Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది మెత్తని ప్రేమ తలపుల వాన. శ్వేత పూలవాన. ఉదయపు కిరణాలంత తాజా వాన. కవిత్వమై కురిసిన అనుభూతుల జడివాన. ఈ కవి ఆత్మయిన భావుకతను పట్టి తెచ్చే 'దూది పింజల వాన'.
కవి పెరుగు రామకష్ణ నెల్లూరు నివాసి. వెన్నెల జలపాతం (1996), పూల అమ్మినఊరు(2013), ఒక పరిమళభరిత కాంతి దీపం(2017), దూది పింజల వాన(2020) వీరి కవితా సంపుటిలు. వీరు 'నువ్వెళ్లిపోయాక' పేరుతో దీర్ఘ కవిత, 'ముంజలు' పేరుతో మినీకవిత్వం కూడా రచించారు.
ఈ కవితా సంపుటిలో కరొనా మానవ జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చెప్పే కొన్ని సంఘటనాత్మక కవితలు (మనిషే ఒక శాస్త్రం, నిశ్శబ్దపు విశ్వయుద్ధం), మానవీయ విలువలతో కూడినవి (మనిషితనం మొలకెత్తాలి), శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన దష్టి కోణంలో రాసిన కవితలు (చంద్రయానం, జాబిలిపై సూర్యోదయం), కొన్ని గజల్స్, స్మతి కవితలు (సరస్వతీనదిలా నువ్వు), భావుకతకు అద్దం పట్టే కవితలు (పులకింత, నది పుట్టుక చూసాక, దశ్యం), కాల సంబంధిత కవితలు (కాలచక్రం, కాలంలో నువ్వొక రెప్ప), వలస నేపథ్యంలో (గాయాల నదై), దేశభక్తి నేపథ్యంగా (సియాచిన్) మొదలగునవి పొందుపరిచారు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. మరచిపోకు
పుట్టినప్పుడు పేరుండదు
ఊపిరొక్కటే ఉంటుంది
పోయేటప్పుడు ఊపిరుండదు
పేరు మాత్రమే ఉంటుంది
(ఈ క్షణం మాత్రమే నీది; పేజీ 39)
ఈ వాక్యాలకు కవి తాత్వికతను ఊపిరిగా పోశాడు. ''పుట్టినప్పుడు ఏమి పట్టుకురాము పోయేటప్పుడు ఏమి తీసుకు పోము'' అనే నానుడిని మనమందరం వినే ఉంటాము. ఆ భావనను పరిపుష్టం చేసేవే ఈ వాక్యాలు. ఊపిరి శాశ్వతం కాదు పేరు ఒక్కటే అని చాటి చెప్పే ఈ వాక్యాలు గుర్తుంచుకోదగ్గవి.
2. మనిషిని మనిషిగా ప్రేమించలేని వాళ్ళు
మనిషిని ముక్కలు ముక్కలుగా
తరుగుతున్న వాళ్లు
మనిషిని నిర్మించ లేనివాళ్లు
వాళ్లు ఎవరైతేనేం?
కసువుతొట్టెలో విసిరేయాల్సిన వాళ్లు
(వాళ్ళు ఎవరైతేనేం; పేజీ 65)
ఇవి మతసామరస్యానికి ప్రతీకయిన వాక్యాలు. మనుషులను కులాలు, మతాల పేరుతో విభజిస్తున్న వాళ్లు, అన్నింటికంటే ముందుగా తమను తాము మనుషులమని గుర్తుంచుకోవాలి. మనిషిని ప్రేమించాలి మనిషిని నిర్మించాలి. మనిషిని ప్రేమించలేనివాడు ''చెత్తకుండీ'' లాంటి వాడే అన్న కవి వాక్యాలు ఈ రోజుల్లో ఇప్పటికిప్పుడు వర్తించేవి.
3. ఊపిరి కూడా కొనుక్కుంటున్నాం
శ్వాసే ఆడని భూమ్యాకాశాల మధ్య
మసిబారిన వాహనాల కీకారణ్యంలో
నిత్యం చేసుకునే పొగవాంతు ల మధ్య
చెట్లను నరికి రోడ్ల గుండెలు విశాలం చేస్తాం
ఈ వాక్యాలు స్వయంకత అపరాధమును గుర్తు చేస్తున్నాయి. మనకు మనము గానే నెత్తిన చేయి పెట్టుకుంటున్నామన్న విషయాన్ని ఆలోచింపజేస్తున్నాయి. ఊపిరినెలా కొనుక్కుంటున్నామో మనం చూడనే చూస్తున్నాం. మనముందున్న విపత్తే మానవులకు చక్కటి ఉదాహరణ. ఇప్పటికీ ఓ ఆశ చిగురిస్తుంది. మనిషి పట్ల. మానవీయత పట్ల.
4. నిత్యం నడవక పోయినా
శ్వాసను నడిపించటానికైనా నడవక తప్పదు
నిజానికి నడకే నేలకు
నువ్వు సమర్పించే విజయ గీతం
(నడక ఒక యుద్ధం; పేజీ 124)
ఈ వాక్యాలు చైతన్య పూరితమైనవి. నడకను ఒక యుద్ధంగా ప్రకటించడం చాలా ఆశ్చర్యకర విషయం. ఆమోదించాల్సిన విషయం. కవి నడకకు, శ్వాసకు ముడిపెట్టాడు. ఖచ్చితంగా మనిషి చివరి వరకు సజావుగా భూమిపై విజయకేతనం ఎగురవేయాలంటే నడక తప్పనిసరి అవసరం.
ఇంకా వీరు ఆంగ్ల అంతర్జాతీయ కవిత్వ సంకలనాలకు సంపాదకత్వం వహించారు. నెల్లూరు కవిత్వం, కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశ్వ వేదికలపైన గుర్తింపు పొందారు. చక్కని కవిత్వాన్ని సజించిన కవికి శుభాకాంక్షలు.
- తండ హరీష్ గౌడ్, 8978439551