Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంతో విలువైన బతుకు సారాన్ని సంపాదిస్తాడు. ఒకవేళ ఆ సారాన్ని నిక్షిప్తం చేస్తే, ఆ విలువైన సమాచారం భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. పాత చరిత్ర ఆధారంగానే కొత్త చరిత్ర మనుగడ సాగిస్తుంది. మానవ చరిత్ర పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే మనకు అనేక విషయాలు అవగతమవుతాయి. అయితే ఏ మనిషి ఈ భూమ్మీద శాశ్వతంగా జీవించలేడు. పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషి మరణానికి చేరువవుతాడు. ఆయన లేదా ఆమె సంపాదించిన విలువైన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలంటే ఆ మనిషి తన జీవిత అనుభవాన్ని అక్షరీకరించాలి. లేదా ఆ సారాన్ని అక్షరాలలోనే కాకుండా ఆడియో, వీడియో రూపంలో కూడా రికార్డు చేయవచ్చు. వాస్తవానికి మన పూర్వీకులు తాము సంపాదించిన జ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో పదిలపర్చారు. ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం. శాస్త్రసాంకేతిక విజ్ఞానం సహాయంతో మనం అనుసరించిన సృజనాత్మక విషయాలు నిక్షిప్తం చేయడం చాలా సులువైన విషయం. ఆ విలువైన సమాచారం ఆధారంగానే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ప్రపంచ మానవ జీవితం మెరుగు పడేందుకు ఈ పరిశోధనలను చరిత్ర కారులు సద్వినియోగం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వందల సంవత్సరాలుగా వెలు వడిన లక్షలాది పుస్తకాల్లో అనేక మంది తాము జీవితకాలంలో గడించిన అనుభవ సారాన్ని నిక్షిప్త పర్చారు. ఆ పుస్తకాలనే అధ్య యనం చేసిన వ్యక్తులు సమకాలిన పరిస్థితులకు అన్వయించి మానవ జీవితాన్ని ఎలా మెరుగు పర్చుకోవచ్చో సూచించారు. ప్రజలకు ఉపయోగపడే అనేక గ్రంథాలను రచించారు.
ఇదిలా ఉండగా 2011 సంవత్సరంలో టాడ్ హెన్రీ అనే రచయిత 'డై ఎమ్టీ' అనే పుస్తకాన్ని రచించారు. 127 పేజీలు గల ఈ పుస్తకంలో హెన్రీ ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు సంభవించే వివిధ పరిణామాలను వివరించారు. ఆయన ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తిదాయకమైన ప్రేరణ ఉందని చెప్పారు. అదేమిటంటే టాడ్హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొన్నపుడు ఆయన పని చేస్తున్న సంస్థకు చెందిన డైరెక్టర్ 'ఈ భూ మండలంలో అత్యంత ఖరీదైన స్థలమేదని' ఉద్యోగులకు ఒక ప్రశ్న వేశారు. ఉద్యోగులు పరి పరి విధాలుగా ఆలోచించారు. తమకు తోచిన విధంగా సమాధానాలు చెప్పారు. ఒక వ్యక్తి 'గల్ఫ్దేశాలు' అని మరొక వ్యక్తి 'వజ్రాల గనులున్న ఆఫ్రికా' అని సమాధానామిచ్చారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ డైరెక్టర్ ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్థలం 'స్మశానం' అని చెప్పారు. ఎందుకంటే అంటూ ఆయనే వివరణనూ ఇచ్చారు. ఈ ప్రపంచంలో చాలా ఏండ్లుగా వందల కోట్ల మంది జన్మించారు, మరణించారు. ఈ ప్రపంచంలో పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమ మనసులోని మంచి విషయాలను ఇతరులకు పంచారు. కానీ అధిక సంఖ్యాకులు మాత్రం తమలో అంతర్గతంగా నిక్షిప్తమైన మేధస్సును అనేక ఆలోచనలను అద్భుతమైన విషయాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ వ్యక్తుల విజ్ఞానం వెలుగు చూడనేలేదు. ఆ విజ్ఞానం వృధా అయిపోయింది. ఆ విలువైన సమాచారం సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయింది. అంతటి గొప్ప సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన స్థలం ఈ ప్రపంచంలో లేదు అని ఆయన సుదీర్ఘంగా వివరించారు.
డైరెక్టర్ బోధించిన విషయాలు టాడ్హెన్రీని ఆలోచింప జేశాయి. అవి ఆయన మనసులో గట్టిగా నాటుకు పోయాయి. ఆయన అప్పటి వరకు సామాన్య ఉద్యోగే. అందరి మాదిరిగానే ఆయన సాధారణంగా జీవించాడు. కానీ డైరెక్టర్ మాటలు ఆయన మనసును అల్లకల్లోలం చేశాయి. అనేక రోజుల పాటు ఆలోచించాడు. మానవ జీవితం ఎంత గొప్పదో గ్రహిం చాడు. వెంటనే ఇత రుల్లో ప్రేరణ కలిగిం చేందుకు ఆయన 'డై ఎమ్టీ' అనే పుస్తక రచనకు పూనుకు న్నాడు. ఆయన రాసిన ఈ చిన్న పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది. లక్షలాది మందిని ఆలోచింప జేసింది. తమ జీవిత పరమావధి ఏమిటో తెలియజెప్పింది.
మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించకండి. ఆ మంచి విషయాలను ప్రజలకు పంచేసి నిష్క్రమించండి అని హెన్రీ విజ్ఞప్తి చేశారు. మీకేదైనా లక్ష్యం ఉంటే దానిని మరణించేలోగా సాధించండి. ప్రజలకు ఉపయోగపడే విషయాలను తమలోనే దాచుకుని వృధా చేయవద్దని ప్రజలను ఆయన వేడుకున్నారు. మానవ వికాసానికి సంబంధించిన విషయాలను నలుగురికీ పంచుదాం. ఈ క్షణం నుంచే ఆ పనిని ప్రారంభిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రపంచంలో మానసిక సంతృప్తికి మించిన సంపద లేదు. మన జీవితం వల్ల ఇతరులకు ఎంతో కొంత ప్రయోజనం కలిగిందనే ఉల్లాసం మనం ఊపిరి వదిలే సమయంలో బాధకు గురి చేయదు.
- జి గంగాధర్ సిర్ప, 8919668843