Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది. న్యాయస్థానంలో న్యాయం కోసం వెళితే ఆమెకు అక్కడా అన్యాయమే ఎదురవుతుంది. అప్పుడు అనుకోని పరిస్థితులలో ఆమెకు ఒక యువ లాయర్ పరిచయం అవుతాడు. అతనో తాగుబోతు. అతని వెనకో గతం. ప్రేమించిన భార్యను పోగొట్టుకుని తాగుబోతుగా తయారయ్యి కోర్టు కి మళ్ళి రానని శపధం చేస్తాడు. అతడిని తన కేసు వాదించమని నీ లాంటి వారు కూడా లేకపోతే న్యాయస్థానంలో న్యాయం ఎలా దొరుకుతుంది? మాలాంటి వారు ఎక్కడికి వెళ్ళాలని ఆ అమ్మాయి అడుగుతుంది. అప్పుడు అతను కోర్టుకు వస్తాడు. న్యాయాన్ని గెలిపిస్తాడు. ఇది కథ... వింటుంటే ఈ మధ్య రిలేజ్ అయిన ఒక పెద్ద క్రేజీ హీరో సినిమా గుర్తుకు వస్తుంది కదా.
ఇప్పటి తరానికి గొప్ప సినిమా ఇది. కాని ఈ కథ వింటే నాకు గుర్తుకు వచ్చిన సినిమా 1993లో వచ్చిన హిందీ సినిమా ''దామినీ''. ఆ సినిమాలో లాయర్ పాత్రను కాపీ కొట్టి మరో హిందీ సినిమా లోని ఆడపిలల్లను వారి సమస్యను తీసుకుని రెండిటితో జుగల్ బందీ ఆడిన ప్రస్తుత హీరో సినిమాలో కేవలం హీరో ఎలిమెంట్ మాత్రమే ఉంది. అంటే ఆ హీరో పాత్ర తప్ప మరేమీ కనిపించని ఒన్ సైడెడ్ సినిమాని గొప్ప సినిమా అని గొప్ప హీరోయుజం అని ప్రచారం చేసే వారికి దామినీ సినిమా గురించి చెప్పాలి. ఇందులో ఆ లాయర్ పాత్రలో నటించినది సన్నీ డియోల్. ఆ పాత్ర ఇంటర్వెల్ ముందు వస్తుంది. సన్నీ డీయోల్ నటించిన సినిమాలలో ఒక చిరస్థాయి సినిమాగా నిలిచిపోతుంది దామిని. ఈ సినిమాలో అధ్బుతమైన కోర్టు సీన్లను ఎనభై శాతం కాపీ కొట్టి తీసిన ప్రస్తుత హీరో సినిమా, దామిని సినిమాలోని లాయర్ని తీసుకుని పింక్ సినిమాలోని సమస్యను తీసుకుని అల్లుకున్న కథ మాత్రమే.
దామినీలో లాయర్‌గా నటించిన సన్నీ డియోల్‌కి జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా బహుమతి లభించింది. ఈ సినిమా కథ ఈ ఒక్క లాయర్ బేస్‌గా నడవదు, ఇందులో దామినీ గా మీనాక్షి శేషాద్రి ఆమె భర్త శేఖర్ గుప్తాగా రిషి కపూర్ మర్చిపోలేని నటనను ప్రదర్శిస్తారు. ప్రతిఒక్కరు పోటిపడి నటించిన ఈ సినిమాలో అమ్రిష్పురీ నటనను కూడా కాపీ చేసారు ఇప్పుడు వచ్చిన తెలుగు సినిమాలో. దామినీ భారత దేశ సినీ చరిత్రలోనే ఒక గొప్ప స్త్రీ పాత్ర. ఈ సినిమాను రాజకుమార్ సంతోషి చాలా శ్రద్ధతో మలిచారు. ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప సినిమా ఇది.
దామినీ ఒక పేద తండ్రికి పుట్టిన రెండవ కూతురు. తండ్రి కట్నం ఇచ్చి పెళ్ళి చేసే స్థితిలో లేడని పెద్ద కూతురు తనను ప్రేమించిన ఒక మిమిక్రీ ఆర్టిస్టుతో వెళ్ళిపోతుంది. అతనో తాగుబోతు. రెండవ అమ్మాయి దామిని మంచి డాన్సర్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఆమె నైజం. అబద్దం చెప్పదు, జీవితంలో నటించదు. ఆమె నాట్యం చూసి శేఖర్ ఆమెను ప్రేమిస్తాడు. తల్లి తండ్రులను ఒప్పించి ఆమెను చూడడానికి తీసుకువస్తాడు. వారితో కూడా దామిని తమ కుటుంబ స్థితిని ఉన్నది ఉన్నట్లు చెబుతుంది. అక్క విషయం దాచే ప్రయత్నం చేస్తున్న తండ్రిని వారించి, తన అక్క ప్రేమించినతనితో వెళ్ళిపోయిందని నిజం చెబుతుంది. అలాగే వారు తాగుతున్న టీ కప్పులు కూడా పక్కింటివారివని తాము చాలా సామాన్యంగా జీవిస్తున్న వ్యక్తులమని చెప్పుకుంటుంది. ఆమె నిజాయితికి మెచ్చి శేఖర్ తండ్రి ఆమెను కోడలిగా స్వీకరిస్తాడు. ఎటువంటి హంగులు లేకుండా అత్తవారింట కూడా సాధారణంగా జీవించడానికే దామిని ఇష్టపడుతుంది. ఆమెను శేఖర్ విపరీతంగా ప్రేమిస్తాడు.
శేఖర్ తమ్ముడు రాకేష్. ఆ ఇంట్లో ఉర్మి అనే ఒక పల్లెటూరి పని అమ్మాయి పని చేస్తూ ఉంటుంది. దామినికి ఆ అమ్మాయితో చాలా స్నేహం. చిన్నదైన ఉర్మీ దామినిని అక్కా అని పిలుస్తూ ఉంటుంది. హౌలీ పండగ రోజు రాకేష్ అతని మిత్రులు విపరీతంగా తాగి ఉర్మి పై అత్యాచారయత్నం చేస్తారు. వారి చేతులలో ఉర్మీని చూసి ఆమెను రక్షించలేక దామిని భర్తను పిలుచుకువస్తుంది. కాని వారామెను రక్షించలేకపోతారు. మత్తులో రాకేష్ అతని స్నేహితులు ఉర్మీని జీప్ లో ఎక్కించుకుని ఒక నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇంట్లో వారికి ఈ సంగతి తెలిసి రాకేష్‌ని రక్షించుకునే ప్రయత్నంలో పడిపోతారు. ఉర్మీ బతుకుతుంది. ఆమెను హాస్పిటల్లో ఎవరో చేర్పిస్తే అక్కడ తనకు జరిగిన అన్యాయం చెబుతూ దామినీకి అంతా తెలుసని పోలీసులకు చెబుతుంది. దామినిని పోలీసులతో కలవకుండా కుటుంబం ప్రయత్నిస్తుంది. కాని చివరకు ఉర్మికి జరిగిన అన్యాయం తెలిసి దామిని పోలీసులకు నిజం చెబుతుంది.
దామినీ నిజాయితీ, తమ్ముడు భవిష్యత్తు, ఇంటి పరువు, పెద్ద కొడుకుగా తన భాద్యత వీటన్నిటి మధ్య శేఖర్ నలిగిపోతూ ఉంటాడు. దామిని ఇల్లు వదిలి వెళ్ళవలసి రావడం, ఉర్మి పరిస్థితి విషమం అవడం, దామినీతో నిజం చెప్పించిన పోలీ సులు కూడా ఆ మిష మీద కుటుంబం వద్ద డబ్బు లాగాలని ప్రయత్నించడం, డబ్బు ముట్టాక అంతా ఒక్కటయ్యి రాకేష్‌ని రక్షించే ప్రయత్నం చేయడం, దామినిని అడ్డు తొలగించుకోవడానికి ఆమెను పిచ్చిదాన్ని చేసి ఆమెను చంపాలనుకోవడం, పిచ్చి ఆసుపత్రి నుండి పారిపోతున్న దామినికి లాయర్ గోవింద్ కనిపించడం ఇలా కథ సాగుతుంది. ఈ లోపు ఉర్మీ హత్య జరగడం, దామినీ న్యాయం కోసం కుటుంబాన్ని, ప్రేమించిన భర్తను వదిలి చేస్తున్న పోరాటాన్ని చూసి గోవింద్ ఆమె తరపున వాదించి న్యాయాన్ని గెలిపించడం సినిమా కథ. ఈ సినిమా తరువాత ఇటువంటి కోర్టు డ్రామాలు ఎన్నో వచ్చాయి కాని అవన్నీ కూడా దామినీ సినిమా జోలికి రాలేవు దానికి కారణం నటుల నటన, ఆ పాత్రలను మలచిన తీరు.
మనిషి ఆత్మసాక్షికి మించి మరో కోర్టు లేదు అన్నది ఈ సినిమాలో ముఖ్యమైన పాయింట్. ఆత్మసాక్షికి విరుద్దంగా ప్రవర్తించలేని దామిని పాత్ర అద్భుతమైన స్త్రీ పాత్ర. భర్త పెద్ద లంచగొండి అయినా అలా వచ్చిపడే ధనంతో జీవితాలను వెల్లిబుచ్చుతున్న స్త్రీలతో నిండి ఉన్న సమాజం మనది. కాని కాపురం కన్నా, కుటుంబ గౌరవం కన్నా న్యాయం గొప్పదని దానికోసం తన సర్వస్వాన్ని ఒడ్డే దామిని లాంటి స్త్రీలు చాలా అరుదు. దామిని ఎన్నో సార్లు విపరీతమైన సంఘర్షణకు లోనవుతుంది. రాకేష్‌ని మరిదిగా అభిమానించినా సాటి స్త్రీగా ఉర్మికి జరిగిన అన్యాయాన్ని ఆమె ప్రశ్నిస్తుంది. ఒక పేద యువతిగా పుట్టి అదష్టంతో గొప్పింటికి కోడలయినా, ఆమె మరో పేద స్త్రీకు న్యాయం అందించడానికి తన జీవితాన్నే పణంగా పెడుతుంది. ఎన్నో వర్గాలలో వ్యక్తులు ఒక ఉన్నతమైన స్థితిని చేరుకున్నాక తమ తోటి వారిని మరచిపోయి వాళ్ళూ వ్యవస్థలో దోపీడీ చేసే వారి పక్షాన చేరడం చూస్తూనే ఉన్నాం. అణిచివేతను అనుభవిస్తున్న ఎన్నో వర్గాల వారిలో, సాజాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన వారు తమ తోటి వారి గురించి ఆలోచించి వారి పక్షాన నిలవడం చాలా అరదు. ఉన్నతి పొందిన తరువాత వారు దోపిడీ వర్గంతో చేరి తమ వారిపై అధికారం చెలాయించడం సమాజంలో నిత్యం చూస్తున్న విషయమే. పేదరాలయిన దామిని డబ్బున్న వారి ఇంట కోడలిగా వెళ్ళినా తన మూలాలను, తమ పేద బతుకుల నిస్సహాయతను మర్చిపోదు. డబ్బు, పెళ్ళి ఇచ్చిన హౌదాతో ఆమె గుడ్డిదయిపోదు. మరో పేద స్త్రీకి సహాయం చేయడం తన కర్తవ్యం అనుకుంటుంది. ఇది దామిని గొప్పతనం. సమాజంలో స్త్రీలు ఆచరించవలసిన విధానం. తోటీ స్త్రీలకు చేయూత అందించ గలిగిన విద్యా వంతులు, ధన వంతులు, అభిమాన వంతులైన స్త్రీల ఆదరణ ఉంటే చాలా స్త్రీ సమస్యలు పరిష్కరింప బడతాయి. కాని స్త్రీల కోసం ఆలోచించే తోటి స్త్రీల కొరత ఉన్న సమాజంలో ప్రతి స్త్రీ జీవితంలో ఒంటరి పోరాటమే చేస్తుంది.
ప్రతిచోట దామిని తన మనసు చెప్పిన మార్గంలో వెళుతూ కనిపిస్తుంది. ఆమె వేసే ప్రశ్నలలో అమాయకత్వంతో పాటు నిజాయితీ ఉంటుంది. ఒక చోట హాస్పిటల్లో జర్నలిస్టుల మధ్య
దామిని పాత్ర వేసే ప్రశ్నలు చూసి తీరాలి. అక్కడ మీనాక్షీ శేషాద్రి నటన చాలా గొప్పగా ఉంటుంది. ఉర్మి హాస్పిటల్లో తీవ్ర రక్త స్రావంతో చావు బతుకుల మధ్య ఉంటుంది. జర్నలిస్టులు ఆమెతో పాటు అత్తింటిపై కేసు వేసిన దామినిని కూడా ఫోటో తీయడానికి పోటీ పడతారు. అదో సెన్సేషనల్ కేసు కాబట్టి దాన్ని ఎవరెంతగా హైలైట్ చేస్తే ఆ పత్రిక సర్కులేషన్ అంత పెరిగి వారికి పేరు వస్తుందని వారి ఆశ. వారికి అక్కడ ఉర్మి, దామినీ స్త్రీలుగా కనిపించరు. వారందరికి అది ఒక న్యూస్ మాత్రమే ఒక స్త్రీ జర్నలిస్టు, దామిని చీర బోర్డరు సరి చూసుకొమ్మని ఫోటో సరిగ్గా రావట్లేదని కెమెరా ఫోకస్ మార్చుకుంటున్నప్పుడు ఉర్మీపై కప్పిన దుప్పటి తీసి పక్క మీద కారుతున్న రక్తాన్ని చూపించి చీర బోర్డరు కాదు ఆ రక్తాన్ని చూడమని, దామిని జర్నలిస్టులను ఎదుర్కునే సన్నివేశం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనం బతుకున్న సమాజంలోని కుళ్ళు ని బట్టబయలు చేసే గొప్ప సన్నివేశం అది.
అలాగే భార్యను విపరీతంగా ప్రేమిస్తూ, పెద్ద కొడుకుగా తన భాద్యత నెరవేర్చడానికి తపన పడుతూ నలిగిపోయే ఒక భర్తగా రిషీ కపూర్ నటన సూపర్. ఒక లవర్ బారుగా ఎంచబడిన రిషీకి చాలా తక్కువ సినిమాలలో నిజంగా నట విశ్వరూపాన్ని చూపే అవకాశం దక్కింది. అందులో దామినీ సినిమా ఒకటి. ఇందులో శేఖర్ పాత్రలోని అంతర్మధనాన్ని అతను అభినయించిన విధానం ఆకట్టు కుంటుంది. ఇక్కడ అతను దమ్ములేని మగాడిగా కనిపించరు. బాధ్యతల నడుమ నలిగిపోయే ఒక కుటుంబ వ్యక్తిగా కనిపిస్తాడు. బలహీన మనస్కుడుగా ఈ పాత్ర మిగిలిపోదు. ఎంతో నరకం అనుభవిస్తూ ఆ సమస్య కారణంగా తక్కువ హాని తన కుటుంబానికి కలగడానికి తానేం చేయాలో అని నిత్యం తపించే ఒక కొడుకు కనిపిస్తాడు. నా వరకు రిషి కపూర్లోని మంచి నటుడికి ఈ పాత్ర ఒక ఉదాహరణ అని చెబుతాను.
ఇక గోవింద్‌గా సన్నీ డియోల్పాత్ర ఎన్నో సినిమాలకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. కోర్టి రూంలో సన్నీ డైలాగులన్నీ ట్రెండ్ సెటర్లే. అప్పట్లో ఈ డైలాగులు ముఖ్యంగా ''తారిఖ్.. తారిఖ్'' అంటూ సాగే అతి పెద్ద డైలాగ్, ''ఢాయి ఖిలో కా హాత్'' అనే మాట హిందీ డైలాగులలో గుర్తుండి పోయాయి. లాయర్ పాత్రలో అమ్రిష్ పూరి స్టైల్‌ను ప్రతివాద లాయరుగా నటించే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో కాపీ కొట్టడం ఆనవాయితీగా మారింది. బాలీవుడ్లో దామిని లాంటి బలమైన పాత్రలు చాలా తక్కువ. మదర్ ఇండియా లో నర్గీస్ తరువాత అంత పవరున్న పాత్ర దామిని. మొన్న వచ్చిన తెలుగు సినిమా చూసి దామినీ సినిమాలో సన్నీ డియోల్ పాత్రను, అమ్రిష్ పురి పాత్రలు ఎంతలా కాపీ కొట్టారో తెలుసుకుని ఆశ్చర్యం అనిపించింది. అందరూ ఆ సినిమా గురించి చాలా రాసారు కాని దామిని సినిమా ప్రస్తావన ఎక్కడా లేకపోవడం బాధగా అనిపించింది. అందుకే ఈ సినిమాను ఇప్పటి తరానికి పరిచయం చేయాలని పించింది. ప్రస్తుత సినిమాలలో హీరో తప్ప మరే పాత్ర కనిపించనివ్వకుండా సినిమా తీయడం హీరోకి న్యాయం చేయడం అనుకుం టున్నట్లు కనిపిస్తుంది. కాని హేమాహేమీల మధ్య పోటీగా సాగే ఈ మూడు పాత్రల సంగమం చూసే ఒక గొప్ప సినిమా చూపిన ఫీల్ కనిపిస్తుంది.
దామినీ ఈ సినిమా ముఖ్య పాత్ర. ఇందులో లాయర్‌గా సన్నీ గుర్గుండిపోయే నటనను ప్రదర్శిస్తే, రిషీ కపూర్ ఎందరి అభిమానాన్నో చూరగొన్నారు. సినిమా అంటే ఇన్ని కాంబినేషన్స్ ఉండాలి అని అనుకున్న రోజుల నుండి హీరో తప్ప మరెవ్వరూ కనిపించని రోజులకు సినిమా వచ్చినందుకు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. దామిని చాలా ప్లాట్ఫార్మల్లో ఉంది. ఉత్తరాన ఈ సినిమాకు ఇప్పటికీ గొప్ప క్రేజ్ ఉంది. దక్షిణ భారతీయులు హిందీ వచ్చిన వారు, ముఖ్యంగా ప్రస్తుతం తెలుగు వారు చూడవలసిన సినిమా ఇది.