Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్య రంగంలో మిత్రుని రూపంలో గురువుగా తటస్థపడిన ఎడతెగని కవితా ప్రవాహం కవి కె.శివారెడ్డి. ఆ నలుగురు శిష్యులు నందిని సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, ఆశారాజు, నాళేశ్వరం శంకరం. ఈ నలుగురు నాలుగు విభిన్న నేపథ్యాలు గలవారు. వైవిద్యభరితమైన పరిసర ప్రభావంలోంచి పుట్టుకొచ్చిన వారు. విభిన్న ధోరణులతో అనేకానేక వ్యక్తిగత సమస్యలతో తమను తాము ఏ విధంగా మలుచుకొని శివారెడ్డి కవితా స్పర్శతో కవిత్వాన్ని ప్రేమిస్తూ జీవితంలో స్థిరపడుతూ కవిత్వంలో విస్తరించిన క్రమాన్ని విప్పి చెప్పిన గ్రంథం 'ఒక గురువు గారు నలుగురు శిష్యులు'' శీర్షికతో విలక్షణమైన గ్రంథాన్ని పెన్నా శివరామకృష్ణ ముందు మాటతో వెలువరించారు. చీకోలు సుందరయ్య విభిన్న ధోరణులతో అనేకానేక వ్యక్తిగత సమస్యలతో తమను తాము ఏ విధంగా మలచుకొని శివారెడ్డి కవితా స్పర్శతో కవిత్వాన్ని ప్రేమిస్తూ కవిత్వంలో తాము విస్తరించిన క్రమాన్ని నలుగురు శిష్యులు మనసు విప్పిచెప్పిన గ్రంథమిది.
''సిధారెడ్డి జీవితంలోని అనేక మలుపుల్లో శివారెడ్డి కనిపిస్తారు. ''సిధారెడ్డి మార్క్సిస్టు భావాల్ని బలంగా నమ్మి తన ప్రతి రచనలోనూ ఆ సిద్ధాంతానికి పునరంకితమవుతూ నెత్తురోడుతున్న తెలంగాణ పల్లెల్ని అక్షరీకరించారు'' అని అన్నారు రచయిత చీకోలు సుందరయ్య.
కందుకూరి శ్రీరాములు.. శివారెడ్డి గారి సన్నిహితుల్లో వున్న స్వచ్ఛమైన కవుల్లో ఒకరు. ప్రతి వస్తువును కవిత్వంలో అంతర్భాగం చేస్తూ ఒక అవిచ్ఛిన్నత, ఒక ఏక మాత్రత సాధించాడని శివారెడ్డి చేత మెచ్చుకోలు పొందాడు అని రచయిత చెప్పాడు. 'ఆశారాజు కవిత్వానికి ప్రధానశక్తి ఊహాశీలత్వం. కొత్త కొత్త ఊహలు చేయగలడు. ఉపమాలు చెప్పగలరు. ఒక ఆలోచనను అనేక కోణాల్నుంచి ప్రదర్శించడం మనం ఆశారాజు కవిత్వంలో చూస్తాం' అంటారు చీకోలు వారు. ఆశారాజు, శివారెడ్డి గురించి చెప్తూ ''ఆయన చూపించే ప్రేమలో జీవించే ధైర్యం వస్తుంది. ఆయన పలకరింపులో మృధుస్పర్శ ఉంటుంది అని చీకోలు సుందరయ్య చెప్పారని అంటారు.
కళ్ళు చెమ్మగిల్లే కవిత్వం రాయడంలో నాళేశ్వరం శంకరం అని చీకోలు సుందరయ్య ప్రశంసిస్తారు. నాళేశ్వరం శంకరం నిరాశావాద కవి కాదు. నిప్పులు గక్కే కవి. దు:ఖాన్ని దునుమాడే కవి. వస్తువును తనలో ఇంకించుకున్న తర్వాతనే అక్షరాలుగా మలుస్తాడు. కవితా ఎత్తుగడ ముగింపులోనూ తనదైన ముద్ర వేస్తాడని చీకోలు సుందరయ్య ప్రశంసిస్తాడు.
ఈ గ్రంథంలో దాపరికాలు లేని నగ సత్యాలు ఎన్నో చెప్పబడ్డాయి. శివారెడ్డి చుట్టూ కవులే, కవిత్వపు వాసనలే! ఆయనొక వర్క్‌షాప్ అని రచయిత తెలియజేస్తారు. ఇలా ఈ గ్రంథంలో ఒక గురువు, నలుగురు శిష్యులు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో, కంటతడి పెట్టించే మలుపులు ఉన్నాయి. కవిత్వపు మెళకువలు తెలుసుకునే సంఘటనలు అనేకం.
(ఒక గురువు గారు నలుగురు శిష్యులు, రచయిత : చీకోలు సుందరయ్య, పేజీలు : 268, వెల : రూ.160/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో..)
- అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417