Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తస్వీర్ బనాతాహూ తస్వీర్ నహీ బస్ తీ''
''లాగే చూటేనా అబ్ తో సనమ్''
''దోబదన్ ప్యార్ కె ఆగ్ మె జల్ గయె''
''నతుమ్ హమే జానో న హమే తుమే జానో''
అత్యంత జనాదరణ పొందిన ఈ హిందీ సినిమా గీతాలు పాడిందెవరో చాలా మందికి తెలుసు. తలత్ మొహమూద్, మహ్మద్ రఫీ, హేమంత్ కుమార్ అని. కానీ ఏ హీరో పై చిత్రీకరించారో చాలా తక్కువ మందికే తెలుసు. ఆ హీరో చంద్రశేఖర్. మన హైదరాబాదీ. ఆశ్చర్యపోతున్నారా? అవును చంద్రశేఖర్ మన హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు. ఈ నెల 16న ముంబైలో తన తొంభై ఎనిమిదవ యేట కన్నుమూశారు.
అవి 1940 నాటికి హైదరాబాదు స్టేట్ విమోచనోద్యమం ఊపందు కుంటున్న రోజులు. ఎవరో నిజాం నవాబు కారుపై బాంబు విసిరారు. అంతే కనిపించిన వారిని కనిపించినట్లే అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు, ముఖ్యంగా యువకులను. ఈ భయంతో నగరంలోని యువకులంతా దిక్కుతోచిన చోట్లకుపోయి తలదాచుకోవడం మొదలుపెట్టారు. చంద్రశేఖర్ కూడా నిజాంకు వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నాడు. పోలీసుల నుండి తప్పించు కోవడానికి సినిమాల్లో ట్రై చేస్తే పోలా అనుకుని మద్రాసు వెళ్లాడు. ఆ తరువాత బెంగుళూరు వెళ్లాడు. ఎక్కడా అవకాశాలు రాలేదు. తిరిగి హైదరాబాదు వచ్చి బతుకుదెరువు కోసం ఏవేవో పనులు చేశాడు. కానీ సినిమాల్లోకి రావాలనే కోరిక అతన్ని వీడలేదు. హైదరాబాదులో ప్రదర్శితమైన ప్రతి మూకీ సినిమా చూసిన చంద్రశేఖర్ టాకీలు వచ్చాక రూబీ మేయర్ సులోచన, మాస్టర్ నిస్సార్, జుబేదా, పథ్వీరాజ్ కపూర్ వంటి హేమా హేమీలు నటించిన తొలి దశకం నాటి టాకీలు విడవకుండా చూసేవాడు. వీటికి తోడు చంద్రశేఖర్‌ను హిందీలో అదష్టం పరీక్షించుకొమ్మనే మిత్రుల ప్రోత్సాహం. ఇక బొంబాయి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 1942లో బొంబాయి వి.టి. స్టేషన్లో తన పెట్టేబేడాతో దిగాడు కూడా. 40 ఏండ్ల తరువాత ఒక రోజు హిందీ సినిమా తొలితరం సూపర్‌స్టార్ మాస్టర్ నిసార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన రోజుల్లో షూటింగ్లో పాల్గొని బయటికి రాగానే ఆయనపై కరెన్సీ నోట్లు విసిరి తమ అభిమానాన్ని చాటుకునే వారు. అంత గొప్ప హీరో చివరి రోజుల్లో ముంబాయిలోని హాజీ అలీ దర్గా వద్ద భిక్షాటన చేసి పొట్ట పోసుకున్నాడు. చివరికి ఇంట్లో నయా పైసా లేని స్థితిలో కన్నుమూశాడు. చివరి చూపులు చూడటానికి వచ్చిన వాళ్లంతా అంత్యక్రియల కోసం తలా ఇంత చందాలు వేసుకుంటున్నారు. అంతలో అక్కడికి కార్లో వచ్చిన చంద్రశేఖర్ తక్షణమే చందాల వసూలు నిలిపివేసి స్వంత ఖర్చులతో జరగవలసినవన్నీ జరిపించాడు. అంత గొప్ప ఔదార్యాన్ని చూపే స్థాయికి ఎదిగిన ఆయన సినిమా ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం.
బొంబాయి వచ్చిన తొలిరోజుల్లో దాదాలోని ఫుట్‌పాత్‌పైనే గడిపిన చంద్రశేఖర్ అష్టకష్టాలు పడ్డాడు. అక్కడే తనకు కొందరు మధ్యప్రదేశ్‌కు చెందిన మిత్రులు పరిచయమై వారితో బాటే కలిసుండేవాడు. రోడ్డు పక్కనే రాళ్లతో పొయ్యినేర్పాటు చేసుకుని వంట చేసుకునేవారు. రోజూ దాదార్‌లోని స్టూడియోల చుట్టూ ఏదైనా వేషం దొరుకుతుందాని తిరిగేవాడు. ఒక రోజు ఓ జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ వచ్చి హీరోను చేస్తానని చెప్పి తీసుకెళ్లి ఎక్స్ట్రా నటుల బందంలో కూర్చోబెట్టాడు. అది దిలీప్ కుమార్ మొదటి చిత్రం ''జ్వార్ భటా (1944)''. మొదటి రోజు షూటింగ్‌లోనే మనవాడి ఒడ్డూ పొడుగూ చూసి నీవు ఎక్స్ట్రాలో ఏమిటీ, నీ అందానికి డిసెంట్ ఎక్స్ట్రాలో చేరిపోవాలన్నారు. ఆ రోజుల్లో ఎక్స్స్ట్రాకి రోజుకి రూపాయిన్నర ఇస్తే, డిసెంట్ ఎక్స్స్ట్రాకి 8, 9 రూపాయలు ఇచ్చేవారు. 1945 నాటికి షాలిమార్ ఫిలిం కంపెనీ (పూనా)లో నెలకి 70 రూపాయల జీతంతో కుదిరిపోయాడు. అక్కడే భరత్ వ్యాస్, రామానంద సాగర్, భరత్ భూషణ్ వంటి వారితో పరిచయమేర్పడింది. ఇక్కడే రంగీలా రాజస్థాన్ 1949లో మొదటి హీరో భరత్ భూషణ్, రెండో హీరోగా చంద్రశేఖర్ చేశాడు. మొదట అక్కడే షంషాద్ బేగంతో కలిసి కోరస్‌గా గొంతు కలిపాడు. ఇంతలో షాలిమార్ కంపెనీ నుండి బయటికి రావలసి వచ్చింది. శ్యామ్ వంటి పెద్ద హీరో షాలిమార్‌ని వదిలేశాడు. మళ్లీ కథ మొదటికి వచ్చింది. బొంబాయి వచ్చి దాదాలో స్టూడియోల చుట్టూ చక్కర్లు కొట్టక తప్పలేదు. ఆయన మిత్రుడు ఎస్.ఏ. ప్రేమ్ తీసుకెళ్లి రాజ్‌కమల్ కంపెనీలో నెల జీతానికి కుదిర్చాడు. అంతే బతుక్కి భరోసా ఏర్పడింది. రాజ్కమల్లో సెలక్షన్లలో పాల్గొంటున్నప్పుడు కేశవరావ్ దాతే పక్కనే ఉన్న షంషాద్ బేగం ఆయనను చూసి ఇతను బాగా నటించడమే కాదు... పాడతాడు కూడా. మనకు పనికి వస్తాడు ''సెలక్ట్ కరో'' అని రికమండ్ చేసింది.
అప్పుడే రాజ్‌కమల్ వారు తీసిన 'అప్నాదేశ్' (1949- తమిళంలో ''నమ్ నాడ్'') ఎవరో నటుడు బాగా చేయలేకపోతే కేశవరావ్ దాతే ఆ వేషానికి చంద్రశేఖర్‌ను సూచించాడు. మనవాడు సింగిల్ టేక్‌లో ఓకే చేసేశాడు. అంతే శాంతారాం తన తర్వాతి చిత్రం ''సురంగ్''లో ఇద్దరు హీరోల్లో ఒకడిగా ఎంపిక చేశాడు. హీరోయిన్ షీలా రమ్మాని. చంద్రశేఖర్ ది గని కార్మికుడి వేషం. అద్భుతంగా పండించాడు. సినిమా బాగా ఆడింది. మనోడికి వేషాలు వరుస కట్టినవి. శాంతారాంతోనైతే చాలా మంది మిత్రులు, సెన్సార్ బోర్డు మెంబర్లు ''సురంగ్''లో చంద్రశేఖర్ పాత్ర పోషణ చూసి ''ఈ ఒరిజినల్ గని కార్మికుడిని ఎక్కడ పట్టుకొచ్చా రండి'' అనడిగేశారు. అదీ ఆయన గొప్పతనం. సినీ పత్రికలన్నీ చంద్ర శేఖర్ గురించి గొప్పగా రాశాయి. ''స్టార్ ఈస్ బోర్న్'' అని. సురంగ్ (1953) సమయం లోనే ''ఫర్మాయిష్'' కూడా వచ్చింది. 1954లో విడుదలైన ''ఔరత్ తేరి యహీ కహానీ'' లో భరత్ భూషణ్‌తో బాటు మరో హీరోగా చేశాడు. ఈ సినిమాకు బి.కె.సాగర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు.
''బారాదరి (1955)''లో అజిత్‌తో పాటు చంద్రశేఖర్ కూడా మరో హీరో. తలత్ మొహమూద్ పాడిన ''తస్వీర్ బనాతాహూ'' పాటను ఇందులోనే చంద్రవేఖర్పై చిత్రీకరించారు. మల్టీ స్టారర్ చిత్రం ''బాగీసిపాహి (1958)'' లో మధుబాల - రంజన్, ఓంప్రకాష్‌లతో చాటు చంద్రశేఖర్ కూడా ముఖ్య భూమికను పోషించాడు. దానికి ముందు తీసిన రూప్ కుమార్, ''పన్నా'', ''బజ్ రంగ్ బలి'', ''బసంత్ బహార్ (1956)'' చిత్రాల్లో రెండో హీరోగా నటించాడు.
'సురంగ్' చంద్రశేఖర్ సినీ జీవితాన్ని మలుపు తిప్పితే ''కాలీటోపీ లాల్ రుమాల్ (1959)'', మైలురాయిగా నిలిచిపోయింది. షకీలా హీరోయిన్. సూపర్ హిట్ చిత్రంగా ఆడింది. ''మస్తానా (1954)''లో మోతీలాల్, నిగార్ సుల్తానాతో కలిసి పని చేశాడు. ''భలా ఆద్మి(1958)''లో శేఖర్‌తో అనితా గుహ హీరోయిన్గా నటించింది. తరువాత ''హమ్ దివానే సచ్చే కా భోలా బాలా'', ''మినార్'', ''బర్సాత్ కి రాత్'' ఒకదాని తరువాత ఒకటి చంద్రశేఖర్‌ని హీరోగా నిలబెట్టాయి. అయితే శాంతారాం వద్ద పని చేస్తున్నప్పుడే ఎడిటింగ్, డైరెక్షన్, స్క్రిప్టు వర్క్ విభాగాల్లో శిక్షణ పొందడంతో పాటు, తాను స్వంతంగా సినిమా తీయా లని నిర్ణయించుకున్నాడు. ఆర్.చంద్ర, భరత్ భూషణ్, చంద్రశేఖర్ ముగ్గురూ ప్రాణ మిత్రులు. అంతకు ముందే స్వంత నిర్మాణ సంస్థల నెలకొల్పుకుని స్థిరపడి పోవాలను కున్నారు. అనుకున్నట్లుగానే భరత్ భూషణ్ 'దూజ్ కా చాంద్' తీస్తే ఆర్.చంద్ర ''నయీ ఉమర్ కి నయీ ఫసల్' తీశారు. చంద్రశేఖర్ రైటర్, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరోగా తీసిన సినిమా ''చాచాచా'' (1964). హిందీ చిత్రరంగంలో ఒక సంచలనం. ఒక సాధారణ బాలీవుడ్ హీరో తీసిన మ్యూజికల్ హిట్‌గా నిలిచిపోయింది. ఎక్బాల్ ఖురేషి (ఇతనూ హైదరాబాదీనే) సంగీతంలో నీరజ్ రాసి ''సుభాన ఆయే - షామ్ న ఆయే'', ''వో తుమ్ న థే - వో హమ్ న థే'' పాటలు మారు మోగిపోయినవి. సినిమా అంతా తయారయ్యాక అప్పటికే రికార్డయిన ముగ్దుం ''ఎక్ చమేలీకీ మండ్వే తలే'' పాటను రాజ్ ఖోస్లా సలహా మేరకు సలీం అనార్కలి కాస్ట్యూమ్స్ తో షూట్ చేసి జత చేశారు. హిందీ సినిమాను ఒక ఊపు ఊపింది. ''చాచాచా''. హీరోయిన్ హెలెన్ ధనవంతుల పిల్ల. సెలవుల్లో కాశ్మీర్ వెళ్లిన తను అక్కడ పేదవాడైన హీరో చంద్రశేఖర్ ప్రేమలో పడుతుంది. లో బడ్జెట్ సినిమా నెల రోజుల్లోనే పూర్తి చేశాడు. అది ఈస్ట్‌మన్ కలర్ చిత్రాల కాలమైనా, నలుపు - తెలుపుల్లో తీసి సక్సెస్ సాధించడం చంద్రశేఖర్ ప్రతిభకు నిదర్శనం.
చాలా మంది యాక్టర్, రైటర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా మొదటి వ్యక్తి మనోజ్‌కుమార్ అంటారు. కానీ చంద్రశేఖరే ఆద్యుడు. విభిన్నంగా మెడలు విరుస్తూ డాన్స్ చేసిన షమ్మీ కన్నా ముందుగా ''చాచాచా'' డాన్స్‌తో బాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిందీ మన చంద్రశేఖరే. 'చాచాచా' వచ్చిన తరువాతనే షమ్మీ కపూర్ ''తీస్త్రీ మంజిల్ (1966)'' తదితర చిత్రాలు వచ్చిన విషయం ఇక్కడ గమనార్హం. 23 కేంద్రాల్లో విజయవంతంగా శతదినోత్సవం చేసుకున్న చాచాచా చంద్రశేఖర్‌ను బహుముఖ సినీ టెక్నిషియన్‌గా నిలబెట్టింది. ''చాచాచా'' విజయోత్సాహం తో తీసిన మరో చిత్రం ''స్ట్రీట్ సింగర్ (1966)''. వీధి బాలల జీవితాలను కథాంశంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా కమర్షియల్‌గా ఫెయిలయినా పలు అవార్డులే గాక జాకీర్ హుస్సేన్, ఇందిరాగాంధీ వంటి ఎందరో దేశ నాయకుల ప్రశంసలందుకున్నది. ఈ చిత్రం తరువాత నాలుగేళ్ల పాటు ఏ చిత్రంలోనూ నటించని చంద్రశేఖర్ తాను అంతకుముందే నెలకొల్పిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇతర అనుబంధ సంఘాల నిర్వహణలో మునిగిపోయాడు. 1950ల నాటికి తరచూ నిర్మాతలు నటీనటులు, టెక్నీషియన్లు పరస్పరం వివాదాలతో సినిమా షూటింగ్‌లు రద్దయ్యేవి. వీటిని దగ్గరగా గమనించిన చంద్రశేఖర్ అటు నిర్మాతలకు, టెక్నీషియన్లకు నష్టం లేని పరిష్కారాలు చూపి ఫిలిం ఫెడరేషన్ భూమికను ఇండిస్టీలో కీలకం చేశాడు. దాంతో షూటింగ్‌లు ఆగడం, సమ్మెలు, చెల్లింపుల నిలిపివేతలు అనేవే లేకుండా పోయినవి. న్యాయస్థానాలు చూపలేని పరిష్కారాలు చూపడం చంద్రశేఖర్ ప్రత్యేకత. ''నూతన్'' కేసులో చంద్రశేఖర్ పరిష్కారాన్ని చూసి బొంబాయి హైకోర్టు గొప్పగా ప్రశంసించింది. ఆ తరువాతే మహారాష్ట్ర ప్రభుత్వం మనవాడికి స్పెషల్ మెజిస్ట్రేట్ సూదానివ్వగా మూడేళ్లు ఆ పదవిలో కొనసాగి స్వచ్ఛందంగా వైదొలిగాడు. కార్మిక నేతగా భారత ప్రతినిధి హెదాలో జెనీవా వంటి విదేశాల్లో పర్యటించాడు.
హీరో పాత్రలు విరమించుకున్న తరువాత 1970లో శక్తి సామంత ''కటీపతంగ్''లో కారెక్టర్ యాక్టర్‌గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చంద్రశేఖర్ ''హమ్ తుమ్ ఔర్ వో, హల్చల్ (1971), కోషిష్, పరిచరు (1972), నఫ్రీత్, దర్మా (1973), అపరాధి, దోఫూల్ (1974), సన్యాసి (1975), దఫా 302 (1975), బేకసూర్ (1980), బర్సాత్ కి ఏ రాత్ వంటి వందకు పైగా చిత్రాల్లో నటించాడు.
మరోవైపు కారెక్టర్ రోల్స్ చేస్తూనే రామాయణ్, మహాభారత్, పరివర్తన్, కమాండర్ వంటి టీవీ సీరియల్స్ లో నటించిన చంద్రశేఖర్ చివరి చిత్రం ''ఖాఫ్'' (2000) యోధానుయోధులకే అసాధ్యమైన హిందీ సినీరంగంలో ఏడు దశాబ్దాలు తనదైన శైలిలో ఉనికిని నిలుపుకుని మచ్చలేని జీవితాన్ని గడిపిన చంద్రశేఖర్‌ను బొంబాయిలో సత్కరించని సంస్థ లేదు.
1923 జూలై 7న హైదరాబాదు పాతనగరంలో జన్మించిన మన చంద్రశేఖర్ హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని చివరి వరకు తెంచుకోలేదు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావుతో ఆయనకు దగ్గరి స్నేహం. ఇంకా మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య, నటుడు ప్రభాకర్‌రెడ్డి, సినీ గోయర్స్ బి.కిషన్లతో ఆయనకు మంచి స్నేహం ఉండేది. దిలీప్‌కుమార్ తర్వాత హిందీ సినిమా రంగంలో అత్యధిక కాలం కొనసాగిన ఏకైక నటుడు గండి చంద్రశేఖర్.ఆయన మరణం హిందీ తెరకు, తెలంగాణాలోని సినీ అభిమానులకు తీరని లోటు.
- హెచ్.రమేష్ బాబు
సెల్: 7780736386