Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 1991వ సంవత్సరం. నేను శ్రీకాకుళం జిల్లా వమరవెల్లి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్న రోజుల్లో సందర్భం వచ్చినప్పుడల్లా 'ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక' అనే పాటను పాడేవాణ్ణి. ఒకరోజు నా మిత్రుడు సాసుబిల్లి కష్ణారావు ఈ పాట ఎవరు పాడారు నీకు తెలుసా? అని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పాను. ఆ పాట పాడినవారు మన జిల్లా వారేనని, మా ఊరు వారేనని అంటూ జి.ఆనంద్ గురించి తెలియజేశాడు.
గొట్టా బ్యారేజ్ అందరికీ తెలిసినదే. వంశధార నదిపై నిర్మించబడింది. ఈ బ్యారేజ్ హిరమండలం దగ్గర ఉంది. ఒకప్పుడు హిరమండలంకు దగ్గరలో తులగాం, దుగ్గుపురం, పాడలి, గార్లపాడు, కొల్లివలస అనే గ్రామాలు ఉండేవి. ఈ గ్రామాలకు 'పంచరత్నాలు' అనే పేరుంది. నేడు ఈ గ్రామాలు వంశధార రిజర్వాయర్‌లో ముంపు గ్రామాలుగా కలిసిపోయి వాటి అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఇక్కడి ప్రజలు చెట్టుకో పిట్టలా వేరే ప్రాంతాలకు వలసపోయారు. ఈ ఊరి ప్రజలు ఎక్కువ మంది శ్రీకాకుళం పట్టణానికి ఆనుకుని ఉన్న రాగోలు ఆర్టీసీ కాలనీలో ఇండ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే గత వైభవాన్ని తలుచుకుని వారంతా ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు కరువు కాటకాలు లేని ప్రాంతమిది. వంశధార నదికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలు ఉన్నప్పటికీ, దగ్గర్లో ఉన్న కొండవాలు వలన వర్షాలు ఎక్కువగా పడేవి. ఆ నీరు వచ్చి ఈ గ్రామ చెరువుల్లో చేరడంతో పూర్తిగా నిండేవి. అందువల్ల పంటలకు ఎప్పుడు ఢోకా లేదు. అందుకే వీటికి 'పంచరత్నాలు' అని పేరు వచ్చింది.
'రాసి కన్నా వాసి మిన్న' అని అన్నట్లు జి.ఆనంద్ పాడిన పాటలు తక్కువే. కానీ ఆ పాటలలో ఏ ఒక్క పల్లవి పాడి వినిపించినా ఇది జి.ఆనంద్ గారి పాటని ఠక్కున చెప్పేస్తారు. అంతటి మధుర గాయకులు ఆనంద్. 2021 మే 6వ తేదీన తన 76 యేట జి.ఆనంద్ కొవిడ్ కాటుకు బలై హైదరాబాదులో ఆకస్మికంగా దేహత్యాగం చేయడం విచారకరం. ఐదు దశాబ్దాల పాటు తన మధుర గాత్రంతో ప్రేక్షకులను ఓలలాడించిన జి.ఆనంద్ మరణవార్త తెలుసుకున్న తెలుగువారు బాధాతప్త హదయులయ్యారు.
చిన్ననాట గేదెల ఆనందరావుగా పిలువబడే జి.ఆనంద్ శ్రీకాకుళం జిల్లా, తులగాం గ్రామంలో 1945 ఫిబ్రవరి 16న చంద్రశేఖర నాయుడు, అమ్మన్నమ్మ పుణ్య దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ఆనంద్ భార్య పేరు సుజాత, ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్. వీరిది ప్రేమ వివాహం. కల్పన చిత్రం షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి కుమారులు అరవింద్, అరుణ్. కుమారులిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఆనంద్ గారి తండ్రి పౌరాణిక నాటకాలు వేసేవారు. ఆనంద్ కూడా చిన్నతనం నుండి పలు సాంఘిక నాటకాల్లో నటించేవారు. ఎక్కువగా హీరో పాత్ర వేసే వారు. తండ్రి శిష్యరికంలో పలు పాటలు నేర్చుకొని పాడేవారు. పాటలు పాడే పిచ్చే తనని సినిమాల వైపు లాగించిందని తరచూ ఆనంద్ అనేవారు.
తన స్వగ్రామంలో 'జి.ఆనంద్' బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసమంతా తులగాంలోనూ, ఎస్.ఎస్.ఎల్.సి హిరమండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ కొనసాగింది. తరువాత కొన్నాళ్లు అన్ ట్రైన్డ్ టీచరుగా, మరికొన్నాళ్లు వి.ఎల్.డబ్ల్యుగా విధులు నిర్వహించారు. అలా విధులు నిర్వహించిన సమయంలోనే సిక్కోలు కీర్తి దశదిశలా వ్యాపింపజేసిన సంగీత విద్వాంసులు శ్రీ బండారు చిట్టిబాబు గారు నిర్వహిస్తున్న 'సుకుమార్' ఆర్కెస్ట్రాలో ఆనంద్‌కు పాటలు పాడే అవకాశం దక్కింది. చిట్టిబాబు శిష్యరికంలో మేటి గాయకుడిగా తీర్చిదిద్దిబడ్డాడు. చిట్టిబాబు ఆనంద్‌ని ముద్దుబిడ్డ లాగే చూసుకునేవారు. అనేక విధాల సహాయ సహకారాలు అందించే వారు. శాస్త్రీయ సంగీతం అంతగా తెలియనప్పటికీ, ఏదైనా పాటను ఒక్కసారి వింటే, ఇట్టే పట్టేసే గుణం ఆయన సొంతం.
ఒకసారి 'నందిని కళానికేతన్ అసోసియేషన్, నంద్యాల' వారు జాతీయస్థాయిలో పాటల పోటీలు నిర్వహించారు. ఆ పోటీలకు ఆనంద్ హాజరయ్యారు. ఆ పోటీలకు సుమారు 80 మంది దాకా గాయకులు హాజరయ్యారు. ఆ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కె.వి.మహదేవన్, ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యవహరించారు. ఆ పోటీల్లో ఆనంద్ ఏకవీర చిత్రంలోని ఘంటసాల గారి 'ఏ పారిజాతములనీయగలనో' అనే పాటను పాడి ఆహూతులను ఎంతగానో అలరించారు. న్యాయ నిర్ణేతలు తతీయ, ద్వితీయ బహుమతులు ప్రకటించగా, వారు ప్రథమ బహుమతి ప్రకటించక ముందే జి.ఆనంద్ దే ప్రథమ బహుమతి అని ప్రేక్షకులు అనడం విశేషం. ఆ విధంగానే ఆ పోటీలలో ఆనంద్ ప్రథమ బహుమతి పొందారు. దాంతో మహదేవన్ దష్టి ఆనంద్‌పై పడింది. నీవు ఒకసారి మద్రాస్ రా నీకు అవకాశం ఇస్తానని ఆ సందర్భంగా అన్నారు. దాంతో 1971లో సిక్కోలు నుండి మద్రాస్‌కు పయనమయ్యారు ఆనంద్.
మహదేవన్ 'ఇల్లు ఇల్లాలు' సినిమాలో రాజబాబుకు పాడే పాటను ఆనంద్‌తో పాడించాలనుకున్నారు. ఆ పాటను అనివార్య కారణాల వల్ల బాలూతో పాడించారు. ఒక మిత్రుని సాయంతో ఎస్.పి.కోదండపాణిని ఆనంద్ కలిసారు. 1972లో 'పండంటి కాపురం' సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో రాజబాబుకు పాట పాడే అవకాశం మళ్లీ వచ్చింది. అయితే ఆ పాటను పుష్పవల్లి, సుశీల, బాలు గార్లతో కలిసి పాడారు. మెగాస్టార్ చిరంజీవికి మొట్టమొదటి యుగళగీతం ప్రాణం ఖరీదు చిత్రంలో ఆనంద్ ఆలపించారు. 'ఏది యెల్లో ఏది యెల్లో ఎందాక' అనే పాటను గాయనీమణి శైలజతో కలిసి పాడారు. చిరూకి 'పిల్లికి తెస్తా పల్లకీ నచ్చినచ్చిన వాడి కౌగిలి' అనే మరో గీతాన్ని కూడా ఆలపించారు. 1976లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'అమెరికా అమ్మాయి' చిత్రంలో 'ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక' అనే పాట సకల జనాల గుండెలను హత్తుకుంది. ముఖ్యంగా యువత ఆ పాటకు నీరాజనాలు పలికారు. ఆ సినిమాలో ఆ పాటను దర్శకుడు చిత్రించిన తీరు అద్భుతం. దాంతో జి.ఆనంద్కి మంచి పేరుప్రఖ్యాతులు చిత్రరంగంలో వచ్చాయి. 1977లో 'చక్రధారి' సినిమాలో 'విఠల విఠల పాండురంగ విఠల' అనే పాటను పాడారు ఆనంద్. అయితే ఆ పాట చిత్రం విడుదల కాకముందు రికార్డులో ఉంది. ముందుగానే అత్యంత ప్రజాదరణ పొందింది. కానీ ఆ చిత్రంలో మాత్రం ఆ పాటను వేరే వారు పాడారు. 'విఠల విఠల పాండురంగ విఠల' అని అంటే ప్రజల్లో ముందుగా గుర్తుకొచ్చేది ఆనంద స్వరమే. అంతలా ఆ భక్తి గీతం ప్రజల హదయాలను చూరగొన్నది. 1977లో జీకే వెంకటేష్ సంగీతంలో వచ్చిన 'కల్పన' చిత్రం ఆనంద్కి ఒక మైలురాయిగా నిలిచింది. అందులో సుశీలమ్మతో పాడిన 'దిక్కులు చూడకు రామయ్య పక్కన ఉన్నది సీతమ్మ' అనే పాటకు మాస్ ఇమేజ్ వచ్చింది. ఈ పాటను అప్పట్లో కొలంబియా కంపెనీ రికార్డ్ చేసింది. ఆ రోజుల్లో ఈ పాటల రికార్డు బాగా అమ్ముడుపోయింది. అదే కాదు సుశీలమ్మతో చక్రవర్తి సంగీతంలో జూదగాడు చిత్రంలోని 'మల్లెల అల్లరి వేళ మదిలో మన్మధ లీల' అనే పాటను అద్భుతంగా ఆలపించారు ఆనంద్. అదే ఏడాది బంగారక్క చిత్రంలో 'దూరాన దూరాన తారా దీపం' అనే పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే ఏడాది కె.రాఘవేంద్రర్రావు దర్శకత్వంలో వచ్చిన 'ఆమె కథ' చిత్రంలో చక్రవర్తి సంగీతంలో 'పువ్వుల నడుగు నవ్వుల నడుగు' అనే గీతాన్ని చక్కగా ఆలపించారు ఆనంద్. 1978లో 'మనవూరి పాండవులు' సినిమాలో కొసరాజు రాసిన గీతం 'నల్ల నల్ల మబ్బులోనా లక్కు పిల్లా' శైలజ గారితో కలిసి పాడటం జరిగింది. ఆ పాట కూడా సంచలనమయ్యింది. ఇంకా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ 'బంగారు కానుక' అనే సినిమాకి 'ప్రేమ బందావనం పలికెలే స్వాగతం' అనే ఓ మధురమైన గీతాన్ని ఆలపించారు. ఇవేకాక తాయారమ్మ బంగారయ్య, దానవీరశూరకర్ణ చిత్రాలకు కూడా గాత్రాన్ని అందించారు. ఆనంద్ వేల పాటలు పాడారు. వాటిలో ఎక్కువ నాలుగైదు లైన్ల బందగానాలు మాత్రమే. కానీ తన గాత్ర మాధుర్యానికి ఆ రోజుల్లో విశేషమైన ఆదరణ లభించింది. 1987లో గాంధీ నగర్ రెండో వీధి, అదే సంవత్సరం స్వతంత్రానికి ఊపిరి పోయండి, 1990లో రంగవల్లి చిత్రాలకు సంగీత దర్శకత్వం బాధ్యతలు కూడా చేపట్టారు. అలాగే కొన్ని సీరియల్స్‌కి, అనువాద చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు.
తన స్వరమాధురి ఆర్కెస్ట్రాతో దేశవిదేశాల్లో సుమారు 6500 కచేరీలు ఇవ్వడం విశేషం. ఈ ఆర్కెస్ట్రా ద్వారా ఎందరో వర్ధమాన గాయకులకు అవకాశాలు కల్పించారు. ఈ ఆర్కెస్ట్రా ద్వారా యువ గాయనీగాయకులతో 2,500 వరకు భక్తి గీతాలు చేయడం విశేషం. 'షిరిడి సాయి, ఏసుక్రీస్తు, అయ్యప్ప స్వామి మొదలగు దేవుళ్ళపై భక్తి గీతాలు ఆలపించారు. 'సాయి నామ సంకీర్తనం జన్మ తరియించు సాధనం, మనిషి కోసం మరణ మొందిన దైవ సుతునికి వందనం' లాంటి భక్తి గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయి. అయితే ఆనంద్ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదు. ఎంత టాలెంట్ ఉన్నా సినిమా రంగంలో రాణించాలంటే అదష్టం కూడా తోడు రావాలని నమ్మేవారు. సంగీత దర్శకులు కె.చక్రవర్తి సినిమా రంగంలో నాకు మంచి అవకాశం ఇచ్చారని, వారిని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని, వినమ్రంగా చెప్పేవారు. అలాగే మహదేవన్, కోదండపాణి, జి.కె.వెంకటేష్ కూడా తనను ఆదరించారని పలు సందర్భాల్లో చెప్పేవారు. వినయశీలి, మధుర గాయకులు, జి.ఆనంద్ పరలోక యాత్ర చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఎందుకంటే అజరామరమైన గీతాలను ఆలపించి తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానాన్ని పొందారు కాబట్టి.
సిక్కోలు ప్రాంతమంటే ఆనంద్‌కు మమకారం ఎక్కువ. ఏడాదికి ఒకమారు అయినా కుటుంబంతో సహా తన స్వగ్రామం వచ్చి పది పదిహేను రోజులు ఉండేవారు. పలు సందర్భాల్లో తన స్వరమాధురి ఆర్కెస్ట్రాతో వచ్చి సిక్కోలు గడ్డపై ప్రదర్శనలు ఇచ్చేవారు. సిక్కోలు బిడ్డ, మధుర గాయకుడు జి.ఆనంద్‌కు శ్రద్ధాంజలి... ఘటిద్దాం...
- పిల్లా తిరుపతిరావు
7095184846