Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణగదొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం వాడుకొన్న అతి పదునైన ఆయుధం, ఐ.పి.సి లోని అతి క్రూరమైన సెక్షన్ - సెక్షన్ 124-ఎ. ఇది రాజద్రోహ నేరానికి సంబం ధించిన సెక్షన్. దీనిలోని అంశాలను తెలివిగా ఉపయోగిం చుకొన్న ఆనాటి ప్రభుత్వం, తిలక్, గాంధీలకు జైలు శిక్షను విధించింది. భారతదేశ నేర విచారణల చరిత్రలో, తిలక్-గాంధీల రాజద్రోహ విచారణలు, ప్రాధాన్యాన్ని సంతరించుకొని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల దష్టినాకర్షించాయి.
తిలక్ విచారణ :
లోకమాన్య బాలగంగాధర్ తిలక్, కేసరి అనబడే మరాఠి వారపత్రికను పూనాలో స్థాపించి, దేశభక్తి పూరితమైన పెక్కు రచనల్ని,యీ పత్రిక ద్వారా అందించేవాడు. అది బ్రిటిష్ పాలకులకు ఆగ్రహం తెప్పించింది. అంతే- కరుడు గట్టిన సెక్షన్ 124-ఎను ఉపయోగించుకొని తిలక్ మీద రాజద్రోహ నేరం మోపింది బ్రిటిష్ ప్రభుత్వం. వాస్తవంగా, తిలక్ మూడుసార్లు యీ సెక్షన్‌కు గురయ్యాడు. మొట్టమొదట 1897లో యీ సెక్షన్ క్రింద ఆయనకు 18 మాసాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అంతటితో తప్తి చెందని బ్రిటిష్ ప్రభుత్వం 1908లో మరొకసారి యీ సెక్షన్‌ను ప్రయోగించి తిలక్‌కు ఆరు సంవత్సరాల ప్రవాస శిక్షను విధించింది. తిరిగి 1916లో యిదే సెక్షన్ కింద రాజద్రోహనేరం మోపబడ్డా, శిక్ష నుండి తప్పించుకోగలిగాడు తిలక్.
ఇక పై శిక్షల విషయా నికొస్తే 1908లో జరిగిన తిలక్ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించు కొంది.. వాస్తవంగా చెప్పాలంటే, తిలక్ రచనలు మరాఠీ వార పత్రికలో ప్రచురిం చబడ్డాయి. అయితే ప్రభుత్వం, యీ పత్రికలోని కొన్ని వ్యాసాల్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదింప జేసింది. అనువా దకులు, ప్రభుత్వానికి కొమ్ముగాచే ప్రభుత్వ- అనువాదకులు. ఈ వ్యాసాల్లో ప్రత్యేకించి రెండు వ్యాసాల్ని రాజద్రోహ నేరం మోపేందుకు అనుకూలమైనవిగా గుర్తించింది ప్రభుత్వం.
మొదటిది, 12 మే 1908లో ప్రచురించబడ్డ వ్యాసం. రెండవది 9వ జూన్ 1908 లో ప్రచురించ బడింది. ఆ రెండు వ్యాసాల ఆధారంగానే రాజద్రోహ నేరం మోపబడి తిలక్ అరెస్ట్ చెయబడ్డాడు. ఆ సందర్భంగా ఆనాటి న్యాయవాది మహమ్మద్ అలీ జిన్నా (తరువాతి కాలంలో పాకిస్తాన్ సష్టికర్త) తిలక్ బెయిల్ కోసం విశేషంగా కషి చేశాడు. తన క్లయింట్ మధుమేహంతో బాధపడుతున్నాడని- అందుకు చికిత్స తీసికొంటున్నాడని కోర్టుకు తెలియజేశాడు జిన్నా.
అంతేకాదు న్యాయపరంగా చూస్తే ఇంగ్లీష్‌లోకి అనువదిం చబడిన తిలక్ వ్యాసాల అనువాదం లోప భూయిష్టమని వాదించాడు. అత్యంత ప్రతిభా శాలియైన జిన్నా వాదనని పసలేని వాదనగా తేలుస్తూ బెయిల్ నిరాకరించాడు న్యాయ మూర్తి దావర్. ఇక్కడ విచిత్రమైన విషయమేమంటే, అప్పుడు న్యాయమూర్తిగా వ్యవహరించిన దావర్ అంతకు పదేళ్ళ క్రితం అంటే 1897లో తిలక్ పైన పెట్టిన మొదటి రాజద్రోహ నేర విచారణ సందర్భంగా తిలక్ పక్షాన వాదించి తిలక్‌కు బెయిల్ సంపాదించి పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం- 1897 ప్రాంతంలో దావర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేవాడు. తరువాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో న్యాయమూర్తిగా పదవిని పొంది- విచిత్రంగా, ఒకనాటి తన క్లయింట్‌పై కేసు విచారణకే-అంటే తిలక్‌పై రెండవ రాజద్రోహ నేరవిచారణలో 1908లో న్యాయమూర్తిగా వ్యవహరించాడు. ఇక తిలక్ కేసు విచారణకు ఒక జ్యూరీని నియమించడం జరిగింది. అన్నింటికంటే దారుణం, ఆ జ్యూరీలోని తొమ్మిది మంది సభ్యుల్లో ఆరుగురు యూరోపియన్లు, ఇద్దరు పార్సీలు, ఒకతను యూదు జాతికి చెందిన వ్యక్తి. వీళ్ళెవరికీ మరాఠి భాష పరిజ్ఞానం లేదు. అనువాదాల్ని మాత్రమే ఆధారంగా చేసుకొని తమ నిర్ణయాన్ని వెలువరించే జ్యూరీగా నియమించబడ్డారీ సభ్యులు. కేసు విచారణ సందర్భంగా తన కేసును తానే వాదించుకొన్నాడు తిలక్. అద్భుతమైన తన వాదనా పటిమతో ఇంగ్లీష్ అనువాదం తప్పుల తడక అని వాస్తవాల్ని వక్రీకరించారని వాదించాడు తిలక్. అయితే తిలక్ వాదన మెజారిటీ జ్యూరీ సభ్యులకు రుచించలేదు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నివ్వడమే వారి కర్తవ్యం. కాని తొమ్మిది మందిలోని యిద్దరు సభ్యులు మాత్రం ఆత్మను చంపుకోలేక తిలక్‌ను నిర్దోషిగా నిర్ణయించగా తక్కిన ఏడుగురు ఆయనను దోషిగా నిర్ణయించారు. ఫలితంగా జస్టిస్ దావర్, రాజద్రోహ నేరం కింద తిలక్‌కు ఆరు సంవత్సరాల ప్రవాస శిక్షను విధించాడు. ఈ సందర్భంగా కోర్ట్ తీర్పు మీద తిలక్ వెలువరించిన ప్రకటన చారిత్రాత్మకమైనదిగా వర్ణించబడింది. తిలక్ మాటల్లో ఆ ప్రకటన ''జ్యూరీ తీర్పు యేమైనప్పటికిన్నీ నేను చెప్పదలుచుకొన్నది నేను నిరపరాధిని మాత్రమేనని. అయితే అఖండ శక్తి సంపన్నమైన దైవ సంకల్పమే విధిని శాసిస్తుంది. బహుశః నా స్వేచ్ఛామయ జీవితంకంటే బాధా తప్త జీవితమే నా లక్ష్య సాధనకు ఇతోధిక దోహదం చేస్తుందని భగవంతుడు భావించాడేమో- అందుకే విధి యీ విధంగా నిర్ణయించి వుండవచ్చు''. భారతదేశ స్వాతంత్య్రానంతరం తిలక్ ప్రకటన ఒక శిలా ఫలకం మీద రూపు దిద్దుకోబడి ముంబై హైకోర్ట్‌లోని ప్రధాన హాలులో ఆవిష్కరించబడింది. విచిత్రమేమంటే ఎక్కడైతే కొద్ది సంవత్సరాల క్రితం తిలక్ విచారించబడి ప్రవాస శిక్షకు గురయ్యాడో, సరిగ్గా అదే స్థలం లోనే యీ శిలా ఫలకం ఆవిష్కరించబడింది. శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తూ ఆ సమయంలో ముంబై హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ ఎగ్లా వెలువరించిన సందేశం చారిత్రాత్మకమైనదే కాకుండా భావి తరాల న్యాయ వ్యవస్థకే మార్గదర్శకంగా మారింది. ఆ సందేశం, ఆయన మాటల్లోనే- ''దేశాన్ని ప్రేమించిన నేరానికి తిలక్ శిక్షించ బడ్డాడు. తనకన్నా తన స్వేచ్ఛకన్నా తన దేశాన్ని అమితంగా ప్రేమించాడు తిలక్. అందుకే ఆ నేరానికి శిక్షించబడ్డాడు. సోదర సోదరీ మణులారా! మన సమకాలీన వ్యక్తులు కానీ లేదా వర్తమానం కానీ మన పట్ల వెలువరించే తీర్పులు అంత ఘనమైనవేమీ కావు. అనివార్యమైన భవిష్యత్తులోని చరిత్ర యిచ్చే తీర్పుకై, మనం వేచి చూడాలి. ఇక తిలక్ విషయంలో చరిత్ర యిచ్చిన తీర్పు గతంలో తిలక్‌కు విధించిన శిక్షల్ని తప్పు పట్టింది. తిలక్‌కు విధించబడ్డ శిక్షలు, స్వాతంత్య్రమని నినదించే గొంతుల్ని నొక్కివేసి వారిలో పెల్లుబుకుతున్న దేశభక్తిని అణిచి వేసేందుకు మాత్రమే నిర్ణయించబడ్డాయి. తిలక్ చర్యలు, దేశాన్ని ప్రేమించి, దేశంకోసం పోరాడే ప్రతివ్యక్తి హక్కుకు ప్రతీకలు. అవి న్యాయ సమ్మతమైనవి. ఇక తిలక్‌కు, ప్రభుత్వం విధించిన శిక్షలు హేయమైన చర్యలుగా ముద్ర వేయబడి కాలగర్భంలో చరిత్రలోని అట్టడుగు పొరల్లో పాతర వేయ బడ్డాయి. ఇక కాల గమనంలో తిలక్ ఖ్యాతి ఆయన ప్రభావం యెంతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించింది.''
మహాత్మా గాంధీ విచారణ :
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మాత్రమే కాదు, జాతిపిత మహాత్మా గాంధీ కూడా యీ క్రూరమైన 124-ఎ. సెక్షన్ కింద రాజద్రోహ నేరం మోపబడి జైలు శిక్షకు గురయ్యాడు. ''యంగ్ ఇండియా'' అనబడే పత్రిక ఆ రోజుల్లో అహ్మదాబాద్ నుండి వెలువడేది. దానికి మహాత్మా గాంధీ సంపాదకుడు. శంకర్ లాల్ -గలాభారు అనబడే వ్యక్తి పబ్లిషర్.
మహాత్మా గాంధీ సంపాదకత్వంలోని ''యంగ్ ఇండియా'' పత్రికలో దేశభక్తి, ప్రధాన సందేశంగా రకరకాల వ్యాసాలు ప్రచురించబడేవి. అందులో ముఖ్యంగా 1921-22 సంవత్సరాల్లో ప్రచురించబడ్డ నాలుగు వ్యాసాలు బ్రిటిష్ ప్రభుత్వానికి అమితాగ్రహాన్ని తెప్పించాయి. ఫలితంగా మహాత్మా గాంధీ, శంకర్ లాల్ - గలాభారుల మీద రాజద్రోహ నేరం మోపబడి 1922లో విచారణ కొనసాగింది. ఈ నేర విచారణ ఒక ప్రత్యేకతను సంతరించుకొంది. అందుకు కారణం యీ విచారణ ఒక దేశంలోని చట్టాలకు-ఆ దేశంలోని ఒక వ్యక్తి నైతిక విలువలకు మధ్యన జరిగిన పోరాటంగా అభివర్ణించ బడింది. ముఖ్యంగా గుజరాత్ హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి షెలాత్ యీ విచారణను యీ విధంగా వర్ణించారు. ''సోక్రటిస్ విచారణను మినహాయిస్తే, మానవజాతి చరిత్రలో మానవాళి మీద యింత ప్రభావం చూపిన విచారణ మరేదీ లేదు. ఈ రెండు విచారణల్లోను, చట్టానికి, నైతికతకు మధ్యన పోరాటం సాగింది. అంతే కాదు సోక్రటీస్ గానీ, గాంధీజీ గాని, తమను విచారించిన న్యాయ వ్యవస్థ పట్ల ఒకే విధంగా ప్రవర్తించారు. తాము నమ్ముకొన్న సత్యమే చట్టం కన్న గొప్పదని యీ యిరువురూ భావించారు. అయినా చట్టం విధించిన శిక్షను యెంతో హుందాగా స్వీకరించారు.''
ఇక మహాత్మా గాంధీ విచారణ విషయంలోకి వస్తే, మార్చి 18 1922న అహ్మదాబాద్ సెషన్స్ కోర్ట్‌లో విచారణ ప్రారంభమయింది. బ్రూంఫీల్డ్ న్యాయమూర్తిగా, స్టాంగ్ మన్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విచారణ కొనసాగింది. ఆ సందర్భంగా మహాత్ముడు చేసిన ప్రకటన చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకొంది. అందులో కొంత భాగం ''నా చర్యలు మీ చట్టం దష్టిలో ఒక ఘోరమైన నేరం. కాని నా దష్టిలో మాత్రం అవి నా దేశం పట్ల ఒక పౌరునిగా నేను నిర్వహించిన నా విద్యుక్త ధర్మం. ఏదేమైనప్పిటికిన్నీ మీరు విధించే శిక్షను స్వీకరించేందుకు నేను సిద్ధంగా వున్నాను. గౌరవనీయులైన న్యాయమూర్తిగారూ! వాస్తవంగా నిర్దోషినైన నాకు శిక్షను విధించమని మీ చట్టం మిమ్మల్ని నిర్దేశిస్తున్నది. అటువంటి చట్టం కుళ్ళిపోయిందని మీరు భావిస్తే ఇక మీకున్న ఒకే ఒక మార్గం మీ ఉద్యోగానికి రాజీనామా చేయడం. లేదా మీ చట్టం ఉన్నతమైనదని- అది యీ దేశ ప్రజలకు మేలుచేసేది మాత్రమేనని అంతే కాదు నా చర్యలు దేశ ప్రయోజనాలకు హానికరమని మీరు భావిస్తే కఠినమైన శిక్షను మీరు నాకు విధించవచ్చు.'' తన ప్రకటన చదివేందుకు గాంధీజీకి 15 నిమిషాలు పట్టింది. గాంధీజీ ప్రకటన చదువుతున్నంతసేపు, ఆ తరువాత కొన్ని నిమిషాల వరకు, కోర్ట్‌లో ఒక గంభీర వాతావరణం గోచరించింది.
అయితే గాంధీజీ ప్రకటన తరువాత యెవరికీ అర్థం కాని విషయం, జరుగుతున్న విచారణలో ముద్దాయి యెవరని? బ్రిటిష్ ప్రభుత్వం ముందు గాంధీజీ ముద్దాయిగా నిలబడ్డాడా లేక భగవంతుని ముందు- మానవత ముందు, బ్రిటిష్ ప్రభుత్వమే ముద్దయిగా నిలబడిందా అన్నది యెవరికీ అర్థం కాలేదు. గాంధీజీ ప్రకటన ప్రభావం నుండి కొన్ని క్షణాల తరువాత తేరుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ కొనసాగించాల్సిందిగా న్యాయమూర్తిని అభ్యర్థించాడు. ఆయన అభ్యర్ధన ప్రకారం విచారణ జరిగి గాంధీజీకి ఆరు సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది. ఒక గొప్ప దేశ భక్తునికి-అహింసావాదికి శిక్ష విధిస్తున్న సందర్భంగా న్యాయమూర్తు బ్రూంఫీల్డ్ తీవ్ర కలవరానికి లోనయ్యాడు. అయినా నిగ్రహించుకొని అసాధారణమైన జాగ్రత్తతో గాంధీజీ పట్ల ఉన్నత-గౌరవ పదజాలాన్ని ప్రయోగిస్తూ, తన తీర్పుని వెలువరించాడు న్యాయమూర్తి. తీర్పుని ముగిస్తూ న్యాయమూర్తి బ్రూంఫీల్డ్ చెప్పిన మాటలు గాంధీజీ వ్యక్తిత్వానికి దర్పణం పడుతూ గాంధీజీ పట్ల న్యాయమూర్తికి వున్న గౌరవాన్ని తెలియజేస్తాయి. న్యాయమూర్తి మాటల్లో అవి... ''కాలక్రమ పరిణామంలో భారత ప్రభుత్వం మీ శిక్షని తగ్గించి మిమ్మల్ని విడుదల చేయగలిగితే మీ విషయంలో నా కన్నా ఎక్కువ సంతోషించే వారు ఎవరూ వుండరు.''
ఇక యిప్పుడు, స్వాతంత్య్ర భారత దేశంలో మనం రూపొందించుకొన్న ప్రజాస్వామ్య మనుగడకు, భావ వ్యక్తీకరణ స్వేచ్చ యెంతో అవసరం. భారత పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్చని అణగదొక్కే యీ క్రూరమైన ఐ.పి.సి. సెక్షన్ 124-ఎ ను శాశ్వతంగా సమాధి చేయాల్సిన అవసరం యెంతైనా వుంది. ఆ మంచి రోజు త్వరలో వస్తుందని అశిద్దాం.
- బసవరాజు నరేందర్‌రావు, 99085 16549