Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిశువుకు తల్లే ప్రథమ గురువు. తల్లి మాటలు, పాటలు, చూపులు, సైగలతో పిల్లలు వికాసిస్తారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు, ఐదు ఏండ్ల అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులు, సహచరులతో పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటారు. తాము నేర్చుకున్న విషయాలనే పిల్లలు అనుకరిస్తారు. ఎదుటి వారి మాటలను, సైగలను వారు అర్థం చేసుకుంటారు. తల్లి కోపంతో, లేదా ప్రేమతో మాట్లాడిన మాటలను పిల్లలు గమనిస్తారు. పెద్దలు తమ పట్ల అనుసరించే వైఖరిని నిశితంగా పరిశీలిస్తారు. తదనుగుణంగా తమ ప్రవర్తనను పిల్లలు మార్చుకుంటారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు సహజంగానే ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు కావున పిల్లల వికాసానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు వికాస పాఠాలు బోధించక పోవడం మన దేశంలో లోపంగా ఉంది. పిల్లల ఎదుగుదలకు ఇది అవరోదంగా ఉంది.
ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభకు సానబెట్టి దానిని సమాజ హితం కోసం తీర్చిదిద్దే పరిస్థితులను కల్పించడం చాలా ముఖ్యం.ఒక మనిషి ఎదుగులలో కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారు. సామాజిక పరివర్తన తొలి పాఠాలను పిల్లలు వారితోనే నేర్చుకుంటారు. సమాజంలో ఎవరితోనూ లేని సాన్నిహిత్యం పిల్లలకు కుటుంబ సభ్యులతోనే అలవడుతుంది. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే వరకు పిల్లలకు కుటుంబమే ముఖ్యమైన ఎదుగుదల మార్గంగా ఉంటుంది. మాతృ భాషను పిల్లలు తొలిసారిగా కుటుంబ సభ్యులతోనే నేర్చుకుంటారు. ఇతరులతో పరస్పర సహకారం, సహనం, ప్రేమ, వాత్సల్యం పెద్దలను గౌరవించడం వంటి సామాజిక బాధ్యతను పిల్లలకు కుటుంబమే నేర్పుతుంది. ఇండ్లలో ఉండే వాతావరణం పిల్లల సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. పిల్లలకు తల్లిదండ్రులు సరైన ప్రేమ, వాత్సల్యాన్ని కనబర్చనపుడు, వారి ప్రాథమిక అవసరాలను తీర్చనపుడు వారి మధ్య సంబంధాలు సరిగా లేనపుడు పిల్లల మానసిక వికాసం సరిగా జరగదు. ప్రతి శిశువు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. వేరు వేరు వాతావరణంలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం జరిగాక ఒక్కటవుతారు. ఇద్దరి అభిరుచులు, అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అందువల్లనే సాంసారిక జీవనంలో సమస్యలు తలెత్తుతాయి. ఆ సమస్యలను ఎప్పటి కప్పుడు చర్చించుకుని రాజీ మార్గాన్ని అనుసరించడమే ఉత్తమం. పిల్లల వికాసాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు తరచుగా గొడవ పడడం మానుకోవాలి. కరోనా ప్రజలకు అనేక కష్టాలను తీసుకువచ్చింది. బడులు బందయ్యాయి. పిల్లలు ఇండ్లలోనే ఉంటున్నారు. గృహిణులకు పిల్లలను పెంచడం పెద్ద సమస్యగా మారింది. పిల్లలు పాఠశాలకు వెళ్లిన సమయంలో గృహిణులు తమ వంట పనులను, ఇంటి పనులను నిర్వహించే వారు. ఇంటి సభ్యులంతా ఇండ్లలోనే ఉండడంతో వారి కోసం మహిళలు అదనంగా శ్రమించవలసి వస్తున్నది.
పిల్లల ఎదుగుదలలో కుటుంబం తరువాత పాఠశాల ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. సమాజంలో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి, ఇతరులతో సర్దుకు పోవడానికి అవసరమైన నేర్పులను, ధోరణులను, విజ్ఞానాన్ని పాఠశాల విద్యార్థులకందజేస్తుంది. పిల్లల ఎదుగుదల విషయంలో పాఠశాల తన ప్రభావాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చూపుతుంది. ఆదర్శవంతమైన ఉపాధ్యాయులను కలిగి ఉండి ఉపయోగకరమైన పాఠ్య ప్రణాళికను అనుకరిస్తే విద్యార్థుల సాంఘిక వికాసం చక్కగా జరుగుతుంది. కుటుంబంతో పాటు సమాన వయస్కుల సమూహాన్ని కూడా ప్రాథమిక సమూహంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే కుటుంబం తరువాత పిల్లల మధ్య సన్నిహితమైన, స్వేచ్ఛాయుతమైన సంబంధాలుండేది ఈ సమూహంలోనే.ప్రముఖ మానసిక నిపుణుడు డేవిడ్ రీస్మెన్ అభిప్రాయం ప్రకారం పిల్లల సామాజిక అధ్యయనంలో సమ వయస్కుల సమూహం ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. ఒకే వయస్సు, వివిధ సామాజిక అంతస్థు గల పిల్లలు ఈ సమూహంలో ఉంటారు. ఈ సమూహంలో ఇరుగు,పొరుగు ఇండ్లలోని పిల్లలు, లేదా పాఠశాలలో సహ విద్యార్థులు, ఆట స్థలాలలో కలిసే మితృలు చేరి ఉండవచ్చు. ఈ సమూహానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వీటిని పాటించడం ద్వారా సహకారం, రాజీ, సర్దుబాటు వంటి ఉత్తమ లక్షణాలు చిన్న వయస్సులోనే పిల్లలకు అలవడతాయి.పిల్లల జీవితంలో పొందే ప్రత్యేక అనుభవాలు కూడా వారి సామాజిక వికాసాన్ని నిర్ణయిస్తాయి. రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ చిన్న వయస్సులో పొందిన చేదుఅనుభవాల కారణంగానే ప్రజలకు ఉపయోగపడే అనేక రచనలను రాయగలిగారు. భావి తరాలకు ఎంతో మేలు చేశారు.
- జి.గంగాధర్ సిర్ప
సెల్ : 8919668843