Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడయితే ఉమ్మడి కుటుంబపు / గూడు చెదిరిందో
మహిళ భద్రత ఎడారిలో / మంచు ముద్దయి పోయింది
అన్న వాక్యాలతో ప్రారంభించిన కవిత మనిషి ఆంతర్యం. మాతృదేవతనీ విస్మరిస్తోంది / సహనంలో సీతాదేవిలా శ్వాసిస్తావో / వీరనారిగా విశృంఖలతపై విరుచుకు పడతావో నీ ఇష్టం అంటూ ముగుస్తుంది. ఇంతకంటే ఒక మహిళకు, సమాజంలో ఒక (సింహ) భాగమైన మహిళ ఇతరులకు ధైర్యం ఏం చెప్పగలదు.
పైన చెప్పిన కవిత ఎస్.సుమిత్రా దేవి గారి నైవేద్యం కవితా సంపుటి లోనిది. ప్రస్తుతం సమాజం ఒక నైరాశ్యపు భావనలో ఉందంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడేం కావాలో ఏం చేయాలో కవయిత్రి స్పష్టంగా చెప్పింది. ''ఇప్పుడు ప్రవహించే చైతన్యం కావాలి. జనజాగృతికి జీవం పోసే దివ్య హస్తాలు కావాలి.. స్వార్థాన్ని తుత్తునియలు చేసే విజృంభణ కావాలి. విశ్వవ్యాప్తమై సాగే శాంతి గీతం కావాలి అంటూ ఉత్తేజపరుస్తుంది.
సుమిత్రాదేవి గారి కవిత్వం అంతా సమాజానికి హితం చెప్పే విధంగా సాగుతుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయిని అయిన ఆమె కవిత్వంలో ఎన్నో హితోక్తులు ఉన్నాయి. వస్తు వైవిధ్యం సూచించే కవితలు కొన్ని ఉదహరిస్తాను. ''నీ బిడ్డ నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఇచ్చిన ప్రేమకు అది బదులు / వాడు నిన్ను ద్వేషిస్తుంటే నీ నిరాదరణ నీకు తిరిగి యిచ్చేస్తున్నాడు (ఆలోచించండి)
''ఒక్క క్షణం వినండి'' అనే కవితలో ఇలా అంటారు ''ఉదయాన్నే మేతకు పోయే పక్షుల్లా, చీమల బారుల్లా, సాగే స్త్రీ ప్రస్థానం, ఆఫీసుల నుండి రాజకీయాల దాకా, ఇంతింతై విశ్వమంతై, కేర్సెంటర్లలో గుండె సడిని వదలి వృద్ధాశ్రమాల్లో బాధ్యతల బరువును విడిచి, ఇంటి మందిరాన్ని, చీకటి గుహను చేసి, ఏమీ లేని ఆమెగా విధుల బలిపీఠానికి, కూపస్థమండూక స్థితి నుంచి బయలు దేరుతున్న స్త్రీలను గురించి చెపుతూ వాళ్ళకు ఏం కావాలో, ఏం చేయాలో కూడా చెపుతుంది.
''మాకు ఏ అందలాలూ వద్దు, సంస్కార సమాజపు తాళం చెవి, మా వద్దనే ఉండిపోయింది, ఒక్క అవకాశం ఇవ్వండి, గుక్కపట్టిన శైశవానికి, మమతల ఊపిరిపోయాలి, చీకటి నిండిన బాల్యానికి, నవ్వుల వెలుగులు అద్దాలి'' అంటూ వారికేం కావాలో కూడా చెపుతున్నది. ''సర్వ శక్తులను, ఆశ్రితులకు అంకితం చేసి, అతివ ఆశించేది కేవలం చిటికెడు చిరునవ్వు, పిడికెడు ఆనందం'' యివ్వమంటుంది.
ఇంతటి ఆర్ద్రత, గాఢత, కలిగిన కవిత్వమే కావాలి ఇప్పుడు. దాదాపు ఎనభై కవితలున్న ''నైవేద్యాన్ని'' పఠితలకు పరిచయం చేయాలంటే మళ్ళీ అదొక గ్రంథమవుతుంది. ఈ పుస్తకం వెలువరించిన సుమిత్ర గారికి ధన్యవాదాలు.
(ప్రతులకు : యస్.సుమిత్రాదేవి, ఇం.నెం. 3-2-162, విద్యానగర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - 507101. సెల్ : 7207550867)
- తాటికొండాల నరసింహారావు
సెల్ : 9885787250