముఖులైన వార్ని ఈ పుస్తకంలో రాసారు. మంచి విషయ సేకరణ, స్ఫూర్తినిచ్చే కథనంతో రాసారు రచయిత. చరిత్ర పరిశోధకుడు వకుళా భరణం రామకృష్ణ చక్కటి విలువైన ముందుమాట రాసారు. బ్రిటిష్ వారి బొక్కసానికి ఒక్క పైసా కూడా దక్కనీయకుండా చేసిన యీ వీరెోచిత పోరాటం, గాంధీజీ కలుగ చేసుకుంటేనే ఆగిపోయింది. గుంటూరు జిల్లాలో ఎందరో వీరుల జాతీయోద్యమం నుండి వామపక్ష, తదితర ఉద్యమాల్లోకి వెళ్లి ప్రముఖ పాత్ర నిర్వహించారు. అన్నా ప్రగడ కామేశ్వరరావు, ఇంటూరు వెంకటేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, పల్నాటి పౌరుషం - కన్నెగంటి హనుమంతు, కనుపర్తి వరలక్ష్మమ్మ, కల్లూరి తులశమ్మ, కంఠమనేని వెంకట రత్నం, కొండా వెంకటప్పయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, కొల్లా వెంకయ్య, కోలవెన్ను రామకోటేశ్వరరావు, ఎన్.జి.రంగా, చుక్కపల్లి రామయ్య, జొన్నలగడ్డ రామలింగయ్య, టంగుటూరి ప్రకాశం, తమనంపల్లి అమృతరావు, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, పులుపుల వెంకట శివయ్య, పెండ్యాల లోకనాధం, పోలేపెద్ది నరసింహమూర్తి, వావిలాల, సూర్యదేవర అన్నపూర్ణమ్మ, పాదర్తి సుందరమ్మ, భారతీ రంగా, గోళ్ళమూడి రత్నమ్మ లాంటి వారి వీరోచిత త్యాగమయ జీవిత చరిత్రలున్నాయి. అభినందనీయ ప్రయత్నం. కేంద్ర మంత్రుల్ని ఓడించిన వారి గురించి, నాయుడమ్మ లాంటి శాస్త్రవేత్తల్ని, గుంటూరు బాపనయ్య లాంటి శ్రామిక నేతల్ని కూడా ఎంపిక చేసుకొని రాస్తే ఇంకా సమగ్రత సంతరించుకొని ఉండేది.
(స్వాతంత్య్రమే మా జన్మహక్కని.., రచన : తోటకూర వేంకట నారాయణ, పేజీలు : 224, వెల : రూ.180/-, ప్రతులకు : తోటకూర రామసీత, 2-సి, గీత రెసిడెన్సీ, ఎన్టీఆర్ సెంటర్, చిలకలూరి పేట, గుంటూరు జిల్లా - 522616. సెల్ : 9839613013, 8341586274)
- తంగిరాల చక్రవర్తి, 9393804472