Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారంపల్లి మల్లారెడ్డి, 9490008666
అభిల భారత రైతు ఉద్యమ నాయకులు
26 నవంబర్ 2020న ప్రారంభమైన రైతుల పోరాటం 2021 జూన్ 26 నాటికి 7 మాసాలు గడిచింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ పోరాట చరిత్రలో ఇంత సుదీర్ఘ పోరాటం జరిగిన దాఖాల లేదు. ఈ పోరాటాన్ని భారత దేశంలోని ప్రజలేగాక ప్రపంచంలోని అనేక దేశాల శాసన సభలు, పార్లమెంట్లు బలపర్చాయి. చివరికి ఐక్య రాజ్య సమితి కూడా ఈ పోరాటాన్ని విరమింప జేయాలని భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇంత సుదీర్ఘకాలం పోరాటం సాగడానికి గల కారణాలు ఏమిటి ? ప్రజలు సంఘటిత పడి ఎన్ని నిర్భందాలు వచ్చిన తట్టుకొని పోరాటాలు చేయడానికి గల అవకాశాలు ఏమిటీ ?
పూర్వరంగం
2014 మే 26న అధికారానికి వచ్చిన మోడీ ప్రభుత్వం మొదటి 5 సంవత్సరాలు వ్యవసాయ రంగానికి అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లలో ప్రకటించింది. రైతుల వడ్డీ 4 శాతం మాఫీ, మధ్యతరహా ఇరిగేషన్ ప్రాజెక్టులకు, ప్రధాని ఫసల్‌భీమా లాంటీ పథకాలకు వేల కోట్లు కేటాయించింది. ఈ పథకాల వల్ల బ్యాంకులకు ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభాలు కలిగించిందే తప్ప రైతులకు లాభాలు కలిగించలేదు. దేశంలో 14.57 కోట్ల రైతు కుటుంబాలు ఉండగా వారు 38 కోట్ల ఎకరాల సాగు భూమిపై హక్కు కలిగి ఉన్నారు. ఇందులో 12.57 కోట్ల మంది 5 ఎకరాలకు లోపు గల రైతుల వద్ద 18 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఈ 5 ఎకరాలలోపు గల రైతుల భూములను కార్పోరేట్ పరం చేయడానికి మోడీ లక్ష్యం చేసుకొని సంస్కరణలను ప్రారంభించాడు. ఈ సంస్కరణలలో భాగంగా మొదట ధాన్య సేకరణ (ఎఫ్‌సిఐ) విర మించు కున్నాడు. దేశ వ్యాప్తంగా భారత కొను గోలు సంస్థల వ్యాప కాలను నిలుపుదల చేశాడు. సబ్సిడీలను తగ్గించాడు. వ్యవసాయ రంగంలోకి గుత్తా సంస్థలను, కార్పోరేట్ సంస్థలను ఆహ్వానించాడు. టాటా, బిర్లా, రిలయన్స్, ఆదాని, ఐటిసి, బేయర్ లాంటి సంస్థల ద్వారా వ్యవసాయోత్పత్తుల ఎగుమతి- దిగుమతి వ్యాపారం కొనసాగించాడు. దేశీయ వ్యవసాయో త్పత్తులను తగ్గించి రూ.3లక్షల కోట్ల విలువ గల వ్యవసాయో త్పత్తులను ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకున్నారు. ఆహార ధాన్యాలేగాక ఆర్టికల్చర్ ఉత్పత్తులను, పాల ఉప ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకున్నాడు. వంటనూనెలు, పప్పులు, పంచదార, పత్తి, మాంసం, సరుకులేగాక పండ్లు, పాల ఉత్పత్తులను దిగుమతుల జాబితాలో చేర్చాడు. స్వయం పోషకత్వం నుండి పరాధీన దేశంగా మార్చాడు. కనీస మద్దతు ధరలను ఆశాస్త్రీయంగా నిర్ణయంచడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు గురౌతున్నారు. వ్యవసాయాన్ని వదిలివేసిన పేద రైతుల భూములను కార్పోరేట్లకు అప్పగించడానికి కీలక చట్టాలను చేశారు. 2017లో మోడల్ ఫార్మింగ్ చట్టం తెచ్చాడు. నీటి ఆయోగ్ మోడల్ కౌలుదారుల చట్టాన్ని రాష్ట్రాలకు పంపించింది. ఈ చట్టం కూడా పేదల భూములను కార్పోరేట్లకు రివర్స్ కౌలు ఇవ్వడానికి ఉపయోగపడేదే తప్ప, ధనికుల భూములను పేదలు కౌలు చేయడానికి అంతగా ఉపయోగ పడలేదు.
2016లో శాంతకుమార్ కమిటీ వేయగా, ఆ కమిటీ భారత ఆహార సంస్థను ఎత్తి వేయడానికి సిఫారస్సు చేసింది. గత 3 సంవత్సరాలుగా ఎఫ్‌సిఐ బియ్యం సేకరణను బంద్ చేసింది. రాష్ట్రాలకు నగదు బదిలీ ఇచ్చి చౌక డిపోలకు కావాల్సిన బియ్యాన్ని రాష్ట్రాలే సేకరించుకోవాల్సిందిగా ఆదేశించింది. అంతేగాక ఎరువుల సబ్సిడీని కంపెనీలకు ఇవ్వకుండా రైతులకు ఎకరాకు రూ.2,800లు నగదు బదిలీ చేసి ఎరువుల సబ్సిడీకి కోత విధించింది. ఎరువుల ధరలు పెరిగినచో రైతులే భరించాలని సబ్సిడీ వరకే కేంద్ర ప్రభుత్వం నగదుగా ఇస్తుందని ప్రకటించింది. యంఎస్పిని కూడా ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేసింది. 2017 ఫిబ్రవరి 27న మధ్యప్రదేశ్‌లోని మందసోర్లో రుణాలు రద్దు చేయాలని ఆందోళన చేసిన రైతులపై కాల్పులు చేసి ఆరుగురి మరణానికి కారణమైంది. వీరి ఆందోళన ఫలితంగా 2018 జూన్ 6న శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కొంత మేరకు రుణాలు రద్దు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని రుణాలు మాఫీ చేయాలని, మద్దతు ధరలను చట్టం చేయాలని ఈ రెండు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని 210 రైతు సంఘాలు కోరాయి. ప్రభుత్వం నిరాకరించగా సీపీఐ(ఎం) పార్లమెంట్ సభ్యుడు కె.కె.రకేష్ రెండు అనాధికార బిల్లులను పార్లమెంట్లో ప్రవేశ పెట్టాడు. ఈ సందర్భంగా 2018 నవంబర్ 29-30లలో ఢిల్లీలో 2 లక్షల మంది రైతులతో ర్యాలీ నిర్వహించారు. రైతుల బిల్లులను ఆమోదించడానికి బదులు బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా కార్పోరేట్లకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంది. 2019 జనవరి 8న 35 వేల మందితో రామ్‌లీలా మైదానంలో రాజకీయ పార్టీ నాయకులతో పెద్ద బహిరంగ సభ జరిగింది. అఖిల భారత కిసాన్ సభ కార్యదర్శి హన్నన్‌మొల్లా, యోగేంద్ర యాదవ్‌తోబాటు సీపీఐ(ఎం) అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,, శరత్ పవర్లు పాల్గొన్నారు. ఆ విధంగా రైతాంగ సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. అయినా, మోడీ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ సంస్థలకు అప్పగించడానికే సిద్ధపడింది.
2018లో (డబ్ల్యూటిఓ) ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రిత్వ స్థాయి సమావేశం డైరెక్టర్ జనరల్ అజ్జివేదో పరిశీలనలో మార్చి 19న ఢిల్లీలో జరిగింది. ప్రధాని మోడీ డబ్ల్యూటీఓకు అనుకూలంగా భారత దేశంలో వ్యవసాయ రంగంలో మార్పులు తేవడానికి అంగీకరించడంతో డబ్య్లూటిఓ మంత్రిత్వస్థాయి సంతోషం వెలిబుచ్చింది. భారతదేశాన్ని ధనిక దేశాలకు దిగుమతి కేంద్రంగా చేయడానికి మోడీ అంగీకారం తెలిపాడు. స్థానికంగా ఉత్పత్తులపై భారంపడే విధంగా దేశంలో సబ్సిడీలను ఎత్తివేశాడు. 2021 మార్చి 1న కొత్తగా ఎన్నికైన డబ్ల్యూటిఓ డైరెక్టర్ జనరల్ ఒకంజోలువాల కూడా మోడీ చర్యలకు సంతోషం వెలిబుచ్చింది. ఈమె 2025 ఆగస్టు 31 వరకు పదవిలో కొనసాగుతుంది. ఒకవైపున డబ్ల్యూటిఓ సమావేశంలో అమెరికా 61,286 మిలియన్ డాలర్లు, యూరిపియాన్ యూనియన్ 8,582 మిలియన్ డాలర్లు కేటాయిస్తూ భారత్‌కు 282 మిలియన్ డాలర్లకు 2019 సబ్సిడీల కింద మంజూరీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డబ్ల్యూటిఓ ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు, ఆసియా బ్యాంకు మోడీ చర్యలకు హితాబులు ఇచ్చాయి. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశ పెట్టడానికి వాటి అనుమతి తీసుకోవడం జరిగింది. అదే సందర్భంలో స్థానిక కార్పోరేట్ సంస్థలతో సమావేశం జరిపి 3 చట్టాలను రూపొందించాడు. ఒక చట్టం భూములను కాంట్రాక్టు ఇవ్వడం, రెండో చట్టం కాంట్రాక్టు భూముల్లో పంటలు పండించి కార్పోరేట్లకు అమ్మడం, మూడో చట్టంలో కార్పోరేట్లు ఎంత సరుకునైన నిల్వ పెట్టుకుని లాభాలు సంపాదించే విధంగా చట్టాలను రూపొందించారు.
2020 జూన్ 6న 3 వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్‌ల ద్వారా ప్రకటించాడు. సెప్టెంబర్ 15, 18 తేదీలలో లోక్‌సభ ఆమోదం పొందడం, 20-22 తేదీల్లో రాజ్యసభ ఆమోదం పొందడం జరిగింది. 28 సెప్టెంబర్న రాష్ట్రపతి సంతకంతో చట్టాలుగా రూపొందాయి.
చట్టం నెం. 1
1. పార్మర్స్ ఫ్రొడ్యూస్ ఆండ్ కామర్స్ (ప్రమోషన్ మరియు ప్రోటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరేన్స్ ఆండ్ పార్మ్ సర్విస్ యాక్ట్
చట్టం నెం.2
ద పార్మర్స్ ప్రొడ్యూస్ అండ్ కామర్స్ ( ప్రమోషన్ అండ్ పెసిలిటేషన్) యాక్ట్ 2020
చట్టం నెం.3
మార్కెట్ నిత్యవసర సరుకుల చట్టం 1955 కు సవరణ
ఈ మూడు చట్టాల సామూహిక దుష్పలితాలు :
1) పెద్ద కంపెనీలు వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్ళను నియంత్రిస్తాయి. ప్రభుత్వానికి వీటిపై ఏ నియంత్రణ ఉండదు.
2) కంపెనీలు కోరుకున్నట్లుగా తమకు కావాల్సిన వ్యవసాయోత్పత్తులను గ్యారెంటీగా ఉత్పత్తి చేయించుకోగలవు. కానీ, ఉత్పత్తిలోని రిస్కు భారాల్ని పూర్తిగా రైతులే భారించాల్సి ఉంటుంది. దీని వలన బ్రిటిష్ వలస పాలన కాలంలో నీలి రంగు ఉత్పత్తి రైతులు పూర్తిగా నాశనం అయినారు. ఈ చరిత్ర కాంట్రాక్ట్ సాగు వల్ల మరోసారి పునరావృతం అవుతుంది.
3) మద్దతు ధరను (సి2+50%) అన్ని పంటలకు నిర్ణయించాలని, ఆ ధరకు కొనాలని డిమాండ్ చేస్తున్నప్పటకీ 22 పంటలకే కేంద్రం మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. వీటిలో 20 పంటలు ఆహారానికి సంబంధించినవి. ఇవి వరి, గోధుమ, జొన్న లాంటి 7 ముతక ధాన్యాలు, 6 పప్పు ధన్యాలు, 7 నూనె గింజలు, కొత్త చట్టాల నేపథ్యంలో ఇవన్ని నిత్యావసర వస్తువుల చట్టం కింద రావు. అందువల్ల వీటి ధరలను, వ్యాపారాన్ని నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. బహుశ, జూట్, పత్తి పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర నిర్ణయ వ్యవస్థ కొనసాగవచ్చు.
4) ఒకసారి వ్యవసాయోత్పత్తుల సేకరణ ఆగిపోవడంతో ప్రభుత్వ నిల్వలు కొనసాగవు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఉండదు. దీనికి బదులుగా నగదు బదిలీ వస్తుంది. ఉపాధిహామీ పథకం కింద ఇప్పటికే నగదు బదిలీ లోపాలు, అవినీతిని చూస్తున్నాం. అందువల్ల రాబోయే దుష్పరిణామాలను ఊహించుకోవచ్చు.
5) ఉపకరణాల సరఫరాలో ఒకసారి కంపెనీ పరిధిలోకి మారడంతో ప్రభుత్వం వీటి సరఫరా నుండి క్రమంగా తప్పుకుంటుంది. ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల సరఫరా నుండి తప్పుకొని వీటిని పూర్తిగా కంపెనీలకే అప్పగిస్తుంది. వెంటనే లేక ఆలస్యంగానైనా సాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా కూడా ప్రైవేట్, కార్పోరేట్ యాజమాన్యాలకే అప్పగించబడుతుంది. ఈ నేపథ్యంలో రైతుల ప్రధాన కోరిక ''లాభాసాటి అయిన వ్యవసాయం, సుస్థిర సాగు పరిస్థితులు'' పూర్తిగా అంతరించిపోతాయి.
6) ఒకసారి సాగు ప్రక్రియలు కంపెనీల నియంత్రణలోకి పోయిన తరువాత ఆ కంపెనీలు ప్రమాదకరమైన జన్యు మార్పిడి విత్తనాలతో పాటు సస్యరక్షణ మందులను కూడా తమకు ఇష్టమొచ్చినట్లుగా ప్రవేశ పెడతాయి, ప్రోత్సహిస్తాయి. ఇవి పర్యావరణాన్ని దెబ్బ తీయడాన్ని పట్టించుకోవు. ఏ పంటలు వేయాలో, ఏ పంటలు ఏమేర వేయాలో కూడా కంపెనీలే నిర్ణయిస్తాయి. ఈ మార్పులన్నీ ఆహార సంక్షోభానికి దారీ తీస్తాయి. మరోసారి ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడే దుస్థితి ఏర్పడుతుంది.
7) భూమిలేని పేద రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. పాలుకు తీసుకున్న, కౌలుకు తీసుకున్న వారు నష ్టపోవాల్సి వస్తుంది. ఒకసారి సాగు నియంత్రణ కంపెనీల చేతిలోకి పోయిన తరువాత కంపెనీలే ఏ పంటను సాగు చేయాలో నిర్ణయిస్తాయి. వీరు అందించే సాంకేతికంతో ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున ఖరీదైన ఉపకరణాలను కంపెనీ నుండి కొని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వలస కార్మికులుగా పనిచేస్తున్న పేద రైతులు, కౌలు దారులు తమ శ్రమతో మిగుల్చుకున్న మోత్తాలతో ఉపకరణాలను ఇప్పటిలాగా ఏమాత్రం కొనుకోలేరు. తద్వారా వీరు తమ జీవానాధారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. క్రమంగా ఈ మార్పులన్నీ పెద్ద ఎత్తున సాగు భూములు ఏక ఖండ యాజమాన్యానికి ''రైతు ఉత్పత్తి దారుల సంస్థ''ల పేరుతో అప్పగించాల్సి ఉంటుంది.
8) ఈ మార్పుల వల్ల సాగు నష్టాదాయకంగా మారడంతో రైతులు తీర్చలేని రుణాలతో భూమి నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాల్సి ఉంటుంది.
ఆర్డినెన్స్ విడుదల కాగానే రైతు సంఘాలు ''అఖిల భారత కిసాన్ కో-ఆర్డినేషన్ కమిటీ''గా 510 సంఘాలు ఏర్పడ్డాయి. ఢిల్లీని ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నాయి. అదే సందర్భంలో నవంబర్ 26న అఖిల భారత ట్రేడ్ యూనియన్ సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ రోజునే రైతు సంఘాలు కూడా ఢిల్లీ ముట్టడికి సన్నాహాలు చేశాయి. ముట్టడి పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటానికి 21 రాజకీయ పార్టీలు, 9 రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పటికప్పుడు మద్దతు తెలిపాయి. పంజాబ్ శాసనసభ ప్రత్యామ్నాయ చట్టాలు చేసింది. రైతులు ఢిల్లీకి వచ్చే 5 ప్రధాన రహదారులను 1.పల్వల్, 2.గజియాబాద్, 3.గజియాపూర్, 4.టిక్రీ, 5.సింగూ బార్డర్ జాతీయ రహదారులను దిగ్భందనం చేశాయి.
ఈ చట్టాలను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో చట్టాల అమలును నిలుపుదల చేస్తూ స్టే మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం 18 మాసాల పాటు ఈ చట్టాలను సస్పెండ్ చేస్తానని ప్రకటించింది. అయినా పోరాటం కొనసాగింది. పార్లమెంట్లో మద్దతు ధరల బిల్లు పెట్టాలని, రుణాల రద్దు చట్టం చేయాలని, కేంద్రం ప్రకటించిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కొత్తగా ప్రవేశ పెట్టబోయే విద్యుత్ సవరణల బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చలో ఢిల్లీ నవంబర్ 26న లక్షల మంది ఢిల్లీకి వచ్చారు. వారిపై వాటర్ క్యానాన్లు, బాటన్స్, టియర్ గ్యాస్ వదిలి నిర్భందకాండ సాగించారు. హర్యానా రాష్ట్రంలోకి రాకుండా అటంకపరిచారు. అప్పటికే 2,3 లక్షల మంది ఢిల్లీ చేరుకున్నారు. 14.10.2020 నుండి 22.01.2021 వరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో 11 సార్లు చర్చలు జరిపింది. కానీ ఈ చర్చలు ఫలప్రదం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ దిగువ సూచనలు చేసింది.
ఈ సూచనలను రాత పూర్వకంగా ఇస్తాము తప్ప చట్టంలో పొందుపర్చడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది. చట్టాలే అమలు జరగని ఈ రోజుల్లో రాతపూర్వక హామీలు ఏ మేరకు అమలు జరుగుతాయోనని రైతులు నమ్మలేకపోతున్నారు. అందువల్ల చర్చలు విఫలమయ్యాయి. జనవరి 26వ తేదీన రైతులు ''రైతుల పెరేడ్''ను నిర్వహించారు. లక్షల మంది రైతులు ట్రాక్టర్లలో ప్రభుత్వం అనుమతించిన రహదారులలో ఊరేగింపు, పరేడ్ చేశారు. కానీ బీజీపి అనుకూలురు, ప్రభుత్వం పంపిన అరాచకవాదులు ఎర్రకోటలోకి వెళ్లి జెండా ఎత్తడం జరిగింది. దీనిని సాకుగా తీసుకుని కేంద్రం ఉద్యమంపై నిర్భందం ప్రయోగించాలని అనుకుంది. సోషల్‌మీడియా ద్వారా వాస్తవంగా ఎర్రకోటలోకి వెళ్లిన వారిని గుర్తించడంతో ప్రభుత్వం ఉద్యమంపై దాడిని కొంత తగ్గించుకుంది. ఏదో ఒక నెపంతో ఉద్యమాన్ని విరమింపజేయాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2022 సెప్టెంబర్ వరకూ రైతు నేతలు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు. వివిధ పద్ధతుల ద్వారా రాష్ట్రాలలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
సుప్రీంకోర్టు కమిటీ
3 వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించి, ఆ కమిటీతో రైతు నాయకులు చర్చించాలని సూచించింది. అందులో 1. అశోక్ గులాఠి (కన్వీనర్), 2. ప్రమోద్ కుమార్ జోషి, 3. అనిల్ ఘన్వాట్, 4. భూపేంద్రసింగ్ మన్న ఉన్నారు.
- భూపేంద్రసింగ్ మన్న రెండు రోజుల తరువాత తాను కమిటీ నుండి తప్పుకుంటున్నట్లు స్టేట్మెట్ ఇచ్చారు. ఈ కమిటీ ప్రస్తుతం చర్చలు జరపలేదు.
ప్రతిఘటన
ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు 2020 సెప్టెంబర్ 25న భారత్ బంద్ ప్రకటించాయి. రైల్వే, జాతీయ రహదారులు దిగ్భందనం చేశారు. మీడియా వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ బంద్ జయప్రదమైంది. డిసెంబర్ 12న టోల్ ప్లాజాల వద్ద ఫీజులు వసూలు చేయకుండా నిలుపుదల చేయడంతో పాటు ఎడ్లబండ్ల ప్రదర్శన చేశారు. 21 ట్రేడ్ యూనియన్లు, రవాణా మోటార్ ట్రాన్‌పోర్ట్ వ్యవస్థ (95 లక్షల ట్రక్కులు, 50 లక్షల బస్సు ట్యాక్సీలు) ఆందోళనలో పాల్గొన్నాయి. రైల్‌రోకో సెప్టెంబర్ 24న జరిగింది. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌కు రైళ్ళను పూర్తిగా ఆపివేసింది. 2020 డిసెంబర్ 8న మరల భారత్‌బంద్ జరిగింది. ప్రధాని దిష్టిబొమ్మలను దేశవ్యాప్తంగా తగలబెట్టారు.
జనవరి 26 పరేడ్
2021 జనవరి 26న ఎర్రకోటపై జెండా ఎత్తి ప్రభుత్వం ర్యాలీ నిర్వహిస్తుంది. దానికి పోటీగా రైతు నాయకులు ''కిసాన్ పరేడ్'' జరపాలని నిర్ణయించారు. 1.సింగు బార్డర్, 2. పల్వాల్, 3. ఘాజీఫూర్, 4. గజీయాబాద్, 5. ట్రిక్రీ లలో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. రాయిటర్ వార్తా సంస్థ ప్రకారం 2 లక్షల ట్రాక్టర్లు ఈ పెరేడ్లో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. సింగూ, ట్రిక్రీలలో 40 వేల మందితో ముట్టడి జరిగింది. ఈ పరేడ్‌ను అప్రతిష్ఠపాలు చేయడానికి బీజేపీకి చెందిన నాయకులు 200 ట్రాక్టర్లతో ఎర్ర కోటాలో ప్రవేశించి ప్రధాని ఎత్తిన జెండాను దించి దాని స్థానంలో మతం జెండాను ఎత్తారు. ఈ ఆరోపణను రైతు నాయకులపైకి తోయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మోడీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి జెండా ఎత్తినట్లు రుజువైంది. దానితో అతను కొంత కాలం రహస్యంగా వెళ్ళి ఆ తరువాత ప్రభుత్వ ఆదేశంతో అరెస్టు అయినాడు. మోడీ చేసిన ఈ కుట్ర కూడా విఫలమైంది.
మోడీ విచ్ఛిన్న ప్రయత్నాలు
మహారాష్ట్రలో షేత్కారి సంఘటన ఈ బిల్లును సమర్థిస్తున్నట్లు మరో 10 యూనియన్లను కలుపుకొని ప్రచారం చేసింది. నరేంద్రమోడీ వ్యవసాయశాఖ మంత్రి తోమార్‌తో మాట్లాడి యూపి, బీహార్, హర్యానా, కేరళ, తమిళనాడు, తెలంగాణలో కూడా విచ్ఛిన్న ప్రయత్నాలు చేశాడు. 2020 డిసెంబర్ 24న 20 వేల మందితో బిల్లుకు అనుకూల ప్రదర్శనలు చేయించాడు. ఎన్ని విచ్ఛిన్న చర్యలు చేపట్టిన పోరాటం శాంతియుతంగా సాగింది. సింగ్ బార్డర్లో ఉన్న వారికి ఎన్ఆర్ఐలు మజ్జిగా, రొట్టెలు, పిజ్జాలు సరఫరా చేశారు. ఢిల్లీ గురుద్వారా కమిటీ భోజనాలు ఏర్పాటు చేసింది. కోవిడ్-19 ప్యాండమిక్ సందర్భంగా ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రదర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోడీ విచ్ఛిన్న చర్యలను తట్టుకొని ఆహారం అందించారు. బట్టలు, చెప్పులు, మందులు తదితర నిత్యావసరాలను ప్రదర్శకులకు అందించారు. విపరీతమైన చలిని తట్టుకోడానికి కంబళ్ళు సరఫరా చేశారు.
రాజీనామ
1. హర్‌సిమ్రాత్‌కౌర్ బాదర్, ఆహార ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల కేంద్ర మంత్రి, శిరోమణి అకాళిధళ్,
2. సోమాలిసంఘవాన్, శాసన సభ్యులు, 2020 డిసెంబర్ 1న, హర్యానా శాసన సభకు మద్దతు ఉపసంహరించుకున్నాడు.
3. హర్యానా వ్యవసాయ మంత్రి 2020 డిసెంబర్ 17న కేంద్రానికి బహిరంగా లేఖ వ్రాశాడు.
అంతర్జాతీయ సంస్థల నిరసన
దేశీయ సంస్థలేగాక విదేశీ సంస్థలు, ప్రభుత్వాలు కూడా తీవ్ర నిరసనను భారత ప్రభుత్వానికి తెలియజేశాయి.
1. ఐక్యరాజ్య సమితి, 2. ఐయంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ), 3. హ్యూమన్‌రైట్స్ వాచ్, 4. అమెరికా, 5. ఇంగ్లాండ్, 6. ఆస్ట్రేలియా పార్లమెంట్ తీర్మానం, 7. కెనడా (ప్రధానమంత్రి ఆసమ్మతి), 8. ఇటలీలో నీనామల్హోత్ర రోములో గురుద్వార దర్శించి నిరసన తెలియజేశారు. 9. న్యూజీలాండ్, 10. పాకిస్తాన్,
ఈ దేశాలేగాక వివిధ దేశాలలోని స్వచ్ఛంద సంస్థలు, స్వతంత్ర సంస్థలు అనేకం నిరసనలు తెలియజేశారు. చివరికి మేధావులు కూడా ఈ నిరసనలలో పాల్గొన్నారు. 1. ప్రకాశ్‌సింగ్ బాదల్ (పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ ఆవార్డు గ్రహిత) 2. బాబా సేవా సింగ్ (పద్మ శ్రీ), 3. అర్భజన్మన్న, 4. సుకదేవ్సింగ్ (రాజ్యసభ సభ్యులు) వీరంతా వ్యతిరేకించారు.
ఈ పోరాటాలు 26 జూన్ నాటికి 7 మాసాలు గడిచినా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ పోరాటానికి అఖిల భారత కిసాన్ సభ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్‌మొల్లా, కోశాధికారి పి.కృష్ణప్రసాద్, సహాయ కార్యదర్శి విజ్జుకృష్ణన్లు పాల్గొంటున్నారు. తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ నాయకత్వన రెండు సార్లు ప్రదర్శకులు ఢిల్లీ వెళ్ళారు. మొదట వారం రోజులు, తరువాత 15 రోజులు ప్రదర్శనలో పాల్గొన్నారు.
రాష్ట్రాలలో పోరాటాలు
29 రాష్ట్రాలలోనూ, కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ ఢిల్లీ పోరాటానికి మద్దతుగా స్థానికంగా పోరాటానికి ఉద్యమాలు పెద్ద ఎత్తున సాగాయి. నవంబర్, డిసెంబర్, జనవరి ఢిల్లీలో చలి బాగా ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల రైతులు తమ తమ రాష్ట్ర కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేస్తూ పోరాటాలు సాగిస్తున్నారు. తెలంగాణలో టి.సాగర్, పశ్యపద్మ, రాయల చంద్రశేఖర్, కెచ్చల రంగయ్య, అచ్చుత రామారావు, కన్నెగంటి రవి కన్వీనర్లుగా 28 రైతు సంఘాలు కో-ఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి ఆందోళనలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వడ్డే శోభనాధీశ్వరావు కన్వీనర్, అఖిలపక్ష కమిటీ పనిచేస్తూ ఉద్యమం సాగిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్లలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తూన్నారు.
కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాలని కోరుతూ కో-ఆర్డినేషన్ కమిటీ కేంద్రానికి మెమోరాండం సమర్పించింది. కేంద్రం చర్చలు జరుపుతామని ప్రకటించింది. కానీ ఇంత వరకు ఆ వైపు కృషి లేదు.
కేంద్రం చేసిన 9 సూచనలు
రైతుల ఆందోళన సందర్భంగా 11సార్లు రైతు ప్రతినిధులతో చర్చలు జరిపిన ప్రభుత్వం 9 సూచనలు చేసింది.
1) ఏపిఎమ్సి యాక్ట్ పునరుద్ధరణ
2) కేంద్ర ప్రభుత్వానికి బదులు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారులకు లైసెన్స్ ఇవ్వడం, చెకప్ చేయడం జరుగుతుంది
3) రైతుల అభ్యంతరాలకు సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చు
4) కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందం జరిగిన 30 రోజులలోపు అగ్రిమెంటును ఎస్‌బిఎమ్ వద్ద డిపాజిట్ చేయాలి.
5) కాంట్రాక్ట్ ఫార్మింగ్ భూములలో జరిగిన నిర్మాణాలు చివరికి రైతులకే అప్పగించాల్సి ఉంటుంది
6) ఫార్మింగ్ భూములలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వ్యక్తి ఏ పరిస్థితిలలోను ఆక్రమించరాదు
7) ఎంఎస్పి-ప్రొక్యూర్మెంట్ కేంద్రప్రభుత్వం అమలు జరుపుతుంది
8) రైతులు ప్రస్తుత విద్యుత్ బిల్లుల చెల్లింపు విధానంలో ఎలాంటి మార్పూ ఉండదు
9) గాలి కాలుష్యం నివారణకు రైతు కోరినట్లు అమలు జరుపుతాము.
పోరాట రైతుల డిమాండ్లు
1. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ మూడు బిల్లులపై చర్చించాలి. (రాజ్యసభలో మోడీ ప్రభుత్వానికి మెజార్టీ లేకున్నా, మూజువాణి ఓటుతో ఆక్రమంగా బిల్లును చట్టంగా ఆమోదించారు.)
2. కనీస మద్దతు ధరలు కనీస మద్దతు ధరలు - ధాన్యం సేకరణకు చట్టబద్దత కల్పించాలి.
3. పంటల సేకరణ విధానం కొనసాగాలి.
4. కనీస మద్దతు ధరలు సి2+50 శాతంగా శాస్త్రీయంగా నిర్ణయించాలి.
5. పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించాలి. రైతులకు 50 శాతం రాయితీ ఇవ్వాలి.
6. గాలి పొల్యూషన్‌పై ఎన్‌సిఆర్ - 2020 ఆర్డినెన్స్‌లు వాపాస్ తీసుకోవాలి.
7. వరి కాల్చిన పొల్యూషన్‌కు కారణమైనారని అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి.
8. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలి.
9. కేంద్రం రాష్ట్రాల హక్కులలోకి రాకూడదు. వీకేంద్రీకరణ చేయాలి.
10. రైతులమీద పెట్టిన కేసులను ఎత్తి వేయాలి.
పై కోర్కెలను ఆమోదించే వరకు పోరాటం కొనసాగిస్తా మని రైతు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆత్మహత్యలు
ఆందోళన సందర్భంగా నిరసనగా కొంతమంది ప్రదర్శకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
1. రాంసింగ్ 10 పేజీల నోట్ వ్రాసి 1920 డిసెంబర్ 16న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని దహనానికి అందరు హాజరైనారు.
2. జోగేంద్రసింగ్ జూవాండ (బికెయు) భారతీయ కిసాన్ యూనియన్ 22 సంవత్సరాల వయస్సు
3. ఆమర్జిత్సింగ్రారు డిసెంబర్ 27న, అడ్వకేట్, లేఖ వ్రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
4. కాశ్మీర్‌సింగ్ (75), 2021 జనవరి 2న, రాంఫూర్ జిల్లా
5. ఆమరేంధర్సింగ్ (40), జనవరి 9, పంజాబ్,
ఇంకా ఆత్మహత్యలు జరిగినప్పటికీ నోట్ కాలేదు. బాబా రాంసింగ్ ఐదుగురు సంతులు వ్యతిరేకత ప్రకటించారు.
ప్రదర్శనలు జరుగుతుండగానే 535 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ఆస్వస్థతకు గురైనారు.