Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విపరీత వ్యక్తులు టైటిల్ చూడగానే అలనాటి క్లాసిక్ నవల ''కాలాతీత వ్యక్తులు'' గుర్తుకు వస్తుంది. ఈ నవల గౌతమ్ పాత్రపైన నడుస్తుంది. గౌతమ్ చుట్టూ ఉన్న వాతావరణం, ప్రజలు, వారి ఆవేశకావేశాలు, వారి అభిప్రాయాలు, జీవన శైలి, భుక్తి కోసం, గుర్తింపు కోసం పడుతున్న పాట్లు వాటిల్లో తన జీవిత కాలంలో చూసిన మార్పులు - చేర్పులు, తన మీద ప్రభావం చూపించిన పలు అంశాలు చర్చిస్తూ ఈ నవల నడుస్తుంది. పలు సన్నివేశాల్లో మానసిక సంఘర్షణ ఉంటుంది. ప్రాపంచిక దృక్పథానికి మనుషుల మనస్తత్వాన్ని జోడిస్తూ సాగిన ఈ నవల వినూత్నంగా ఉంది. ఒక సాధారణ రైతు అబ్రహం కొడుకు గౌతమ్. అతని భార్య మేరి. వీరికి రాహుల్ అనే కొడుకు. భార్య, పుత్రుడు గౌతమ్‌ను వదిలి వెళ్ళిపోతారు. తండ్రి అబ్రహాం కొడుకు గౌతమ్‌తో సంసారాన్ని పలుసార్లు చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు. తండ్రిగా అబ్రహాం పాత్ర హుందాగా సాగుతుంది. గౌతమ్‌కు సాహిత్యం, కళలు, రాజకీయాలు, సంగీతంపై పట్టు ఉంటుంది. రాయుడు, నయన, రాజా అనే మిత్రులు గౌతమ్‌కు సన్నిహితంగా ఉంటారు. కొన్ని సాహిత్య సభలు నవలలో అంతర్భాగంగా వస్తాయి. రాయుడుతో కలిసి తాగడం, కాశీలో గంజాయి సేవించడం... భార్య పిల్లాడిని ఇల్లు వదిలి కలకత్తా, కాశీ లాంటి ప్రాంతాలు గౌతమ్ తిరగడం.. సాధారణ పాఠకులకు ఆ పాత్రపై ఎలాంటి గౌరవం, అభిమానం ఏర్పడవు. ముగింపులో ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలైన గౌతమ్‌ను భార్య మేరి, కొడుకు రాహుల్ కలుసుకుంటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న డా|| లూకాస్ మాటలు నిజమే కదా!!
హ్యుమానిజం, బుద్ధిజం, కమ్యూనిజం, వేర్వేరు దృక్పథాలు... వీటిని కొన్ని పాత్రల్లో చొప్పించి నవనీకరించాం అనుకోవడంతో ఆకట్టుకోలేదు. నవల నిరాశ పరిచింది. సాధారణ తెలుగు నవల స్థాయిలోనే ఆసాంతం సాగింది. అనీల్ అట్లూరి, దాట్ల దేవదానం రాజు, కవిమిశ్రీ లాంటి సాహితీ వేత్తలు ముందు మాటలు.. ఆ నవల గురించి క్లుప్తంగా పరిచయం చేస్తాయి.
(విపరీత వ్యక్తులు, రచయిత : పి.చంద్రశేఖర్ ఆజాద్, పేజీలు : 112, వెల : 120/-, ప్రతులకు పి. చంద్రశేఖర్ ఆజాద్, ఫ్లాట్ నెం. 909, మై హౌం జువెల్, మదీనా గూడ, మియాపూర్, హైదరాబాద్ - 049, సెల్ : 9246573575)
- తంగిరాల చక్రవర్తి, 9393804472