Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు. ఎట్లా బతికేదిరో అని వాపోయేడు వామన్‌రావు. బతకాలనే బట్టకట్టాలని ఎవడికుండదు. వామనరావుకు కూడా బతకాలన్న ఆ ఒక్కటీ దొరకడం లేదు. అది దొరికితే కదా ఓ పూట తినీ ఓ పూట నీళ్ళు తాగీ బతకొచ్చు.
ఆ ఒక్కటీ డబ్బులుంటే దర్జాగా కొనుక్కుని కాలర్ ఎగరేయవచ్చు కానీ డబ్బుతో ఆ ఒక్కటీ కొనే శక్తి వామనుడికి లేదు మరి. పిచ్చెక్కినట్టయ్యింది. వామన్రావుకి దాని కోసం తిరిగీ తిరిగీ కాళ్ళఇjక చెప్పులున్నయి కనక అవి అరిగిపోయినయి. ఒకటి ఎలాగో దొరికింది. రెండవది గగన కుసుమం అయింది.
ఏం చెయ్యాలో తోచలేదు. ఈ లోకంలో డబ్బున్నవాళ్ళే అన్నీ కొనుక్కు బతుకుతారు, ఆ ఒక్కటి కూడా. తను కొనలేడు ఆ ఒక్కటీ!
భయంతో బాధతో దిగులుతో నిద్ర పట్టడం లేదు వామన్రావుకి. పీడకలలు పీక పట్టుకుంటున్నవి. మెదడు ఆలోచనల కీకారణ్యంగా మారింది.
ప్రాణం ఖరీదు ఎవరు చెప్పగల్రు. పది లక్షలు పోసినా పేషెంటును శవంగా మార్చి ప్యాక్ చేసి పంపిన డాక్టర్‌ను నిలదీశారు బంధువులు. నేను డాక్టర్ని, దేవుణ్ణి కాను. మా ప్రయత్నం మేం చేశాం అన్నాడు డాక్టర్. ఘొల్లుమంటూ వెళ్ళిపోయేరు జనం వాళ్ళ వెనక శవం.
వామన్‌రావు ఆ పక్కనే నిలబడున్నాడు చేత్తో కత్తి పుచ్చుకుని. ఎదురుగ్గా ఎవడో వచ్చాడు ఎదుర్రొమ్ము విరుచుకుని. మంటెత్తిపోయేడు వామన్‌రావు. కత్తి వాడి కడుఉలో గుచ్చి ప్రేవులు బయటకులాగి వికటాట్టహాసం చేశాడు. పోలీసులు రానే వచ్చారు. చేతులకి బేడీలు వేస్తుంటే ఆ డాక్టరు చంపితే వేయలేదేం బేడీలు అనడిగాడు అక్కసుతో.
డాక్టర్లకు ఎవరినైనా చంపే హక్కుంది. లక్షలు తీసుకుని మరీ లక్షణంగా చంపి సారీ అని చచ్చినోడి మీద తెల్లగుడ్డ కప్పవచ్చు. నీకు లైసెన్సు లేదు. నువ్వు చావడం తప్ప చంపడానికి లేదు అంటూ వామన్‌రావును ఈడ్చుకుపోయారు పోలీసులు.
అరే! ఇక్కడికెల్లా వచ్చాను అనుకున్నాడు వామన్‌రావు. ఇక్కడ చాల చలిగా ఉందే అనుకుంటూ ఒణుకుతూ చుట్టూ చూశాడు తెల్లటి కొండలు మంచు కొండలు. అక్కడ ఒంటికాలు మీద నిలబడి కొందరు బాసింపట్టు వేసుకుని కొందరు ముక్కులు మూసుకుని కొందరు కనపడ్డారు. 'ఎవరు మీరు ఋషులా, మునులా, సన్యాసులా' అనడిగాడు వామన్‌రావు. ఎవరమూ కాదోయి మనుషులమే మామూలు మనుషులమే. బతకాలనే కోరికతో ఇక్కడిదాకా వచ్చి తపస్సు చేస్తున్నాం అన్నారు వాళ్ళు. ఈ చలికి గడ్డకట్టుకుపోతారు అయినా బతకడానికి తపస్సేమిటి? అన్నాడు వామన్‌రావు విసుగ్గా.
నీకు తెలీదా? దాని కోసం. ఆ ఒక్కటీ కోసం. డబ్బులున్న వాళ్ళు భేషుగ్గా కొనుక్కుంటున్నారు. ఆ ఒక్కటీ కాని మా దగ్గర డబ్బుల్లేక ఒక్కటీ కోసం యిలా వచ్చి తపస్సు చేస్తున్నాం. ఉచితంగా యిస్తానన్నవాడు చేతులెత్శేఆడు పైవాడన్నా యిస్తాడేమోనని వచ్చాం. రెండవ దాని కోసం గిలగిల్లాడుతున్నాం.
మీ పిచ్చి గానీ ఈ కలియుగంలో దేవుడు ప్రత్యక్షం అవడు. రంభా ఊర్వశులు మీ తపోభంగానికి ఇటు వైపు రానేరారు గడ్డ కట్టుకుపోతామన్న భయంతో. ఆ ఒక్కటీ కాక మరేదీ ప్రాణాలకు రక్షణ, నాకూ కావాలి కానీ తపస్సు చేసే ఓపిక లేదు దాని మీద నమ్మకమూ లేదు అని గాల్లోకి ఎగిరాడు వామన్‌రావు.
ఎరుపు రంగు సూరీడు ముఖానికి తెల్లటి పౌడర్ అద్దుకుంటున్నప్పుడు వినవచ్చే శబ్దాలు మొదలయ్యేయి. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటా అనరుస్తూ తోపుడు బండీ వాడు రానే వచ్చాడు. అలవాటైన ఆ అరుపులకు వినడానికి వామనరావు చెవులు మిలిట్రీ జవాన్లల్లా స్టడీగా నిలబడ్డయి.
టీకాలో... టీకాలు.. రకరకాల టీకాలు.. అన్ని రకాల టీకాలు. దేశీల టీకాలు.. విదేశీ టీకాలు.. ఒక్క డోసు టీకాలు.. రెండు డోసుల టీకాలు.. టీకాలు.. టీకాలు.. వేస్తే జ్వరమూ ఒళ్ళు నొప్పులు రాని టీకాలు.. వేస్తే ఒళ్ళు నొప్పులు మాత్రమే వచ్చే టీకాలు.. వేస్తే వేసినట్టే ఉండని టీకాలు.. టీకాలో టీకాలు.. ధర తక్కువ మన్నిక ఎక్కువ!
ఇదేమిటిది? నే వింటున్నది నిజమేనా అనుకున్నాడు వామన్‌రావు. కూరగాయల వాడు టీకాలమ్ముతున్నాడంటే చవగ్గానే ఉంటయి. కేజీ ఉల్లిగడ్డ రేటుకో కేజీ క్యాబేజీ రేటుకో వచ్చేస్తయి అనుకున్నాడు.
ఆగు.. ఆగు.. టీకా బండీ ఆగు ఆగు వస్తున్నా అని వెర్రి కేకలు వేస్తూ మంచం మీది నుంచి దభేలుమని కిందపడ్డాడు వామన్‌రావు ఆ ఒక్కటీ కోసం!
- చింతపట్ల సుదర్శన్
సెల్: 9299809212