Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకున్నది అస్సలు జరగవు. కానీ జరిగేవన్నీ అనుకోనివే కదా. కాకపోతే ఎన్నడూ లేనిది బాబాయి ఇంటికి రావడం ఏమిటి అని వాపోయేడు మురళి. అందులోనూ ఇలాంటి సమయంలో అని కూడా అనుకోవలసి వచ్చింది.
ఇలాంటి సమయం అంటే మరేమీలేదు ఇటీవల మెడ నొప్పులూ, తల తిరగడమూ వంటివి పొడసూపడంఓ డాక్టర్ను సందర్శించక తప్పింది కాదు మురళికి. ఆ డాక్టరÊ మురళికి 'బ్లడ్ ప్రెషర్' అనే జబ్బు ఖాయం చేసి రోజూ వాడవలసిన టాబ్లెట్లు రాసిచ్చి అనేక విధాలుగా భయపెట్డాడు. అందువల్ల ఎంతో బెంగటిల్లి 'ఇంతేలే బతుకింతేలే' అని మురళి పాట పాడుకుంటున్న వేళ ఇంటికి వచ్చిపడ్డాడు వరుసకు బాబాయి అయిన బాబాయి.
వచ్చినవాడు ఓ కప్పుడు కాఫీ చెంబుడు నీళ్ళు తాగి పోతాడు కదా దీనికి హైరానా ఎందుకు అనుకోవచ్చు ఎవరైనా! అయితే ఈ బాబాయి మామూలు బాబాయి కాదు మరి. ఉపన్యాస కేసరి. ఈయనకు తెలియని విషయమంటూ ఉండదు. దేని గురించయినా అడిగితే చాలు రామాయణం నుంచి మహా భారతం నుంచి పురాణాల నుంచి అనేక ఉదాహరణలు చెప్పి వినే వాడి బుర్రా చెవులూ జమిలిగా వేడి వెక్కించేస్తాడు. అందుచేత బాబాయితో అంటీముట్టనట్టుగా పొడిపొడిగా మాట్లాడి పంపేద్దామ నుకున్నాడు. ఆయన గ్లాసులో చివరి కాఫీ చుక్క చప్పరిస్తుంటే ఇక లేచి వెళ్తాడు. మనం 'సేఫ్'గా ఉన్నాం అనుకున్నాడు.
అప్పుడు పేలింది బాంబు. ఆయనకి ఎదురుగ్గా నుంచి ప్రపంచం మునిగిపోయే సంగతి చెప్పనే చెప్పింది. మావయ్య గారూ ఈనకి బి.పి. వచ్చిందట. డాక్టర్ మందులు రాసిచ్చాడు. కానీ ఎందుకో నీరసంగా విచారంగా ఉంటున్నారు. మీరు కొంచెం ధయిర్యం చెప్పండి అంది శ్రీమతి మురళి.
అంతే! కందిరీగల తుట్టె కదల్నే కదిలింది. ఇహనో ఇప్పుడో లేచి వెళ్ళిపోతాడనుకున్న మనిషి సోఫాలో వెనక్కి జారి కాళ్ళు రెండూ ఆడిస్తూ 'ఓహౌ! అదా సంగతి ఏంట్రా 'డల్లు'గా ఉన్నాడు అనుకుంటున్నానప్పట్నించి. ఏమిటేవిటీ రక్తపోటూ! ఓస్ అంతేనా! అదో జబ్బుట్రా సన్నాసి. ఈ రోజుల్లో అది షరా మామూలే. పొద్దున్నే కడుపులో ఇం బరువుతో పాటు బిళ్ళ వెయ్యని వాడెవడ్రా!' అన్నాడు.
బలి యివ్వబోతున్నప్పుడు తల వంచుకునే మేకలా తల వంచుకున్నాడు మురళి, శ్రీమతి మురళి వైపు కోపంగా చూడాలనుకునీ చూడలేక.
అసలు బి.పి. అంటే కోపం, కోపం అంటే బీపీ. కోపం లేకపోతే అసహజం అని భయపడాలి కాని కోపం అంటే మంచి ఆరోగ్య లక్షణమే అనుకోవాలి. విశ్వామిత్రుడి పేరు విన్నావు కదా బ్రహ్మర్షి. కోపం వల్లే కదా అంత 'పాపులర్' అయ్యేడు అని మురళి వైపు చూశాడు బాబాయి.
ఇంక మొదలు ఎగ్జాంపిళ్ళు అనుకుని బిక్క ముఖం పెట్టాడు మురళి. దుర్వాసుడనే వాడు తెలిసే వుంటాడు ఆయనకూ ఉండేది హైబీపీ. ఆ మాటకు వస్తే రామాయణం తీసుకో. లక్ష్మణుడికి ఎంత బీపీ పెరిగిపోతే శూర్పణఖ ముక్కూ చెవులూ కోసం ఉంటాడు. రాముడు మాత్రం సముద్రం దారి యివ్వకపోతే ఆగ్రహంతో ఊగిపోలేదూ.
శ్రీమతి మురళి ఒంటింట్లోకి పోయి తలదాచుకుంది కానీ మురళికి మొఖం దాచుకోను వీలేలేదు. వింటున్నానంటూ తల ఊపక తప్పలేదు.
రావణుడికి వచ్చింది మామూలు బీపీనా? తన ముందు హనుమంతుడు చేసిన చేష్టలకి వీరంగం ఎత్తాడు. ఆ కోపం పెద్ద మంటలయి హనుమంతుడి తోకకు నిప్పవలేదూ. తోక కాలిపోతుంటే ఎవరికైనా బీపీ వచ్చి తీరవలసిందే. మండే తోకను చూసి ఒళ్ళు మండిన ఆంజనేయుడు లంకాదహనం చేశాడా లేదా?
అవునవును అన్నట్లు తల వూపాడు మురళి. ఇక మహాభారతం చూద్దాం. మయసభ భవనంలో కాలుజారి కాలవలో పడబోయిన సుయోధునుడ్ని చూసి పాంచాలి లేడీ రాజనాలలా వికటాట్టహాసం చేసినప్పుడు ఆయనకు వచ్చిన బీపీని చూస్తే రక్తపోటు మాపక యంత్రం పగిలి ముక్కలైపోయి వుండును. ఇక కురుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణమప్పుడు పద్యాలతో ప్రతిజ్ఞ చేసిన భీముడికి ఎంత రక్తపుపోటు వచ్చి ఉండాలి. ఇదంతా ఎందుకు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండి ఉషారుగా సరదాగా మాట్లాడే కృష్ణుడ్నే తీసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అడ్డూ అయిపూ లేకుండా బాణాల వర్షం కురిపిస్తుంటే యుద్ధమే చెయ్యన్న వాడు కురు పితామహుడి మీద చక్రం ప్రయోగించడానికి రథం దిగలేదూ. బీపీ అట బీపీ అరేరు ఉరేరు మురళీ ఇది త్రేతా యుగం నుంచీ ఉన్నదేరా. ఇవన్నీ కాదు ఈ రోజుల్లో చంటిపిల్లలు మారాం చెయ్యకుండా అన్నం తిండానికి సెల్ఫోన్లు చేతికిస్తున్నారు. ఏ చంటివాడి చేతిలోంచైనా ఫోన్ లాక్కుని చూడు యేం జరుగుతుందో! అందువల్ల బీపీ సత్యం బీపీ నిత్యం బీపీ సహజం. ఈ మాత్రం దానికి మొహం వేళ్ళాడేసే పనిలేదు. అలవాటయిపోతుంది మాత్రలు మింగడం అంటూ వెళ్ళిపోవడానికి లేచాడు బాబారు!
బాబారు మీకూ బీపీ ఉందా అని అడుగుదామనుకుని మానేశాడు మురళి మళ్ళీ సోఫాలో కూచుంటాడని భయపడి.
- చింతపట్ల సుదర్శన్,
సెల్: 9299809212