Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజాభాయ్ ఏం నడుస్తున్నది?
ఫ్రాడే నడస్తున్నది
తెలుసు కానీ ఇంకా ఏం నడుస్తున్నది?
ఫ్రాడే నడుస్తున్నది.
ఫ్రాడంటే మోసం. మోసం అంటే వంచన దగా!
నిజాలు నిజాలవునో కాదో తెలీదు. అబద్ధాలు అబద్ధాలే అవునో కాదో తెలీదు. నిజాలు అబద్ధాల రూపంలో అబద్ధాలు నిజాల వేషంలో. అసలు నిజమేదో అబద్ధమేదో గజిబిజి గందరగోళం.
ఒక్కటి మాత్రం నిజమైన నిజం. నికార్సయిన నిజం. నిప్పయిన నిజం.
అవును. ఫ్రాడే నడస్తున్నది.
అసలు ఈదడం అంటే తెలియని మనుషులు శవాలయ్యేక నీట్లో తేలుతున్నారు. గజ ఈత గాళ్ళల్లా ఈదుతున్నారు. ప్రవాహంలో ముందుకు ప్రవాహంతో పాటు ముందుకు ముందుకే ఎక్కడికో??! పవిత్రమై పోతున్న శవాలు.
ఎన్ని? ఎన్నో? ఎన్నెన్నో లెక్క కట్టండి. లెక్కలు రాని వాళ్ళు లెక్క పెట్టండి. లెక్కలు వచ్చీ అబద్ధాలు చెప్పే వాళ్ళు లెక్క కట్టండి. ముందు బతికున్న వాళ్ళని లెక్క కట్టండి. చచ్చిన వాళ్ళు పోను బతికున్న వాళ్ళందరినీ వరసగా నించో పెట్టండి. బతికి ఉండాల్సిన వాళ్ళంతా బతికే ఉన్నారా లేదా? లెక్కకు రాని వాళ్ళంతా లేనట్టేనా? చచ్చినట్టేనా? పోయినట్టేనా? అప్పుడు చచ్చిన వాళ్ళ సంఖ్య పెంచి బతికున్న వాళ్ళ సంఖ్య తగ్గించాలి కదా!
ఏది సత్యం? ఏది అసత్యం? ఏం నడుస్తున్నది.
అవును ఫ్రాడే నడుస్తున్నది.
జబ్బు...ప్రాణాలు తోడేసే జబ్బు.. ప్రాణాలు తీసేసే జబ్బు.. జబ్బు.. జబ్బు.. దానంతట అదే వచ్చిందా? ఎవరైనా తెచ్చారా? మళ్ళీ వచ్చిందా? తిరగ బెట్టిందా? తిరగమోత పెట్టారా? ప్రచారం వికటించి జబ్బు వొచ్చిందా? జబ్బు వచ్చిందని ప్రచారం అయ్యిందా? జబ్బు భయంగా మారిందా? భయమే ఓ జబ్బయి పోయిందా? ఊపిరితిత్తులు పొగ చూరాయా? ఆక్సిజన్ కరువయిందా? మరి చచ్చిన మనిషిని వెంటిలేటర్ ఎప్పుడు నిద్ర లేపుతుంది? లేపుతుందా? బిల్లు కట్టడం అయ్యేక లేపుకు పోతుందా? మందులేవీ కనిపించవు. నల్ల బకాసురుడి కడుపులో దాక్కున్నాయా?
డాక్టర్ 'కోటే'శ్వర్రావులందరూ 'కోటీ'శ్వర్రావులయి పోవడమేమిటి?
ఏం నడుస్తున్నది?...
అవును ఫ్రాడే నడుస్తున్నది.
వచ్చేసింది. వచ్చింది. సంజీవని. ఒకటి కాదు రెండూ మూడు వచ్చేవి వొచ్చినయి కొన్ని దారిలో ఉన్నయి వచ్చేస్తయి. అబ్భ! ఇంక అంతా శుభమే. భూగోళం ఆరోగ్యంగా లేచి కూచుంటుంది. కూచోడం కాదు లేచి తన చుట్టూ ఆను తిరగడమే కాదు సూర్యుని చుట్టూ ఉషారుగా ఉషారుషారుగా తిరిగేస్తుంది.
భూగోళం సంగతేమోకాని మన ఊరికొచ్చింది సంజీవని మనం బతికేస్తామో అని పరుగులు తీశారు జనం ఆసుపత్రికి. ప్రాణాలు అర చేతుల్లో పట్టుకుని.
అయిపోయిందయిపోయిం దయి పోయింది అన్నది ఆసుపత్రి.
ఎన్ని వచ్చేయి? ఎన్ని పోయేయి? ఎవరికిచ్చేరు? వచ్చినన్నే వచ్చాయా? వచ్చిన వన్నీ పోయేయా అయిపో యేయా? ఇవ్వవలసిన వాళ్ళకే ఇచ్చారా? తీసుకోవలసిన వాళ్ళే తీసుకున్నారా?
సంజీవనీ... ఓ సంజీవనీ.. నిజం చెప్పు! ఏం నడుస్తున్నది. లాక్డౌన్లు చెక్ పోస్టులు హద్దులు ఆంక్షలు అధికారాలు కాఖీలు లాఠీలు. వలస వచ్చిన నిర్భాగ్యు లైతేనేం, దినసరి కూలీ అయితేనేం బండీ వ్యాపారైతేనేం, బడ్డీ నడిపే వాడైతేనేం ఆకలితో చస్తే చావొచ్చు కానీ జబ్బు లెక్కలో చావడానికి వీల్లేదు.
రాజ్యాలు ఏలేటి వారు బడా బాబులు చేతుల్లో తోలు బొమ్మలు. తూచా తప్పని వాళ్ళు అధికారులు కీలు బొమ్మలు. మట్టిలో పుట్టి మట్టిలో కలిసేవి మట్టిబొమ్మలు. నిజమేదో అబద్ధమేదో అంతా గజిబిజి గందరగోళం.
రాజూభాయ్.. ఏం నడస్తున్నది?
ఫ్రాడే నడస్తున్నది.
తెలుసు కానీ ఇంకా ఏం నడుస్తున్నది?
ఫ్రాడే నడస్తున్నది!!
- చింతపట్ల సుదర్శన్, 9299809212