Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి సమూహంలో జీవించే ప్రాణి. నిరంతరం తన జీవితంలో ఒక తోడు కోసం వెతుక్కుంటూ ఉండే జీవి. కాని మనం నిర్మించుకున్న సమాజంలో నియమాల మధ్య ఆధిపత్య భావ జాలంతో నిండిపోయి, ఒకరికొకరు తోడుగా ఉండడం అంటే ఒకరి ఆధిపత్యంలోకి మరొకరు వెళ్ళడం అనే అర్థంతోనే జీవిస్తున్నాం. అందుకే పరస్పర తోడు కోసం ఏర్పడ్డ బంధాలు అన్నీ కూడా ఆధిపత్యం వైపే నడుస్తూ కనిపిస్తాయి. పురుషాధిక్య సమాజంలో కుటుంబ సంబంధాలన్నీ కుడా పురుషుని అధికారం కింద జీవించే జీవితాలయిపోయాయి. ఇదే ఒక పద్ధతిగా సాగుతూవచ్చింది. సమాజంలో అధికార హౌదాలో ఉన్న పురుష జాతి తమ ఆధిపత్యం కింద ఉండడానికే స్త్రీలను తయారు చేెసుకుంది. అలాగే స్త్రీలు జీవించాలని అదే వారి జీవన మార్గం అని నమ్మించింది.
అధికారంలో అనురాగం ఉండదని, అనుగారం అధికారంగా మారినప్పుడు అక్కడ బంధంలో ఒక అవసరం తప్ప మానసిక దగ్గరితనం ఉండదని తెలిసినా, తమ అవసరాలన్నీ ఇలానే తిరుతాయి, తమ స్వేచ్ఛా స్వతంత్రాలన్నీ ఈ అధికార బంధాల మధ్యే అనుభవించే వెసులుబాటు కలుగుతుందని పురుష ప్రపంచం భార్యలు ఇదే పంధాలో తీర్చిదిద్దుకుంది. తాము తమ కుటుంబ సభ్యుల నుండి స్వీకరించే సౌఖ్యాలు, తాము ఇవ్వవలసిన వాటికంటే ఎంతో ఎక్కువ కాబట్టి ఆ వెసులుబాటును భర్త అనే స్థానంలో అనుభవించడమే తమ హక్కుగా పురుష సమాజం అనుకుంటూ వచ్చింది. ఇదే సాంప్రదాయం కూడా అయింది. కాని తమ పరిస్థితుల పట్ల అవగాహన ఉన్న స్త్రీలు తమ జీవితాలలోని లొంగుబాటుకు దారి తీసిన పరిస్థితులను అర్ధం చేసుకుని వాటిని ఎదిరించి వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా జీవించాలని చేసే పోరాటమే స్త్రీ వాదం. కొన్ని సార్లు ప్రస్తుత తరంలో ఇక్కడే స్పష్టత లోపిస్తుంది. తాము వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా జీవించడం కోసం పోరాడడం స్త్రీ వాదం కాని, ఇతరుల వ్యక్తిత్వాన్ని హరించడం స్త్రీవాదం కాదు అన్న స్పష్టమైన అవగాహనతో విచక్షణతో భాద్యతతో ముందుకు సాగవలసిన అవసరం ప్రస్తుతం స్త్రీవాదానికి ఉంది.
సినిమా కథకు వద్దాం. అసలు స్త్రీకి తోడు అంటే ఏంటీ? పెళ్ళితో ఏర్పడిన జీవిత భాగస్వామితో ఆమెకు నిజంగా తోడు లభిస్తుందా? అసలు ఆడపిల్లకు తల్లితండ్రులు పెళ్ళి చేసేది ఆమె ఒంటరిగా బతకలేదని, ఆమెకో తోడు కావాలని. కాని అసలు జీవిత భాగస్వామి తోడును స్త్రీ ఎలా ఆస్వాదించాలనుకుంటుంది. అందులో ఏమి కోరు కుంటుందని స్త్రీ పక్షంగా చూపించిన కథ ఓల్గా గారి ''తోడు''. దీనినే అక్కినేని కుటుంబరావుగారు 1997లో సినిమాగా తీసారు. శరత్ బాబు, గీత, ఝాన్సి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఒక చక్కని తెలుగు సినిమా. ఏ హంగు లేకుండా చాలా సింపుల్‌గా తీసిన ఈ సినిమా హాయిగా ఉంటుంది. తళుకుబెళుకుల జిమ్మిక్కులు లేకుండా విషయం నుండి ఎక్కడా డీవియేట్ అవకుండా తీసిన సినిమా ఇది.
గంగాధరంకు భార్య మరణంతో, జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అన్నిటికీ భార్య మీద ఆధారపడిన అతను ఆమె లేకుండా రోజులు గడపలేకపోతాడు. ఇందులో అతనికి భార్యపై ప్రేమ కన్నా రోజూ తన పనులు తాను చేసుకోవడానికి పడుతున్న ఇబ్బంది ఇంకా బాధిస్తుంది. భార్య లేని కారణంగా పని మనిషి సహాయంతో ఇల్లు నడస్తూ ఉంటుంది. ప్రతి చిన్న పనికి భార్య మీద ఆధారపడిన అతని ఇల్లు ఒక చెత్తకుండీలా తయారవుతుంది. హౌటల్లో తింటూ ఇంట్లో పడుకుంటూ ఆఫీసులో ఎక్కువ సమయం గడుపుతూ అతను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ లో ఉండే మరో వ్యక్తి చనిపోతాడు. అతని భార్య విజయలక్ష్మి. విజయలక్ష్మి ఇద్దరు కొడుకులు పెద్ద ఉద్యోగాలలో దూర ప్రదేశాలలో ఉంటారు. వారు ఇల్లు అమ్మి ఆమెని తీసుకువెళదాం అనుకున్నా విజయలక్ష్మి ఒప్పుకోదు. ఒక చిన్న స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ ఒంటరిగా ఉండడానికి ఆమె సిద్ధపడుతుంది. భర్త చనిపోయాడని బొట్టు గాజులు తీయడానికి కూడా ఆమె ఇష్టపడదు. దానికి కోడళ్ళూ నోళ్ళు నొక్కుకున్నా లెక్క చేయదు. మొదటి నుండి ఇంటిని సంభాళించిన మనిషి కాబట్టి భర్త మరణం వల్ల ఆమె దైనిక జీవితంలో పెద్ద మార్పు లేదు. ఇల్లు ఇంకా శుభ్రంగా, ఆమె అభిరుచితో సర్దుకుని ఇంటి భోజనానికి దూరం కాకుండా ఆమె జీవిస్తూ ఉంటుంది.
ఎల్.ఐ.సీ పాలసీల విషయంలో సహాయం చేయమని విజయలక్ష్మి కొడుకులు అడిగినందుకు గంగాధరం విజయలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆమె ఇంట్లో పద్ధతి అదీ చూసి ఆమెలా తానెందుకు ఉండలేకపోతున్నానని ఆలోచిస్తాడు. విజయలక్ష్మికి సంగీతం అంటే చాలా ఆసక్తి. వయోలిన్ కొనుక్కుని సంగీత టీచర్ ను కూడా కుదుర్చుకుంటుంది. ఆమె భర్త ఫోటోకి ప్రతి రోజు ఒక మాల వేసి ఉంటుంది. దుమ్ము కొట్టుకునిపోయి ఉన్న తన భార్య ఫోటోను చూసి తన జీవితానికి విజయలక్ష్మి జీవితానికి ఉన్న తేడాని గంగాధరం గమనిస్తాడు. ఆమెతో కలిసి మాట్లాడుతున్న ప్రతిసారి ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితుడవుతాడు. తన జీవితానికి మరో స్త్రీ అవసరం ఉందని అతను అనుకుంటాడు. అందుకే ఇద్దరం వివాహం చేసుకుందాం అని విజయలక్ష్మిని అడుగుతాడు.
విజయలక్ష్మి అతని మాటలను తప్పుగా తీసుకోదు. అతనిలోని ఘర్షణ ఆమెకు అర్థం అవుతుంది. తాను పెళ్ళి పేరుతో మళ్ళీ సేవలను చేసే పని మనిషి స్థితికి రాలేనని తనకీ జీవితం బావుందని, ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇప్పుడే తన ఇష్టాలకు అనుగుణంగా జీవించగలుగుతున్నానని చెబుతుంది. అనాధ అంటే భర్త పోయిన స్త్రీ కాదని ఒక రకంగా స్త్రీకి అది స్వేచ్ఛ అని, నిజమైన అనాధ భార్య పోయిన భర్త అని సున్నితంగా చెబుతుంది. అప్పటిదాకా తన భార్య తనకు చేసిన సేవలు, ఆమె వల్ల తాను పొందిన సౌఖ్యం వెనుక తన అధికారం గంగాధరానికి అర్థం కావు. మొదటిసారి బతకడానికి కావలసిన అవసరమైన పనులను చేసుకోవడం మొదలెడతాడు. తాను వివాహ ప్రసక్తి తీసుకువచ్చి పొరపాటు చేసానని అభిమాన పడ్డ అతన్ని మళ్ళి మామూలుగా పలకరించి స్నేహ భావంతో అతన్ని కలుపుకుంటుంది విజయలక్ష్మి. ఒకరి పనులలో ఒకరు సహాయం చేసుకుంటూ ఒకరి నుండి మరొకరు సహాయం కోరుతూ, కలిసి ఇష్టమైన కార్యక్రమాలకు వెళుతూ మొదటిసారి నిజమైన తోడును ఇద్దరూ ఆస్వాదిస్తారు. ఇందులో అధికారం లేదు. ఇబ్బంది లేదు. అహంకారం అసలే లేదు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపించుకోవడం అన్నదే లేనప్పుడు స్త్రీ పురుష సంబంధాలలో వికసించే స్నేహం, ఒకరినొకరు గౌరవంగా చూసుకుంటూ అభిమానించుకోవడంలో సహజంగా ఏర్పడే ప్రేమలోని గొప్ప తనాన్ని అనుభవించిన ఆ ఇద్దరూ కూడా తమ వ్యక్తిత్వాలకు మెరుగు పెట్టుకుంటూ మానసికంగా ఎదుగుతూ కనిపిస్తారు. ఇద్దరి ఆలోచనలలో మార్పు వస్తుంది. మనిషిని అధికార చట్రం నుంచి వేరు చేసి చూసినప్పుడు లభించే దగ్గరితనంలోని నిస్వార్ధమైన ప్రేమ, పరిపూర్ణమైన అనుబంధంగా ఎలా మారుతుందో ఇద్దరూ ఆస్వాదించగలుగుతారు.
విజయలక్ష్మి కొడుకులు పిల్లలతో తాము ఇబ్బంది పడుతున్నామని ఆమెను ఇల్లు అమ్మి తమ వద్దకు రమ్మని అడుగుతారు. ఈ కోరికలో వారికి అసహజమనేదేదీ కనిపించదు. తాను తన గూడు వదిలి వారికి, వారి పిల్లలకు మళ్ళీ సేవలు చేస్తూ ఉండనని ఆమె చెప్పడం మాత్రం వారికి చాలా అసహజంగా కనిపిస్తుంది. తల్లి అంటే ఆఖరి నిముషం దాకా తమకు ఉపయోగ పడాలి అనుకునే సగటు మనుష్యులు వారు. మనవడు పుట్టాడని కూతురింటికి వెళతాడు గంగాధరం. అతను లేని లోటు విజయలక్ష్మిని బాధిస్తుంది. తనకు తెలీయకుండానే గంగాధరాన్ని కోరుకుంటున్నానని ఆమెకు అర్థం అవుతుంది. ఆమెలో ఒక భయం మొదలవుతుంది. తరతరాలుగా సాంప్రదాయపు జీవితాల మధ్య ఎదిగిన ఆమె మనసు తన మనసులో జరుగుతున్న అలజడిని తట్టుకోలేక పోతుంది. గంగాధరం తిరిగి వచ్చేలోపు ఆమె కొడుకుల దగ్గరకు వెళ్ళిపోతుంది. గంగాధరం వచ్చి విజయలక్ష్మిని వెతుక్కుంటాడు. ఆమె లేని లోటు అతనిని బాధపెడుతున్న సమయంలో విజయలక్ష్మి అతని కోసం తిరిగి వస్తుంది. ఇది సినిమా కథ. ఇక తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారా. కలిసి ఒకింట్లో ఉన్నారా అనే ప్రశ్నలు వస్తాయి. కాని ఈ కథ ఆ కుతూహలాన్ని తీర్చడానికి రాసినది కాదు.
స్త్రీకి భర్త తోడు అవుతాడని, భర్త చనిపోతే బిడ్డలు తోడు అవుతారని, ముఖ్యంగా మగబిడ్డలు తోడవుతారని అదే ఆలోచనలతో స్త్రీ జీవితానికి వివాహం మోక్ష మార్గమని చెప్పి చెప్పి ఆమెలో పెళ్ళి పట్ల ఎన్నో ఆశలు కలగజేస్తారు చుట్టూ ఉన్నవారు. కాని వివాహం స్త్రీని చాకిరికి పరిమితం చేస్తుంది. తనది అంటూ ఏమీ లేని జీవితంలోకి ఆమెను తోసేస్తుంది. వివాహం తరువాత ఆమె అభిరుచులు, ఆలోచనలు అన్నీ కూడా అత్తగారింటికి అనుకూలంగా మారవలసిందే. సంగీతం ఇష్టం లేదంటే పాడడం మానేయాలి. పద్ధతులు మార్చు కోవాలి, తన కోరికలు చంపుకోవాలి, ఇంత చేసినా ఆమెను తమ అవస రాలు తీర్చే యంత్రంగా చూస్తారు తప్ప కుటుంబం ఆమెను వ్యక్తిగా గుర్తించదు. అదే దారిలో ఆమె కన్న పిల్లలు కూడా ప్రయాణిస్తారు. వారిపై సమాజ ప్రభావమే అధికంగా ఉంటుంది. ఆమెకు స్వతంత్రంగా కొన్ని అభిరుచులు ఇష్టాలు ఉంటా యని, అవి ఆమెకు ముఖ్యం అని కుటుంబం అంగీకరించదు. అప్పుడు తోడు అనుకున్న బంధాలే సంకెళ్ళ వుతాయి. సంకెళ్ళు మధ్య బతికే ఏ జీవి అయినా వాటి నుండి మిముక్తి కోరుకుంటుంది. అది భర్త మరణం ద్వారా అనుభవించడం వెనుక స్త్రీ కఠిన హదయం కాదు, సమాజం ఏర్పరిచిన పరిస్థితులు ఉన్నాయి. నిజమైన తోడు మనిషి లేనప్పుడు తన అవసరాలు తీరక బాధపడడంలో ఉండదు. అది స్వార్ధం. జీవితంలో అన్నీ ఉన్నా, ఆ ఉన్నవి మరొకరితో పంచుకోవాలనిపించడం నిజమైన తోడు. ఈ విషయాన్ని సున్నితంగా చెప్పిన సినిమా ఇది. ఇందులో శరత్‌బాబు, గీతల నటన చాలా బాలెన్స్డ్గా ఉంటుంది.
చలాకీ అయిన నవయిగం ప్రతినిధిగా ఝాన్సి, ఒక మంచి స్నేహితుడి రూపంలో బ్రహ్మానందం కనిపిస్తారు. బాలమురళీ కష్ణ గారు ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. స్త్రీ వాదాన్ని చాలా స్పష్టతతో చూపించిన సినిమా ఇది. ఈ సినిమాలో తన జీవితంలో పురుషుని అధికారంతో వచ్చే తోడు లేకుండా మిగిలిపోయిన స్త్రీని ఒక వైపు చూపిస్తూ, అధికారాన్ని, అనుబంధం అనుకుని అధికారం మాటున తాను పోగొట్టుకున్న సాహచర్యపు విలువను అర్థం చేసుకునే మరో పురుష పాత్ర ద్వారా కూడా చూపిస్తారు దర్శకులు. ఈ పద్ధతిలో ''తోడు'' కు ఒక స్పష్టమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు కుటుంబరావు గారు. ఇది ఓల్గా గారి కథే అయినా దర్శకులు ఎక్కడా అతివాదం రాకుండా జాగ్రత్తపడడం వలన ఈ సినిమా చాలా గొప్పగా వచ్చింది. కొన్ని స్త్రీవాద సినిమాలు చేసే పొరపాట్లకు కుటుంబరావు గారు చోటివ్వకుండా జాగ్రత్తపడడం ప్రతి ప్రేం లో మనకు కనిపిస్తుంది. ఇందులో కనిపించే విజయలక్ష్మి పాత్ర తెలుగు సినీ పాత్రలలో ఒక ఉన్నతమైన పాత్ర అని చెప్పవచ్చు.
- పి.జ్యోతి,
సెల్:9885384740