Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది ఒక వ్యక్తి చరిత్ర అని సాధారణంగా మనం అనుకుంటాం. కానీ ససేమీరా కాదు. ఇది ప్రవహించే చైతన్యపు గతం. ఈ ప్రవాహం ఇప్పుడు వర్తమానంలోనూ కొనసాగుతుంది. అంతేకాదు రేపులోకి ఉజ్వలంగా పయనిస్తుంది. ఇవి కవితా వాక్యాలు కావు. ఆచరణను పురికొలిపే భావోద్వేగ దృశ్యమాలికలు. ఒక మహౌన్నత వ్యక్తిని నెపంగా పెట్టి తెలంగాణా చైతన్య యుత రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను కళ్ళ ముందు దృశ్యమానం చేశారు రచయితలు. 'కష్టాల కొలిమి - త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం' పేర ఆర్.శివలింగం, డా|| ముత్యం గారు రాసిన పుస్తకం నిజంగా నేటి ప్రగతిశీలురకు, అభ్యుదయ గాముకులకు ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. రచయితలిద్దరూ ఎంత శ్రమ చేశారో చదువుతుంటే అర్థమవుతుంది. శివలింగం గారు వస్తువును సమకూరిస్తే, ముత్యంగారు శిల్పం చెక్కినట్లుగా వుంది. తెలుగు ప్రాంతాలలో విస్మృత వీరుల చరిత్రను నూతన తరానికి అందించడంలో చేయి తిరిగిన చైతన్యశీలి డా|| ముత్యం గారు. రామనాథం గారి జీవితాన్ని, ఆయన జీవితంతో ముడిపడి వున్న పిండిప్రోలు, ఖమ్మం, వరంగల్లు, హైద్రాబాద్ ప్రాంతాలలోని ఆనాటి రాజకీయ, ఆర్థిక, వర్గపోరాటాల చరిత్రను, కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానాన్ని అందులో భాగంగానే ఆసక్తి గొలిపేలా వివరించారు.
సర్వదేవభట్ల రామనాథం పేరు తలవగానే ఖమ్మం, వరంగల్ ప్రాంతాలలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గుర్తుకు వస్తుంది. ప్రపంచ పోరాటాల చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ఈ సాయుధ పోరాటంలో ఇంత ప్రముఖమైన పాత్రను నిర్వహించిన, తెలంగాణ ప్రాంతంలోనే తొలి కమ్యూనిస్టు అనదగిన ముఖ్యుడి చరిత్రను విపులంగా ఈ పుస్తకం వచ్చేదాక లేకపోవడం చరిత్ర పట్ల మన అలసత్వానికి నిదర్శనం. ఇప్పటికయినా, ఈనాటి రాజకీయ భిన్నాభిప్రాయాలకు, విభిన్న మార్గాలకు అతీతంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడం అందరూ అభినందించాల్సిన విషయం.
అత్యంత సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామనాథం, వేల ఎకరాల భూమికి వారసుడిగా వుండి కూడా, శ్రామికుల, కార్మికుల శ్రేషస్సు కోసం, శ్రామికులుగానున్న దళిత, వెనుకబడిన వర్గాల కోసం అన్నిటినీ త్యజించి కమ్యూనిస్టు ఉద్యమంలోకి రావడమే కాదు, తనకు సంక్రమించిన భూమిని ప్రజలకు పంచాడు. ఛాందస సాంప్రదాయాలను విడిచిపెట్టి సామాన్య ప్రజలతో మమేకమయ్యాడు. అంతేకాదు అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. జైళ్ళకు పోయాడు. కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. శ్రామిక మహౌద్యమంలో తన వంతు పాత్రను చరిత్ర సాక్షిగా పోషించాడు.
వ్యక్తుల శక్తియుక్తులను, సామర్థ్యాలను ఉద్యమాలకందిస్తే, అవి విప్లవ చరిత్రను ఎలా లిఖిస్తాయో నిరూపించిన జీవిత రచనే ఈ పుస్తకం. ఒక నిప్పు కణిక దావానంలా ఎలా విస్తరిస్తుందో కూడా తెలిపిన చరిత్ర. పిండిప్రోలు, ఖమ్మం ప్రాంతాలలో అనేక మంది కమ్యూనిస్టు ఉద్యమ యోధుల ఆవిర్భావాన్ని కళ్ళకు కట్టిస్తుందీ రచన. ఈ నేలపై ఇప్పటికీ, అవి ఎన్ని దారులలో పయనిస్తున్నప్పటికీ విప్లవాశయంతో పని చేస్తున్న శక్తులకూ వ్యక్తులకు చైతన్య బీజ కర్తలు రామనాథం, ఆయనతో పాటు పని చేసిన వీరులే కారణం. అట్లాంటి ఒక మహత్తర ప్రేరణాత్మక చరిత్రను అందించడంలో రచయితలు సఫలీకృతమయ్యారు.
ముఖ్యంగా చరిత్ర పరిశోధక విద్యార్థులు, తెలంగాణ యువత ఈ పుస్తకాన్ని చదవాలి. ఎలాంటి త్యాగాల నేలకు వారసులమో తెలుసుకోవాలి. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన పి.ప్రసాద్ గారన్నట్లు, మాట్లాడటమే, ప్రశ్నించడమే నేరంగా పరిగణిస్తున్న తరుణంలో, ఫాసిస్టు శక్తులు తామే తెలంగాణకు వారసులమంటున్న వేళ, రాష్ట్రం ఏర్పడ్డా ఫలించని ఆశలతో, నిస్పృహలో యువత నీరసిస్తున్న సమయాన చరిత్రలోంచి నూతనోత్సాహాన్ని పొందాలి. తెలంగాణ పోరాట వారసత్వాన్ని రగిలించగల ఈ రచనను అధ్యయనం చేయాలి. ఇంత గొప్ప చరిత్రను వెలుగులోకి తెచ్చిన రాయల చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్, ఖమ్మం వారు నిజంగా అభినందనీయులు. మూడు వందల పేజీల రచనయినప్పటికీ ఎంతో ఆసక్తితో చదివింపజేసిన రచయితలు ఆర్.శివలింగం, డా|| ముత్యంలకు ధన్యవాదాలు.
(కష్టాల కొలిమి త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం, రచయితలు : ఆర్శివలింగం, డా|| కె.ముత్యం, పేజీలు : 312, వెల :రూ.200/-, ప్రతులకు : వాయిస్ ఆఫ్ న్యూ డెమోక్రసీ, మార్క్స్భవన్, 658, విద్యానగర్ 7వ లైన్, హైదరాబాద్ - 44)
- కె.ఆనందాచారి, 9948787660