Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో పాతుకుపోయిన అనేక సమస్యలను చూసి చలించి, వాటిని మనసులోకి తీసుకొని కవ్వంతో చిలికి కమ్మనైన వెన్నలాంటి భావాలను కవిత్వ రూపంలో పాఠకులకు చూపించాలన్నదే కవులు తపన. కవిత్వంలో అనేక ప్రక్రియలు వెలుగు చూసినప్పటికీ నానీలు మాత్రం ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాయని చెప్పవచ్చు. 'అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని' ప్రదర్శించే నానీలు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. నానీల నాన్న డా. ఎన్.గోపి పురుడు పోసిన ఈ నానీల ప్రక్రియలో సామాజిక సమస్యలను వినూత్న పదాలతో కవయిత్రి సుధా మైత్రేయి నానీలు రాశారు. అలా ఆమె రాసిన సంపుటే 'నానీల సకినాలు'
తెలంగాణకే ప్రత్యేకమైన సకినాలలాంటి కమ్మనైన నానీలను పాఠకులకూ అందించడం కోసమే కవయిత్రి తన కవితా సంపుటికి ఆ పేరు పెట్టింది అని అర్థమవుతుంది. సుధారాణికి సాహిత్యం అంటే ప్రాణం. ఆ విషయాన్ని అక్షరాలలో బంధించానని కవయిత్రే స్వయంగా నానీల్లో చెప్పుకుంది.
'కవితయింది/ అక్షరాలు చల్లితే / పంట పండలేదు /గింజలు చల్లితే' పై పంక్తులలో రైతుల ఆవేదనను కవయిత్రి చిత్రించింది. కవులు కవిత్వాన్ని పండించినంతగా పంటల దిగుబడి ఉండటంలేదని రైతుల దయనీయ స్థితిని కవయిత్రి నానీల్లో సహజంగా చిత్రీకరించారు. శ్రమకు నిర్వచనంగా రైతులు చూపిస్తూ... 'మట్టితో మాట్లాడావా /ఎప్పుడైనా /రైతన్నల శ్రమ గీతం/వినిపిస్తుంది' అని అంటుంది. రైతుల శ్రమ తెలిసిన మట్టిని తడిమితే రైతన్న కష్టం ఏంటో అర్థమవుతుందని కవయిత్రి ఆర్ద్రంగా చెప్పారు. సాహిత్యంలో నానీల గొప్పతనాన్ని వివరిస్తూ.. 'నాలుగే పాదాలు /నానీకి /అయితేనేం/కోట్ల మెదళ్ల చేరింది' అని చిత్రించింది. నానీల సష్టికర్త గోపి గారి సాహిత్య కషిని కొనియాడుతూ, 'కళామతల్లికి చిట్టి కవితాహారం 'నానీ'ల రూపంలో అందించారని కవయిత్రి ప్రశంసించారు. సాహిత్యంలో అన్ని ప్రక్రియల కంటే నానిలే గట్టి గింజలుగా నిలుస్తున్నాయని కవయిత్రి వక్కాణించారు. ఎన్నారై అనే అర్హత ఉంటే చాలు కళ్లుమూసుకుని పెళ్లి చేస్తున్నారని, హౌదాకి డబ్బుకి ఇచ్చిన గౌరవం మనిషికి ఇవ్వడం లేదని కవయిత్రి ఆవేదన చెందుతుంది. సమాజంలో నాయకులు చేసే బూటకపు నిరాహార దీక్ష గురించి కవయిత్రి తనదైన శైలిలో చిత్రిస్తూ.. 'వేదికపై /నిరాహార దీక్ష సాగుతోంది/అందుకేనేమో/చుట్టూ పండ్ల బండ్లు' అని అంటుంది. ఈ ఒక్క నానీ చూస్తే చాలు నిరాహార దీక్షల నిజాయితీ ఏమిటో మనకు అర్థమవుతుంది.
'తన సంతోషాన్ని /ధారబోసింది అమ్మ/మా జీవితాలు/జయప్రదం అయ్యాయి' పై పంక్తులలో పిల్లల కోసం అమ్మ చేసే త్యాగాలను చిత్రించింది. 'కాయలు కాసేది/చెట్టుకి కాదు /నాన్న చేతులకు/ అమ్మ కళ్ళలో కూడా'
ఇక్కడ నాన్న కష్టాన్ని, అమ్మ ఎదురుచూపులను కవయిత్రి సమర్థవంతంగా చిత్రించింది.
'కలం పట్టే వాడు /పూర్వపు కవి/ ఇప్పుడు/ఎలుకను పడుతున్నాడు' ఒకప్పుడు కవులంతా కలంతో సాహిత్యం పండించేవారు. కానీ ప్రస్తుతం మౌస్తో సాహిత్యం పండిస్తున్నారు అని కవయిత్రి వ్యంగ్యంగా చిత్రించింది.
మొత్తంగా సుధారాణి నానీల్లో అమతం లాంటి పద ప్రయోగం ఉంది. సుధా అమత పద తోరణాన్ని సాహిత్య గలుమకి అలంకరించింది. సామాజిక సమస్యల చిత్రణ ఆమె నానీల కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. 'నానీల సకినాలు' సంపుటిలో ఉన్న నానీలను పరిశీలిస్తే ప్రస్తుతం సమాజంలో పతనమవుతున్న మానవ సంబంధాలు, నైతిక విలువలు కనిపిస్తాయి.
(నానీల సకినాలు (కవిత్వం), రచయిత : సుధా మైత్రేయి, పేజీలు : 95, వెల : రూ. 120/-, ప్రతులకు : ఫ్లాట్ నెం.502, స్పెక్ట్రా అపార్ట్మెంట్, డిఫెన్స్ కాలనీ, సైనిక్‌పురి, హైదరాబాద్ - 094 ; అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో..)
- డా. మద్దిరాల సత్యనారాయణ రెడ్డి
9502771776